ఆ 3 రోజులు నదిలో నీరు ఎర్రగా ఎందుకు మారుతుంది ? దీనిని పురుష నదిగా ఎందుకు పిలుస్తారు ?
భారతదేశం ఎన్నో నదులకు పుట్టినిల్లు. సనాతన ధర్మాన్ని ఆచరించే భారతదేశంలో నదులను దేవతలుగా పూజిస్తారు. ఒక్కో నదికి పుష్కరాలను నిర్వహిస్తారు. నదీమాతల్లిని పరమపవిత్రంగా భావిస్తూ పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. నది స్నానం చేస్తే సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందనేది అనాదికాలంగా వస్తున్న ఆచారం. నిరంతరం నదులు పడమర నుండి తూర్పు వైపుగా ప్రవహిస్తూ ఉంటాయి. ఎంతో స్వచ్ఛతను కాపాడుకుంటూ..
పరమ పవిత్రమైనవిగా నదులు పేరు పొందాయి. సాధారణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదులు స్త్రీల పేర్లను కలిగే ఉంటాయి. గంగా, యమునా, సరస్వతి, నర్మదా, గోదావరి, సింధు తపతి తదితర నదులు స్త్రీల పేర్లను కలిగి ఉన్నాయి. అయితే భారతదేశంలో పురుషుని పేరుతో ఉన్న నది కూడా ఒకటి ఉంది. అదే ‘బ్రహ్మపుత్రా’ నది. బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మకుమారుడు అని అర్థం. సాధారణంగా అన్ని నదులు స్త్రీల పేర్లను కలిగి ఉంటే బ్రహ్మపుత్ర నది మాత్రం పురుషుని పేరుతో ఉంటుంది. అందుకే దీనిని పురుష నదిగా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది యొక్క విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మపుత్రా నది హిమాలయాలలోని ఉత్తరాన టిబెట్ లోని పురంగ్ జిల్లాలో మానస సరోవర్ సమీపంలో జన్మించింది. ఈ నదిని చైనా దేశస్తులు యార్లంగ్ త్సంగో అని పిలుస్తారు. అక్కడ ఉన్నటువంటి బౌద్ధులు, జైనులు సైతం భక్తి శ్రద్ధలతో ఈ నదిని పూజిస్తారు. అక్కడి చాంగ్ థాంగ్ పీఠభూమి నుండి ఈ నది ఉద్భవించిందని అక్కడి ప్రజలు చెబుతారు. ఈ నది భారత దేశంలోని పలు ప్రాంతాలలో ప్రవహిస్తుంది. ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాల్లో సైతం ఈ నది పాయలుగా విడిపోయి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించి అస్సాం లోయలో కలుస్తోంది. ఆపై అక్కడ నుంచి బంగ్లాదేశ్ లో ప్రవేశిస్తుంది. బ్రహ్మపుత్ర నది భారత దేశంలో రెండవ అతిపెద్ద నదిగా చెప్పవచ్చు. దీని పొడవు 2,900 మీటర్లు.
బ్రహ్మపుత్రా నది పురాణ గాథ..
బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మకుమారుడిగా చెబుతారు. పురాణ కథల ప్రకారం బ్రహ్మ శాంతనుడి భార్య అమోఘ
అందానికి ముగ్ధుడు అవుతాడు. ఒకసారి బ్రహ్మ శాంతన మహర్షి ఆశ్రమాన్ని సందర్శించాడు. మహర్షి ఇంట్లో లేనందున, ఆయన భార్య అమోఘ అతిథిని బ్రహ్మ గౌరవప్రదంగా స్వీకరించాడు. అమోఘా అందానికి ఆకర్షితుడయ్యాడు బ్రహ్మ. అసంకల్పితంగా బ్రహ్మకు వీర్య స్కలనం జరిగి నేలపై విడుదల చేస్తాడు. తన బలహీనతకు సిగ్గుపడిన బ్రహ్మ వెంటనే ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే ఆశ్రమానికి తిరిగి వచ్చిన శాంతన మహర్షి తన భార్య ద్వారా ఈ విషయం తెలుసుకున్నాడు.
బ్రహ్మదేవుని అమూల్యమైన వీర్యాన్ని స్వీకరించమని, దానిని వృధా చేయవద్దని అమోఘని శాంతనుడు కోరాడు. విధేయత గల భార్యగా ఆమె దానిని అంగీకరించింది. కానీ ఆమె దివ్య గర్భాన్ని భరించలేక యుగంధర పర్వత లోయలో ఉన్న నీటిలో ఆ వీర్యాన్ని నిక్షిప్తం చేసింది. అప్పటి నుండి, ఇది ‘లోహిత’ అని పిలువబడే పవిత్ర స్నాన ప్రదేశంగా మారింది. అదే ‘బ్రహ్మపుత్ర’ గా అవతరించింది. ఈ పవిత్ర జలంలో స్నానం చేయడం ద్వారా పరశురాముడు క్షత్రియులను సంహరించిన తన పాపాన్ని పోగొట్టుకున్నాడని చెబుతారు. బ్రహ్మపుత్ర నదికి ‘లోహిత’ అనే పేరు సంస్కృత పదం.
బౌద్ధుల కథనం ప్రకారం..
బ్రహ్మపుత్రా నది ఒకప్పుడు పెద్ద సరస్సుగా ఉండేదట. ఆ సరస్సులోని నీరు హిమాలయాలలోని ఇతర ప్రాంతాలకు కూడా చేరాలని, ప్రజల నీటి అవసరాలను కూడా తీరుతాయని కరుణామయుడైన బోధిసత్వ భావించాడట. ఈ సరస్సు నుండి నీటిని తీసివేసేందుకు ఒక నిర్మాణాన్ని చేపట్టాడట. అప్పటినుండి దీనిని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారని అక్కడి బౌద్ధులు చెబుతారు.
ఈ నదిలో నీరు రక్తంలా ప్రవహిస్తుంది.. ఎందుకంటే..?
బ్రహ్మపుత్రా నదిలో నీరు ఒక ఒకానొక సమయంలో రక్తంలా ఎర్రటి రంగులో ప్రవహిస్తుంది. దానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం జూన్ నెలలో నది నీరు మూడు రోజులపాటు రక్తంలాగా ఎర్రగా మారుతుంది. బ్రహ్మపుత్రా నది కామాఖ్య ఆలయానికి అనుకుని ఉంటుంది. అయితే ఆ మూడు రోజులు కామాఖ్య దేవికి తన రుతు చక్రంలో భాగంగా రక్తస్రావం జరుగుతుందనేది ఒక నమ్మకం. అయితే కామాఖ్య దేవి రుతుచక్రంలో భాగంగా జరిగేటువంటి ఆ రక్తస్రావం నదిలో కలవడం ద్వారా బ్రహ్మపుత్రా నది ఆ మూడు రోజులపాటు రక్తం రంగులోకి మారుతుందని పురాణాలలో రాసి ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే.. బ్రహ్మపుత్ర నది ప్రాంతం యొక్క నేల సహజంగా ఐరన్ తో సమృద్ధిగా ఉంటుందని ఎరుపు, పసుపు నీళ్ల అవక్షేపాలు అధిక సాంద్రతతో నదికి ఏడాదిలో కొద్ది రోజులు ఎరుపు రంగు కలిగి ఉంటుందని వెల్లడించారు. అందుకే ఈ నదిని ఎర్రన్నది అని కూడా పిలుస్తారని వారి మాట.
బ్రహ్మపుత్ర.. జమున, పద్మావతిగా ఎలా మారుతుందంటే..?
చైనాలో పుట్టిన ఈ బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారత భూమిలోకి ప్రవేశిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఈ నదిని ‘సియాంగ్’ అని పిలుస్తారు. అక్కడినుంచి అస్సాం రాష్ట్రం గుండా ప్రయాణించి.. బంగ్లాదేశ్ లో ప్రవేశిస్తుంది. ఈ సమయంలో రెండు పాయలుగా విడిపోయిన బ్రహ్మపుత్రా నది ఒక పాయ దక్షిణం వైపుగా ప్రవహించి.. ‘జమునా నది’ పేరుతో దిగువ గంగానదిలో కలుస్తుంది. దీనిని ‘పద్మావతి’ నది అని కూడా పిలుస్తారు. అదేవిధంగా మరో పాయ మేఘన నదిలో కలుస్తోంది. ఈ నదులు బంగ్లాదేశ్ లోని చాంద్ పూర్వ వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదుల కన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. ఎంతో పరమ పవిత్రతను కలిగినటువంటి ఈ బ్రహ్మపుత్రా నదిలో స్నానం చేయడంవల్ల శారీరక, మానసిక బాధల నుండి ఉపశమనం లభిస్తుందట. అంతేకాకుండా పాపాలు కూడా సమాప్తం అవుతాయని పెద్దలు చెబుతారు.