Telugu News

ప్రతీ యేటా జనవరి మొదటి వారంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు.

జనవరి నెల ఎప్పుడు వస్తుందా అని సంగీత ఆరాధకులు, సంగీత కళాకారులు ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ప్రతీ సంవత్సరం జనవరి నెల మొదటి వారంలో తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు దగ్గరలో ఉన్న తిరువయ్యూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. త్యాగరాజ ఆరాధన అనేది ప్రముఖ వాగ్గేయకారుడు “త్యాగరాజు” ను స్మరించుకుంటూ సంవత్సరానికి ఒక్కసారి జరిగే సంగీతోత్సవాలు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి అక్కడకు విచ్చేస్తారు.

ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున త్యాగరాజ సమాధి సమీపంలో పుష్య బహుళ పంచమి నాడు జరుగుతుంది. ఆరోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు. కేవలం సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు. ఆ సమయంలో అక్కడ అడుగుపెట్టిన వారికి ఓ సంగీత ప్రపంచంలోకి అడుగున అనుభూతి కలుగుతుంది. దేవాలయాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా తయారవుతాయి. అక్కడ త్యాగరాజ కృతులు మనకు వినిపిస్తుంటాయి. కర్ణాటక సంగీతానికి విశేష సేవలు అందించిన త్యాగరాజ, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్లు ఇక్కడే జన్మించారు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు త్యాగయ్య…

నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగయ్య. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఆయన ఒకరు. ఆయన కర్ణాటక సంగీత త్రయంలో మరో ఇద్దరైన శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడు కూడా. వీరు ముగ్గురూ తమిళనాడులోని, తంజావూరు జిల్లా, తిరువారూరుకు సంబంధించిన వారే. తమిళదేశంలో పుట్టి పెరిగినా వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగింది. త్యాగయ్యను, త్యాగరాజ, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై అతడికి గల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామాలు జపించి వారి దర్శనం పొంది, వారి ఆశీర్వాద పొందినట్లు కథనాలు ఉన్నాయి. త్యాగయ్య ఉపనయనం (వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ) తరువాత తండ్రిగారి బోధలు, బాల్యంలోనే తనకు తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు, తన 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం త్యాగరాజ స్వామి వారిలో బీజాంకురాలులై మూర్తీభవించాయి.

త్యాగయ్య నేపథ్యం…

త్యాగయ్య వైదిక వెలనాడు కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్వీకులు 1600 ప్రాంతంలో ఆంధ్రదేశం నుండి తమిళనాడు లోని తంజావూరు ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడి నాయక రాజుల ఆశ్రయంలో జీవించారు త్యాగయ్య తండ్రి రామబ్రహ్మం. ఆయన తంజావూరు మహారాజా తులజాజీ -ll మన్నననలు పొందిన వారు. రామాయణాన్ని హరికథలు, ప్రవచనాల రూపంలో ప్రచారం చేసే వారు. ఆయన తమిళనాడులోని కుంబకోణం వద్ద మరుదనల్లూరులోని ఒక శైవమఠాధిపతి వద్ద ఆయన రామతారక మంత్రోపదేశాన్ని పొందారు. త్యాగయ్య జన్మించక ముందు తిరువారూరులోని గల త్యాగరాజస్వామి (నాట్యం చేసే యోగి రూపంలో ఉంటాడీ శివుడు) రామబ్రహ్మం దంపతులకు స్వప్న సాక్షాత్కారమిచ్చి నారదుని అవతారమై ఒక కుమారుడు జన్మిస్తాడు, అతనికి త్యాగరాజు అని నామకరణం చేయమని పలికి అదృశ్యమయ్యాడు.

ఆ తరువాత  04 మే 1767 నాడు త్యాగరాజ స్వామి జన్మించారు. పసివయస్సులోనే తల్లి పాలు త్రాగుతున్న పసిబాలుడు ఎక్కడైనా సంగీతం వినబడితే చాలు పాలు త్రాగడం ఆపి అటువైపు తల తిప్పి సంగీతం వినేవాడు. ఒకసారి రామబ్రహం తన కుటుంబంతో కలిసి కాశీ ప్రయణం అవుతుండగా తిరువారూరు త్యాగరాజస్వామి (శివుడు) మళ్లీ స్వప్నంలో కనబడి తిరువైయారు వెళ్లమని, అదే అతనికి కాశీతో సమానమని చెబుతాడు. రామబ్రహ్మం ఇదే విషయం తులజాజీ -ll మహారాజా వారికి తెలుపగా అయన తిరువైయారులో రామబ్రహ్మానికి ఒక ఇల్లుతో పాటు ఆరు ఎకరాల పొలం ఇస్తాడు. ఆ విధంగా రామబ్రహ్మం కుటుంబం తిరువైయారులో స్థిరనివాసం ఏర్పరుచుకోవలసిన వచ్చింది.

ఊంఛవృత్తిని అవలంభించి… 

త్యాగయ్యకు తన 18 సంవత్సరాల వయస్సులో పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 సంవత్సరాల వయస్సులో ఉండగానే ఆమె మరణించడం జరిగింది. ఆ తరువాత త్యాగయ్య పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడారు. ఈ దంపతులకు సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కూడా కలిగాడు. కానీ అతడు యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగయ్యకు కచ్చితమైన వారసులెవరూ లేరు. అయినా కూడా అతను ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. త్యాగయ్య తండ్రి చిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య జగిగిన భాగపరిష్కారాలలో త్యాగయ్య భాగంలో తనకు కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహాలు వచ్చాయి. ఆ ప్రతిమలను త్యాగయ్య అతి భక్తితో పూజించేవారు. త్యాగయ్య జీవితమంతయూ ఊంఛవృత్తిని అవలంబించి సామాన్య జీవితాన్ని సాగించేవారు. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన శ్రీరాముడి పై కృతులు రచించుటలోనే నిమగ్నమైయ్యేవారు.

దేశంలో మరి కొన్ని ఆరాధనోత్సవాలు…

దేశంలో అనేకమంది ప్రముఖ సంగీత కళాకారుల జ్ఞాపకార్థం ప్రతీ యేటా సంగీత ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని

★ బృందావనంలో స్వామి హరిదాస్ ఉత్సవం..

★ గ్వాలియర్ లో తాన్ సేన్ ఫెస్టివల్..

★ జలంధర్ లో హర్ బల్లభ్ ఉత్సవం..

 ★ మైహార్ లో అల్లావుద్దీన్ ఖాన్ ఫెస్టివల్..

అయితే త్యాగరాజ ఆరాధన మహోత్సవానికి ఉన్న విశిష్టత వేరు..

ఎవరి వసతులు వారే చూసుకోవాలి…

ప్రతీ సంవత్సరం జనవరి నెల మొదటి వారంలో వందల మంది సంగీత కళాకారులు, వేల మంది సంగీత ఆరాధకులు, అభిమానులు అక్కడికి చేరుతారు. అక్కడ వాతావరణం పూర్తిగా సరిగమలతో నిండిపోతుంది. అక్కడికి వచ్చే కళాకారులంతా ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని రావాల్సిందే. ఆరాధనోత్సవాల నిర్వాహకులు కళాకారుల కోసం ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించరు. ఆరాధన ఉత్సవాలకు హాజరైన కళాకారులు బస చేసేందుకు ఎవరి ఏర్పాట్లు వారే చూసుకోవాలి. ఏ ఏర్పాట్లలో కూడా ఉత్సవాల నిర్వాహకులు కల్పించుకోరు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరాధన ఉత్సవాల కచేరిలలో పాల్గొనే కళాకారులకు కూడా పారితోషికం చెల్లించరు. 

కళాకారులందరూ సమానమే.

ఇక్కడ జరిగే త్యాగరాజు ఉత్సవాల ప్రత్యేకతలలో ఇది కూడా ఒకటి. కళాకారుల మధ్యలో గొప్ప, సామాన్య లాంటి భేదాలు ఉండవు. ప్రముఖ కళాకారులైనా, ఔత్సాహికులైన కళాకారులైనా అంతా సమానమే. ఒక్కొక్క కళాకారుడికి ఇరవై నిమిషాల సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో కేవలం త్యాగరాజ కృతులు మాత్రమే గానం చేయవలసి ఉంటుంది.

త్యాగబ్రహ్మ కి నివాళి…

త్యాగరాజుని అందరూ త్యాగబ్రహ్మ అని పిలుస్తారు. ఆరాధనోత్సవాలకు హాజరయ్యే కళాకారులంతా వారు చేసే కచేరీలన్నీ త్యాగబ్రహ్మకు నివాళిగా భావిస్తారు. అందుకే అక్కడ ప్రత్యేక సదుపాయాలు కల్పించకపోయినా, పారితోషికం ఇవ్వకపోయినా కూడా కళాకారులంతా ఉత్సాహంగా ఆ ఉత్సవాలకు హాజరవుతుంటారు. 

ఆరో రోజు అద్భుతం..

ఆరాధన ఉత్సవం ఆరంభమైన రోజు నుంచి ఆరవ దినం కోసం సంగీత అభిమానులంతా ఎదురు చూస్తుంటారు. ఆరోజు ప్రముఖ కళాకారులంతా తిరువయ్యూరు వీధులలో కాలినడకన తిరుగుతూ త్యాగరాజ కృతులు ఆలపిస్తారు. నిజంగా ఆ దృశ్యం చూసేవారికి  ఒళ్ళు పులకరిస్తాయి. ఎప్పుడో రెండు వందల యేండ్ల క్రితం త్యాగబ్రహ్మ ప్రతీరోజు ఇలా భిక్షాటన చేసే వారని ప్రతీతి. 

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, సెమ్మాన్ గుడి, శ్రీనివాస్ అయ్యార్, టీ.బృంద, అరియకుడి రామానుజన్ అయ్యంగార్ వంటి ప్రముఖ కళాకారులు ప్రతీ యేటా ఈ ఉత్సవాలలో పాల్గొనేవారు. ఆరవ రోజు జరిగే భిక్షాటన కార్యక్రమంలో పాల్గొని “త్యాగరాజ పంచరత్న కృతులు” ఆలపిస్తారు.

స్మారక చిహ్నాన్ని పునరుద్దరణ చేసిన శిష్యులు…

ప్రతీ యేటా జనవరి మొదటివారంలో జరుగుతున్న ఆరాధనోత్సవ సంప్రదాయానికి సుమారు వంద సంవత్సరాలకన్నా తక్కువ వయస్సే ఉంటుంది. త్యాగరాజు 1847లో స్వర్గస్తులయ్యారు. తన మరణానికి కొద్దిరోజుల ముందుగా ఆయన సాంప్రదాయ బద్ధంగా అన్నీ త్యజించి సన్యాసిగా మారారు. ఆయన మరణించిన తరువాత తన భౌతిక కాయాన్ని కావేరీ నది ఒడ్డున ఖననం చేసి అక్కడే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. అయితే ఆయన శిష్యులంతా వారి వారి స్వస్థలాలకు చేరుకుని ప్రతీ సంవత్సరం త్యాగరాజ వర్థంతిని వారి వారి ఇళ్ళలోనే జరుపుకునే వారు. 1903 సంవత్సరం వచ్చేసరికి ఎవ్వరూ కూడా ఆయన స్మారక చిహ్నాన్ని పట్టించుకోకపోవడంతో ఆ నిర్మాణం పాడుపడిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఆయన దగ్గర విద్యనభ్యసించిన ఇద్దరు శిష్యులు దానిని సందర్శించడం జరిగింది. వారే ప్రముఖ సంగీత విద్వాంసులు సుందర భాగవతార్, ఉమయాల్పురం కృష్ణ భాగవతార్లు. వారు తమ గురువు సమాధికి అలాంటి పరిస్థితి కలగడం చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే ఆ ప్రాంతాన్ని పునరుద్ధరణకు ఏర్పాట్లు చేశారు.

నాగరత్నమ్మాళ్ కృషి…

భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళలకు ఎనలేని సేవచేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత నాగరత్నమ్మాళ్. ఏటికి ఎదురీదిన ఆమె, మొక్కవోని పట్టుదలతో, అంకుఠిత దీక్షతో తాదలచిన కార్యములు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా తన బ్రతుకు ముగించిన గొప్ప మహిళ నాగరత్నమ్మాళ్. 

త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మాళ్ కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ ఒకరోజు విషపూరితమైన పాలు త్రాగబోతుండగా త్యాగరాజ స్వామి కనబడి ఆవిడని ఆపివేసినట్టు నాగరత్నమ్మాళ్ కి కనిపించింది. ఆవిడ వెంటనే తిరువయ్యారు వెళ్లి త్యాగరాజ స్వామి సమాధిని దర్శించారు. ఆ సందర్భంలో త్యాగరాజస్వామి సమాధి నిర్లక్ష్యానికి గురికావడం చూసి ఆ దేవదాసి తన ధనం వెచ్చించి ఆ సమాధి స్థలాన్ని కొనుగోలు చేసి, అక్కడ ఓ దేవాలయం నిర్మించి అందులో త్యాగరాజ స్వామి వారి పాలరాయి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

 1949 వ సంవత్సరంలో నాగరత్నమ్మాళ్ తన ఆస్తులన్నింటినీ ట్రస్ట్ కు వ్రాసేశారు. ప్రతీ సంవత్సరం త్యాగరాజ సంగీత ఆరాధన మహోత్సవం ఏవిధంగా జరపాలో తగిన సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారం నేటికీ ఉత్సవాలు జరుపబడుతుండడం విశేషం. త్యాగరాజ స్వామి సమాధి ఎదురుగా కావేరి నది ఒడ్డున నాగరత్నమ్మాళ్ సమాధి కూడా ఉంది.

Show More
Back to top button