Telugu News

దేశ చరిత్రలోనే తొలిసారి మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం.

పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు, 

ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది..

ఒత్తిడిలేని చదువులు, నైతిక విలువలే లక్ష్యం..

ప్రైవేటు బడుల కన్నా.. ప్రభుత్వ చదువులకే పెద్దపీట వేస్తాం..

ఏటా డిసెంబరు 7న పేరెంట్స్‌-టీచర్స్‌ డే!

బాపట్ల పురపాలకోన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై, పలు కీలక విషయాలను చర్చించి.. విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.

‘చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదు. విద్యతోనే ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే మీ బిడ్డల్ని చదువుల వైపు ప్రోత్సహించండి. మీ జీవితాలు మారాలంటే విద్యతోనే సాధ్యమని మరచిపోకండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉద్బోధించారు. 

రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో పెనుమార్పులకు నాంది పలుకుతామని చెప్పారు. ‘తల్లిదండ్రులంతా తమ పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం చేస్తున్నారు? క్రమశిక్షణ, నడవడిక, ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మీ పిల్లలు చదివే బడిలో ఉపాధ్యాయులతో కలిసి మీరు మమేకమవ్వాలి. పొరపాటున పిల్లలు దారి తప్పినా వెంటనే సరిదిద్దుకునే అవకాశం అప్పుడే ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒకేరోజు 44 వేల పైచిలుకు పాఠశాలల్లో మెగా పేరెంట్స్‌- టీచర్స్‌ సమావేశాలకు శ్రీకారం చుట్టింది.

ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు అంతా కలిపి 1.20 కోట్ల మంది పాలుపంచుకున్న ఈ కార్యక్రమం గిన్నిస్‌బుక్‌లో లిఖించదగ్గది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను అభినందించారు. శనివారం బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్‌- టీచర్స్‌ సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు.

గంజాయి, డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి. ఇవి క్యాన్సర్‌కన్నా ప్రమాదం. వీటికి ఆకర్షితులైతే జీవితమే నాశనమవుతుంది. వాటిపై ఉక్కుపాదం మోపుతాం. ఏటా డిసెంబరు 7న పేరెంట్స్‌-టీచర్స్‌ డే నిర్వహిస్తాం. స్టూడెంట్‌- పేరెంట్స్‌- టీచర్‌- ప్రభుత్వం పనిచేస్తేనే విద్యలో మంచి ఫలితాలు ఉంటాయి. మూడు నెలలకోసారి సమావేశాలు పెడతాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని చదువులపై చర్చించుకోవాలి. పిల్లల ఆలోచన విధానం, ఆశలు, ఆకాంక్షల్ని గుర్తెరిగి నడుచుకోవాలి. అమ్మానాన్నల కలలను సాకారం చేయటానికి విద్యార్థులు శ్రమించాలి. పిల్లల చదువులు, వారికి వస్తున్న మార్కులతో పాటు బడికి వెళ్లలేకపోయిన వెంటనే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపే విధానాన్ని త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు.

వచ్చే ఏడాది జూన్‌ నాటికి కొత్త టీచర్లు వస్తారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. వైకాపా ప్రభుత్వం ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు. విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించింది. నాడు-నేడు పనులు చేపట్టి గుత్తేదారులకు రూ.వందల కోట్ల బిల్లులు పెండింగ్‌ పెట్టింది. అవన్నీ మేము చెల్లిస్తున్నాం. టీచర్లు అంటే తెదేపా ప్రభుత్వానికి చాలా గౌరవం. 11 డీఎస్సీలు వేసి 1.50 లక్షల మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత తెదేపాది. ప్రైవేటు బడుల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన చదువులు, ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి. క్రీడలనూ ప్రోత్సహిస్తాం. ఒత్తిడి లేకుండా చదువులు సాగాలి. స్మార్టు క్లాసులు, కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెడతాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ద్వారా పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తాం అని చంద్రబాబు అన్నారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించామన్నారు. ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. ‘మా పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం జరిగితే మా అమ్మే వచ్చేవారు. ఎందుకంటే మా నాన్న అప్పటికే రాష్ట్రానికి టీచరు కాబట్టి సమయం ఉండేది కాదు. పిల్లలంతా నా కుమారుడు దేవాన్ష్‌లానే అనిపిస్తారు. పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ మంత్రిని కావడం నా అదృష్టం. 

మన విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా ఆంధ్ర మోడల్‌ తీసుకొస్తున్నాం. విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉండాలంటే సమాజ భాగస్వామ్యం తప్పనిసరి.. 

సీఎం సూచనలతో మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశానికి నాంది పలికాం. విద్యార్థులకు హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులను అందిస్తున్నాం. వైద్యశాఖ సహకారంతో కొన్ని వైద్య పరీక్షలు చేసి, నివేదిక ఇస్తున్నాం. విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయినా ఛాలెంజ్‌గా తీసుకుని నిర్వహిస్తున్నా. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. 

అలాగే గత ప్రభుత్వం మాదిరిగా మాకు రంగులు, ఫొటోల పిచ్చి లేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఫొటోలు, రంగులు తీసేయమని ఆదేశించా. మరుగుదొడ్లు, భోజనం ఫొటోలు తీయడం ఉపాధ్యాయుల పని కాదని వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించాం. విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు డిజిటల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలకు ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం’ అని ఆయన చెప్పారు.

Show More
Back to top button