సిక్కు మతస్థుల 10వ సిక్కు గురు సాహెబ్ అయిన గురు గోవింద్ సింగ్ జీ 358వ జయంతి ఉత్సవాలను ప్రతి ఏట 06 జనవరిన ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ వస్తున్నది. ధైర్య సాహసాలు, సమానత్వం, సమన్యాయం, ప్రేరణలకు మారుపేరుగా నిలిచిన దార్శనికుడు, మహానాయకుడు, ఆధ్యాత్మిక మార్గదర్శి, నిస్వార్థ సేవకుడిగా గురు గోవింద్ సింగ్ సిక్కు మతస్థులకి కాకుండా సమస్త మానవజాతికి లభించిన అపురూప వరంగా భావించాలి. తమ ప్రజల హక్కుల పరిరక్షణకే కాకుండా తమ ప్రాంతాలపై దండయాత్ర చేసిన మొఘల్ చక్రవర్తుల పాలనను ఎదిరించిన సాహసి గురు గోవింద్ సింగ్ వ్యక్తిత్వం మహోన్నతం. కరుణ కలిగిన నాయకుడు, శాంతి స్థాపనకు పాటుపడిన ఘనుడు, ఉత్తమ రచయిత అయిన గురు గోవింద్ సింగ్ జీ తన జీవితాన్ని సిక్కు మతస్థుల సద్గురువుగా కీర్తిని, వారి మనస్సులోకి దైవంగా తిష్ట వేశారు.
అసాధారణ పోరాట యోధుడు:
ఇస్లాం మతంలోకి మారడానికి అంగీకరించని కారణంగా గురు గోవింద్ సింగ్ జీ తండ్రి గురు తేజ్ బహదూర్‌ను నాటి పాలకులు చంపి వేసిన కారణంగా తమ వారి రక్షణకు తనదైన ఒక పటిష్టమైన సిక్కు ఆర్మీని “ఖల్సా ఫౌజ్” పేరుతో రూపొందించారు. మొఘల్ పాలకులను ఆధ్యాత్మికంగా, రాజకీయంగా వ్యతిరేకించిన గురు గోవింద్ సింగ్ జీ ధైర్యం నిరుపమానం, అసాధారణం. అత్యున్నత నైపుణ్యం కలిగిన వీరుడిగానే కాకుండా ఉన్నత వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ఆధ్యాత్మిక గురువుగా స్యయం రక్షణ నేర్చిన వీరుడే కాకుండా మిలిటరీ శిక్షణ పొందిన మహనీయుడు మన గురు గోవింద్ సింగ్ జీ. “ఖల్సా ఫైజ్ లేదా సిక్క్ ఆర్మీ”ని రూపొందించిన గురు జీ నిర్మించిన తన సైన్యం మొఘల్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. కళలు, సాహిత్యానికి పెద్దపీట వేసిన గురు గోవింద్ సింగ్ జీ స్వయాన కవి, వ్యాసకర్తగా మేధావులకే మహాగురువుగా నిలిచారు. పంజాబీల సాహిత్యం, సంగీతాలను సుసంపన్నం చేసిన ఆయన వారి సంస్కృత వారసత్వానికి దారి దీపంగా వెలుగొందారు.
అభ్యుదయ భావాల రూపశిల్పి :
సిక్కుల్లో ఆధ్యాత్మిక అభివృద్ధి, స్వయం-క్రమశిక్షణ, మానవీయ సేవాగుణాలను జాగృతం చేయడానికి “ఖల్కా పంథ్”ను ఏర్పాటుచేశారు. అన్యాయాన్ని ఎదిరించడంలో ధైర్యసాహసాలను తన మతస్థుల్లో నూరి పోసిన యోధుడిగా గురు జీ నేటికీ సిక్కుల ఆదర్శ గురువుగా పూజలు అందుకుంటున్నారు. ఆ కాలంలోనే మహిళా హక్కులు, సాధికారతకు కృషి చేసిన దార్శనికుడు మన గురు గోవింద్ సింగ్ జీ. మహిళల్లో ఆధ్యాత్మిక భావనలు, విద్య, యుద్ధ నైపుణ్యాలను పెంపొందించడంలో ఆయన చేసిన కృషి శ్లాఘనీయం. నాటి భారత సమాజంలో అమలులో ఉన్న ‘సతీ సహగమనం’, ‘పరదా’ లాంటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకిస్తూ అభ్యుదయ భావాలకు పురుడు పోశారు. ‘గురు గ్రంథ్ సాహిబ్’ మత గ్రంథాన్ని పూర్తి చేయడంలో ఆయన పాత్ర కూడా మరువలేనిది. సిక్కుల మత గ్రంథంగా గురు గ్రంథ్ సాహిబ్‌ను నిలిపిన మహోన్నత వ్యక్తి మన గురు జీ. సిక్కిజమ్‌కు ప్రత్యేకమైన ఐదు నియమాలు కేష్ (కత్తిరించని కేషాలు), కంగా (చెక్క దువ్వెన), కారా (స్టీల్ కంకణం), కచెరా(కాటన్ లోదుస్తులు), కిర్పన్(చిన్న కత్తి)లను పాటించాలని సూచించారు.
స్ఫూర్తివంతమైన గురు జీ జీవిత విశేషాలు:
22 డిసెంబర్ 1666న పాట్నాలో జన్మించిన గోవింద్ సింగ్ జన్మదినాన్ని నానక్‌షాహి క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తున్నారు. తన తండ్రి గురు తేజ్ బహదూర్త చూపిన బాటలో నడుస్తూ తన తొమ్మిదవ ఏటి నుంచే మత బోధనలు ప్రారంభించిన గురు గోవింద్ అనతి కాలంలోనే సిక్కుల మార్గదర్శిగా, ఆరాధ్య దైవంగా మారిపోయారు. 1699లో నిమ్న నిరుపేద వర్గాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను ఎంచుకొని వారితో ధైర్యసాహసాలు, ఆధ్యాత్మిక భావనలను పెంపొందించి ఒక గొప్ప అభ్యుదయవాదిగా నిరూపించుకున్నారు. 07 అక్టోబర్ 1708న నాందేడ్, మహారాష్ట్రలో అమరత్వం పొందిన గురు గోవింద్ సింగ్ జీ సిక్కుల పవిత్ర మత గ్రంథంగా “గురు గ్రంథ్ సాహిబ్”ను ప్రకటించారు.
గురు గోవింద్ సింగ్ జీ చూపిన సన్మార్గం, స్ఫూర్తి, ఆధ్యాత్మిక విలువలు, మానవీయ భావనలు, పేదరిక నిర్మూలన ప్రయత్నాలు, అసమానతలపై పోరాటాలు, ఇస్లాం మతస్థుల బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక పోరు, ఖల్సా సైన్య సృష్టి, ఆలోచింపజేసే అద్భుత కవిత్వం, జీవన మార్గాలను చూపే మహోన్నత రచనలు నేటికీ సిక్కులకు, ఇతర మతస్థులకు దారి దీపంగా నిలుస్తున్నాయి.