టెక్నాలజీని ఆసరాగా చేసుకొని ఈరోజుల్లో సైబర్ నేరగాళ్లు, స్కామర్లు రకరకాల స్కామ్ లకు పాల్పడుతున్నారు. అటువంటి స్కాంల మాదిరిగా ఈ పిచ్ బుచరింగ్ స్కాం కేసులు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బీ అవేర్..
ఆకర్షణీయమైన ప్రకటనలు, ఈజీ మనీ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ వంటివి ఈ స్కాం అజెండాగా తెలుస్తోంది. తేలికగా మోసపోయే వ్యక్తులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. అటువంటి వారిలో ఆశ పెరిగేలా చేసి మాట్లాడటం, పరిచయం పెంచుకోవడం..
ఆ తర్వాత క్రిప్టోకరెన్సీ లేదా మరో ప్రాఫిట్ వచ్చే స్కీంలో పెట్టుబడి పెట్టేలా ఒప్పించి.. చివరకు ఆ డబ్బును వీరు కొట్టేస్తారు. ఈ తరహా ఆన్‌లైన్ మోసాలనే ‘పిగ్ బుచరింగ్’గా వ్యవహరిస్తారు. పందులను వధించే ముందు కసాయి వాటికి మంచి ఆహారం అందించే కోణంలో ఈ పదం వ్యవహారంలోకి వచ్చింది.
ఇకపోతే ఈ తరహా స్కాంలు 2016లో తొలిసారిగా చైనాలో మొదలైనట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా మోసాలు భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
నిరుద్యోగ యువత, గృహిణులు, విద్యార్థులే టార్గెట్ గా.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్’ లేదా ‘ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్’గా కేసులు పెరిగాయని కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించింది. వీటి ద్వారా రెగ్యులర్ గా ప్రజలు భారీ స్థాయిలో నష్టపోతున్నారని.. ఈ మోసాల కోసం సైబర్ నేరగాళ్లు గూగుల్ సైట్ లను విస్తృతంగా వాడుకొంటున్నారని తెలిపింది.
విదేశాల నుంచి లక్షిత ప్రకటనలు ఇచ్చేందుకు విడిగా గూగుల్ అడ్వర్టైజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ వీలుగా ఉండటమే కాక ఈ తరహా మోసాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో మనీలాండరింగ్‌తోపాటు సైబర్ బానిసత్వం ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. నిమిషాల్లో లోన్ లు ఇస్తామంటూ ఫేస్‌బుక్ ద్వారా లింకులను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది.
అయితే ఈ తరహా మోసాలను ముందుగానే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ (I4C) గూగుల్, ఫేస్‌బుక్ వంటి టెక్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది.