హనుమంతుడు ధైర్యానికి మారుపేరుగా చెప్పుకునే హిందూ దేవుడు. ఆయనను చూసి ధైర్యాన్ని నేర్చుకోవాలని ధైర్యానికి ఆయన ప్రతిరూపం అని చెప్పుకుంటారు. చెడు శక్తులు ఆయనను చూడగానే భయపడిపోతాయని కొందరు అంటుంటారు. ఆంజనేయుడు, పవనసుతుడు, హనుమాన్, అని కూడా ఆయనకు గల పేర్లు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి పూజలు అందుకుంటారు. ఆయన సన్నిధికి వెళ్ళినవారు వెళ్లి పీడిత వ్యక్తుల నుంచి తమను కాపాడాలని కోరుకుంటారు. సిందూరం ఆంజనేయ స్వామికి ప్రీతికరం. పురాణ గాధల ప్రకారం హిందూ దేవతలు అందరూ వాహనాలను కలిగి ఉన్నారు.
బలవంతుడైనటువంటి ఆంజనేయ స్వామికి కూడా వాహనం ఉంది. అసలైతే బలిష్టమైన శరీరంతో కూడుకొని వాయువేగంతో ప్రయాణించే హనుమంతుడికి వాహనం ఏంటి అనేది అందరిలో మెదిలే ప్రశ్న. అయినప్పటికీ ఆంజనేయ స్వామికి వాహనం ఉన్నట్టు పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆయన వాహనం ఎడారి ఓడగా పిలిచే ఒంటె. ఆయన దేవాలయాలకు వెళ్లి చూస్తే ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా ఒంటె రూపం ప్రతిష్టించబడి కనిపిస్తోంది. అంజన్న దర్శనానికి వెళ్లిన వారందరూ ముందుగా ఒంటెను నమస్కరించుకొని ఆయనను దర్శించుకుంటారు. అసలు బొంటె ఆయనకు ఏ విధంగా వాహనం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
రుద్రాంశ సంభూతుడు హనుమంతుడు. సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే ఆంజనేయుడిగా పురాణ కథనాలు చెబుతున్నాయి. వాయు పుత్రుడు వాహనం ఒంటె… ఆయన ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదు రుగా ఒంటె విగ్రహన్ని మనం చూడొచ్చు. వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం ఆసక్తికరమైన విషయం.
రామభక్తుడైన హనుమంతుడిని హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి పేర్లతో ఆంజనేయస్వామిని ఆరాధిస్తారు. దేశంలో హనుమంతుడి గుడి లేని ఊరు ఉండదనే చెప్పవచ్చు. హనుమంతుడి జీవితం గురించి మన పురాణాల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ అనేక గాథలున్నాయి.
రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి హత మారుస్తాడు. అతడి మృతదేహాన్ని ఋష్యమూక పర్వతం పై పడేశాడు. ఈ సంఘటనే వాలి శాపాన్ని పొందేందుకు కారణంగా మారిందట. ఋష్యమూక పర్వతం పైన మాతంగ మహాముని తపస్సు చేసుకునేవాడు. తాను తపస్సు చేసుకుంటున్న పర్వతంపై వాలి దుందుభి మృతదేశాన్ని పడవేయడం మాతంగ మహర్షి చూశాడు. దీంతో మాతంగ మహర్షి తీవ్ర కోపదిక్తుడయ్యాడు. వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని మాతంగ మహర్షి శపించాడు.
కాలక్రమంలో సుగ్రీవుణ్ణిని వాలి చంపడానికి వెంటాడిన సమయంలో.. తన అన్న ఋష్యమూక పర్వతం మీద కాలు పెట్టడని శాపోదంతం తెలుసున్న సుగ్రీవుడు ఇదే తనకు అనుకూలమైన విషయమని పర్వతానికి వెళ్లి తలదాచుకున్నాడు. ఆ సమయంలో తన స్నేహితుడైన సుగ్రీవుణ్ణి చూడటానికి హనుమంతుడు ఋష్యమూక పర్వతం మీదకు చేరుకున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న పంప సరోవర అందాలను తిలకించాలని హనుమంతుడు అనుకుంటాడు. దీంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా సుగ్రీవుడు ఒంటెను సిద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు ఒంటెను అధిరోహించి.. విహరించాడట. అప్పటి నుంచి హనుమంతుడికి ఒంటె వాహనంగా మారినట్లు చెబుతారు.
హనుమంతుడి వాహనం ఒంటె అని పరాశర సంహితలో సైతం పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే.. మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు. సీతాదేవిని వెతుకుతూ పంపా నదీ తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నపుడు, సుగ్రీవుడు వాళ్లను చూసి భయపడతాడు. ధనుర్బాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకొని రమ్మని హనుమంతుడిని పంపిస్తాడు.
ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముణ్ని కలుసుకున్నది కూడా పంపానదీ తీరంలోనే! ఈ ప్రాంతం హనుమకు ఎంతో నచ్చిన ప్రదేశం. ‘పంపాతీర నివాసాయ గంధమాదన వాసినే’ అని స్వామిని భక్తులు కీర్తిస్తారు. అయితే, ఈ నది తీరం వెంబడి ఎడారిని తలపించేలా దట్టమైన ఇసుక మేటలు ఉండేవి. హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండటం కోసం, ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని మరో కథనం. అంతేకాదు, హనుమంతుడి ధ్వజంపైన కూడా ఒంటె గుర్తే ఉంటుంది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు వృషభం వంటి బలిష్ఠమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా పెద్దలు చెబుతారు. ఇవి పురాణ గాథలు మాత్రమే. రామాయణంలో మాత్రం హనుమంతుడికి వాహనం ఉన్నట్లు ప్రస్తావించబడలేదు.
హనుమంతుడికి వాహనం ఒంటె అనే విషయంపై కొందరు విమర్శకులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు హనుమంతుడికి వాహనం అవసరం ఏముంది? దూర ప్రయాణాలు చెయ్యడానికా లేక బరువులు మొయ్యడానికా? రెండింటికీ వాహనం అవసరం లేదనేది వారి మాట. హిమాలయాల నుండి సంజీవనీ పర్వతాన్ని లంక వరకూ మోసుకొని గాలిలో ఎగిరి వచ్చినట్టు రామాయణంలో తెలియజేయబడింది మరి ఒంటె వాహనంగా ఉన్న విషయాన్ని వాల్మీకి మహర్షి ఎందుకు రాయలేదని ప్రశ్నిస్తున్నారు.
చిన్న తనంలోనే అత్యంత వేడిగా ఉండే సూర్యుని వద్దకే ఎగిరి, యెంత వేడినైనా తట్టుకొని ఎంత దూరమైనా ఎగరగల పవన సుతుడు ఆంజనేయుడికి ఇక ఎడారి ఓడతో పని ఏముందనేది వారి ప్రశ్న. సందర్భం వచ్చినపుడు హనుమంతుడు తనే స్వయంగా రామ లక్ష్మణులకు వాహనంగా మారాడు అటువంటి వ్యక్తికి మరొక వాహనం ఉంటుందా అనేది విమర్శకుల నుండి వెల్లువెత్తుతున్న ప్రశ్నలు.