
స్వామియే శరణం అయ్యప్పా! అని శరణుఘోష చేస్తూ… కుటుంబసభ్యులు, బంధుమిత్రులు వెంటరాగా… 40 రోజులపాటు చేసిన మండల దీక్షని పూర్తి చేసిన సంతృప్తితో వేలాదిమంది భక్తులు గురుస్వామి చేత ఇరుముడి కట్టించుకుంటూ కనిపిస్తుంటారు.
చైత్ర మాసంలోని ఉత్తర నక్షత్రం చతుర్దశి అయిన సోమవారం రోజున జన్మించాడు అయ్యప్ప స్వామి. జ్యోతిరూపంగా అంతర్ధానం అయిన రోజునే మనం మకర సంక్రాంతిగా పిలుస్తాం. మన జాతక రాశుల్లో మకరరాశి ఒకటి. ‘మకరజ్యోతి’ అంటే మకరరాశి వెలుగు అని అర్ధం. ఏటా జనవరి 14న భక్తులకు ఒక నక్షత్రం (వెలుగు)గా కనిపించి, అందర్నీ దీవిస్తాడని నమ్ముతారు.
మకరజ్యోతి వేరు. మకర విలక్కు అనేది వేరు. మకర జ్యోతి భక్తుల విశ్వాసం. మకర విలక్కు అనేది కేవలం మనిషి వెలిగించే అఖండ దీపం. దాన్నే ఇప్పుడు భక్తులు ‘మకరజ్యోతి’గా పరిగణిస్తున్నారు. అంతేకాక సంక్రాతి పర్వదినానికి ముందుగా మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఉత్తరాయణంలో సూర్యుడు ఆరు నెలలపాటు ఉత్తర దిశగా ప్రయాణిస్తాడనీ, అలా మకర సంక్రాంతి (జనవరి 14న) మొదలైన ప్రయాణం కర్క సంక్రాంతి (జులై 14న) ముగుస్తుందనీ పెద్దలు చెబుతారు. సంక్రాంతి రోజున పంటలు ఇళ్లకు రావడంతో గ్రామాలన్నీ సంతోషంగా పండుగ జరుపుకుంటాయి.
మకరజ్యోతి అంటే..
జనవరి 14న ఉదయం పొన్నాంబలం కొండకు ఒక బృందం బయలుదేరి సాయంత్రానికల్లా అక్కడికి చేరుకుంటుంది. మధ్యలో మధ్యాహ్న సమయంలో కాసేపు సేద తీరి, భోజనాలు చేసి, మళ్లీ ప్రయాణమవుతారు. సాయంత్రానికి కొండమీదికి చేరి, సంధ్యవేళ 6:15 తర్వాత 3- 4 నిమిషాల పాటు అఖండ జ్యోతిని వెలిగిస్తుంది. సుమారు పదికిలోల కర్పూరం వెలిగించేసరికి పెద్ద జ్యోతి పైకి లేస్తుంది. ఆ వెలుగుకు అడ్డంగా కొందరు లావుపాటి దుప్పటి మూడుసార్లు అడ్డుపెట్టి తొలగిస్తారు. దాంతో శబరిమల ఆలయంలో ఉన్న భక్తులకు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారికి ఆకాశంలో నక్షత్రం మూడుసార్లు మినుకుమని వెలిగి మాయమైందన్న భ్రమ కలుగుతుంది. అదే మనిషి చేసే మకరజ్యోతి మహత్మ్యం!
కొండమీద హారతి కార్యక్రమం అయిపోగానే, కొండ కింద అయ్యప్ప గుడిగోపురం నుంచి అర్చకులు భక్తులకు సంకేతాలిస్తారు. దాంతో కార్యక్రమం ముగిసిందని భక్తులు తెలుసుకుని, ఎవరిదారిన వారు వెళ్ళిపోతారు. కొండమీద నక్షత్రమనే ఒకప్పటి భ్రమే, ఇప్పుడు వాస్తవంగా మారింది.
మకరజ్యోతి దర్శనం..
2011లో మకరజ్యోతి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి నుంచి మకరజ్యోతి విశ్వసనీయతపై పలు సందేహాలు తలెత్తాయి. శబరిమల ఆలయం ప్రధానార్చకుడు చెప్పిన విషయం ప్రకారం మకరజ్యోతి మానవులు వెలిగించేది కాదు. అదొక దివ్య నక్షత్రం. అయితే మకర విళక్కు అంటే కొండపై నుంచి మూడుసార్లు కనిపించే దీపమని, పొన్నంబళమేడు పర్వతంపైన చేసే ఒక దీపారాధనగా మాత్రమే అని తేలింది. అయితే హేతువాద సంస్థలు మాత్రం ఇందుకు అంగీకరించకుండా మకరజ్యోతి నిజం కాదు, అది దేవుడి మహిమ అంతకన్నా కాదని, ఈ జ్యోతిని మానవులే వెలిగిస్తున్నారని వాదిస్తున్నారు.
జ్యోతి రూపంలో దర్శనమిచ్చే కాంతి పుంజంగా అయ్యప్ప స్వరూపం చూసేందుకు భక్తులు ఈరోజున ఉదయం నుంచి నిరీక్షిస్తుంటారు. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని విశ్వాసం. అంటే మరుజన్మ లేకుండా భగవంతుడ్ని చేరుకోవడం అని అర్థం.
శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధానార్చకులు స్వామికి అలంకరిస్తారు. అనంతరం మూలమూర్తికి హారతిస్తారు. ఆ వెంటనే పొన్నంబళమేడు పర్వత శిఖరాల్లో కాంతులీనుతూ మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయి.
మకరజ్యోతి దర్శనం కాగానే మనసంతా నిండిన భక్తి భావంతో అయ్యప్ప దీక్షాధారులు స్వామియే శరణమయ్యప్ప! అంటూ చేసే శరణఘోషలతో శబరిగిరులు మారుమోగుతాయి.
ఆ అనుభూతిని స్వయంగా అనుభవించాల్సిందే కానీ, మాటల్లో చెప్పేది కాదు. ప్రత్యక్షంగా మాలధారులు మకర జ్యోతిని దర్శించుకుంటే పరోక్షంగా లక్షలాది మంది ప్రజలు ప్రసార మాధ్యమాల్లో లైవ్ లో మకరజ్యోతిని దర్శించుకుంటారు.
*అయ్యప్పను సందర్శించే భక్తుల్లో 80శాతం మంది 40 కిలోమీటర్ల దిగువనున్న వావర్ మసీదును సందర్శించాకే అయ్యప్ప వద్దకు వెళతారు. పురాణాల ప్రకారం, వావర్ యుద్ధ విద్యలో ఎంతో నైపుణ్యం కలిగినవాడు.. ఒకసారి అయ్యప్పతో మూడురోజుల పాటు యుద్ధం చేశాడని, ఈ యుద్ధంలో ఇద్దరు సమఉజ్జీలుగా నిలిచారు. దీంతో అయ్యప్ప తన చేతిలోని ఆయుధాన్ని పడేసి, వావర్ ను ఆలింగనం చేసుకుని, స్నేహం చేశాడట. ఆ తర్వాతి కాలంలో వావర్ అయ్యప్పకు ప్రముఖ శిష్యుడు, భక్తుడు అయినట్లు తెలుస్తోంది.
*అనంతరం తన జన్మ రహస్యం గురించి తెలుసుకున్న అయ్యప్ప తాను వేసిన బాణం ఎక్కడ పడుతుందో అక్కడే తన ఆలయాన్ని నిర్మించాలని పండలం రాజుకు చెబుతాడు. అదే సమయంలో వావర్ కు సైతం ఒక మసీదును కట్టించమని చెప్పాడట. ఆ ప్రకారమే శబరిమల ప్రాంగణంలో వావర్ పేరిట మసీదు నిర్మితమైంది. ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం, అక్కడ విగ్రహ ప్రతిష్ట కాలేదు కానీ మసీదు లోపల వావర్ ఉనికిని చాటే ఒక శిల మాత్రం ఉంది. 500 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రార్థనలు కొనసాగుతున్నట్లు ప్రతీతి. వావర్ స్వామికి ప్రార్థనలు చేయడం పూర్తయిన తర్వాతే అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు ప్రారంభమవుతుండడం విశేషం!