
మనస్ఫూర్తిగా వేడుకుంటే ఎక్కడైనా కొలువు తీరుతాడు ఆ మహా శివుడు. ఆయన లీలలు అద్భుతం. కేవలం చెంబుడు నీళ్లతో సంతృప్తి చెంది ఆ పరమేశ్వరుడు భక్తులకు ఎల్లప్పుడూ చేరువలో ఉంటాడు. తనని నమ్మిన భక్తుల కోసం ఏమైనా చేయగల సమర్ధుడు ఆయన. అటువంటి ఘటనే మహారాష్ట్రలోని ఓ దేవాలయంలో జరిగింది. కులం పేరుతో దూషించబడిన ఓ హరిజన భక్తుడి కోసం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దిగొచ్చాడు. మహారాష్ర్టలోని అంబర్ నాథ్ లో జరిగింది. ఇక్కడి అంబర్ నాథ్ దేవాలయంలోని మహాదేవుడు ఓ హరిజన భక్తుడి కోసం తూర్పు వైపున ఉన్న తన ప్రవేశ ద్వారాన్ని పడమర దిక్కుకు మార్చకున్నాడు. ప్రస్తుతం ఆ దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లు తోంది.
మహారాష్ట్ర లోని అంబర్‌నాథ్ లో క్రీ.శ. 1060 సంవత్సరంలో ఈ పురాతన శివాలయం నిర్మించబడింది. ఏ శివాలయాన్ని అంబరేశ్వర్ అని కూడా అంటారు. యునెస్కోచే ప్రకటించబడిన ప్రపంచంలోని 218 సాంస్కృతిక వారసత్వాలలో ఇది ఒకటి. ఆ 218లో భారతదేశంలో 25, మహారాష్ట్రలో 4 ఉన్నాయి.
మహారాష్ట్ర రాజధాని ముంబైకు దగ్గరగా అంబర్ నాథ్ రైల్వేస్టేషన్ కు 2 కిలోమీటర్ల దూరంలో వడావన్ నదీ తీరంలో ఉంది ఈ దేవాలయం. ఈ నదిని వాల్దుని అని కూడా పిలుస్తారు.
స్థల పురాణాన్ని అనుసరించి పంచపాండవులు వనవాసం చేసే సమయంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని తెలుస్తుంది. ఒక్క రాత్రిలోనే భారీ రాతితో నిర్మించారట. అంబర్ నాథ్ లో రాత్రి బస చేసిన సమయంలో శివుడి ఆజ్జ ప్రకారం ఒక రాత్రి లోపు శివాలయాన్ని నిర్మించారట.
సూర్యస్తమయం తర్వాత పనులు మొదలు పెట్టి సూర్యోదయం లోపు శివుడి దేవాలయాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే గర్భగుడి గోపురం నిర్మించడానికి సమయం సరిపోలేదు. దీంతో వాళ్ళు పైకప్పు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ఆలయ ప్రధాన గర్భగుడి పైన ఉన్న పైకప్పు నేటికి నిర్మాణం లేకుండా కనిపిస్తుంది.
అందువల్లే ఈ అంబర్ నాథ్ దేవాలయంలో గర్భగుడి పై కప్పు ఉండదు. సూర్య కిరణాలు నేరుగా గర్భ గుడిలోని శివ లింగం పై పడుతాయి. ఈ లింగంపై పడిన తర్వాత సదరు కిరణాలకు అతీత శక్తులు వస్తాయని ఇక్కడి వారు చెబుతున్నారు.
ఇక గర్భగుడిలోని మూలవిరాట్టు భూ గర్భంలోపల ఉంటారు. ఆలయ గర్భగుడిలో 20 మెట్లు ఉంటాయి. వాటి గుండా కిందికి దిగి మహాశివుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ గర్భగుడిలోపల నుంచి పాండవులు దైవ లోకానికి ఒక రహస్య మార్గం నిర్మించారని కూడా స్థలపురాణం చెబుతుంది. పాండవులు తప్పించుకోవడానికి ఉపయోగించిన కిలోమీటరు పొడవైన మార్గం అది. అయితే దేవాలయంలోని ఆ భూ గర్భ మార్గాన్ని ప్రస్తుతం మూసివేశారు.
ఇక ఈ దేవాలయాన్ని శిలహర రాజు ఆయన కుమారుడైన ముమ్ముని పున:నిర్మించినట్లు ప్రస్తుత దేవాలయం ఉన్న చోట దొరికిన శిలాశాసనాల ద్వారా పురావస్తు శాస్త్రజ్జులు చెబుతున్నారు.
ముమ్ముని కాలంలో ఒక రోజు శివుడి భక్తుడైన హరిజనుడు దేవాలయంలోకి దైవ దర్శనానికి వస్తాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న భటులు ఆయనను మెడపట్టి బయటికి తోసివేస్తారు. కులం పేరుతో దూసిస్తూ ఆలయంలోకి అనుమతి ఇవ్వరు. పైగా ఆలయం వెనుకవైపు నుంచి దేవుడిని దర్శించుకోవాలని ఆదేశిస్తారు.
భటుల ఆజ్జప్రకారం పడమర వైపునకు వెళ్లి శివుడి గురించి ఆ హరిజనుడు స్తుతిస్తాడు. దీంతో తూర్పు వైపున ఉన్న ప్రవేశ ద్వారం పడమర వైపునకు వెలుతుంది. అందుకు నిదర్శనం పడమర వైపున ఉన్న ప్రవేశ ద్వారం పై భాగం కొద్దిగా కిందికి ఉంటుంది. భక్తుడి కోసం సాక్షాత్తు పరమేశ్వరుడే దిశను మార్చుకున్నాడు అని పురాణ గాథలు చెబుతున్నారు.
ఇక అప్పటినుంచి ఆ దేవాలయంలో శివలింగం పడమర వైపునకు తిరిగి ఉంటుంది. నంది మాత్రం తూర్పు వైపునే ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ముమ్ముని ఆశ్చర్యానికి గురయ్యాడు. పరమ శివుడు లీలను గ్రహించాడు. ఆ రోజు నుంచి తన రాజ్యంలోని అన్ని దేవాలయాల్లోకి హరిజనులకు కూడా ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడట.
శివరాత్రి రోజున మూడు రోజుల పాటు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచే కాకుండా దేశంలోని వేర్వేరు చోట్ల నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ప్రతి పౌర్ణమి రోజున కూడా విశేష పూజలు జరుగుతాయి.
ఈ ఆలయానికి చేరుకునే మార్గాలు…
విమాన మార్గం ద్వారా అయితే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సమీప విమానాశ్రయంగా మారింది. దిగిన తర్వాత, ఆలయానికి వెళ్లడానికి టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.
రైలు మార్గం ద్వారా అయితే అంబర్‌నాథ్ రైల్వే స్టేషన్ మీకు సమీపంలోని రైల్వే స్టేషన్. ఇది ఆలయం నుండి నడక దూరంలో ఉంది. ఇది కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్నందున, నడక ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం ద్వారా అయితే అంబర్నాథ్ రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. బస్సులు లేదా టాక్సీల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. సమీపంలోని పూణే నగరం నుండి ప్రయాణిస్తున్నట్లయితే, ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణించండి. టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.
అంబరనాథ్ ఆలయం చుట్టూ చూడదగిన ప్రదేశాలు…
అంబర్‌నాథ్ ఆలయం దర్శనం తర్వాత చుట్టుపక్కల సందర్శనా స్థలాల కోసం కూడా సమయాన్ని వెచ్చించవచ్చు.
మాథెరన్…
పశ్చిమ కనుమల యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందించే నిర్మలమైన హిల్ స్టేషన్ మతేరన్. ఇది దట్టమైన అడవులు, నడక మార్గాలు కలోనియల్-శైలి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. అదనంగా, హిల్ స్టేషన్ యొక్క చల్లని వాతావరణం, స్వచ్ఛమైన గాలి సందర్శనలో ప్రశాంతతను పెంచుతాయి. మీరు ట్రెక్కింగ్ సాహసాలను ఆస్వాదించినట్లయితే ఆ సౌకర్యాలు కూడా ఉన్నాయి.
మలంగ్‌గడ్ కోట….
హాజీ మలంగ్ అని కూడా పిలువబడే మలంగ్‌గడ్ కోట అంబర్‌నాథ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన కోట. కొండ కోట మూడు స్థాయిలను కలిగి ఉంది. పిర్ మాచి, సోన్ మచి, బాలేకిల్లా. ఇవి ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యతను పెంచుతాయి. కోట శిథిలాలను అన్వేషించడమే కాకుండా,
సూఫీ సన్యాసి అయిన హాజీ మలాంగ్ యొక్క దర్గా (పుణ్యక్షేత్రం)ని కూడా సందర్శించవచ్చు.
అంబరనాథ్ ఆలయం నుండి ఈ కోట 15.2 కి.మీ దూరంలో ఉంది.
చందేరి కోట…
మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఉన్న చందేరి కోట అంబర్‌నాథ్ ఆలయం నుండి చూడదగ్గ మరొక ప్రసిద్ధ ప్రదేశం. ఇది ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానం. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణిపై ఉన్న కొండపైన ఉన్న కోట. ప్రకృతి దృశ్యం యొక్క అద్భుతమైన వీక్షణలను, సాహసోపేతమైన భూభాగాలను అన్వేషించే అవకాశాన్ని అందిస్తుంది.
అంబరనాథ్ ఆలయం నుండి 39.8 కి.మీ. దూరంలో ఉంది ఈ కోట.