
ప్రస్తుతం మీరు ఏ వయసులో ఉన్నా మీ రిటైర్‌మెంట్ కోసం తప్పకుండా ప్లాన్ చేయాల్సిందే. దీనికోసం మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఎన్నో పాలసీలు ఉన్నాయి. వాటిలో ఒకదాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కొత్తగా తీసుకొచ్చిన ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్(LIC Smart Pension Plan). ఈ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన ఈ ప్లాన్ లాంచ్ అయింది.
ప్రజలకు మరుసటి రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక పదవీ విరమణ ప్లాన్‌గా చెప్పవచ్చు. పదవీ విరమణ కోసం ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని సంస్థ చెప్పింది. ఒకవేళ మీరు రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నట్లైతే.. ఈ ప్లాన్ ఉత్తమం అనే చెప్పవచ్చు. మీరు ఈ పథకంలో చేరడానికి ముందు.. ఇది మీకు సరైనదా..? కాదా..? అనే విషయం ముందుగానే చూసుకోవాలి.
ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఏం అందిస్తుంది..!
ఫైనాన్షియల్ సెక్యూరిటీ
మార్కెట్ కాన్ఫిడెన్స్
తక్షణ యాన్యుటీ
ఆదాయం
ఈ పాలసీ తీసుకున్న తర్వాత.. మరుసటి నెల నుంచే పెన్షన్ తీసుకునేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తర్వాత ఇది ఆర్థిక భద్రత, భరోసా కల్పిస్తుందని, నెల నెలా చేతికి పెన్షన్ వస్తూనే ఉంటుందని సంస్థ పేర్కొంది. పదవీ విరమణ సమయంలో ఇలా స్థిరమైన, రెగ్యులర్ ఆదాయం అనేది ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది ఒక నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ ప్లాన్.. అంటే కంపెనీ లాభ నష్టాలతో దీనికి సంబంధం ఉండదు.
ఇందులో రెండు యాన్యుటీ ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి సింగిల్ లైఫ్ యాన్యుటీ. అంటే పాలసీ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంత కాలం మాత్రమే పెన్షన్ లభిస్తుంది. మరొకటి జాయింట్ లైఫ్ యాన్యుటీ ప్లాన్. ఇందులో ఇద్దరు సభ్యులు కలిసి పాలసీని తీసుకుంటారు. ఒకరు ప్రైమరీ సభ్యులు అయితే మరొకరు సెకండరీ సభ్యులు. వీరిద్దరు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ లభిస్తుంది.
ఈ పాలసీని తీసుకోవడానికి 18-100 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు అర్హులు. ఈ పాలసీలో కనీసం పెట్టుబడి రూ.1,00,000. మీరు కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మీకు ప్రతి నెల కనీస పెన్షన్ రూ.1000 లభిస్తుంది. మీరు ప్రతి నెలా లేదా త్రైమాసికానికి లేదా అర్ధ వార్షికంగా లేదా ఏడాదికి ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి డెత్ బెనిఫిట్స్ ఇస్తారు.