బరువు తగ్గడానికి, బాడీ ఫిట్‌గా ఉండటానికి అనేక వ్యాయామాలు చేస్తుంటాం. మన అవసరం కోసం చేసే కొన్ని పనులు ఆరోగ్యాన్ని తెచ్చిపెడతాయి. మీరు ఎప్పుడైనా సైకిల్ తొక్కారా? ఇప్పుడంటే బైక్‌లు వచ్చాయి. కానీ, ఒకప్పుడు ప్రతి ఇంట్లో సైకిల్ ఉండేది. ఏదో ఒక పని మీద సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవాళ్లం. ఇలా సైకిల్(సైక్లింగ్) తొక్కడం వల్ల శరీరానికి ఎంతో ప్రయోజనం ఉందని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం..
సైక్లింగ్ చేస్తున్నప్పుడు పాదాల నుంచి తల వరకు అన్ని శరీర భాగాల్లో కండరాల్లో కదలికలు జరుగుతాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడి.. శరీరంలో అవయవాలన్నింటికి ఆక్సిజన్ చక్కగా సరఫరా అవుతుంది.
గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్నవారికి సైక్లింగ్ మంచిది. BP అదుపులో ఉండటానికి, సులభంగా బరువు తగ్గడానికి సైక్లింగ్ ఉపయోగపడుతుంది.
తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నవారు సైక్లింగ్ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
సైక్లింగ్‌తో బాడీ మరింత ఫిట్
పిక్కలు పట్టేయడం, నొప్పి, వెరికోన్స్ వీన్స్(సిరలు ఉబ్బిపోవడం) వంటి సమస్యలతో బాధపడుతున్న వారు సైక్లింగ్ చేస్తే ఉపశమనం పొందవచ్చు. వెరికోన్స్ వీన్స్ వల్ల కలిగే మంటలు, నొప్పులు, వాపులు సైక్లింగ్ వల్ల తగ్గుతాయి.
సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లలో కండరాలు బలపడి రక్తం శరీర పైభాగాలకు చురుకుగా సరఫరా అవుతుంది.
కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు కూడా సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
శరీరంలో ఎముకలు ధృడత్వం, హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది.
డయాబెటిస్‌తో బాధపడే వారు సైక్లింగ్ చేయడం వల్ల ఇన్సులిన్‌ని నిరోధించే శక్తి తగ్గి ఇన్సులిన్ స్వీకరించే శక్తి పెరుగుతుంది. దీంతో డయాబెటిస్ నుంచి సులభంగా బయటపడవచ్చు. భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.