
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పల్లెల్లో ఉదయాన్నే ప్రతి ఇంటి ముందు చలిని లెక్కజేయకుండా వేసే కళకళలాడే ముగ్గులు, అందులో గొబ్బెమ్మలు..
హరిదాసు కీర్తనలు.. పిండివంటలు, గాలిపటాలు,
కొత్త అల్లుళ్ళు, కోళ్ల పందాలు.. ఇల్లంతా కుటుంబసభ్యులతో ప్రత్యేక శోభతో వెలిగిపోతుంది.
పంటలు చేతికంది రైతులు పరవశించే రోజుగా..
వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పుణ్యసమయంగా ఈరోజును చెప్పవచ్చు.
మన పూర్వీకులు సూర్య సంచారాన్ని భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నప్పుడు ఉత్తరాయనంగా, దక్షిణ దిశలో ఉంటే దక్షిణాయానంగా విభజించారు.
సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణంగా పిలుస్తారు.
అలా ప్రవేశించడానికి పట్టే కాలం సుమారు నెలరోజులు అయితే ఇలాంటి సంక్రమణాలు ఏడాది మొత్తంమీద పన్నెండు ఉంటాయి. వాటిలో మకర సంక్రమణానికి ప్రాధాన్యత ఎక్కువ.
రాశిచక్రంలోనూ మకరరాశి ప్రధానమైనది. కావున
సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే మహత్తర పుణ్యదినంగా మకర సంక్రమణానికి పేరుంది. సూర్యుడు శ్రీమన్నారాయణమూర్తిగా మనకి ప్రత్యక్షంగా సాక్షాత్కరించేది మకర సంక్రమణ కాలంలోనే అందువల్ల సూర్యుడికి ‘సూర్య నారాయణుడు’ అనే పేరు వచ్చినట్లు పెద్దలు చెబుతారు. ఈ సందర్భంగానే మనం భోగి, సంక్రాంతి, కనుమ.. అంటూ మూడు రోజులపాటు పండుగ ఘనంగా చేసుకోవటం ఆచారంగా వస్తోంది.
భోగి అంటే మనకు గుర్తొచ్చేవి భోగిమంటలు..
భోగం నుంచి వచ్చిన పదం భోగి. నిజానికి భోగం అంటే సుఖం అనే అనుభూతి, అనుభవించే రోజని భావం. పురాణాల్లో గోదాదేవి- శ్రీ రంగనాథస్వామిలో లీనమవ్వడం అనే భోగాన్ని పొందిన రోజునే భోగి పండుగ అవుతోంది.
భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రమాదాలను అరికట్టడమే భోగిమంటల ప్రధాన ఉద్దేశం కాగా చలి కాచుకోవడం రెండోది. భోగి మంటలు వేదకాలంలో రుషులు చేసిన యజ్ఞాలకు ప్రతిరూపం కూడా.
సంక్రాంతి బుద్ధిని వృద్ధి చేసుకోవడం అనేది పండుగలోని ఆంతర్యం. అందుకే ఈ రోజున బుద్ధికి అధిదేవత అయిన సూర్యుణ్ణి ఆరాధించాల్సిందిగా పెద్దలు నిర్ణయించారు. ఈ శుభ ఘడియల్లో చేసే పూజలు, దానాలతో మంచి పుణ్యం కలుగుతుంది. సంక్రాంతి నాడు నువ్వులతో హోమం, నువ్వులదానం చేయడం వల్ల శనిదోషం తొలగిపోతుంది. తెల్లని నువ్వులు తీసుకోవడం వల్ల అకాల మృత్యు బాధ తొలగి, ఆయుష్షు పెరుగుతుందన్నది పురాణాల్లో చెప్పడమైంది.
కనుమ నాడు సర్వదా కృతజ్ఞతాభావం చూపిస్తారు రైతులు.. తమ పంటలు పండటంలో, అవి చేతికందడంలో సహాయపడిన పశుపక్ష్యాదుల పాత్ర ఎనలేనిది.. ఏడాదంతా తమతో పాటు శ్రమించిన పశువులను కనుమనాడు ప్రత్యేకంగా పూజిస్తారు. శ్రీ కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి, గోకులంలోని ప్రజలను, గోవులను రక్షించింది ఈరోజేనని పురాణాలు చెబుతున్నాయి.
భారతీయ సంస్కృతికి మూలమైన వేదాలు, సంస్కృత భాష ఉత్తరాదినే పుట్టాయి. దేవతలు, రుషులు, పండితులంతా ఉత్తర ప్రాంతాల్లో నివాసమున్నారు. మకర సంక్రమణంతో దేవతలకు పగటి కాలం మొదలవడం వల్ల ఈ కాలంలో దేవతలు మేల్కొని ఉండి, కోరిన కోర్కెలు తీరుస్తారని.. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని, పితృ దేవతలకు తర్పణాలు ఇస్తే వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. పదకొండు సంక్రమణాల్లో ఇవ్వలేకపోయినా, మకర సంక్రమణం నాడు తప్పకుండా.. పితృ తర్పణాలు ఇవ్వాలి.
గాలిపటం..
శ్రీహరిని స్తుతిస్తూ హరిదాసులు చేసే గానం వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇకపోతే ఇష్టంగా ఎగురవేసే గాలిపటాలు జీవుణ్ణి, దేవుడితో అనుసంధానించే ఆధ్యాత్మికతకు గుర్తుగా నిలుస్తాయి. ఇక్కడ భగవదాశీర్వాదం దారంలా నిలబడి, మానవుడనే గాలిపటాన్ని సంరక్షిస్తున్నంత కాలం ఆనందంగా ఎగురుతూనే ఉంటుందనేది భావన. ఈ అంతరార్ధం తెలిసినా, తెలియకున్నా గాలిపటాలు ఎగిరేసే సంప్రదాయం మాత్రం సంక్రాంతిలో భాగమైపోయింది. అయ్యప్ప భక్తులకు శబరిమలపై మకరజ్యోతి సందర్శనం లభించేది కూడా ఈ సంక్రాంతి పర్వదినానే.
‘ముక్కనుమ’ కనుమ తరువాతిరోజు…ఈరోజున కొత్తగా పెళ్లైనవారు సావిత్రీ గౌరీ వ్రతం చేసి, అమ్మవారి బొమ్మలతో బొమ్మలనోము నోచుకుంటారు. గౌరీదేవిని తొమ్మిది రోజులు పూజించి, తొమ్మిది రకాల పిండి వంటలను నివేదిస్తారు. తర్వాత ఆ మట్టిబొమ్మలను పుణ్యతీర్ధంలో నిమజ్జనం చేస్తారు. మూడు రోజులు ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి పండుగ బంధాలను బలపరుస్తుంది. ఇది మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం. ఆత్మీయతలూ అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం.
ప్రయోజనాలు..
*ప్రతి ఒక్కరి ఇంటిముందు రంగురంగుల ముగ్గులు ఉంటాయి. ముగ్గులోని మధ్య చుక్క సూర్యుడికి ప్రతిరూపంగా, చుట్టూ ఉన్నవి గ్రహాలకు ప్రతీకలుగా భావిస్తారు. సంక్రాంతికి సంబంధించిన విషయాలన్నీ సూర్యుడితో ముడిపడి ఉంటాయి. ముగ్గులు వేసే సరదా, సందడి, శారీరక శ్రమ వెనుక నలుగురితో కలిసి మెలిగే స్నేహానుబంధం, ఆరోగ్య రహస్యం మనకూ అంతర్లీనంగా కనిపిస్తాయి.
*ఈ పర్వదినాల్లో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, దుస్తులు, కాయగూరలు, దుంపలు, చెరకు, గోవు, బంగారం ఇలా ఎవరి శక్తికొద్దీ వారు దానం చేస్తారు. ఇలా చేసే దానాలు ఉత్తమ ఫలితాన్నిస్తాయి.
*కొత్త బియ్యంతో పరమాన్నం, అరిసెలు వంటి పిండివంటలు చేసి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం సమర్పించడం ఆచారం. పితృదేవతలు సదా మనల్ని ఆశీర్వదిస్తుంటారు. అంత శక్తి కలిగిన వారిని ఇతర రోజుల్లో ఎలా ఉన్నా సంక్రాంతినాడు తప్పక ఆరాధించాలని పెద్దలు చెబుతారు. పితృదేవతలకి నైవేద్యాలు సమర్పించాల్సిన పండుగ కనుక సంక్రాంతిని పెద్ద పండుగ లేదా పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు.