అంతర్ముఖులు లేదా ఇంట్రావర్ట్స్” అనే పదాన్ని నేటి పౌర సమాజం కొంత చులకన, హేళన, తక్కువ దృష్టి, మాట్లాడడానికి భయపడే వారని ఆక్షేపణ దృష్టి అపార్ధం చూసుకోవడం చూస్తున్నాం. గలగల మాట్లాడే వారందరూ మంచి వారు కారు, తక్కువగా మాట్లాడే వారు సమర్థులు కారు. పౌర సమాజంలో 25 – 40 శాతం వరకు ప్రజలు అంతర్ముఖులుగానే జీవితాలను గడుపుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్ముఖుల్లో ప్రముఖ శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, కళాకారులు, ఆలోచనాపరులు అనేకులు ఉన్నారని మరువరాదు. అంతర్ముఖులతో మాటకలిపితే వారి శక్తిసామర్థ్యాలు అవగతం అవుతాయని తెలుసు కోవాలి. సాధారణంగా బహిర్ముఖులు లేదా ఎక్‌స్ట్రవర్ట్స్ దృష్టిలో అంతర్ముఖులు చులకనగా చూడబడతారు.
అంతర్ముఖుల విలక్షణ సుగుణాలు:
నిజానికి అంతర్ముఖుల తెలివి తేటలు, గొప్ప లక్షణాలు, మేధో వికాసం, శక్తి సామర్థ్యాలు అపారంగా ఉంటూ, అద్భుతాలను సృష్టిస్తు ఉంటారు. అవసరమైతే తప్ప మాట్లాడని వారు, మొహమాట పడే వారు, వినడానికి ఆసక్తి చూపే వారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే వారు, ఇతరులతో గడపడానికి ఆసక్తి చూపని వారు, పార్టీలకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేసే వారు అంతర్ముఖులుగా పేర్కొనబడతారు. అంతర్ముఖులు తక్కువగా మాట్లాడుతూ, ఓపికగా వినడానికి ఇష్టపడుతూ, సోషల్ మీడియాల్లో చురుగ్గా ఉంటూ, చుట్టు పక్కల నిశితంగా పరిశీలిస్తూ, మంచి స్నేహితులుగా ఉంటారు. నలుగురిలో ఉన్నపుడు నిశ్శబ్దంగా ఉండే వీరు నోరు జారే సందర్భాలు చాలా తక్కువ. వీరు నమ్మకమైన కొద్ది వ్యక్తులతోనే స్నేహం చేస్తారు. వీరు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి, ఒత్తిడిలో సహితం సరైన నిర్ణయాలు తీసుకునే గుణాన్ని కలిగి ఉంటారు.
అంతర్ముఖులు అసాధ్యులు:
అంతర్ముఖులు అంటే సిగ్గు పడేవారు లేదా అందరికీ దూరంగా ఉండేవారట అని మాత్రం కాదని వారి లోపల నిగూఢమైన శక్తి అపారంగా ఉంటుందని పౌర సమాజం గుర్తించాలని ప్రచారం చేయడానికి 2011 నుంచి ప్రతి ఏట 02 జనవరిన “ప్రపంచ అంతర్ముఖుల దినం లేదా వరల్డ్ ఇంట్రొవర్ట్ డే” పాటించడం ఆనవాయితీగా వస్తున్నది. నిశ్శబ్దాన్ని కోరుకునే అంతర్ముఖులకు సృజనశీలత, లోతైన విషయ పరిజ్ఞానం, ఒత్తిడిని తట్టుకుంటూ సమస్యల సాధనకు కృషి చేయడం లాంటి ప్రత్యేక లక్షణాలు అంతర్ముఖులకు స్వంతం అని ఆ వర్గం వారిని గుర్తించడం, ప్రోత్సహించడం, వారితో స్నేహం చేయడం లాంటి అంశాలను ప్రచారం చేయడానికి ప్రపంచ అంతర్ముఖుల దినం వేదికలు ఉపయోగపడతాయి.
ప్రపంచ ప్రఖ్యాత అంతర్ముఖులు:
అంతర్ముఖుల జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజాలు అనేకులు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, మేడమ్ క్యూరీ, చార్లెస్ డార్విన్, సర్ ఐజాక్ న్యూటన్‌లతో పాటు ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకెర్‌బర్గ్, భారత పితామహులు మహాత్మా గాంధీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, అత్యంతసంపన్న వ్యాపారవేత్తలు వారెన్ బఫెట్, ఎలాన్ మస్క్, లారీ పేజ్‌లు, బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు మైఖేల్ జోర్డన్, సినీ దర్శకులు స్టీవ్ స్పిల్బర్గ్, అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, బరాక్ ఒబామా మొదలగు వారందరూ ఉండడం గమనించదగిన అంశంగా చూడాలి.
అంతర్ముఖులను ఎగతాళిగా చూస్తే మనం త(ప)ప్పులో కాలు వేసినట్లే. వారిలోని విలక్షణ లక్షణాలను గుర్తించి, వారితో స్నేహం చేసి మన విజ్ఞానాన వివేకాలను పెంచుకుందాం, అంతర్ముఖుల అభిప్రాయాలకు పట్టం కడదాం.