చలికాలం వచ్చిందంటే చాలు.. త్వరగా చీకటి అవుతుంది, అంతే త్వరగా నిద్రపోవాలి అనిపిస్తుంది. వేడివేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి అనిపిస్తుంది. సీజన్ కు తగ్గట్లు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్లు కూడా కామన్ గా ఎటాక్ అవుతుంటాయి. అలాంటప్పుడు వీటి నుంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు తినడం ఎంతో మంచిదని కొందరు వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
*రోజూ తినే ఆహారంలో కార్న్, జొన్నలు, రాగులకు చోటు ఇవ్వాలి. వీటితో తయారుచేసిన స్నాక్స్, వంటకాల వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. ఆపై వెచ్చగా ఉంచడంలోనూ సాయపడతాయి.
ఈ సీజన్‌లో రకరకాల కూరగాయలు దొరుకుతాయి. వీటితో చక్కని సూప్ తయారు చేసుకుని తీసుకోవడం వల్ల శరీరంలో నీరు, పోషకాల లేమి ఉండదు. కూరగాయలే కాదు ఆకుకూరలు అయిన మెంతికూర, బచ్చలికూర వంటివి తీసుకోవడం వల్ల ఐరన్, విటమిన్లు సరిపడా అందుతాయి. బరువు కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
*చలికాలంలో వచ్చే ప్రధాన సమస్య.. చర్మం పొడిబారడం, ముఖం కూడా పాలిపోయినట్లుగా ఉంటుంది. ఇందుకు నీరు తాగడం తగ్గించొద్దు…
చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగడానికి ఇష్టపడలేం. కానీ శరీరం సక్రమంగా పనిచేయడానికి మాత్రం నీరు చాలా అవసరం. అందుకోసం రోజులో 2 నుంచి 3 లీటర్ల వరకు నీళ్ళు తాగడం మానొద్దు.
టీ, పాయసం లాంటి పానీయాల్లో చక్కెరకు బదులు తేనెకు చోటు ఇవ్వాలి. దీనివల్ల గొంతునొప్పి, దగ్గు వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక సిట్రస్ జాతి పండ్లు అయిన ఆరెంజ్, దానిమ్మ, జామ, కివి పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అస్తమా రోగులు, చల్లగాలి వీచే చోట, మంచుపట్టిన సమయంలో బయట తిరగడం మంచిదికాదు.
*ఈ కాలంలో ఏసీ, ఫ్యాన్, కూలర్లు వాడకం తగ్గించాలి.
*చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన సమయంలో ఉపశమనం కోసం సొంత వైద్యం తగదు, వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడాలి.
*కాచి చల్లార్చిన నీటిని, వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచింది.
*ఈ సీజన్ లో చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యం. చేతులు మంచిగా కడిగిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి.
*కాళ్లు, చేతులు గోరువెచ్చని నీటితో కడిగి, వ్యాస్‌లెన్, స్కిన్‌లోషన్ లు రాసుకొని పొడిబారకుండా చూసుకోవాలి.
*ఇంటి పరిసరాలు, ఇంట్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలి. దోమతెరలను వాడటం మంచిది.
*శీతల పానియాలు, ఐస్‌క్రీంలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా వాటిని చిన్నారులకు ఇవ్వకూడదు.
*అలాగే చిన్నారులకు స్వెటర్లు వేయకుండా ఇంటాబయట తిరగనివ్వద్దు.
*గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చాలా జాగ్రతగా ఉండాలి.
*క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
*వీలైనంతవరకు సూర్యుడు కాస్త వెలుగులోకి వచ్చిన సమయంలోనే జాగింగ్, వ్యాయామం చేయాలి.
*వీలైనంత వరకు సాయంత్రం 6 తర్వాత బయట తిరగరాదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తగిన స్వీయ జాగ్రత్తల తీసుకుంటే చలి నుంచి బయటపడవచ్చు.