మంటలు చెలరేగినప్పుడు ఫైర్ ఇంజన్ని పిలవడం కన్నా. నిప్పు రాజుకుంటున్నప్పుడే ఊది ఆర్పేయాల్సింది. అయితే ఆ పని జరగాల్సిన రీతిలో జరగకపోవడం వల్ల నేడు మణిపూర్ జాతుల మధ్య వైరం దావాలనంలా తయారైంది. సమస్యను తేలిగ్గా తీసుకోవడమో, లేదా స్వంత పార్టీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అతి నమ్మకమో గానీ కేంద్రం ఈ విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించ లేకపోయింది.
లేకుంటే అక్కడి పరిస్థితిని దారిలోకి తెచ్చుకోవడం కేంద్రానికి ఏమంత కష్టమైన పని కాదు. అక్కడ రాజకీయంగా, ఆర్థికంగా పైవరసలో ఉన్న మైదాన ప్రాంతపు మెజారిటీ గ్రూప్ మైతీలకు, వెనకబడి కొండల్లో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల సమూహం కుకీ గిరిజన తెగలకు మధ్య వైరుధ్యం ఈనాటిది కాదు. అయినా తాజా ఘర్షణలకు మూలం 2023లో మైతీలు కోరుతున్న షెడ్యూల్ తెగ స్టేటస్ పరిశీలించాలంటూ అక్కడి హైకోర్టు ప్రభుత్వాన్ని కోరడం. అక్కడ మొదలైన నిరసనలు ముదిరి దాడులు, ప్రతిదాడులు అత్యాచారాలు, హత్యల వరకూ వచ్చాయి. అక్కడి ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన స్వంత తెగ మైతీలకు కొమ్ము కాస్తున్నట్టు కుకీల అనుమానం.
ఈ సంవత్సరం మొదట్లో ఒక మహిళను నగ్నం ఊరేగించి, ఆపై హత్య చేసిన వీడియో బయటకు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగు ఆదేశా లిచ్చింది. అక్కడి సమస్యకు రాజకీయ, సామాజిక పరి ష్కారాల్ని చర్చల ద్వారా, పాలనపై నమ్మకం కలగజేయడం ద్వారా కాకుండా ప్రభుత్వం శాంతి భద్రతల కోణంలోనే ఆలోచించింది. ఫలితంగా అదే ముఖ్యమంత్రి, అదే బలగాల్ని పెంచుతూ పోయే ప్రక్రియలు. అవి వికటించగా నేడు మళ్ళీ 5 వేల మంది బలగాల మోహరింపు, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం మళ్ళీ ప్రవేశ పెట్టడం లాంటివి అవసరం పడ్డాయి.
తీవ్రవాదులు కొద్ది మంది ఉంటే అణిచి వేయవచ్చు. ప్రజలే చీలిపోయి వర్గాలుగా మారి హింసకు తెగబడితే ఆ స్థితిని అదుపు చెయ్యడానికి కేవలం బలగాలు సరిపోవు. పైగా ఆ రాష్ట్రం మయన్మార్ సరిహద్దులో ఉంది. విదేశీ శక్తులు చొరబడి పరిస్థితిని దిగజారుస్తున్నాయని భావించినా, ఆ అవకాశం వారికి ఇవ్వకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలి. రాను రానూ పరిస్థితి దిగజారుతుందంటే, కేంద్రం చేస్తున్న చికిత్స పనిచేయడం లేదని అర్థం. మంత్రులకే రక్షణ లేని స్థితికి వచ్చింది. రాష్ట్రంలో మిత్ర పక్షాలు, నేషనల్ పీపుల్స్ పార్టీతో సహా, మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఇప్పుడు కేంద్రం ఆ రాష్ట్రాన్ని తన అదుపులోకి తెచ్చుకుని మంటల్ని ఆర్పాల్సిన అవసరం ఉంది.