మానవీయ గుణాల్లో దయ, కరుణ, క్షమాగుణం లాంటివి అతి ప్రధానమైనవి. దయ చూపడం ఓ సుగుణం అని అర్థం చేసుకోవాలి. దయను పంచడం ఓ అలవాటు కాలాలి. దయకలిగిన వారిలో దైవత్వం ఉట్టిపడుతుంది. దయాగుణం కలిగిన మానవ సమాజం ప్రశాంత వాతావరణంలో సుఖశాంతులతో వర్థిల్లుతుంది. దయ పంచని వారు కఠినాత్ములుగా పరిగణించబడతారు.
ఇలాంటి అతి ముఖ్యమైన మానవీయ దయాగుణం ప్రాధాన్యాన్ని ప్రపంచ మానవాళికి గుర్తు చేయడానికి, దాని శక్తిని అవగాహన పర్చడానికి 1998 నుంచి ప్రతి ఏట 13 నవంబర్ రోజున ప్రపంచవ్యాప్తంగా “ప్రపంచ దయ దినోత్సవం(వరల్డ్ కైండ్‌నెస్ డే)” నిర్వహించడం ఆనవాయితీగా మారింది. మన దైనందిన జీవితాల్లో దయాగుణానికి పెద్ద పీట వేయబడింది. సున్నిత మనస్కుల్లో దయాగుణం ఒక శాశ్వత సుందర ఆభరణంగా నిలుస్తుందని ప్రజలకు తెలియపర్చడం, సహానుభూతిని అలవాటు చేసుకోవడం, అర్థవంతంగా జీవితాన్ని గడపడం, సమన్వయ భావనలతో ఇరుగుపొరుగుకు చేయూతనివ్వడం లాంటివి దయామయులకు మాత్రమే సాధ్యమవుతాయి.
దయామయులు ఆదర్శవంతులు:
దయగల వ్యక్తులు ఉదారంగా, ప్రేమగా, సదుద్దేశ్యంతో ఉంటారు. అసంకల్పితంగా పరులకు సహాయం చేయడం, నిస్వార్థంగా అవసరార్థులకు సేవలు అందించడం, సత్కార్యాలకు పూనుకోవడం లాంటి సద్గుణాలు దయామయుడిలో కనిపిస్తాయి. దయగల వ్యక్తులు ఇతరుల జీవితాల్లో నవ్వుల వెలుగులను చూడడానికి ఉత్సాహపడతారు. దయగల మహానుభావులు సమాజంలో ఆదర్శవంతులుగా లేదా రోల్ మోడల్‌గా నిలబడతారు. దయామయులు చరిత్రలో చెరగని ముద్రను వేస్తారు. దయగల వ్యక్తుల్లో నైతికత, నీతి, నిజాయితీ, సేవాతత్పరత, నిబద్దత, ప్రేమాభిమానాలు, విలువలతో కూడిన జీవన విధానాలు విధిగా కనిపిస్తాయి. దయగల వారు చీమకు కూడా హానిని తలపెట్టరు. “సకల జీవుల సేవయే మాధవ సేవ” అని పూర్తిగా నమ్ముతారు.
బాల్యం నుంచే దయాగుణాన్ని నేర్పించాలి:
దయగల వ్యక్తులు ఇతరులకు స్వచ్ఛందంగా సహాయం చేయగల మహత్తర శక్తి ఉంటుంది. దాతృత్వం, సహృదయత, విచక్షణ, మానవీయత, సహానుభూతి గుణాలు కలిగిన వ్యక్తులను దయామయుడిగా పరిగణిస్తారు.
“మొక్కై వంగనిదే మానై వంగునా” అన్నట్లు చిన్నతనం నుంచే పిల్లల్లో దయాగుణాన్ని బోధించడం తల్లితండ్రుల బాధ్యతగా గుర్తించాలి. దయలేని ప్రపంచం నరకప్రాయమని అర్థం చేయించాలి. ప్రపంచ దయ దినోత్సవం వేదికగా దయా గుణాన్ని పిల్లల్లో అలవాటు చేయడం, బడి పిల్లల చేత ఇతరులకు సేవ అందించడాన్ని అలవాటు చేయడం, చిన్నారుల చేతుల మీదుగా పేదలకు సహాయం చేయించడం, వారి పుట్టిన రోజులను పేదల పిల్లల మధ్య జరుపుకోవడం, దయ గుణం ప్రాధాన్యాన్ని వివరించడం, దానధర్మాలు చేయడం, నిస్సహాయులకు చేయూత అందించడం, దయగల వ్యక్తులను సన్మానించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు.
దయ వర్ధిల్లే ప్రపంచం స్వర్గతుల్యం. దయలేని మనిషిలో రాక్షసత్వం బయట పడుతుంది. దయాగుణంతో ప్రజల మనసులను గెలవవచ్చు. దయను ప్రదర్శించడానికి ప్రత్యేక సందర్భాలంటూ కొన్నే ఉన్నప్పటికీ, అనుక్షణం దయను చూపడం ఓ మంచి అలవాటుగా మారాలి. అనాధాశ్రమ వాసులకు సహాయం చేయడం, అవసరార్థులకు తగు చేయూతనివ్వడం మన కనీస కర్తవ్యంగా భావించి దయాగుణాన్ని నరనరాల్లో నింపుకుందాం, దయ అనే వృక్షం నీడన జీవించడం అలవాటు చేసుకుందాం.