Telugu News

డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్ వివాదాస్పద‌ జీవితం  

రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, మీడియా పర్సనాలిటీ, రచయిత అయిన డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ జీవితం ఆద్యంతం జయాపజయాల సమ్మిళితం. పడిన ప్రతి సారి నూతనోత్తేజంతో ఆకాశమంత ఎత్తు ఎగిరే విచిత్ర, వివాదాస్పద తత్వం ట్రంప్‌ది. 70వ ఏట 2017-21 మధ్య అమెరికా 45వ అధ్యక్షుడిగా సేవలు అందించిన డొనాల్డ్‌ ట్రంప్‌, నేడు తన 78 ఏండ్ల వయస్సులో రెండోసారి అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అత్యంత వయస్సు కలిగిన యూఎస్‌ అధ్యక్షుడిగా రికార్డు నెలకొల్పుతూ తన ప్రజాదరణతో పాటు ప్రత్యేకతను చాటుకున్నారు. 

బాల్యం, విద్యాభ్యాసం:

ఫ్రెడ్రిక్‌ క్రిస్ట్‌ (ఫ్రెడ్) ట్రంప్‌‌-మెరీ అన్నేమాక్‌లియార్డ్‌ ట్రంప్‌ దంపతులకు 14 జూన్‌ 1946న న్యూయార్క్‌ క్వీన్స్‌లో మధ్య తరగతి కుటుంబంలో ఐదుగురి సంతానంలో 4వ సంతానంగా (మెరిసాన్నే, ఫ్రెఢ జూనియర్‌, ఎలిజబెత్‌, రాబర్ట్‌) జన్మించారు. తండ్రి ‘ఫెడ్‌ ట్రంప్’ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా పేరు గడించారు.‌ బాల్యంలో డొనాల్డ్‌ ప్రవర్తన విచిత్రంగా, సమస్యాత్మకంగా ఉండేది. అతి చురుకుదనంతో కీవ్‌-ఫారెస్ట్‌/సందేహం స్కూల్‌-మ్యాన్‌హట్టన్‌ పాఠశాల్లో ఇతరులతో ఇమడడం కష్టంగా ఉండేది.

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రవర్తనకు విసిగిపోయిన తండ్రి ఫ్రెడ్‌ ట్రంప్‌ మరో మార్గం దొరక్క డొనాల్డ్‌ ట్రంప్‌ క్రమశిక్షణారాహిత్యాన్ని గాడిలో పెట్టడానికి న్యూయార్క్‌ మిలటరీ అకాడమీలో చేర్పించారు. మిలిటరీ అకాడమీలో క్రమశిక్షణను మెరుగుపరుచుకుని విద్యార్థి నాయకుడిగా, క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన మోకాలి ఎముకల సమస్యతో వియత్నాం యుద్ధంలో పాల్గొనడానికి అర్హత కోల్పోయారు. పాఠశాల విద్య తర్వాత పోర్దమ్‌ యూనివర్సిటీ, పెన్సిల్‌వేనియా యూనివర్సిటీల్లో చదివి 1968లోఎకనమిక్స్‌ బాచిలర్స్‌ డిగ్రీ పొందారు. 

రియల్‌ ఎస్టేట్ వ్యాపారిగా‌ “ట్రంప్‌ సంస్థల సామ్రాజ్యం”:

డిగ్రీ అనంతరం తండ్రి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో చేరి మెలకువలు నేర్చుకొని, మాన్‌హట్టన్‌ ప్రాంతంలో తనదైన శైలిలో ఆకాశహర్మ్యాలు నిర్మించి మంచి రియల్‌ ఎస్టేట్‌ డెవలప్పర్‌గా పేరు గడించారు. అనతి కాలంలోనే న్యూయార్క్‌ సిటీలో సర్వాంగ సుందరంగా గ్రాండ్‌ హయత్‌ హోటల్‌, ట్రంప్‌ టవర్స్‌, ట్రంప్‌ వరల్డ్‌ టవర్‌, ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ లాంటి అనేక ఆకాశహర్మ్యాలను విజయవంతంగా నిర్మించి తనదైన ముద్ర వేశారు.  “శ్వేత జాతి అమెరికన్లకు మాత్రమే” పరిమితం అంటూ సంపన్నులకు విలాసవంతమైన గృహాలను నిర్మించి వివాదస్పదంగా మారారు.

2003-15 మధ్య ట్రంప్‌ నిర్వహించిన “ది అప్రెంటిస్‌”, “ది సెలబ్రిటీ అప్రెంటిస్‌” అనే రెండు టివీ రియాలిటీ షోల ద్వారా తన కంపెనీలో ఉద్యోగాల ఎంపిక కార్యక్రమం విజయవంతంగా నడిపి అందరూ అమెరికన్ల ఆదరణను పొందారు. గృహ సముదాయాలు, ఆకాశహర్మ్యాలు, హోటల్స్‌, క్యాసినోలు, గోల్ఫ్‌ కోర్సులు, అందాల పోటీలు(మిస్‌ యూఎస్‌ఏ, మిస్‌ టీన్‌ యూఎస్‌ఏ), పలు బ్రాండెడ్‌ ఉత్పత్తుల రంగాలతో తన “ట్రంప్ ఆర్గనైజేషన్స్‌‌” బ్రాండ్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ, అత్యంత సంపన్నుడిగా ఖ్యాతి గడిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపారు, నేడు గడుపుతున్నారు. 

వివాదాలు, విలక్షణతలు తన ప్రత్యేకతలు:

తన సోదరుడు జూనియర్‌ ఫ్రెడ్‌ తాగుబోతుగా మారి అకాల మరణం చెందడంతో చలించిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన జీవితాంతం ఆల్కహాల్‌, పొగ తాగనని ప్రతినబూనారు. డొనాల్డ్‌ ట్రంప్‌ సహ-రచయితగా “ది ఆర్ట్‌ ఆఫ్‌ ది డీల్‌”, “థింక్‌ లైక్‌ ఏ చాంపియన్‌”, “ది ఆర్ట్‌ ఆఫ్ ది కమింగ్‌ బ్యాక్‌” లాంటి పుస్తకాలు రచించారు. తన వ్యాపార జీవితంలో పలుమార్లు తన కంపెనీలు దివాళా తీయడం, అధిక నష్టాలపాలు కావడం, ఆర్థికంగా చితికి పోవడం, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించడం, పన్నుల ఎగవేత, నిధుల దుర్వినియోగం లాంటి పలు కష్టనష్టాలను దాటుకుంటూ పడిన చోటే లేచి నిలబడి తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నిలదొక్కుకున్నారు. 2015లో తన వ్యక్తిగత అకడమిక్‌ వివరాలను బహిర్గతం చేయవద్దంటూ తాను చదివిన పాఠశాలలు, కాలేజీ బోర్డులను హెచ్చరించడం కూడా ట్రంప్‌కే చెల్లింది. రిపబ్లికన్‌ అధ్యక్షుడిగా రెండు సార్లు గెలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌ 2001-09 మధ్య డెమెక్రాటిక్‌ పార్టీలో, 2011-12 మధ్య స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లో పనిచేశారు. తొలి దశలో అధ్యక్షుడిగా పలు కుంభకోణాలు, పక్షపాత ధోరిణిలు, విచారణలు, అక్రమ లైంగిక సంబంధాలు లాంటివి ఎదుర్కొని అత్యంత వివాదస్పద అధ్యక్షుడిగా ‘అన్‌ప్రెసిడెంటెడ్‌ (తనదైన కొత్తదనం)’ అని పిలువబడ్డారు. 

ముగ్గురు భార్యలతో (ఇవానా జెలినికోవా(1977-90), మర్లా మాపిల్స్(1990-99)‌, మెలానియా నాస్(2005 నుంచి నేటి వరకు‌)  సంసారం చేసిన ట్రంప్‌కు ఐదుగురు (డొనాల్డ్‌ జూనియర్‌‌, ఇవాంకా,  ఎరిక్‌, టఫెనీ, మరియానె బారాన్‌) సంతానం ఉన్నారు. 

20 జనవరి 2025 రోజున అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ 2.0 అమెరికా ఫస్ట్‌, అమెరికా ది గ్రేట్‌ అగైన్‌, ఇక స్వర్ణయుగమే, మూడవ ప్రపంచ యుద్ధం వద్దు, అక్రమ వలసలపై ఉక్కుపాదం, ఉగ్రవాద సంస్థల మెడపై కత్తులు అంటూ చేసిన ప్రసంగం రానున్న రోజుల్లో నిజం కావాలని 78 ఏండ్ల టెంపర్‌ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలియజేద్దాం. 

Show More
Back to top button