దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌ను ప్రతి సంవత్సరం ఎంతోమంది రాస్తుంటారు. కానీ, అందులో చాలా కొద్ది మంది మాత్రమే సివిల్ సర్వెంట్లు అవుతారు. అంతేకాదు సరైన కోచింగ్, గైడెన్స్, పక్కా ప్రణాళిక, డెడికేషన్, ఏకాగ్రతతో చదివితే తప్ప లక్ష్యం చేరుకోలేరు. అలాంటిది వరుసగా రెండు సంవత్సరాల్లో ఏకంగా రెండు సార్లు సివిల్స్ క్లియర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది హర్యాణకు చెందిన దివ్య తన్వర్.
అలాంటి ఆమె సక్సెస్ స్టోరీ చూద్దాం. ఒక పేదింటి నుంచి వచ్చిన ఆమె ఎలాంటి కోచింగ్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐపీఎస్ సాధించింది. అదీ కేవలం 21 ఏళ్ల వయసులోనే. దివ్యకు 15 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. అప్పటినుంచి ముగ్గురు కూతుళ్ల బాధ్యతను తల్లి బబిత తీసుకుంది. వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించింది.
చదువు పూర్తయిన తర్వాత కుటుంబానికి తనవంతు చేయూత అందించేందుకు నిర్ణయించుకుంది. దీంతో స్థానికంగా టీచర్‌గా జాయినయ్యింది. అలా పిల్లలకు చదువు చెబుతూనే తాను సొంతంగా యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమైనట్లు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. 2021లో మొదటిసారి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి జాతీయ స్థాయిలో ర్యాంక్ 438 సాధించింది.
తనకు వచ్చిన ర్యాంకుకు ఐపీఎస్ కేడర్ దక్కింది. దీంతో అక్కడితో ఆగకుండా 2022లో రెండో సారి పరీక్ష రాసి 105 ర్యాంకు సాధించింది. ఇక ఈ దెబ్బకి ఐఏఎస్‌గా ఎంపికవడంతో ఎంతోమంది అభ్యర్థులకు ఆదర్శంగా నిలిచింది దివ్య తన్వర్.