Telugu News

వ్యక్తిగత ప్రమాద బీమా ప్రయోజనాలు

వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదం జరిగితే.. వ్యక్తులు మరణించవచ్చు. లేదా అంగవైకల్యానికి గురికావొచ్చు, ఇలాంటి సమయంలో ఆర్థిక రక్షణ పొందడానికి వ్యక్తిగత ప్రమాద బీమా (Personal Accident insurance policy) ఎంతగానో ఉపయోగపడుతుంది. రోడ్డు ప్రమాదం వల్ల పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. ఆ కుటుంబంపై ఆర్థిక భారం లేకుండా చేస్తుంది. ఈ పాలసీని 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఎవరైనా తీసుకోవచ్చు.

ఇందులోనే ఫ్రాక్చర్ కేర్, ఈఎంఐ, రుణ చెల్లింపులు, ఎయిర్ అండ్ రోడ్ అంబులెన్స్ సర్వీస్ వంటి అదనపు సదుపాయాలను కూడా జత చేసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వారికి రోడ్డు ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే.. ఏకకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతికందుతుంది. వాటిని కేవలం వైద్య ఖర్చులకే కాకుండా.. ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.

ఒకవేళ ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి హామీ మొత్తం లభిస్తుంది. దీంతో ఆ కుటుంబానికి ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ప్రమాదం వల్ల పాలదారుడు కంటి చూపు కోల్పోవడం, వినికిడి కోల్పోవడం వంటివాటితో బయటపడితే.. చికిత్సకు అయ్యే ఖర్చును చెల్లిస్తారు. వ్యక్తి స్థితిని బట్టి 25% నుంచి 90% వరకు డబ్బు చెల్లిస్తారు.

యాక్సిడెంట్ అయిన పాలసీదారుడికి వైద్యులు కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని చెబుతుంటారు. అలాంటప్పుడు సదరు వ్యక్తి ఆదాయం కోల్పోతాడు. అయితే ఈ పాలసీ ద్వారా కొన్ని రోజులపాటు ఆదాయం పొందవచ్చు. పాలసీలోని నిబంధనల ప్రకారం.. నెలనెలా (లేదా) రోజూవారీ ఆదాయం పొందవచ్చు. అయితే ఈ మధ్య కొన్ని బీమా కంపెనీలు అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్కు కూడా పాలసీలను అందిస్తున్నాయి. అంటే సాహసోపేతమైన కార్యక్రమాల్లో పాల్గొని ప్రమాదానికి గురైతే ఈ బీమా వర్తిస్తుంది.

Show More
Back to top button