పర్యావరణానికి ఇంద్రధనుస్సు రంగుల అందాలను అద్దుతూ, ఆకాశ మార్గాన కలియ తిరుగుతూ, జీవ జాతిలో ప్రత్యేకతను సంతరించుకున్న పక్షులు విశ్వ జీవరాసులతో సహజీవనం చేస్తూ, మానవాళి జీవితాలతో అనుబంధాన్ని పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 రకాల పక్షి జాతులు అడవుల్లో, మానవ ఆవాసాల్లో సంచరిస్తున్నాయి. దురదృష్టకరంగా పక్షి జాతిలో కొన్ని రకాలైన పక్షులు అంతరించే అంచున ఉన్నట్లు, కొన్ని రకాలైన పక్షులు అంతరించిపోయాయనే వార్త మానవాళికి హెచ్చరికగా నిలుస్తున్నది.
మిలియన్ల పక్షులను వేటగాళ్లు, స్మగ్రర్లు, గిరిజన జాతులు తమ స్వలాభం కోసం పట్టుకొని ఆహారం లేదా అవయవాల నిమిత్తం చంపి వేయడం గమనిస్తున్నాం. పక్షుల వల్ల జీవ వైవిధ్య పరిరక్షణ, ఫలదీకరణానికి అవసరమైన పుప్పొడి వితరణ, విత్తనాలను విస్తరించడం, పంటలకు హాని చేసే క్రిమి కీటకాలను అదుపు చేయడం, వ్యాధుల కట్టడి, సాదు పక్షులతో సంబరాలు, పక్షి ఈకలతో వస్తువుల తయారీ, ఆహార పదార్థాలు, వార్తాహరులు, పర్యావరణ సమతుల్యత లాంటి ప్రధానమైన ప్రయోజనాలు ఉన్నాయి.
జాతీయ పక్షుల దినం-2025:
పర్యావరణ పరిరక్షణలో పక్షుల ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడానికి ప్రతి ఏట 05 జనవరి రోజున “జాతీయ పక్షుల దినం (నేషనల్ బర్డ్స్ డే)” పాటించడం 2002 నుంచి ఆనవాయితీగా మారింది. పక్షుల ఆవాసాల విధ్వంసం, అక్రమ వ్యాపారం కోసం వేట, వాతావరణ ప్రతికూల మార్పులను అవగాహన పరచడానికి ఈ వేదిక ఎంతగానో ప్రయోజకారిగా నిలుస్తున్నది. పక్షుల సంరక్షణకు జీవ వైవిధ్యానికి విడదీయరాని సంబంధం ఉన్నది. జాతీయ పక్షుల దినం రోజున పక్షుల పార్కుల సందర్శన, పక్షులకు ఆహార వేయడం, పక్షుల కిలకిలారావాలను వినడం, పక్షుల సంరక్షణ ప్రాధాన్యాన్ని వివరించే ఆర్ట్స్ పోటీలు నిర్వహించడం, పక్షులకు సంబంధించిన పుస్తకాలు చదవడం, అరుదైన పక్షి జాతులను గూర్చి తెలుసుకోవడం జరుగుతుంది.
భారత్‌లో పక్షుల పరిరక్షణ చర్యలు:
భారతీయ సంస్కృతిలో పలు రకాలైన పక్షి జాతులను ప్రత్యేక స్థానం కల్పించబడింది. భారత జాతీయ పక్షిగా అందమైన నెమలికి ప్రత్యేకత కల్పించబడింది. భారత దేశవ్యాప్తంగా పక్షుల సంరక్షణ చర్యల్లో భాగంగా 72 పక్షుల అభయారణ్యాలు 1,120 రకాల పక్షిజాతులకు ఆవాసాలుగా విలువైన పాత్రను పోషిస్తున్నాయి. పక్షుల సంరక్షణ రంగంలో తన జీవితాన్ని అర్పించి కృషి చేస్తున్న పక్షి ప్రేమికులు అనేకులు ఉన్నారు. వీరిలో అగ్రగణ్యుడిగా డా సలీం అలీ నిలిచి ‘బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకున్నారు. భారతీయ సంస్కృతిలో గరుడ, గండబేరుండ, పావురాలు, నెమలి, జటాయువు, హంస, రామచిలుక లాంటి పలు రకాలైన పక్షులు పురాణ ఇతిహాసాల్లో పూజ్యనీయ స్థానాన్ని ఆక్రమించడం హర్షదాయకం.
పక్షులకు సంబంధించిన ఆసక్తికర అంశాలు:
పెంగ్విన్ పక్షులు ఎగురలేనప్పటికీ, అవి నీటిలో అద్భుతంగా ఈదగలవు. గుడ్లగూబలు తమ తలను 270 డిగ్రీలు తిప్పి వెనుక ఉన్న దృశ్యాలను చూడగలవు. పక్షి జాతిలో అత్యంత పెద్దదైన ఉష్ట్రపక్షి ఎగరలేదు, కాని గంటకు 60 మైళ్ల వేగంతో పరుగెత్తగలవు. హమ్మింగ్ బర్డ్ మాత్రమే వెనుక వైపుకు ఎగురగలుగుతూ, సెకనుకు 80 సార్లు రెక్కలు కొట్టగలవు. ఫ్లెమింగో పక్షులు తమ ఆహారం నుంచి పింక్ రంగును పొందగలుగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10,000 పక్షి జాతుల్లో 900 రకాల వరకు అంతరించే ప్రమాదంలో నిలిచాయని, కనీసం నాలుగు రకాల పక్షి జాతులు ఇప్పటికే అంతరించి పోయాయని తెలుస్తున్నది. మానవ సమాజానికి దగ్గరగా నివసిస్తున్న పక్షి జాతులతో పాటు అడవుల్లో నివసించే అరుదైన పక్షులను కాపాడుతూ, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం, అందమైన పక్షులను అపురూపంగా చూసుకుందాం.