![What is the severity of the HMPV virus spreading in the center of China!](/wp-content/uploads/2025/01/HMPV-virus.jpg)
గత ఐదేళ్లుగా కరోనా మహమ్మారి మిగిల్చిన గాయాలను ప్రపంచ మానవాళి మరువక ముందే చైనాలో మరో వైరస్ విస్తరిస్తూ అంటువ్యాధిగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బలహీన రోగనిరోధకశక్తిగల వర్గాలపై తన ప్రభావాన్ని చూపుతూ మరో ప్రజారోగ్య విపత్తుగా మారవచ్చని వార్తలు గుప్పుమంటున్న వేళ ఆ వైరస్ ప్రభావాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకోవడం మనకు తప్పనిసరి అవుతున్నది.
వైరస్‌ల పుట్టిల్లుగా మారిన చైనాలో కరోనా బయటపడి ప్రపంచ మానవాళిని కుదిపేస్తూ, లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటూ, కోట్ల మందిని ఆసుపత్రుల పాలు చేసింది. అదే తరహాలో నేడు మరో వైరస్ “హుమన్ మెటా న్యూమో వైరస్, హెచ్‌ఎంపివి”ను చైనా ప్రపంచానికి బహుమతిగా ఇవ్వనుందన్న వార్తలు ప్రపంచ మానవాళిని భయం పెడుతున్నాయి. భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు హెచ్‌ఎంపివి వైరస్ వ్యాప్తి, ప్రభావాలను నిశితంగా పరిశీలిస్తూ దేశ ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నది.
హెఎంపివి రోగ లక్షణాలు:
హెచ్‌ఎంపివి అంటువ్యాధి ప్రభావంతో 14 ఏండ్ల లోపు, ముఖ్యంగా 5 ఏండ్ల లోపు పిల్లల్లో తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు గమనించారు. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో దగ్గు, జ్వరం, నాసల్ కంజెషన్(ముక్కు దిబ్బడా), శ్వాస తేలికగా ఆడకపోవడం, గొంతు నొప్పి, ఇతర శ్వాస ఇబ్బందులు, బ్రాంకైటిస్, న్యుమోనియా లాంటి అనారోగ్య లక్షణాలు బయట పడుతున్నట్లు గమనించారు. తొలి సారి రెండు దశాబ్దాల క్రితం 2001లో నెథర్‌ల్యాండ్స్‌లో కనుగొన్న ఈ వైరస్ కేసులు 2011-12లో అమెరికా, కెనడా, యూరోప్ దేశాల్లో కూడా నమోదు అయినట్లు తెలుస్తున్నది.
“న్యూమోవిరిడే” కుటుంబానికి చెందిన “సింగిల్-స్ట్రాండెడ్ (ఏక చిక్కుకుపోయిన) ఆర్‌ఎన్‌ఏ (రైబో న్యూక్లిక్ ఆసిడ్)” శ్వాస సంబంధ వైరస్ ఒక ఏడాది లోపు వయస్సు కలిగిన చిన్నారుల్లో కూడా గమనించడం జరిగింది. ఈ వైరస్ వ్యాప్తి గురించి వెంటనే భయపడవలసిన అవసరం లేదని వైద్య వర్గాలు భరోసా ఇస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి చేదు అనుభవం మానవాళిని భయకంపితులను చేస్తున్నది. హెచ్‌ఎంపివి వైరస్ చికిత్సకు ప్రత్యేకమైన “ఆంటీ-వైరల్ డ్రగ్స్ లేదా టీకా మందు” నేడు అందుబాటులో లేవని, అన్ని వయస్సుల వారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఫ్లూ-లాంటి అనారోగ్య సమస్యలు బయట పడుతున్న ఈ వేళల్లో ఈ వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో తన ప్రభావాన్ని చూపవచ్చని వివరిస్తున్నారు.
హెచ్‌ఎంపివి సులభంగా సోకే వైరస్ అంటువ్యాధి:
హెచ్‌ఎంపివి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతున్నట్లు గమనించారు. హెచ్‌ఎంపివి సోకిన వ్యక్తులు దగ్గడం, తుమ్మడం ద్వారా తుంపర్ల రూపంలో మరొకరికి సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి బయట పడే ద్రవాలను లేదా వ్యక్తులను ఇతరులు తాకడం. పీల్చడం, కరచాలనం చేయడం, ఆ ద్రవాలు పడిన ప్రదేశాలను ఇతరులు తాకడం, వారి ముక్కు/నోరు/నేత్రాలను తాకడం మొదలైన కారణాలతో హెచ్‌ఎంపివి ఇతరులకు సోకుతుంది. ఈ విషయాలను గమనిస్తూ కరోనా కాలంలో పాటించిన నియమనిబంధనలను (భౌతిక దూరాలు పాటించడం, క్వారంటైన్, మాస్కులు, సానిటైజర్లు) కూడా ఇప్పడు పాటించవలసి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
శీతల వాతావరణంలో సులభంగా వ్యాప్తి చెందగల హెచ్‌ఎంపివి వైరస్ వ్యాప్తి భారత్ లాంటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే దేశాల్లో కొంత నెమ్మదిగా విస్తరించవచ్చని అంటున్న విషయాలు మనకు కొంత ఊరటను కలిగిస్తున్నాయి. ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, అంత భయపడవలసిన ప్రమాదం ఏదీ లేదని వైద్య ఆరోగ్య వర్గాలు ధైర్యాన్ని అందిస్తున్నారు. అయినప్పటికీ “వ్యాధి చికిత్స కన్న వ్యాధి నివారణ మిన్న” అనే నినాదాన్ని గుర్తుంచుకొని మన జాగ్రత్తల్లో మనం ఉందాం, మన ఇంట్లోని పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల విషయంలో జాగ్రత్తగా ఉందాం. చేతులు కాలక ముందే ఆకులు సిద్ధం చేసుకుందాం, ప్రమాదం విరుచుకుపడక ముందే జాగ్రత్తలు తీసుకుందాం.