Telugu Special Stories

మాస్టర్ ఆఫ్ లైటింగ్’.. టెస్లా!

ప్రపంచ మేధావుల జాబితా తెరచి చూస్తే.. మనకు గొప్ప గొప్ప ఆవిష్కర్తలైన ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ మొదలైనవారు తారసపడతారు. వీళ్లు యూనివర్స్(విశ్వాని)కి సంబంధించి మనకి అంతుచిక్కని, అర్ధంకాని ఎన్నో సూత్రాలను కనిపెట్టారు. కానీ నిత్యం మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువులు, ఇప్పుడు ఉపయోగిస్తున్న మొబైల్, కరెంట్ వంటి టెక్నాలజీపరంగా చూసుకుంటే మోస్ట్ బ్రిలియంట్ పర్సన్ మరొకరున్నారు… ఆయనే ‘మాస్టర్ ఆఫ్ లైటింగ్’ గా పేరొందిన నికోలా టెస్లా. వైర్ లెస్ కరెంటును అందరికి ఉచితంగా అందించాలని కలలు కన్న వ్యక్తి.. ఏసీ(ఆల్టర్నేటింగ్ కరెంట్) కరెంట్ రన్ అయ్యే మొదటి మోటార్ ను తయారుచేసిన ఘనత ఆయనదే.. రాబోయే కాలంలో మన చేతిలో సెల్ ఫోన్లు ఉంటాయని 1930లోనే చెప్పిన విజ్ఞాని.. ఆయన ఇన్వెన్షన్స్ ఈ ప్రపంచానికి సరికొత్త దారిని చూపింది. ఇప్పటికి టెస్లా స్టడీస్ ని రిఫరెన్స్ గా తీసుకుని ఎంతోమంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అటువంటి గొప్ప మేధావి తాను చేపట్టిన వివిధ పరిశోధనలు వాటి తీరుతెన్నులను గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.

నేపథ్యం..

1856, జులై 10న ఆస్ట్రేలియాలోని స్మిల్జాన్ లో జన్మించారు నికోలా టెస్లా. టెస్లా తండ్రి చర్చిలో ఫాదర్. అప్పట్లో మగపిల్లాడు పుడితే కొంతకాలం ఆర్మీలో లేదంటే చర్చిలో పనిచేయాలనే నియమం ఉండేది. కానీ ఈ రెండు టెస్లాకి ఇష్టం లేదు. ఆయన ఇంజనీర్ అవ్వాలనుకున్నారు. స్కూలింగ్ అవ్వగానే, ఆస్ట్రియాలో యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో 8 భాషల్లో ప్రావీణ్యం పొందారు. ఈయనకి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఫిజిక్స్ అంటే మక్కువ. తనకున్న ఐక్యూ పవర్ తో.. ఇంటిగ్రల్ క్యాలుకేషన్ ను మెదడులోనే లెక్కించేవాడు. 

అప్పుడంతా డీసీ(డైరెక్ట్ కరెంట్) కరెంటు మీదనే నడిచేది. కానీ డీసీ కరెంటు వల్ల ఎన్నో నష్టాలుండేవని గ్రహించి.. ఆ సమయంలోనే ఏసీ(ఆల్టర్నేటింగ్ కరెంట్) కరెంటును ఉత్పత్తి చేసే జనరేటర్ ను తయారు చేయాలనే ఆలోచన కలిగింది టెస్లాకి. దానికి సంబంధించి ఎన్నో పరిశోధనలు కూడా చేశాడు. ఆ తర్వాత టెలిఫోన్ ఎక్స్ చేంజ్ కంపెనీలో ఉద్యోగంలోనూ చేరాడు.. తాను చేయాలనుకున్న ఆల్టర్నేట్ కరెంట్ మోటార్ గురించి బాగా ఆలోచించడం మొదలుపెట్టాడు. తన చేతిలో ప్లాన్ అయితే ఉంది కానీ.. అందుకూ ఫండింగ్ లేదు. అందుకోసం ప్యారిస్ లోని కాంటినెంటల్ ఎడిషన్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. అట్నుంచి టెస్లా 1884లో జేబులో కేవలం 4 సెంట్లతో ఎన్నో కలలతో అమెరికాకు చేరుకున్నాడు. అప్పుడు ఆయన వయసు 28. 

ఎడిసన్ కంపెనీలో ఉద్యోగం…

ఎడిసన్ కంపెనీలో చేరాలని ఆయన కల. అనుకున్నట్లే ఉద్యోగంలో చేరాడు. అప్పటికి ఎడిసన్ కంపెనీ న్యూయార్క్ సిటీలోని ఎలక్ట్రిసిటీని మెయింటేన్ చేస్తుంది. కానీ తరచూ కరెంటు పోతుండేది. డీసీ కరెంటు సిస్టం వల్ల చాలా ఇబ్బందులు ఉండేవి. దీన్ని ఎక్కువ దూరం పంపలేం. అలాగే వాడేకొద్ది మెరుపులు, మంటలు వంటి సమస్యలు ఏర్పడేవి. ఈ సమస్యను అరికట్టేందుకు, డీసీ కరెంటును ఆధారం చేసుకొని ఎడిసన్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. 

టెస్లా ఏసీ పవర్ జనరేట్ చేసే జనరేటర్ ప్లాన్ గురించి ఎడిసన్ కి చెప్పాడు. కానీ ఎడిసన్ టెస్లా ప్లాన్ కు సుముఖత చూపలేదు సరికదా.. బదులుగా తన కంపెనీలో అప్పటికే వర్కింగ్ లో ఉన్న డీసీ జనరేటర్ లోని లోపాలను సరిచేయమని టెస్లాకు చెప్పాడు. 

అలా ఎడిసన్ డిసీ జనరేటర్ లను టెస్లా రీడిజైన్ చేయగలిగితే.. అందుకుగానూ 50 వేల డాలర్లు బహుమతిగా ఇస్తానన్నాడు. అది విన్న టెస్లా.. డీసీ జనరేటర్ ను మరింత ఎఫిషియంట్ గా పనిచేసేలా తయారుచేశాడు. తనకిస్తానన్న 50వేల డాలర్ల గురుంచి ఎడిసన్ ని అడగగా, అప్పుడు ఎడిసన్ నీకు అమెరికన్ హ్యూమర్ అర్థమైనట్లు లేదు.. అని నవ్వి, నేను సరదాగా అన్నాను కానీ నువ్వు చేసిన పని చాలా బాగుంది. నీ జీతాన్ని పది డాలర్లకు పెంచుతానని అనడంతో టెస్లా ఆ మాటకు బాగా  నిరాశ చెందాడు. దాంతో టెస్లా ఎడిసన్ వద్ద పని మానేశాడు. అప్పటివరకు టెస్లాకి, ఎడిసన్ మీద ఉన్న ఆ కాస్త గౌరవం కూడా పోయింది. 

తర్వాత తాను బతకడం కోసం ఓ ఎలక్ట్రిక్ కంపెనీలో పనిలో చేరాడు. అలా ఒక సంవత్సరంపాటు చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడిపాడు. 

సొంతంగా ల్యాబ్..

కొంతకాలానికి టెస్లా ఐడియా నచ్చి, కొంతమంది పెట్టుబడిదారులు ముందుకు రావడంతో టెస్లా స్వయంగా ఒక ల్యాబరేటరీని నిర్మించుకున్నాడు. అక్కడ తాను ఊహించుకున్న ఏసీ జనరేటర్ ను నిర్మించే పనిలో పడ్డాడు. ఐదు సంవత్సరాల్లో టెస్లా కనిపెట్టిన ఏసీ మోటార్స్ జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్స్ మీద 22 పేటెంట్లు తీసుకున్నాడు. ఏసీ సిస్టమ్ కి మంచి భవిష్యత్ ఉందని ముందే గుర్తించిన జార్జ్ వెస్టింగ్ హౌస్(ధనికుడు), టెస్లా పేరు మీదున్న ఆల్టర్నేటింగ్ కరెంట్ కు సంబంధించిన అన్ని పేటెంట్స్ ను సుమారు 1 మిలియన్ డాలర్లకు కొనుక్కోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా టెస్లా ధనవంతుడయ్యాడు. ఆయన పేరు దేశమంతటా మారుమోగిపోయింది. ఏసీ కరెంటును తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం పంపగలమనే సూత్రంతో.. ఏసీ కరెంటు వాడుకలోకి వచ్చింది. 

ఇక ఏసీ కరెంట్ ఎడిసన్ వ్యాపారానికి పెద్ద నష్టం తేవడంతో ఎడిసన్ కి, టెస్లాకి మధ్య యుద్ధం మొదలయ్యింది. అప్పట్లో దీనిని ‘వార్ ఆఫ్ కరెంట్స్’ అనేవారు. ఏసీ కరెంటును ఆపివేయాలని, ఏసీ కరెంటు వాడటం వల్ల ఇళ్లు కాలిపోతున్నాయని రుజువుగా ప్రజలందరి ముందు కుక్కలు, గుర్రాలు, ఏనుగులకి ఏసీ కరెంటుతో షాక్ ఇచ్చేవాడు. దాంతో ఆ జీవులన్ని అక్కడికక్కడే చనిపోయేవి. అంతేకాదు ఏసీ కరెంట్ తగిలితే చావు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చూపించడానికి, జైల్లో ఖైదీలకు శిక్ష విధించడానికి ఒక ఎలక్ట్రిక్ ఛైర్ ను సైతం ప్రత్యేకంగా తయారు చేయించాడు.

దీనికితోడు ఎడిసన్ ఎన్ని ప్రయోగాలు చేసిన అవి ఫలించలేదు. ఏసీ కరెంట్ వల్ల ప్రమాదం ఏమిలేదని తర్వాత టెస్లా ఒక కొత్త ప్రయోగమైన ‘టెస్లా కాయిల్’ అనే పరికరాన్ని తయారు చేసి, నిరూపించాడు. దానిద్వారా కొన్ని లక్షల వోల్టుల విద్యుత్తును తన శరీరంగుండా పంపి.. ఏసీ కరెంట్ మీద ప్రజలకి మరింత నమ్మకం వచ్చేలా చేశాడు. టెస్లా నయగారా వాటర్ ఫాల్స్ కి టర్బైన్ ఏర్పాటు చేసి, ఏసీ జనరేటర్ల ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా.. నయగారా నుంచి సుమారు 580 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూయార్క్ వంటి ప్రాంతాలకు కూడా విద్యుత్తును పంపగలిగాడు. దాంతో ఎడిసన్ కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. అలా ఎడిసన్ కి, టెస్లాకి మధ్య మొదలైన ఏసీ, డీసీ కరెంట్ యుద్ధం ముగిసింది.

దీంతో టెస్లా ఖ్యాతి అమెరికాను దాటి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. పైగా ఎన్నో అవార్డులు వరించాయి.

ల్యాబ్.. అనుకోని ప్రమాదం..

ఇకపోతే తాను ఎంతో అపురూపంగా చూసుకునే ల్యాబ్ అనుకోకుండా తగలబడిపోయింది. ఏ పనైనా ఏ ప్రాజెక్టు అయినా సరే, న్యూయార్క్ సిటీలోని తన ల్యాబ్ లో చేసేవారు టెస్లా. ఆయన చేసిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన డిజైన్లను ఆ ల్యాబ్ లోనే ఉంచేవారు. రోజు మొత్తంలో ఎక్కువ సమయాన్ని ఆ ల్యాబ్ లోనే గడిపేవారు. ఎంతోమంది ఆ ల్యాబ్ కొచ్చి టెస్లా సృష్టిస్తున్న అద్భుతాలను దగ్గరుండి చూసేవారు. ఎంతోమంది ప్రముఖులను సైతం టెస్లా ల్యాబ్ ఆకర్షించింది. కానీ ఒకరోజు అనుకోకుండా ల్యాబ్ మొత్తం కాలిపోయింది. టెస్లా అనుకున్న ఎన్నో ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్లాన్స్ అన్ని అందులోనే కాలి బూడిదయ్యాయి. టెస్లా ఈ ప్రమాదాన్ని అస్సలు ఊహించలేదు. తను ఎంతో ఖర్చుతో ఎన్నో వ్యయప్రయాసలతో కట్టుకున్న ల్యాబ్ కాలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆయన కష్టాల్లో పడ్డారు. తన ఫైనాన్షియల్ పొజిషన్ కూడా డౌన్ అయ్యింది. అదే సమయానికి వెస్టింగ్ హౌస్ తో ఉన్న కాంట్రాక్ట్ కూడా ముగింపుకు వచ్చేసింది.

ఇంత జరిగినా ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తిరిగి ఏదో ఒక ప్రయోగంలో నిమగ్నమైన ఆయన స్పిరిట్ కు ఏది తక్కువ కాదనిపించింది.

ఓడినా.. పనిలోనే ఆనందం వెత్తుకున్నాడు..

అనంతరం 1898లో రిమోట్ కంట్రోల్ సాయంతో ఒక చిన్న బోటును తయారుచేశాడు. దీన్ని ఆర్మీకి ఇవ్వాలని టెస్లా ప్లాన్. జనాలకి డెమో చేసి చూపించారు. కానీ ఆర్మీ ఈ టెక్నాలజీని నమ్మలేదు. తరువాత టెస్లా కాయిల్, ఇండక్షన్ మోటార్, టెస్లా టర్బైన్, నియాన్ ల్యాబ్స్, ఎక్స్ రేస్ వంటి ఇలా ఎన్నో గొప్ప పరిశోధనలు, ఆవిష్కరణలు టెస్లా రూపొందించారు.

అయినా టెస్లా వెనకడుగు వేయకుండా తన కల  కోసం.. వాటిని నిజం చేయడం కోసం ఇన్వెస్టర్లను కలుస్తూనే ఉన్నారు. టెస్లా ఐడియాలు అప్పటివారికి అస్సలు అర్థం కాలేదు. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా విన్నట్లు భావించారు. పోనీ టెస్లా మీదున్న నమ్మకంతో పెట్టుబడి పెడదామనుకున్నా కూడా  టెస్లా చెప్తున్న ఐడియాలేం చిన్న బడ్జెట్ తో కూడినవి కావు.. దానిమీద చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని వెనకడుగు వేశారు. ఇలా ఆయనకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకపోయినా.. ఎన్ని కష్టాలు వచ్చినా టెస్లా ఎప్పుడు వెనకడుగు వేయలేదు. తను ఎలాగైనా వైర్లెస్ ఎలక్ట్రిసిటీని సాధించాలని అనుకున్నారు. 

అదే సమయంలో ఒకరు టెస్లాకి కారెడో అనే ఊరికి సమీపంలో జనసంచారంలేని చోట ఒక ల్యాబ్ ని  నిర్మించుకోమని సహాయం చేశారు. దీంతో టెస్లా వెంటనే ఆ ఊరికి వెళ్ళిపోయారు. అక్కడ పెద్ద మ్యాగ్నిఫైడ్ ట్రాన్స్ మీటర్ ని నిర్మించారు. దీని ద్వారా హై ఎలక్ట్రిక్ వోల్టేజ్ ని జనరేట్ చేయాలనేది టెస్లా ఆలోచన. ఆ హై ఎలక్ట్రిక్ వోల్టేజ్ ని భూమిలోకి ఎలక్ట్రిక్ షాక్ రూపంలో పంపించారు. దాంతో భూమికి ఆనుకొని ఉన్న బల్బులన్నీ వెలగడం మొదలయ్యాయి. టెస్లాకు తను అనుకున్న వైర్లెస్ కరెంటును సాధించవచ్చని పూర్తి నమ్మకం కలిగింది. దీంతో ఏదో సాధించానని ఆనందంతో న్యూయార్క్ కి వెంటనే వచ్చేశారు. అలా న్యూయార్క్ కి తిరిగి వచ్చిన టెస్లా తను అక్కడ ఒక టవర్ ను కడతాని ఆ టవర్ నుంచి వైర్లెస్ కరెంటు కనెక్షన్స్ ఇవ్వొచ్చని మొత్తం ప్రపంచానికి ఈ టవర్ నుంచి కరెంటు పంపవచ్చని టెస్లా అభిప్రాయపడ్డారు.

కొన్నాళ్లకు జేపీ మార్గాన్ టెస్లా ఐడియాల మీద ఇన్వెస్ట్ చేయడానికి  ముందుకు వచ్చారు. అందుకుగాను మార్గాన్ లక్షాయాభైవేల డాలర్లు ఇచ్చారు. కానీ ఆ ఇన్వెస్ట్ మెంట్ అంతా కూడా టవర్ ని కట్టడానికి, అందుకోసం స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవడానికి మాత్రమే సరిపోతుందని టెస్లాకి అర్థమైంది. అయినప్పటికీ ముందు టవర్ ని నిర్మించే పనిలో పడ్డారు. ఆ టవర్ కి వార్డెన్ క్లిప్ అనే పేరు పెట్టారు. టెస్లా దాదాపుగా ఆ టవర్ కోసం 17 సంవత్సరాలపాటు ఎక్స్పరిమెంట్ చేశారు. కానీ టెస్లా అనుకున్నది సాధించలేకపోయారు. ఎప్పటికప్పుడు తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని ఇందులోనే ధారబోశారు. అలా పలు బ్యాంకులో ఎన్నో అప్పులు చేశారు. దీంతో 1917న వాడెన్ క్లిప్ ను మూసివేయాల్సిందిగా కోర్టు టెస్లాకు ఉత్తర్వులు ఇచ్చింది.

టెస్లా ఇంకేం చేయలేకపోయారు. తన దగ్గర ఏమీ మిగల్లేదు. అప్పట్లో ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఎడిసన్, టెస్లా పేటెంట్స్ ని వాడుకొని రేడియో కనిపెట్టిన మార్కోని బాగా డబ్బున్నవారయ్యారు. కానీ ప్రపంచానికి వైర్లెస్ కరెంట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్న టెస్లా మాత్రం రోడ్డు మీద పడ్డారు. ఆ తర్వాత తర్వాత టెస్లా జనాల మధ్యలో కనబడడమే మానేశారు. ఎన్నో హోటల్స్ లో స్టే చేసి, బిల్లు కట్టలేక అక్కడ నుంచి వారికి తెలియకుండానే వెళ్ళిపోయే దుస్థితికి చేరుకున్నారు. వాస్తవానికి మనందరం రేడియోని కనిపెట్టింది ఎవరంటే మార్కోని అంటాం, కానీ అంతకంటే ముందే వైర్ లెస్ కమ్యూనికేషన్ మీద టెస్లా పేటెంట్ కూడా తీసుకున్నాడు. రేడియోని తయారుచేశాడు. టెస్లాకి సంబంధించిన వైర్ లెస్ కమ్యూనికేషన్ ఆధారంగానే ఈ రేడియోని తయారుచేశాడు. మార్కోని టెస్లాకి సంబంధించిన 17 పేటెంట్లను వాడుకున్నాడని అప్పట్లో ఓ అపోహ.

*1947 జనవరి 5న, 86 సంవత్సరాల వయసులో తన హోటల్ రూమ్ లోనే కన్నుమూశారు. 

తన అంత్యక్రియలను వెస్టింగ్ హౌస్ ఖర్చు పెట్టి దగ్గరుండి జరిపించారు. టెస్లా చనిపోయిన తర్వాత తన రూమ్ లో ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని పేపర్లు దొరికాయి. నేడు వైర్లెస్ టెక్నాలజీలో జరిగిన డెవలప్మెంట్ అంతా టెస్లా గొప్పతనమే అని అనడంలో అతిశయోక్తి లేదు. కష్టాలు ఎలాంటి మనిషినైనా ఓడిస్తాయి. అటువంటి టెస్లా జీవితంలో ఎంతటి కష్టంలో అయినా తన ఆలోచన్లని వదల్లేదు.. పరిశోధనలను ఆపలేదు. టెస్లా తన చిరకాల వాంఛ అయిన వైర్ లెస్ కరెంటు ను అందించాలనే కలను సాధించలేకపోవచ్చుకానీ తను చేసిన పరిశోధనలు తరువాతి తరాలకు అద్భుతమైన స్ఫూర్తిపాఠాలను నేర్పింది.

Show More
Back to top button