నవంబర్ 17 : “ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల జ్ఞాపకార్థ దినం” సందర్భంగా రోడ్డు ప్రయాణాలు ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా మారుతూ మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. బయటకు వెళితే ఇంటికి సురక్షితంగా చేరతామనే గ్యారంటీ ఉండడం లేదు. మనం ఏ తప్పు చేయకపోయినా ఎదుటి వారి నిర్లక్ష్యం మన ప్రాణాలను హరిస్తున్నది. రోడ్డు ప్రమాదాల గూర్చి వార్తల్లో వినని లేదా పత్రికల్లో చదవని రోజు లేదంటే అతిశయోక్తి లేదు. రోడ్డు ప్రయాణాలు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి.
వాహన/రోడ్డు యూజర్స్ రద్దీ, ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కడం, అతి వేగంగా నడపడం, రోడ్లపై సైన్ బోర్డులు/స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం, ట్రాఫిక్ పోలీసుల కొరత, గుంతలతో కూడిన వంకరటింకర రోడ్లు, వాహన చోదకుల నిర్షక్ష్యపు పోకడలు, వాహనాల అధ్వాన్న దుస్థితులు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడడం, శాశ్వతంగా అంగవైకల్యం రావడం అత్యంత బాధాకరం, ఆక్షేపణీయం.
రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన:
రోడ్డు ప్రమాద బాధితుల జ్ఞాపకార్థం “రోడ్‌పీస్” అనే స్వచ్ఛంద సంస్థ 1993లో ప్రారంభించిన “ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల జ్ఞాపకార్థ దినం లేదా వరల్డ్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ రిమెంబరెన్స్ డే” వేదికను 2005లో ఐరాస కూడా తీర్మానించడంతో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చర్చించడం, బాధితులు వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేయడం, ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులకు నివాళులు అర్పించడం, ప్రభుత్వాలు/స్సచ్ఛంద సంస్థలకు చేయూత/సూచనలు ఇవ్వడం లాంటి కారణాలను చర్చించడానికి, అవగాహన కల్రించడానికి ఉద్దేశించబడింది.
ఐరాస అంచనాల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా 1.35 మిలియన్ల ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 5 – 29 ఏండ్ల పిల్లలు/యువత అధికంగా ఉన్నారని తేలింది. పాదచారులు, సైకిల్/బైక్/ఆటోల్లో ప్రయాణించే వారు అధిక శాతం రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2020 వరకు రోడ్డు ప్రమాదాలను 50 శాతం వరకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ లక్ష్యాలను నాటికి చేరడంలో విఫలం కావడం శోచనీయం. 2021-30 దశాబ్దాన్ని “గ్లోబల్ ప్లాన్ ఫర్ జి డికేడ్ ఆఫ్ ఆక్షన్ ఫర్ రోడ్ యూజర్స్”గా కూడా ప్రకటించడం గమనార్హం.
భారతంలో రోడ్డు ప్రమాదాల దుస్థితి:
రోడ్డు ప్రమాదాలు అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో అధికంగా నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 2022లో రోడ్డు ప్రమాదాల్లో 74 వేల మంది స్త్రీలు, 355 వేల మంది పురుషులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మన దేశంలో సగటున రోజుకు 1,264 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 462 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తున్నది. ప్రతి గంటకు 53 ప్రమాదాలు, 19 మరణాలు నమోదు అవుతున్నాయి.
ప్రపంచ వాహనాల్లో ఒక శాతం వాహనాలను వినియోగిస్తున్న భారతంలో రోడ్డు ప్రమాదాల్లో మాత్రం 6 శాతం నమోదు అవుతున్నాయి. దాదాపు 70 శాతం రోడ్డు ప్రమాద బాధితులు యువకులే కావడం బాధాకరం. గత దశాబ్దంలో 15.3 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడిచారు. 2023లో 1.7 లక్షల మంది చనిపోగా, 4.63 లక్షలు గాయపడ్డారు. ఒక్క ఏపీలోని సగటున నెలకు 1,600 ప్రమాదాలు నమోదు కాగా 680 మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.
రోడ్డు ప్రమాదాలను తగ్గించే మార్గాలు:
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, సురక్షితంగా డ్రైవింగ్ చేయడం, డ్రైవర్లు మద్యానికి/డ్రగ్స్‌కు దూరంగా ఉండడం, వేగాన్ని అందులో ఉంచడం, ప్రమాదకర మలుపుల వద్ద జాగ్రత్తగా ప్రవర్తించడం, ప్రతికూల వాతావరణంలో నెమ్మదిగా నడపడం, వాహనాలను కండీషన్సో ఉంచడం, మౌళిక వసతులను కల్పించడం, ఆధునిక టెక్నాలజీని వినియోగించడం, రోడ్డు సెఫ్టీని ప్రచారం చేయడం, నిబంధనలు ఉల్లంఘించిన వారితో కఠినంగా వ్యవహరించడం, రోడ్డు నిబంధనలను తెలుసు కోవడం, ప్రజారవాణాలను బలోపేతం చేయడం, అవసరమైన చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, నిరంతర నిఘా ఏర్పాటు చేయడం, సీటు బెల్టులు/హెల్మెట్లు విధిగా వాడడం, రాత్రి డ్రైవింగ్‌ను తగ్గించడం, ప్యాసెంజర్లను పరిమితులకు లోబడి తీసుకోవడం, డ్రైవింగ్ లైసెస్స్ తీసుకోవడం లాంటి చర్యలు రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తాయి.
వేగం కన్న ప్రాణం మిన్న, స్పీడ్ త్రిల్స్ బట్ కిల్స్ అనే నినాదాలకు కట్టుబడి సురక్షిత ప్రయాణంతో విలువైన ప్రాణాలను కాపాడుకుందాం. ప్రయాణం ప్రమోదదాయకం కావాలే కాని ప్రాణాంతకం కారాదు. ప్రయాణం గంటలు, నిమిషాలే, కాని జీవితం నిండు నూరేళ్లు. క్షణ కాలపు మన నిర్లక్ష్యం నూరేళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేస్తుంది. రోడ్డుపై నడిచినా, వాహనం నడిపినా మన జాగ్రత్తల్లో మనం ఉంటూ అందరం సురక్షితంగా ఇంటికి చేరుదాం, విలువైన జీవితాలను సుసంపన్నం చేసుకుందాం.