సృష్టికర్త బ్రహ్మదేవుడు పూజలకు అనర్హుడు. ఆయన భక్తులచే పూజింపబడడు. అసలు ఆయనకు దేవాలయాలే లేవు అని అనుకుంటారు. కానీ బ్రహ్మదేవుడికి కూడా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఆలయాలు ఉన్నాయి.
సృష్టికర్త బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతో ఉంటాడు. బ్రహ్మ నుంచి సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, అధర్వణ వేదం నాలుగు వేదాలు ఆవిర్భవించాయి. బ్రహ్మకు పూజార్హత లేదని లోక నానుడి ఉన్నా, సమస్త వేద వాంగ్మయరూపంలో జ్ఞాన నిధిగా బ్రహ్మ దర్శనమిస్తుంటారు. అయినప్పటికీ బ్రహ్మదేవునికి భూమిపై కొన్ని ప్రాంతాలలో ఆలయాలు ఉన్నాయి. వేదోద్ధారక గోవిందా కలియుగ వైకుంఠం తిమమల గిరులకు పైన 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవేంకటేశ్వర వేదవిజ్ఞాన పీఠం ఉంది.
వేద ఘోషతో దానికి వేదరిగి అనే పేరు. ఆ వేదపాఠశాల ప్రాంగణంలో అద్భుతమైన బ్రహ్మ విగ్రహం ఉంది. బ్రహ్మ కుడిచేతిలో చిన్ముద్ర, ఎడమచేతిలో పుస్తకం ధరించి, వెనుక చేతులలో కుడివైపు జపమాల, ఎడమవైపు కమండలం పట్టుకుని ఉంటారు. చిన్ముద్రలో చూపులువేలు, బొటనవేలు కలిసి ఉంటుంది. చూపుడు వేలు జీవాత్మకు, బొటనవేలు పరమాత్మకు ప్రతీక అని పండితులు చెబుతారు.
సమస్త వేదసంపద పుస్తకరూపంలో బ్రహ్మ ఎడమచేతిలో ఉంటుంది. పుస్తకం జ్ఞానరూపం. బ్రహ్మ దేవుని వాహనం హంస. బ్రహ్మ భార్య సరస్వతీ దేవి. ఆమెకు గాయత్రీ, బ్రహ్మాణీ, సావిత్రి అనే పేర్లు గలవు. బ్రహ్మకు ఎర్రని పట్టు వస్త్రాలంటే ప్రీతికరం. ఈయన ఎనిమిది మంది ద్వార పాలకులను కలిగి ఉంటారు. బ్రహ్మను ధాత, విధాత, ప్రజాపతి అనే పేర్లతో పిలుస్తుంటారు. ప్రాచీనకాలం నుండి బ్రహ్మను ఆరాధించే సంప్రదాయం ఉంది.
బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి బొట్టు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. కాబట్టి విష్ణువును కమలనాథుడు, పద్మనాథుడు అని అంటారు. అలాగే బ్రహ్మను కమల సంభవుడు అని అంటారు. సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుని ఆలయం రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలోని పుష్కర్ లో కలదు. ఇక్కడ 52 స్నాన ఘట్టాలు కలవు. ఇక్కడ స్నానం ఆచరించడం వలన సమస్త తీర్థాలలో స్నానమాచరించిన ఫలితం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. ఇక్కడ బ్రహ్మదేవుడిని దర్శించుకుంటే పాపాలు తొలిగిపోతాయి. ఇక్కడి స్థల పురాణం ప్రకారం.. వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ హింసిస్తూ ఉండడం వలన బ్రహ్మదేవుడు తన చేతిలోనే తామర పువ్వును ఆయుధం గా చేసుకొని రాక్షసుడు వజ్రనాభను సంహరిస్తాడు. ఆ రాక్షసుడుని సంహరించే సమయంలో తామర పువ్వు నుండి మూడు రేకులు
రాలి జేష్ఠ, మధ్య, కనిష్ట అనే పుష్కర ప్రదేశంలో ఏర్పడ్డాయి. రాలిపడ్డ రేకులు కాబట్టి పుష్కరణలుగా పిలుస్తున్నారు. అదే ప్రాంతంలో లోకహితం కోసం యజ్ఞం తలపెట్టి ఎటువంటి ఇబ్బందులు రాకుండా దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంజూర, తూర్పున సూర్యగిరి అనే కొండలను సృష్టించాడు బ్రహ్మదేవుడు. అయితే యజ్ఞం ముహూర్తం సమయానికి బ్రహ్మదేవుడు సతీమణి అయిన సరస్వతి దేవి రాలేకపోవడంతో మహర్షుల లో ఆదేశాల మేరకు పాలమ్ముకునే ఒక అమ్మాయిని ఇంద్రుడు ఆవులోకి పంపించి పునర్జన్మ ఎత్తినట్లు భావించి గాయత్రి నామంతో బ్రహ్మ పక్కన కూర్చోబెట్టి ముహూర్తానికి యజ్ఞం ప్రారంభించేలా చేస్తాడు.
ఆ తర్వాత అక్కడికి చేరుకున్న సరస్వతి దేవి అసలు విషయం తెలుసుకొని అక్కడ ఉన్న వారిని శపించి బ్రహ్మకు పుష్కరణలో తప్ప ఇంకెక్కడ ఆలయం ఉండకూడదని శపిస్తుంది. అలాగే విష్ణుమూర్తికి భార్యవియోగం, శివుడికి భిక్షాటన, కుబేరుడికి పెడత్వం విధిస్తుంది. రత్నగిరి కొండమీద గాయత్రీ దేవి ఆలయం పక్కనే సావిత్రి నది ఉంది. యజ్ఞం పూర్తి చేయమని మహర్షులను కోరితే తమ శాపం విమోచన చేస్తేనే జరిపిస్తామని చెబుతారు మహర్షులు. అప్పుడు గాయత్రి దేవి వారికి శాప విమోచన కల్పించి ఈ పుష్కర క్షేత్రం గొప్ప పుణ్యక్షేత్రం గా వర్ధిల్లుతుందని చెబుతుంది.
బ్రహ్మ దేవుని ఆలయాన్ని దర్శించిన తర్వాత సావిత్రి, గాయత్రి ఆలయాలు సందర్శించాలి అని చెబుతున్నారు అక్కడి స్థానికులు. బ్రహ్మదేవుడు నాలుగు తలలతో ఎడమవైపున గాయత్రీ దేవి, కుడి వైపున సరస్వతి దేవితో కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయాన్ని రెండువేల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తిలో బ్రహ్మకు దేవాలయం కలదు. తమిళనాడులోని కుంభకోణంలో, కేరళలోని తిరుబత్తూరులోనూ, మహారాష్ట్రలోని సోలాపూర్ లోను బ్రహ్మ దేవుడికి ఆలయాలు కలవు. బ్రహ్మదేవుని దేవాలయాల అన్నింటిలోకి పెద్దది కంబోడియాలోని అంకూర్ వాట్ దేవాలయం. ఇదే బ్రహ్మదేవుని ఆలయం వెనుక ఉన్న అసలు రహస్యం.