
భారత దేశమంతా జనవరి 26ని రిపబ్లిక్ డేగా ఘనంగా జరుపుకుంటారు. అసలు జనవరి 26నే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. 1947 ఆగస్ట్ 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని అప్పటి పెద్దలు భావించారు. రాజ్యాంగాన్ని నిర్మించేందుకు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది. 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారు. అయితే, రాజ్యాంగం అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో జనవరి 26ని ఎంపిక చేసుకున్నారు. ఆ రోజునే ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే..
1929 డిసెంబరులో లాహోర్‌లో పండిట్ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 1930 జనవరి 26 నాటికి భారతదేశానికి డొమినియన్ హోదా (స్వయం-పాలన) ఇవ్వకపోతే, భారతదేశం పూర్తిగా స్వాతంత్య్రం ప్రకటించుకుంటుందని ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వలేదు. దీంతో అదేరోజు నెహ్రూ పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని (దీనిలో భాగంగానే మొదటిసారిగా జాతీయ జెండాని ఎగరవేశారు) జాతికి పిలుపును ఇవ్వడంతో పాటు ఆ రోజే కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభించారు. దీంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఆ ‘జనవరి 26’కి చిరస్థాయి గుర్తింపు కల్పించాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ రోజునే రిపబ్లిక్ నేషన్‌గా చెబుతారు. అప్పటి నుంచి ప్రతియేటా గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. అదన్నమాట అస్సలు విషయం.
* గణతంత్ర వేడుకల్లో కొన్ని ఆసక్తికర విషయాలు
* సాధారణంగా ప్రతి గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్టులను పిలవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా చీఫ్ గెస్టుగా ఇండొనేసియా అధ్యక్షుడు సుకర్నో హాజరయ్యారు. ఈ ఏడాది కూడా ముఖ్య అతిథిగా ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. కాగా, ఈ సంవత్సరం రిపబ్లిక్ డే థీమ్ ‘స్వర్ణిమ భారత్ – విరాసత్ అవుర్ వికాస్’.
* 1950 జనవరి 26న తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఎగరేశారు. 1950లో తొలి రిపబ్లిక్ డే పరేడ్, మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగింది.
* 2022 సంవత్సరానికి ముందు.. రిపబ్లిక్ డే ఉత్సవాల్ని జనవరి 24న ప్రారంభించేవారు. అయితే.. భారత ప్రభుత్వం ఈ తేదీని మార్చి.. జనవరి 23 నుంచే ప్రారంభించేలా ప్లాన్ చేసింది. ఎందుకంటే.. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. జనవరి 29న బీటింగ్ రీట్రీట్ సెరెమనీ జరుగుతుంది. దానితో ఉత్సవాలు ముగుస్తాయి.
* ఈ వేడుకల్లో మిలిటరీ మ్యూజిక్, మార్చింగ్ బ్యాండ్స్ ఉంటాయి. ఇవి భారత త్రివిధ దళాలకు సంబంధించినవి. ఈ దళాలకు అధిపతి అయిన రాష్ట్రపతి.. దళాల నుంచి వందనం స్వీకరిస్తారు. ఇదివరకు యుద్ధాల సమయంలో దీన్ని చేసేవారు. అప్పట్లో డ్రమ్ములు వాయించేవారు. ముగింపుకి ఇది గుర్తు.