Telugu News

పట్టణ మహిళలపై గాలి కాలుష్య దుష్ప్రభావాలు

 ఢిల్లీ, ముంబాయి లాంటి భారత మహానగరాలు గాలి కాలుష్య కుంపట్ల వలె మారాయని, అలాంటి గరళ గాలి కాలుష్యాలతో నగరవాసులు ఊపిరి బిగబట్టుకొని బతుకులు ఈడుస్తున్నారని స్పష్టం అవుతున్నది. అత్యంత తీవ్రమైన గాలి కాలుష్య నగరాల్లో భారతదేశ మహానగరాలే ముందు వరుసలో ఉంటున్నాయి. శీతాకాలం సమీపిస్తున్న వేళ మహానగరాల గాలి కాలుష్యం జడలు విప్పనుంది. ప్రమాదకర స్థాయిలో గాలి కలుషితం రావడంతో వాహనాల నియంత్రణ లేదా రద్దు చేయడం లాంటి చర్యలు కొంత వరకు మాత్రమే ఫలితాలను ఇస్తున్నాయి. నగరాల సమీప వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున వ్యర్థాలను కాల్చడంతో పిఎమ్‌ 2.5 కాలుష్యం తీవ్రరూపం దాల్చుతున్నది.  నగర పురుషులు, మహిళలు సమానంగా కాలుష్యం బారిన పడినప్పటికీ స్త్రీలపై గాలి కాలుష్య దుష్ప్రభావాలు మరింత భయపెడుతున్నాయి. 

మహిళలపై గాలి కాలుష్య దుష్ప్రభావాలు:

గర్భిణి స్త్రీలు కలుషిత గాలి పీల్చడంతో కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతున్నది. దాని ప్రభావంతో మిస్‌క్యారేజ్ లేదా అబార్షన్‌ కావడం, నెలలు నిండాకుండానే ప్రసవాలు, తక్కువ బరువు కలిగిన శిశువులు పుట్టడం, ప్రసవానంతర తల్లిబిడ్డల అనారోగ్యాలు జరుగుట గమనించారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో మరణాల రేటు 20 రెట్లు అధికంగా ఉంటాయని, అసంక్రమిక వ్యాధులు పెరగవచ్చని వింటున్నాం. మహిళా కార్మికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న వేళ వారిపై గాలి కాలుష్య ప్రభావం పెరిగి రేపటి తరం భవిత సన్నబారుతున్నట్లు తేలింది. ఇంట్లో వంట చెరుకు, పిడకలు లేదా బొగ్గుతో వంట చేసే మహిళల ఆరోగ్యంపై గాలి కాలుష్య ప్రభావం, గోరు చుట్టలపై రోకలి పోటు వలె, అనేక రెట్లు పెరుగుట గమనించారు.

హృదయనాళ సంబంధ అనారోగ్యాలు, ఫర్టిలిటీ (వంధ్యత్వం) సమస్యలు, మానసిక అనారోగ్యాలు, ఏకాగ్రత లోపాలు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, శ్వాసకోశ వ్యాధులు, ఆటిజమ్‌ లేదా మూగవ్యాధి లాంటివి మహిళల్లో గాలి కాలుష్యంతో పెరుగుతున్నాయి. వ్యవసాయం లేదా భవన నిర్మాణ రణగాల్లో పని చేస్తున్న మహిళల దుస్థితి వర్ణనాతీతం. రుతుస్రావం ఆగిన మహిళల్లో గాలి కాలుష్యంతో ఎముకల సాంద్రత తగ్గడం, గర్భాషయంపై ప్రతికూల ప్రభావాలు, ఎదుగుదల ఆగిపోవడం, అలర్జీ, అస్తమా, న్యుమోనియా, టిబి లాంటి ప్రమాదకర వ్యాధులు జడలు విప్పుతున్నాయి.

మహిళా సఫాయి కార్మికులపై గాలి కాలుష్య ప్రభావం ఆరు రెట్లు అధికంగా నమోదు కావడంతో శ్వాసకోశ అనారోగ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, పాలిచ్చే తల్లులపై గాలి కాలుష్యం ఏదో తెలియని  పగ తీర్చుకుంటున్నది. గాలి కాలుష్య దుష్ప్రభావాలను కట్టడి చేయడానికి ఎక్కువ నీరు తాగడం, అనారోగ్యం బారిన పడిన వెంటనే వైద్యులను సంప్రదించడం, మాస్కులు ధరించడం, యూవి కాంతికి దూరంగా ఉండడం, కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచకుండా ఉండడం, ఎయిర్‌ ఫ్యూరిఫైయర్లను వాడుకోవడం, కలుషిత గాలికి వీలైనంత వరకు దూరంగా ఉండడం లాంటివి నేటి నగర మహిళలు పాటించాలి. 

గర్భిణి స్త్రీలకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం, అదనపు పోషకాహారం అందించడం, పని గంటలను పునర్‌ సమీక్షించడం, అవసరమైన విశ్రాంతిని అందించడం లాంటివి సత్ఫలితాలను ఇవ్వవచ్చు. మహిళలకు గాలి కాలుష్యం పట్ల అవగాహన చాలా స్వల్పంగా ఉండడంతో పెను ప్రమాదాలు పొంచి ఉన్నట్లు పేర్కొంటున్నారు. మహానగరాల రేపటి పౌరులు గాలి కాలుష్యం బారినపడి బక్కచిక్కిన బతుకులను ఈడ్చుతూ, పుట్టబోయే బిడ్డలు సహితం అనారోగ్యాలతో పుట్టడం, శిశు మరణాలు కూడా నమోదు కావడం విచారకరం. ఈ విధంగా గాలి కాలుష్య ప్రభావాన్ని తెలుసుకుంటూ జాగ్రత్తగా రేపటి అడుగులు వేయాలని కోరుకుందాం. 

Show More
Back to top button