
మనలో అందరికీ ఎంతో కొంత వాయిదా వేసే గుణం సహజంగానే ఉంటుంది. అనవసరమైన విషయాల్లో కాలయాపన చేస్తూ, మన అసలైన పనులను లేదా లక్ష్యాలను వాయిదా వేస్తూ ఉండడం సాధారణంగా జరుగుతుంది. టివీ చూస్తూనే, స్మార్ట్‌ఫోన్లో తలదూర్చుతూనో, మిత్రులతో మాట్లాడుతూనో, అతి నిద్ర పోతూనో మనం చదువులను, చేయవలసిన పనులను లేదా అందుకోవలసిన గమ్యాలను కొన్ని నిమిషాలు, గంటలు, రోజులు, లేదా నెలలు వాయిదా వేస్తూ ఉంటాం. ఇలా “తరువాత చేద్దాం లే” అనే ఆలోచన ఒక దురలవాటుగా మారిపోతుంది.
ఇది దీర్ఘకాలిక దురలవాటుగా మారితే మనం చేరుకోవాల్సి గమ్యాలను దూరం అవుతూ వైఫల్యాలను బహుమతిగా తీసుకోవలసి వస్తుందని మరిచిపోతాం. మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, భాద్యతలను, చదువులను, నిర్ణయాలను పక్కన పెట్టి అనవసర, ప్రాధాన్యం లేని లేదా తక్కువ ప్రాధాన్య పనుల్లో కాలయాపన చేయడాన్ని “వాయిదా వేసే తత్వం”గా పిలుస్తాం. వాయిదా వేసే దుర్గుణం పెరిగితే వ్యక్తి ఎదుగుదల ఆగిపోవడం, జీవితం నిస్సారం కావడం సహజంగా జరుగుట చూస్తున్నాం. దాదాపు 70 శాతం మంది యువతకు ఈ వాయిదా రోగం ఉందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
వాయిదా వేసే దుర్గుణ దుష్ఫలితాలు:
వాయిదా వేసే దుర్గుణాలతో జీవితంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడడం, జీవితంలో అపజయాలు మూటకట్టుకోవడం జురుగుతుంది. ఈ దురలవాటు వల్ల మన భవిష్యత్తు, ఆరోగ్యం, పేరు ప్రతిష్టలు, ఉత్పాదకత లాంటివి దెబ్బతింటాయి. సరియైన సమయానికి సరైన పనులు చేయకపోవడంతో గడువు దగ్గరవుతున్న కొద్దీ మానసిక ఒత్తిడి పెరుగుతూ ప్రతికూల భావోద్వేగాలకు, శారీరక అనారోగ్యాలకు లోనవడం జరుగుతుంది. ఈ దురలవాటు వల్ల అందివచ్చిన అవకాశాలు చేజారడం, లక్ష్యాలకు దూరం కావడం వంటివి జరుగుతాయి. చివరి నిమిషంలో పనులకు ఉపక్రమించడంతో పనిలో నాణ్యత లోపిస్తుంది. వాయిదా వేసే గుణం కలిగిన ప్రబుద్ధులకు సమాజంలో చెడ్డ పేరు, మానవ సంబంధాలు సన్నగిల్లడం, అందరి అంగీకారం లేకపోవడం, ఆందోళన పెరగడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలం వాయిదాలు కొనసాగితే శారీరక పటిష్టత, నిద్ర, వ్యక్తిగత శ్రద్ధ, పనిలో ఏకాగ్రతలు సడలిపోతాయి.
వాయిదా వేయడానికి కారణాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాయిదా వేయడం అనే దురలవాటుకు కారణాలుగా స్వయం ప్రేరణ కొరవడడం, వైఫల్యం అవుతామనే భయం, సమయపాలనతో నియంత్రణ కొరవడడం, తాత్కాలిక సుఖాలకు లొంగి పోవడం, పొరపాటు జరుగుతుందేమో అనే అనవసరమైన ఆందోళనలు లాంటివి గుర్తించబడ్డాయి. వాయిదా వేసే తత్వం నుంచి బయట పడడానికి మనం చేయవలసిన పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవడం, సరైన సాధ్యమైన లక్ష్యాలను మాత్రమే నిర్ణయించుకోవడం, చేయవలసిన పనులను ప్రాధాన్యతాక్రమంలో పెట్టుకోవడం, ప్రతి పనికి అవసరమైన సమయం మాత్రమే కేటాయించుకోవడం, ఏకాగ్రత సడలకుండా చూసుకోవడం, నీకు నువ్వే జవాబుదారీతనాన్ని ప్రదర్శించడం, సకాలంలో పూర్తి చేసిన పనుల నుంచి మానసిక సంతృప్తిని పొందడం లాంటివి కొనసాగించాలి.
వాయిదా వేసే గుణం అందరికీ ఉన్నప్పటికీ కొందరు ఆ గుణాన్ని తగ్గించుకుంటూ, తమను తాము హెచ్చరికలు చేసుకుంటూ, లక్ష్యాలను సకాలం అందుకుంటూ, వ్యక్తిగత ఎదుగుదల సాధించుకుంటూ, తక్కువ సమయంలో ఎక్కువ పనులను చేసుకుంటూ, మానసిక ఆరోగ్యంతో ముందడుగు వేస్తూ, జీవితంలో ఎదురయ్యే జయాపజయాలను సమానంగా తీసుకుంటూ, అపజయాలను విజయవంతంగా అధిగమిస్తూ సమాజ మార్గనిర్దేశనం చేసే స్థాయికి ఎదుగుతూ, జీవితాన్ని ఆసాంతం ఆస్వాదించడం అలవాటు చేసుకుంటారు. నేటి నుంచే వాయిదా వేసే ఆలోచనలకు స్వస్తి పలికి, ఏ సమయంలో ఏ పని పూర్తి చేయాలో తెలుసుకొని మసలుకుందాం, మనదైన ఒకే జీవితాన్ని ఒడుపుగా, అమృతమయంగా ఆసాంతం ఆస్వాదిద్దాం.