Telugu Special Stories

ఆంధ్రదేశంలో శాస్త్రీయ సంగీత పునరుజ్జీవన కర్త… పారుపల్లి రామకృష్ణయ్య పంతులు.

తెలుగు నేలపై శాస్త్రీయ సంగీత పునరుజ్జీవానికి మూలపురుషుడు, తన జీవితకాలంలో తెలుగుదేశాన్నే కాకుండా, యావద్ భారతావనినీ ఆకర్షించి తెలుగు వెలుగును నలుదిక్కులా వెదజల్లిన వారిలో “గాయక సార్వభౌమ” కీర్తిశేషులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ఒకరు. ఈయన భారతీయ పండితుల్లో ఒకరు. త్యాగరాజ స్వామి శిష్యపరంపరలో మూడవతరానికి చెందినవారు. ఈయన సంగీతం పాఠం చెప్పే తీరు, పాడే తీరు కూడా నేర్చుకునే వారికి సుభోదకంగానూ, మార్గదర్శకంగానూ ఉండేది. రామక్రిష్ణయ్య పంతులు కచేరీలలో నెరవు చేసినా రాగం పాడినా, స్వర ప్రస్తారం చేసినా ప్రతీవిషయం నమూనాలుగా భాషించేవి. ఆయన జంత్రగాత్రాలలో బహుముఖ ప్రజ్ఞావంతులైన సంగీత విద్వాంసులు. విజయవాడను కేంద్రబిందువుగా చేసుకొని ఆంధ్రదేశాన శాస్త్రీయ సంగీత ప్రాచుర్యానికి పునాదులు వేశారు. ఆ రోజులలో విజయవాడ పరిసర ప్రాంతాలలో సంగీత కళాశాలలు లేని కారణంగా ఆయన గురుకులమే ఒక విశ్వవిద్యాలయంగా భాషిల్లేది.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కాశీనాధుని నాగేశ్వరరావు, ఆదిభట్ల నారాయణదాసు వంటి ప్రముఖులు తమ అపూర్వ ప్రతిభతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా యావత్ జాతిని ఆకర్షించి భారతీయ కళలు మరియు సంస్కృతిలో తెలుగుకు ప్రాధాన్యతను నెలకొల్పడంలో మూలస్తంభంగా నిలిచారు. ఆ తరగతికి చెందిన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు సంప్రదాయశుద్ధి, గాత్ర మాధుర్యం చూసి ఎంతోమంది దక్షిణాత్యులు ఆయనను ఆదరించి ప్రోత్సహించడమే కాకుండా, వారిని మద్రాసులో స్థిరనివాసం ఏర్పరచుకోవలసిందిగా ఒత్తిడి చేశారు. ఆలా చేయడం వలన వారికి కలిగే ఆర్థిక యశోలాభాలను గూర్చి కూడా ఆశపెట్టారు. దానికి పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు “నా ఆంధ్రదేశములో కూడా తమిళనాడు వలె సంగీతం బహుజన వ్యాప్తంగా వృద్ధిపొందేటట్లు చేయడమే నా జీవిత ధ్యేయం” అని అన్నారు. అలా అనడమే కాకుండా అదే లక్ష్యంతోనే తమ స్వగ్రామమైన కృష్ణా జిల్లా దివిసీమ తాలూకా, శ్రీకాకుళం వదిలిపెట్టి విశాలాంధ్ర వసుంధరా కేంద్రబిందువైన విజయవాడలో స్థిరనివాసం ఏర్పరచుకొని జీవితాంతం వరకు తమ ఆదర్శాన్ని అమలుపరచడంలోనే గడిపారు.

రామక్రిష్ణయ్య పంతులు కృషి, ప్రోద్బలంతోనే ఆంధ్ర రాష్ట్రములో విజయవాడ పట్టణంలో ప్రప్రధమంగా ఆకాశవాణి కేంద్రం, ఆ తదుపరి సంగీత కళాశాల ప్రారంభమైనది. తద్వారా ఎందరికో స్వర భిక్షతో పాటు ఉపాధి కూడా కల్పించిన మహనీయులు రామక్రిష్ణయ్య పంతులు. శిష్యుల సంగీత అధ్యయనం మరియు సాధనలతో నిత్యమూ గురుకులం కళకళలాడుతుండేది. జాతి, కుల, మత వర్గ విభేదాలకు అతీతంగా శిష్యకోటికి విద్యను ప్రసాదించి విజయవాడను కేంద్రబిందువుగా చేసుకొని ఆంధ్ర దేశమున శాస్త్రీయ సంగీత ప్రాచుర్యానికి పునాదులు వేశారు. రామక్రిష్ణయ్య పంతులు పాఠం చెబుతూనే దానికి సంబంధించిన తత్వము కూడా చెప్పి వాటి అర్థము వల్లింపచేసేవారు. గీతాలు, వర్ణాలూ పూర్తయ్యేటప్పటికే విద్యార్థులకు రాగం ఆలాపన చేసి ధారాళంగా స్వర ప్రస్తారం చేయగలిగే శక్తి ఏర్పడేది. శృతి శుద్ధం, లయ శుద్ధం కుదిరేది. వయోలిన్ విద్యార్థి అయితే ప్రక్క వాద్యం వాయించగలిగేవాడు. ఎటువంటి విద్యార్థినీ కూడా సంగీతం రాదు అని పంపేయకుండా వారి వారి గాత్ర సంపత్తిని బట్టి వారికి పాఠం చెప్పి తమ శక్తిని దృష్టిలో ఉంచుకొని పాడుకోమనేవారు. దక్షిణ భారతదేశంలో కన్నడిగులు, తమిళుల సంగీత ప్రతిభే ప్రామాణికంగా చలామణి అవుతున్న ఆ రోజులలో తెలుగువాడి స్వరాన్ని విశ్వవ్యాప్తం చేసిన విశిష్టమూర్తి రామక్రిష్ణయ్య పంతులు.

జీవిత విశేషాలు…

జన్మనామం : పారుపల్లి రామకృష్ణయ్య పంతులు

ఇతర పేర్లు : రామకృష్ణయ్య పంతులు

జననం : 05 డిసెంబరు 1883

స్వస్థలం : శ్రీకాకుళం, కృష్ణా జిల్లా

వృత్తి : భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు

వాయిద్యం : గాత్రాలు

మరణ కారణం : వృద్ధాప్యం

మరణం : 1951

నేపథ్యం…

సంగీత సాహిత్యాలకు నెలవైన ఊరు శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం పేరు గల ఊర్లు రెండు ఉన్నాయి. మొదటి “శ్రీకాకుళం జిల్లా” అయితే, రెండో ఊరు కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో ఉంది. ఈ శ్రీకాకుళంలోనే శ్రీ ఆంధ్రమహావిష్ణువు దేవాలయం నెలకొని ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవుణ్ణి సందర్శించి, అదే ప్రాంగణంలోని ఒక మండపంలో “ఆముక్తమాల్యద” అనే కావ్యానికి శ్రీకారం చుట్టాడు. ఈ శ్రీకాకుళంలోనే పారుపల్లి రామకృష్ణయ్య పంతులు 05 డిసెంబరు 1883 నాడు జన్మించారు. వీరి తండ్రి పారుపల్లి శేషాచలం, తల్లి మంగమాంబ. తండ్రి శేషాచలం సంగీత విద్వాంసులు. అందువలన రామకృష్ణయ్య పంతులుకు ఉగ్గుపాలతో సంగీతం అబ్బింది. ఈయన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి శిష్యులు. అదే ప్రాంతానికి చెందిన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దాదాపు 150 ఏళ్ల క్రిందట సంగీతం నేర్చుకోవడానికి కాలినడకన తమిళనాడుకు వెళ్లి అక్కడ శ్రీ త్యాగరాజ స్వామి వారి శిష్యులైన ఆకుమళ్ళ వెంకటసుబ్బయ్య (ఆయనను మానాంబు చావడి వెంకటసుబ్బయ్య అంటారు) దగ్గర శష్యరికం చేసి మళ్లీ కాలినడకన ఆంధ్రదేశం వచ్చి ఎంతోమంది శిష్యులను తయారుచేశారు. వారిలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు అగ్రగణ్యులు.

గురుకులంలో సంగీతాభ్యాసం…

బ్రహ్మ ముహూర్తానికి శిష్యులందరూ నిద్ర లేచి, గబగబా కృష్ణా నదికి వెళ్లి స్నానాలు చేసి విబూది పెట్టుకునేవారు. అదొక  సంగీత గురుకులంలా ఉండేది. దివ్యాదుల లక్ష్మణ శాస్త్రి, రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, సుసర్ల గంగాధర శాస్త్రి, మహావెద్య నాదయ్య మొదలగు మహామహులంతా పారుపల్లి వారి  సహధ్యాయులే. వారంతా వచ్చి నిశ్శబ్దంగా, వినయంగా కూర్చుంటే మంద్రమంద్రంగా వస్తున్న తాంబూరనాదం మధ్యలోంచి సరస్వతీ స్వరూపులైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వారి కమ్మని కంఠస్వరం సంగీత పాఠాలు చెబుతుంటే, శిష్యులు శ్రద్ధగా ఏకాగ్రతతో వింటూ నేర్చుకునేవారు. అంతా ముక్తకంఠంతో ఆలపిస్తుంటే ఆనాదంతో ప్రకృతి అంతా ప్రతిధ్వనించేది. మల్లెలు తెల్లబోయేవి, మామిడి పిందెలు తలలూపేవి, కోకిలలు సిగ్గుతో కొమ్మల్లోకి దూరిపోయేవి. తేనె కోసం భ్రమరం పిల్లల చుట్టూ ప్రదక్షిణలు చేసేది. గురుకులం అంతా కన్నుల పండుగగా, వీనుల విందుగా ఉండేది. ఉదయం పాఠాలు వినడం పూర్తవ్వగానే శిష్యులే వంట ప్రయత్నాలు చేసేవారు. కండువలు తీసి నడుముకు కట్టి, గాడి పొయ్యి మీద కొందరు గుండిగిలు పెట్టేవారు. కూరలు తరిగేవారు, నీళ్లు తోడేవారు, పప్పు రుబ్బేవారు, పాలు పితికేవారు, పచ్చడి చేసేవారు, వండేవారు, వార్చేవారు వడ్డించేవారు ఇలా శిష్యులందరి పనులతో గురుకులం ఒక పెళ్లి వారి ఇల్లులాగా ఉండేది.

ఠాణేదారు ఉద్యోగం వదిలేసి…

ఆ గురుకులం ఒక సంగీత సాగరం. శిష్యులు చేసే వంటలు కూడా సంగీతాన్ని పలికించేవిధంగా ఉండేవి. పాలు, పంచదార కలిపి సరళీ స్వరాలయ్యేవి. కత్తిపీట, కొత్తిమీర జంట స్వరాలయ్యేవి. ఏది అన్నం కుతకుతలో ఆలాపన, అప్పడాలు వేయడంలో వర్ణాలు, పులుసులు చేస్తూ కృతులు, పరమాన్నం తయారుచేస్తూ కీర్తనలు, వంటశాల సంగీతశాల అయిపోయి నవరసాలతో శ్రవణేంద్రియాల్ని, పక్షుల్ని, కుక్షుల్ని కూడా నింపేసేది. అలాంటి సంగీత వాతావరణం నుండి వచ్చిన సంగీత వేత్త పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు. ఆయన చల్లపల్లి అడవి చినరామయ్య దగ్గర ఠాణేదారుగా ఉద్యోగానికి తర్ఫీదు పొంది తన పన్నెండేళ్ల వయస్సులో పెదకల్లేపల్లిలో ఠాణేదారుగా నియమితులయ్యారు. కానీ తేనె రుచి మరిగిన వారికి బెల్లం పానకం వెగటేసినట్టే, సంగీతం సాహిత్యం అబ్బిన వాడికి ఉద్యోగాలు రుచించవు. అందుచేత ఉద్యోగానికి తిలోదకాలిచ్చి అచ్చంగా సంగీతాన్ని ఆపోసన పట్టడం ప్రారంభించారు రామక్రిష్ణయ్య పంతులు. మొదటినుండి ఆయన గాత్రం కమ్మనైనది. కమ్మనైన ఆయన గాత్రంతో బాటుగా వయోలిన్, వేణువు, మృదంగం, కంజీర ఇలా అన్ని వాయిద్యాలలో ప్రావీణ్యం సంపాదించారు.

సన్మానాలు, బిరుదులు…

సంగీత విద్యాభ్యాసం పూర్తయిన తరువాత రామక్రిష్ణ పంతులు తన సంగీత కచేరీలు ప్రారంభించారు. 1906 వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా సహాయక కలెక్టరు భక్తవత్సలం, రామక్రిష్ణయ్య పంతులు సంగీతానికి ముగ్ధులై ఆయనను “తెలుగు రాయని పాలెం” గ్రామానికి కరణంగా నియమించారు. 1915లో చెన్నపట్నం పరిపాలించిన పేట్లండ్ ప్రభువుచే తెనాలి పురపాలక వర్గం వారు సమర్పించిన స్వర్ణపత్రాన్ని అందుకున్నారు. అదేవిధంగా బరోడాలో జరిగిన అఖిల భారత సంగీత సభలో పాల్గొని సన్మానితులయ్యారు.

1921 వ సంవత్సరంలో ఆంధ్ర పరిశోధన విశ్వవిద్యాలయం నుండి “భారతీ తీర్థోపాధ్యాయ” అనే పట్టా పొందారు. అదే సంవత్సరం మద్రాసులోని “గోకలే” సభా మందిరంలో కె.వి.శ్రీనివాస అయ్యంగారు పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు గాన సభ ఏర్పాటు చేశారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గాత్రం, మైసూరు ఆస్థాన విద్వాంసులు చౌడయ్య వయోలిన్, అలహానంది పిళ్ళే మృదంగం, వేలాయుధం పిళ్ళే కంజీరతో ప్రేక్షకులకు, వీక్షకులకు, శ్రోతలకు ఆనాటి సంగీత కచేరి తరతరాల వరకు విన్నవారి స్మృతి పథంలో ఒక మధురానుభూతి మిగిలించారు. ఆ సభా మందిరం నిండా సరస్వతి పుత్రులతో కిటకిటలాడిపోయింది. 

1928 వ సంవత్సరంలో కాకినాడ శ్రీరామసమాజం వారు రామక్రిష్ణయ్య పంతులుకు బంగారు గొలుసు, పతకంతో సన్మానించారు. అదే సమయంలో పుష్పగిరి పీఠాధిపతుల చేత రామక్రిష్ణయ్య పంతులు కనకాభిషేకం కూడా చేయించుకున్నారు. 1931 వ సంవత్సరంలో అఖిలాంధ్ర పరిషద్వార్షిక మహాసభలో అనేకమంది సంగీత విద్వాంసులు, వేలకొద్దీ రసికులు, విద్యావేత్తలు మరియు పురప్రజల సమక్షంలో ఆ సభ దద్దరిల్లిపోయేలా హర్షధ్వనుల మధ్య పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు “గాయక సార్వభౌమ” బిరుదు పొందారు.

ఎనిమిదేళ్ల శిష్యుడు బాలమురళీతో పాడించి…

సుమారు ఎనభై యేండ్ల క్రిందట తిరువాయూరు త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు సభ్యులు. ఆ ఉత్సవాలకు తనతో పాటు తన శిష్యుడు చిరంజీవి మంగళంపల్లి బాలమురళీకృష్ణను తీసుకెళ్లారు. అప్పటికి ఆ కుర్రాడికి ఎనిమిదేళ్లు. పేరుకు బాలుడే అయినా ఆయన చిచ్చర పిడుగు. త్యాగరాజ ఆరాధనోత్సవాలకు భారతదేశం నలుమూలల నుండి వచ్చిన సంగీత విద్వాంసులు తమ తమ ప్రతిభా పాఠవాలను చూపిస్తున్నారు. ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి. బాలమురళి గురువుగారికి బేలగా చూశాడు. బాలమురళీ ఉద్దేశ్యం గురువు గారికి అర్థమైంది. మిగతా కమిటీ సభ్యులతో కలిసి, మాట్లాడి మా శిష్యుడు చిరంజీవి బాలమురళీకృష్ణ కచేరి చేస్తాడు అన్నారు. దానికి కమిటీ సభ్యులు ఒప్పుకోలేదు.

త్యాగరాజ ఆరాధనోత్సవాలంటే పిల్లల ఆటనా లేక బాలానందం వినోద ప్రదర్శననా? బాలమురళీకృష్ణ పాడడానికి వీల్లేదు అన్నారు అక్కడి పెద్దలు. అప్పుడు పంతులుగారు సరే ఒక పని చేయండి ఆరాధనోత్సవాల్లో నేను పాడడానికి కేటాయించిన సమయంలో నా బదులు నా శిష్యుడు పాడతాడు, మిమ్మల్ని మెప్పిస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది అన్నారు. సంగీత సభ ఆత్రంగా ఎదురుచూస్తుంది. బాలమురళి గురువు పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు వైపు చూసి నమస్కారం చేశారు. గురువుగారు తన కళ్ళతోటే ఆశీర్వదించారు. అద్భుతంగా పాడారు. బాల మురళీనాదం సభ యావత్తునీ మత్తులో ముంచేసింది. పెద్దలంతా చప్పట్లు కొట్టి మంగళ దీక్షితులు చల్లారు. గురువు గారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసిపోయారు. ఆయన శిష్యరికం నా పూర్వజన్మ సుకృతం అని మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఎన్నోసార్లు చెప్పుకున్నారు.

ముగిసిన ప్రస్థానం…

పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులుకు కూడా గురుకులం ఉండేది. ఆయన కూడా సుసర్ల దక్షిణామూర్తి పద్ధతిలోనే గురుకులాన్ని నడిపించేవారు. ఆయన ఇంట్లో అన్ని వర్గాల వారు, అన్ని వర్ణాలవారు, అన్య మతస్థులు కూడా సంగీతం నేర్చుకోవడానికి ఆయన వద్దకు వచ్చేవారు. వారందరినీ సమదృష్టితో చూసిన ఉత్తమ గురువు పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు.

దాలిపర్తి పిచ్చిహరి, అన్నవరపు రామస్వామి, వంకదారి వెంకటసుబ్బయ్య గుప్త, పాతూరు సీతారామయ్య చౌదరి, జీ.వీ.రామకుమారి, షేక్ చిన మౌలానా సాహెబ్, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అరుంధతి సర్కార్, నేతి శ్రీరామ శర్మ, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ లాంటి ఎంతోమంది శిష్యులకు సంగీతంతో పాటు, ఇంగితజ్ఞానం కూడా నేర్పిన మహానుభావుడు పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు. 

తన గురువు సుసర్ల దక్షిణామూర్తి కాలం చేశాక ప్రతీ యేటా ఆయన పేరుతో ఆరాధనోత్సవాలు జరుపుతూ స్వయంగా పారుపల్లి రామకృష్ణయ్య పంతులు తద్దినం పెట్టేవారు. 1951 వ సంవత్సరం సుసర్ల వారి ఆరాధనోత్సవాలు  దుర్గాపురం (విజయవాడ) శరభయ్య గుళ్ళళ్లో జరుగుతున్నాయి. అపరాహ్ణం వేళ గురువుగారికి అబ్దీకం పెట్టి, మేడదిగి, క్రిందికి వెళ్లి తూర్పు వైపున గురువును స్మరిస్తూ సాష్టాంగ ప్రమాణం ఆచరించిన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ఇక లేవలేదు. అప్పటికి ఆయన ప్రస్థానం ముగిసిపోయింది. గురుస్మరణ చేసుకుంటున్న ఆ సమయంలో ఆయన నాదబ్రహ్మంలో ఐక్యమైపోయారు.

Show More
Back to top button