Telugu News

భారత్‌లో సహజీవన సంసారాలు పెరుగుతున్నాయా !

నేటి భారత యువతలో కూడా సహజీవన సంస్కృతి పెరుగుతున్నట్లు, యువతలో దాని పట్ల సానుకూల భావాలు చిగురిస్తున్నట్లు తెలుస్తున్నది. సహజీవన విధానం భారత్‌లో చట్ట వ్యతిరేకం కానప్పటికీ, సామాజిక అంగీకారం లేకపోవడం, సహజీవన పద్ధతిని దురాచారంగా కూడా పరగణించడం జరుగుతుంది. భారత్‌లో సహజీవనం చేస్తున్న జంటను చులకనగా చూడడం, వివక్ష చూపడం, సామాజిక వ్యతిరేకతను ఎదుర్కోవడం కొనసాగుతోంది.

భారతంలో మూడు ముళ్లు పడక ముందే 18 ఏళ్లు పైబడిన జంట అంగీకారంతో సహజీవన సంసారాలకు సంబంధించిన నిర్దిష్టమైన చట్టాలు కూడా లేకపోవడం విశేషం. ‘ఏక పత్ని వ్రతం’తో పాటు ‘ఏక పతి వ్రతం’ పునాదుల మీద పెరిగిన భారతీయ పౌర సమాజం సహజీవన సంసారాలను తీవ్రంగా వ్యతిరేకించడం చూస్తున్నాం. ఆధునిక డిజిటల్‌ యుగపు భారత యువతలో రోజు రోజుకు, ముఖ్యంగా మహానగరాల్లో సహజీవన సంసారాలు పెరుగుతున్నాయని, సగానికి పైగా యువత వీటిని అంగీరిస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

భారత్‌లోని ముంబాయి మహానగరం సహజీవన సంసారాలకు కేంద్రంగా నిలుస్తున్నది. సహజీవనానికి ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేదా అనుమతులు అవసరం లేదని, విడిపోవు సందర్భాల్లో విడాకులు తీసుకోవడం లాంటి ప్రస్తావన ఉండదని తెలుసుకోవాలి. సహజీవనం చేసిన యువ జంటలు అధిక శాతం వరకు వివాహాలు కూడా చేసుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారత మహానగరాల్లో 50 శాతం వరకు యువత సహజీవన బాటన నడుస్తున్నారని తెలుస్తున్నది. 

సహజీవన సంసారాలు పెరుగులకు కారణాలు:

విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మ, అమీర్‌ ఖాన్‌-కిరణ్‌ రావ్‌, సైఫ్ అలీ ఖాన్‌-కరీనా కపూర్‌, జాన్‌ అబ్రహమ్‌-బిపాసా బసు, బోను కపూర్‌-శ్రీదేవి లాంటి పలువురు బాలీవుడ్‌ జంటలు సహజీవనం చేసిన తర్వాతనే వివాహం చేసుకున్నారని మనకు తెలుసు. దినదినం సహజీవన సంబంధాలు పెరగడం, నేటి పౌర సమాజం కూడా నెమ్మదిగానైనా వాటిని అంగీకరించడం జరుగుతున్నది.

నేటి డిజిటల్‌ యువత పెళ్లికి ముందే సహజీవన సంసారాలకు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలుగా వారి మధ్య అభిరుచుల ఏకీకరణ స్పష్టత, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే వివాహం చేసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం, ఇద్దరి మనోభావాలను అర్థం చేసుకోవడం, ఆర్థిక సమస్యలను అధిగమించడం, భావోద్వేగ సమతుల్యతల సాధన, గృహ సంబంధ పనులను పంచుకోవడం, పెళ్లి చేసుకోకుండానే శారీరక మానసిక అనుభవాలను స్వంతం చేసుకోవడం, వివాహం చేసుకోవడానికి ఇష్టపడని యువత సహజీవన పద్దతులను ఆచరణలో పెట్టడం, పిల్లల్ని కనడం/పెంచడం భారం అనుకునే యువత, లైంగిక వాంఛలను మాత్రమే తీర్చుకోవడం, పెళ్లికి పూర్వం ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమతో సహజీవనం చేసి పెళ్లితో ముగింపు పలకడం లాంటి పలు అంశాలను  పేర్కొనవచ్చు. 

సహజీవన సంసారాలు – చట్ట అంగీకారాలు:    

భారత రాజ్యాంగ ఆర్టికిల్‌ 21 ప్రకారం పౌరులకు స్వేచ్ఛగా జీవించే హక్కుతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛ కూడా కల్పించబడిందని, దీని ప్రకారం సహజీవనం నేరంగా పరిగణించబడదని సుప్రీమ్‌ కోర్టు కూడా పేర్కొనడం విశేషం. అదే విధంగా 2005 గృహ హింస చట్టం ప్రకారం కూడా సహజీవన సంబంధాలను “గృహ సంబంధాలుగానే (డొమెస్టిక్‌ రిలేషన్‌షిప్‌)” చూడాలని నిర్ణయించింది. చట్ట పరిధిలో సహజీవనం చేసిన యువతి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భరణం లేదా మెయిన్‌టెనెన్స్‌ పొందే హక్కు కూడా ఉంటుందని తెలుపుతున్నది. సహజీవనం చేసిన జంటకు జన్మించిన సంతానానికి ఆస్తి హక్కులు సంక్రమిస్తాయని తెలుస్తున్నది.

సహజీవనం చేస్తున్న జంటను వారి తల్లితండ్రులు కూడా విడదీయలేరని చట్టం పేర్కొంటున్నది. సహజీవనం చేసిన జంటకు చట్టం ఎలాంటి రక్షణ కల్పించకపోవడంతో వివాహిత యువతులకు కల్పించిన చట్ట రక్షణలు వీరికి వర్తించవు. సహజీవన జంట మధ్య విభేదాలు వచ్చినపుడు వెంటనే వారు విడిపోయి తమ తమ జీవితాలను కొనసాగించే వెసులుబాటు మాత్రం ఉన్నది. దీర్ఘకాలం పాటు సహజీవనం చేయడం, పౌర సమాజంలో ఆ జంట కలిసి తిరగడం, ఇద్దరికీ 18 ఏండ్లకు పైగా వయస్సు ఉండడం, పెళ్లి అయిన జంట వలె లైంగిక సంబంధాలను కలిగి ఉండడం, ఇద్దరి ఆదాయాలను కలిపి ఖర్చు చేయడం, గృహ సంబంధ పనుల్లో పరస్పరం సహాయం చేసుకోవడం, ఇద్దరు తమ హక్కులు బాధ్యతలను పంచుకోవడం, సంతానాన్ని కనడం లాంటి ప్రత్యేక సందర్భాల్లో సహజీవనాన్ని కూడా వివాహం జరిగినట్లుగానే భావించాలని పేర్కొనడం జరుగుతోంది. 

సహజీవనం, డేటింగ్‌ సంస్కృతులు ఒకటేనా!

 18 ఏండ్లు దాటిన ఒక యువతి, ఒక యువకుడు పెళ్లికి ముందు ఒక అంగీకారానికి వచ్చి ఒకే ఇంట్లో కలిసి జీవించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దీర్ఘకాలం పాటు జంటగా జీవించడాన్ని ‘సహజీవనం లేదా లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్’‌ అని పిలుస్తాం. సహజీవనంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని ఇష్టపడిన తర్వాత పెళ్లి కూడా చేసుకోవడం జరుగుతుంది లేదా ఇద్దరి అలవాట్లు/అభిరుచులు/ఆచారాలు/జీవనశైలి/ఆలోచనలు కలువవని నిర్ణయించుకున్నపుడు ఆ సహజీవన జంట విడిపోయి స్వేచ్ఛగా బతకడానికి నిర్ణయించుకుంటారు. సహజీవన సంసారాల్లో యువ జంట లైంగిక సంబంధాలను కూడా కొనసాగించవచ్చు.

డేటింగ్‌ అనే ఆచారం 1 – 3 మాసాల స్వల్పకాలం పాటు ఇద్దరు కలిసి తిరగడం, వేరు వేరు ఇండ్లల్లో జీవిస్తున్నప్పటికీ కలిసి తిరుగుతూ అన్ని రకాలుగా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంగా భావించాలి. ఒక ఆహార పదార్థాన్ని ఎలా ఉందో రుచి చూసినట్లు, ఇద్దరి మధ్య సంబంధాన్ని కూడా డేటింగ్‌తో కొద్ది సమయంలోనే తెలుసుకోవడం జరుగుతుంది.  డేటింగ్‌లో జంట లైంగిక సంబంధాలను తప్పనిసరిగా పెట్టుకోవాలనే నియమం లేకపోయినప్పటికీ అదే ప్రధాన అంశంగా కూడా తీసుకోబడుతున్నది.

డేటింగ్‌ సంబంధాన్ని సీరియస్‌గా కూడా తీసుకోవలసిన పని లేదు. అది ఒక తేలికైన స్వల్పకాలిక సంబంధం కూడా అయి ఉండవచ్చు. ఇద్దరిలో ఒకరు యువతి, మరొకరు యువకుడు కావచ్చు లేదా ఒకే లింగానికి చెందిన జంట కూడా డేటింగ్‌ చేయవచ్చు. జంట ఒక మంచి స్నేహితులుగా కలిసి తిరగడాన్ని కూడా డేటింగ్‌గా భావించవచ్చు. డేటింగ్‌ చేసిన జంట కొంతకాలం తర్వాత సహజీవనం లేదా వివాహ మండపానికి కూడా దారి తీయవచ్చు. 

 ప్రేమ వివాహాలు అన్ని కొనసాగడం లేదని, పెద్దలు కుదుర్చు వివాహాలు కూడా విడాకుల వరకు వస్తున్నాయని గమనించి, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, పెళ్లంటే ఒక జంట మాత్రమే ఒక్కటి కావడం కాదని, రెండు కుటుంబాల కలయికగా వివాహాన్ని చూస్తున్న పౌర సమాజంలో జీవిస్తున్నామని తెలుసుకుంటూ నేటి యువత పాశ్చాత్య పోకడలను గుడ్డిగా అనుకరించకుండా తమ జీవితాలకు పెళ్లితో చక్కటి శాంతియుత కుటుంబ నిర్మాణ పరిష్కారం ఇవ్వాలని కోరుకుందాం. ప్రేమించిన వ్యక్తిని నేరుగా వివాహం చేసుకోవడం ఉత్తమమని, సహజీవన సంసారం మాత్రం చక్కటి పరిష్కారం కాదని తెలుసుకుందాం. నేటి యువత సీతారాములను ఆదర్శ జంటగా తీసుకోవాలని, అందమైన జీవిత భాగస్వామికి అందరి సమక్షంలో మూడు ముళ్లు వేయాలని ఆశిద్దాం. 

Show More
Back to top button