
వేసవి.. అందులోనూ వాతావరణంలో వస్తున్న రకరకాల మార్పులతో.. అనేక ఆరోగ్య సమస్యలూ, జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. చాలామందిలో ఈ ఎండలకు శరీరంలో వేడి చేయడం వల్ల జ్వరం, వాంతులు, వికారం, తలనొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి సమయంలో కొన్ని ఆహారపదార్థాలు.. వేసవి వేడికి విరుగుడుగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు. మీ కడుపును ఎంతో చల్లగా ఉంచి.. ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి.
కడుపులో వేడికి కారణాలు ఇవే..
మన జీవనశైలితో పాటు ఆహార విధానాల శరీరంలో వేడి పెరుగుతుంది. కొన్ని వంటల్లో తినే కారం ఎక్కువగా వాడటం, మాంసాహారం, సిగరెట్ స్మోకింగ్, కాఫీలు అతిగా తీసుకోవడంతో పాటు సరైన టైంలో తినకపోవడం, కొన్ని రకాల మందులు పెయిన్ కిల్లర్స్ కూడా కడుపులో వేడి పెరగడానికి కారణమవుతాయి.
నివారణ:
వేసవిలో ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నూనెలో వేయించినవి, కారంగా ఉండే ఆహార పదార్థాలను దాదాపుగా తగ్గించాలి. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది.
ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగాలి. నిద్రలేచిన 1- 2 గంటల్లోపే అల్పాహారం తీసుకోవాలి. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఇక రోజంతా కనీస మోతాదులో నీరు తాగుతూ ఉండాలి.
ఆహారంలో..
*వేసవిలో పుష్కలంగా లభించే తాజా పుదీనాను ఆహారంలో భాగం చేసుకోవాలి. పుదీనా నీళ్లు తాగినప్పుడు.. కడుపులో యాసిడ్ ఇట్టే తగ్గిపోతుంది.
*బ్రష్ చేసిన వెంటనే.. రెండు మూడు తులసి ఆకులను నమిలి మింగేయాలి. ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల కడుపులో నీటి పరిమాణం పెరుగుతుంది. మంటను కలిగించే ఆమ్లాన్ని సైతం తగ్గిస్తుంది. తులసి ఆకులతో టీ చేసుకొని తాగినా మంచి జరుగుతుంది.
కడుపును చల్లగా ఉంచడంలోనూ, వేడిని తగ్గించడంలో సోంపు బెటర్ గా పనిచేస్తుందట. భోజనం తర్వాత కాస్త సోంపు నమిలితే.. కడుపులో చికాకు తగ్గుతుంది. సోంపు నేరుగా తినలేకపోయినవారు సోంపు వాటర్ ని తాగవచ్చు.
వేసవిలో ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలి. ఈ పండులో అధిక మొత్తంలో లభించే పొటాషియం.. కడుపులో ఆమ్లాన్ని నియంత్రించడంలో సాయం చేస్తుంది. వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
వేసవిలో వేడి పాలు నచ్చకుంటే.. చల్లని పాలే తాగాలి. అల్పాహారంగా ప్రతిరోజూ ఒక కప్పు చల్లని పాలు తాగితే.. మేలు చేస్తుంది. ఇందులోని కాల్షియం.. కడుపులో కలిగే వేడిని తగ్గిస్తుంది. చల్లదనాన్ని అందిస్తుంది.