Telugu CinemaTelugu News

సినిమా సంస్కరణకు సరైన సమయమిదే..!

సమాజంలో ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్య గురించి ప్రజలు మాట్లాడుతారు. విభిన్న కోణాలలో చర్చిస్తారు. ఇలాంటి సమయంలో వార్తాపత్రికలలో, సామాజిక మాధ్యమాలలో, టి.వి లాంటి ప్రసార సాధనాలలో ఆ సమస్య కొన్నాళ్లు నలుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఆ సమస్య సమాజం నుండి రెండు రకాలుగా మాయమయ్యే అవకాశం ఉంది. ఒకటి సమస్యకు తగిన పరిష్కారం దొరికినప్పుడు, రెండు పరిష్కారం లభించకుండానే నీరుగారిపోవడం. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ఈ మధ్యన ‘పుష్ప 2’ సినిమా అనేక రకాలుగా హల్చల్ చేస్తూనే ఉంది. ఈ సినిమా ‘బెనిఫిట్ షో’లో జరిగిన సంఘటనలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగం నిజంగా ‘ నిజాలు ‘ ను ప్రతిబింబించింది. ఇటువంటి తరుణంలోనే తెలుగు ‘సినిమా’ సమస్యలకు పరిష్కారం వెతకవలసిన బాధ్యత ఇటు సమాజం, అటు ప్రభుత్వాలపైన ఉంది. 

* తెలుగు సినిమా ప్రత్యేకత

దేశ వ్యాప్తంగా మన తెలుగు సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. సామాజిక దురాచారాలను అంతమొందించే చిత్రాలను రూపొందించిన ఘన చరిత్ర మన తెలుగు సినిమాది. తెలుగువాడి ‘వాడిని, వేడిని ‘ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయిలో ఇనుమడింపజేసే మహానటుడు నందమూరి తారకరామారావు లాంటి వారిని అందించింది. అనేక పేరుపొందిన నటులను, దర్శకులను, స్వరకర్తలను, గాయకులను, రచయితలను, అనేక సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన చరిత మన తెలుగు సినిమాదే. ఇప్పటికీ ఆ పేరు ఉంది. కానీ కొన్ని సినిమాలు చేసే ‘ సిత్రాల ‘ మూలాన ఆ చరిత్ర కొంచెం మసకబారే పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో తెలుగు సినిమా పేరును నిలబెట్టుకోడానికి సంస్కరణలు చేయవలసిన సమయం ఆసన్నమైంది. మనం అవునన్నా, కాదన్నా సమాజంలో ఉన్న ప్రజలపైనే కాకుండా వివిధ వర్గాలపై, వ్యవస్థలపై సినిమా ప్రభావం మెండుగా ఉంటుంది. అది మంచినా లేదా చెడైనా సరే ! 

* సినిమాలు అవసరమా ?

ఈ ప్రశ్నకు సమాధానం మానవతా విలువలుతో కూడిన సందేశాత్మక సినిమాలు అవసరమే! టికెట్ కొనుక్కుని ప్రేక్షకుడు ధియేటరకు ఎందుకు వస్తాడు? హాయిగా, సంతోషంగా వినోదాన్ని పొందడానికి! సినిమా ప్రధాన లక్ష్యం ప్రేక్షకులకు విలువలతో కూడిన వినోదాన్ని, ఆనందాన్ని అందించడం. కొన్ని సామాజిక సమస్యలను స్పృశించి ప్రజలలో మార్పు తేవడం. సమాజానికి ‘మంచి సందేశాన్ని’ అందించడం. కానీ ప్రస్తుతం వస్తున్న కొన్ని సినిమాలలో వినోదం మాట దేవుడెరుగు ! యువతను పెడత్రోవపట్టించే విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు సినిమా పక్కా వ్యాపారమైపోయింది. అధిక లాభాలు సంపాదించేందుకు ఒక అందమైన బిజినెస్.

* వినోదం తక్కువ ! అశ్లీలం ఎక్కువ

ప్రజాస్వామ్య సమాజాలలో ప్రభుత్వ వ్యవస్థలే పట్టుగొమ్మలు.అటువంటి వ్యవస్థలను తప్పుడుగా చూపించే కథాంశంగా ఉండే సినిమాలు వస్తున్నాయి. వీటిలో వాస్తవానికి దూరంగా ఉండే అంశాలు ఉంటున్నాయి. ” సినిమాలో హీరో అన్నింటీకి అతీతుడు. ఎంతమందినైనా ఒంటి చేత్తో కొడతాడు. అలా కొడితేనే మరి హీరో ! ఎన్నో వికృత చేష్టలు చేసినా తప్పులేదు. అశ్లీల పదాలు వాడొచ్చు. తప్పుచేసే వ్యక్తులకు న్యాయస్థానాలతో పనిలేకుండా శిక్షిస్తాడు. వీలైతే ఆగ్రహావేశాలతో చంపేస్తాడు. ఇటువంటి చిత్రాలు వలన వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయేలే ఒక నెగిటివ్ భావనను కలిగిస్తున్నాయి. హీరో పాత్ర సమాజం దృష్టిలో పాజిటివ్గా ఉండాలి. అంతే తప్ప ఒక స్మగ్లర్ని కూడా హీరోగా చూపిస్తే సమాజానికి ఆ సినిమా ఇచ్చే ‘సందేశం’ ఏమిటి ? విద్యాపరంగా ఉన్నత స్థానాల్లో ఉండే ఉపాధ్యాయులపై సెటైర్లు, కౌంటర్లు వేస్తూ గురువులను ఒక జోకర్లా చూపించే పాత్రలను మన దర్శకులు సృష్టిస్తున్నారు.

ఇదేనా చిత్రాలు గురువులకు ఇచ్చే గౌరవం ! ఇటువంటివి విద్యార్థులు చూసి నిజ జీవితంలో ఆచరించరా ? గురువు మాట వినేదెవరు. ఒక హీరో ( స్మగ్లర్ ) తన తోటి స్మగ్లర్లను జైలు నుండి తీసుకుపోడానికి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులను కొంటాడా? ఇది దుర్మార్గమైన చర్య కాదా ? వ్యవస్థలను డబ్బుతో కొనేస్తాడా? ఒక ముఖ్యమంత్రి తనతో కలిపి ఫోటో తీయుంచకోలేదని సియం నే మార్చుతాడా? ఈ చర్యకోసం ఎర్ర చందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలించి సంపాదించిన డబ్బును ఉపయోగించడమా ? వారి దృష్టిలో ఒక ప్రజానాయకుడును డబ్బుతో మార్చేస్తారా! ఇది ఎలా సాధ్యమో ఇటువంటి సినిమాలు తీసేవాళ్ళకే తెలియాలి.

దేశ చరిత్రలో ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా జరిగిందా? మరికొన్ని చిత్రాలోలైతే జుగుప్సాకరమైన, ద్వంద్వర్ధాలు వచ్చే భాషను వాడుతున్నారు. ఇక ప్రతీ సినిమాలలో ఒక అశ్లీలతతో కూడిన ఐటెం సాంగ్ ఉండాలి ! వంటి మీద చాలీ చాలనట్లుగా కురచ దుస్తులుతో ‘నాయిక’, మహిళలు నృత్యాలు ! వెనుక కల్లు గీత తాగిన కోతుల్లా సొంగ కార్చుకుంటూ యువత ! నిజ జీవితంలో ఇలాంటివి ఉన్నాయా? ఉంటే సమాజం అంగీకరిస్తుందా ? నాయిక వాలకం చూస్తే ఫుల్ఎక్స్పోజింగ్ (అశ్లీలత) ! ఇది మహిళలను అవమానించడం కాదా ! కించపరచడం కాదా ! మరి మహిళా సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదో ? ‘ శృంగార నైషధం ‘ కావ్యాన్ని రచించిన శ్రీనాథుడు ఇప్పుడు ఉండి ఉంటే

ముక్కున వ్రేని వేసుకున్నేమో ? 

విద్యార్థులు మద్యపానం త్రాగినా తప్పు లేదు అన్న భావంతో కొన్ని సీన్స్ ఉంటున్నాయి. ‘మద్యపానం సేవించడం పొగత్రాగడం హానికరం’ అని ఒక వాక్యం కని కనిపించే విధంగా చూపించేస్తే సరిపోతుందా ! సినిమాలలో ఇటువంటి అశ్లీల దృశ్యాలు చూసి యువత ఎందుకు పెడతోవపట్టరు? దీనికి కారకులెవరు? 

అధిక బడ్జెట్ అవసరమా ?

వందల కోట్లు ధనాన్ని వృధా చేసి ఒక చిత్రాన్ని నిర్మించాలా? ఓకే! అది నిర్మాతలు ఇష్టం అనుకుందాం. వారు నష్టపోకుండా ఉండాలంటే కొన్ని వారాలు పాటు సినిమా టికెట్ ధరలు పెంచే వెసులుబాటు కావాలా వారికి ? వచ్చిన లాభాలుతో దేశానికి వీరు ఏమి చేస్తున్నారని రాయితీలు కావాలి ? విలువలతో కూడిన సందేశాత్మక చిత్రాలు తీసే సినిమాలను ప్రోత్సహించడానికి రాయితీలు ఇవ్వడం తప్పు కాదు. అటువంటివాటికి రాయితీలు ఇవ్వాలి కూడా. పెద్ద పెద్ద నిర్మాతలు సిండికేట్ అయి ‘చిన్న సినిమా’లకు కనీసం విడుదల చేసే అవకాశం రాకుండా చేస్తున్నారు. చిన్న సినిమాలను చంపేస్తున్నారు.

సినిమా వ్యూహం:

సినిమా విడుదలకాక ముందే రకరకాలైన పేర్లతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ షోలలో విడుదల కాబోయే సినిమా గురించి లేనిపోని ఒక కృత్రిమ హైప్ సృష్టిస్తున్నారు. ఫట్ అయిన చిత్రాల్ని కూడా హిట్ చేయగలిగే కొన్ని ప్రత్యేకంగా సినిమా కోసమే ఏజెన్సీలు ఉన్నాయి. వీరు వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ చెత్త సినిమాలకోసం ఊదర కొట్టి కొట్టి మన కర్ణబేరిలకు కన్నాలు పెడుతున్నారు. ” ఆహా ! ఓహో ! ఇటువంటి చిత్రం ఇంతవరకు రాలేదు ! గొప్ప స్టోరీ ! హీరో యాక్టింగ్ విరగతీసేసాడు ! చూడవలసిన సినిమా ఇది ! ” లాంటి పలుకులు పలుకుతూ సామాజిక మాధ్యమాల్లో పనికిరాని దుస్తులు ధరించిన హీరోయిన్ బొమ్మ ఒక అర సెకెను చూపిస్తారు. ఇదే వీళ్ళ ట్రిక్! ఇంకా ఒక సినిమాని పార్ట్ 1, పార్ట్ 2 అని విడదీసి రెండుసార్లు ప్రేక్షకులును సినిమాహాళ్ళకు రప్పించి వాళ్ళ జేబులకు చిల్లు వేస్తున్నారు. ఏమీ తెలియని సామాన్య ప్రేక్షకులు ఇవి నిజాలని నమ్మి సినిమాలు చూసేస్తున్నారు. సెన్సార్ వాళ్ళు ఇటువంటి సినిమాలను చూసి సర్టిఫికేట్ ఇస్తున్నారా? లేక కళ్ళుమూసుకొని చూసి ఇస్తున్నారా ? అనే సందేహం ఇటువంటి అనైతిక, అశ్లీల సినిమాలను చూసే సామాన్యుడి మెదడులో మెదులుతున్న ప్రశ్న !

సంస్కరణలు అవసరం:

భారీ బడ్జెట్తో తీసే సినిమాలపై ఎక్కువ శాతం వినోదం పన్నును ప్రభుత్వం విధించాలి. వచ్చే లాభలపై అధిక పన్నును రాబట్టాలి. ఇంకా ఎట్టి పరిస్థితులలో కూడా సినిమా టికెట్ ధరలు పెంచుకోడానికి అవకాశం ఇవ్వకూడదు. ఒకే చిత్రాన్ని ఒక నగరంలో సగం కంటే ఎక్కువ సినిమా హాళ్లలో రిలీజ్ కాకుండా చేసి, చిన్న సినిమాలను బ్రతికించాలి. ప్రి రిలీజ్ ఈవెంట్స్ జరిపేటప్పుడు ఏవైనా జరగరాని సంఘటనలు జరిగితే ఆ సినిమా యూనిట్ వారిని బాధ్యులు చేయాలి. 

మార్గదర్శకాలు అవసరం:

ప్రతీ సినిమా కొన్ని మార్గదర్శకాలను అనుగుణంగా చిత్రీకరించేటట్లుగా ఉండేటట్లు ప్రభుత్వాలు చట్టం చేయాలి. అవి ‘ఒక చిత్రం వినోదాత్మకంగా ఉండాలి. సమాజానికి కీడు చేసే విధంగా ఉండగూడదు. చట్ట వ్యతిరేక పనులు చేసే వారిని హీరోలుగా చూపించగూడదు. అశ్లీలతకు, అనైతికతకు తావుండగూడదు. కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉండాలి. ఒక సినిమా ఒక భాగం గానే ఉండాలి. అంతే తప్ప సినిమా 1, సినిమా 2, ఇలా సీక్వెన్స్ సినిమాలు రాకుండా చూడాలి.

Show More
Back to top button