CINEMATelugu Cinema

తెలుగు వెనుక మాయాజాల ఛాయా మాంత్రికుడు.. రవికాంత్ నగాయిచ్..

దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న అద్భుతమైన సన్నివేశాలను తెరమీద అందంగా ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రహకుడి యొక్క ప్రధాన కర్తవ్యం. దర్శకుడు ఒక్కోసారి చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఆ స్థాయిని ఛాయాగ్రాహకుడు అందుకుంటే మహా అద్భుతాలే జరుగుతాయి. “రవి గాంచని చోట కవి గాంచును” అని తెలుగులో ఒక నానుడి ఉంది. కానీ ఛాయాగ్రాహ మాంత్రికుడు రవికాంత్ దానిని తలక్రిందులు చేశాడు. “కవి గాంచనిది కూడా ఈ రవి గాంచును” అని ఆనాటి చిత్ర ప్రముఖుల చేత ఏకగ్రీవంగా చెప్పించి, ఒప్పించారు.

సాంకేతిక పరిజ్ఞానం శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న ఈ రోజులలో ట్రిక్కు సన్నివేశాలు అంటే ఎవ్వరికీ తెలియదు. నేడు వాటిని స్పెషల్ ఎఫెక్ట్స్ అని పిలుస్తున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వచ్చి సాంకేతిక పరిజ్ఞానం ఎల్లలు చెరిపేశాయి. కానీ ఈ ప్రగతి అంతా కూడా ఆనాడు స్టూడియో నాలుగు గోడల మధ్యనే జరిగేది. కేవలం సాధారణ కెమెరా తోనే డజను సార్లు ఫిలింను విశదము (ఎక్స్ పోజ్) చేస్తూ ఓపిగ్గా మాయాజాలం చేసి చూపించారు ఛాయాగ్రాహకులు రవికాంత్ నగాయిచ్.

డెబ్భై యేండ్ల క్రితం మనిషి ఇంకా చంద్రమండలానికి వెళ్లలేదు. కానీ పసిపిల్లలకు చందమామ అప్పటికి  అర్థం కాని వింత. పసిపిల్లలే కాదు ఆనాటి పెద్దలు కూడా ప్రకృతిలో జరిగే అనేక వింతలను ఊహించుకోవడమే కానీ, వాటిని ఎవ్వరూ ఊహించి ఉండరు. సముద్ర గర్భం, అంతరిక్షం ఇత్యాది విషయాలు వారికి పదబంధ ప్రహేళికే. స్వర్గం, నరకం, ఇంద్ర లోకం, దేవలోకం ఇలా ప్రతిదీ కూడా వారికి ఒక వింతనే. అలాంటి వింత ఏదైనా ఆకృతి దాల్చినా, కనిపించినా కళ్ళు విప్పార్చుకుని చూసేవారు. ఆరేళ్ల వయసున్న రవికాంత్ నగాయిచ్ కూడా అంతే. ఆయనకు చిన్నప్పటి నుండి మహాభారతం, రామాయణం, కాశీ మజిలీ కథలు అంటే విపరీతమైన ఆసక్తి. ఆ కథలోని సన్నివేశాలు అన్నిటికి తన మనసులో ఊహించుకొని చూసుకునేవాడు. అలాంటి ఊహలు తనకు మాత్రమే  పరిమితం అవ్వడం తనకు నచ్చలేదు. వాటిని ప్రపంచానికి కూడా చూపించాలనే ఉబలాటం పెరిగింది. అలాంటి ఉబలాటమే తనను సినిమారంగంలోకి ఆహ్వానించేలా చేసింది.

నందమూరి తారకరామారావు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రవికాంత్ నగాయిచ్ “సీతా రామ కళ్యాణం” (1961) తెలుగు చిత్రంతో సినీరంగంలో ఛాయాగ్రహకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన కెమెరాతో అనేక ట్రిక్కులు చేసిన రవికాంత్ వెండితెరపై ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. “సీతారామ కళ్యాణం” సినిమాలో రావణుడు ఆవేశంతో కైలాసాన్ని పెకిలించే సన్నివేశం అద్భుతంగా చిత్రీకరించారు రవికాంత్ నగాయిచ్. ఒకే ఫిలింను అనేకసార్లు ఎక్స్ ఫోజు చేసి పది తలలు రావడం, ఆ తరువాత కైలాసాన్ని తీసి తలమీద పెట్టడం దాదాపు రెండున్నర రోజులు పట్టింది. అది విజయవంతం అవ్వడంతో తనకు తిరుగులేకుండా పోయింది. నందమూరి తారకరామారావు, విఠలాచార్య, ప్రత్యగాత్మ , ఎం. మల్లికార్జున రావు, బాపు మొదలగు అనేకమంది దర్శకుల వద్ద పనిచేశారు. ఆ అనుభవంతో చిత్ర దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. మహాబలుడు (1969) సినిమాతో దర్శకుడిగా తొలిఅడుగు వేసి “డూండీ” ఇచ్చిన అవకాశంతో హిందీలో ఫర్జ్ (1967) తో అద్భుతమైన విజయాన్ని నమోదుచేసి, ఆ విజయాల పరంపరను చివరవరకు కొనసాగించారు.

జీవిత విశేషాలు…

జన్మనామం  :  రవికాంత్ నగాయిచ్

ఇతర పేర్లు  :  రవి

జననం   :     05 జూలై 1931

స్వస్థలం :    అలీఘర్, అతవాన్లీ జిల్లా, ఉత్తరప్రదేశ్, బ్రిటిష్ ఇండియా 

వృత్తి   :    దర్శకుడు, ఛాయాగ్రాహకులు 

జీవిత భాగస్వామి  :    రాణి

తండ్రి    :   హెచ్. నగాయిచ్ 

మరణ కారణం  :   అనారోగ్యం  

మరణం   :   06 జనవరి 1991, మద్రాసు , తమిళనాడు , భారతదేశం

నేపథ్యం…

రవికాంత్ నగాయచ్ ఉత్తర భారతదేశంలో గల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అతవాన్లి జిల్లా అలీఘర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి హెచ్.నగాయచ్ స్థానిక కె.ఈ.ఎం.వి కళాశాలకు చెందిన ప్రధానాచార్యులు. హెచ్.నగాయచ్ కు అయిదుగురు సంతానం. రవికాంత్ మూడవ వారు. ఆయనకంటే పెద్ద ఇద్దరు అన్నలు, ఆయన తరువాత ఇద్దరు చెల్లెళ్ళు. పెద్దన్న లక్ష్మీనారాయణ బాగా చదువుకుని అమెరికాకు వెళ్లి “ఏరోనాటికల్ ఇంజనీరు” గా స్థిరపడ్డారు. ఆ తరువాత చిన్నన్న శశి నగాయిచ్ పార్లే కంపెనీలో ఉన్నత ఉద్యోగి. రవికాంత్ నగాయచ్ తన చదువు పూర్తి అయిపోయిన తరువాత బొంబాయి బయలుదేరి వెళ్ళాడు.

చిన్నప్పటి నుండి ఫోటోలు తీయడం అంటే ఇష్టపడే రవికాంత్, తన ఛాయా మాయతో చిత్రరంగాన్ని ఏలుతున్న ఛాయా మహేంద్రజాలికులు “బాబూ భాయి మిస్త్రీ” దగ్గర పని కుదుర్చుకున్నారు.  హోమీవాడియా, నిర్భయ నాడియా దంపతుల బ్యానరు ఐన “బసంత్ పిక్చర్స్” కు బాబూ భాయి మిస్త్రీ “జానపదాలు, పౌరాణికలకు ఛాయాగ్రహణం చేసేవారు. “బసంత్ పిక్చర్స్” కు చెంబూరిలో సొంత స్టూడియో ఉండేది. నిర్భయ నాడియా ( ఈమెను ఫియర్‌లెస్ నాడియా అని కూడా పిలుస్తారు) సినిమాలంటే ఆ రోజులలో ప్రేక్షకులకు హల్వా తిన్నంత ఇష్టంగా ఉండేది. ఆవిడ సినిమాలంటే ప్రేక్షకులు వెర్రెత్తిపోయేవారు. ఆ రోజుల్లో బాబు భాయి మిస్త్రీ దగ్గర చాలా మంది సహాయకులు ఉండేవారు. కానీ అతి కొద్ది రోజుల్లోనే వారందరిని రవికాంత్ అధిగమించేసి “బాబు భాయి మిస్త్రీ” కి సన్నిహిత సహాయకులు అయిపోయారు.

సినీ రంగం…

రవికాంత్ నగాయిచ్ గురువు బాబు భాయి మిస్త్రీ ఛాయాగ్రహకుడిగానే అందరికీ పరిచయం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన కళాదర్శకులు కూడా. అందువలన తాను ఊహించుకున్న మాయా ప్రపంచాన్ని తన కళతో అందంగా మలిచి, అందులో కెమెరాకు సంబంధించిన ట్రిక్కులు చేస్తూ, తాను అనుకున్న దృశ్యాలను రాబట్టుకునేవారు. ఆ ట్రిక్కులు పొందాలంటే ముందుగా దృశ్యంలో వింతలోకం చాలా స్పష్టంగా కనిపించాలన్న సంగతి బాబు భాయి మిస్త్రీ దగ్గర రవికాంత్ నేర్చుకున్నారు. అలా ఎన్నో సంగతులు, సినిమాకు సంబంధించిన అనేక విషయాలు ఆయన దగ్గర తెలుసుకున్నారు. 

బాబు భాయి మిస్త్రీ వద్ద ఏడు సంవత్సరాలు పనిచేసిన రవికాంత్ సినిమాలలో అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రతిభావంతులను అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి క్రమంలో తొలి అవకాశం తెలుగు సినిమా నుండి వచ్చింది. అది కూడా నందమూరి తారక రామారావు ద్వారా. ఎన్టీఆర్ తాను తొలిసారి దర్శకత్వం చేపడుతూ “సీతా రామ కళ్యాణం” (1961) చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఆయన తన తొలి చిత్రం “మన దేశం” (1949) ఛాయాగ్రాహకులు యం.ఏ. రెహమాన్‌ను సంప్రదించగా, ఆయన అందుబాటులో లేరు దాంతో నందమూరి తారక రామారావు సోదరులు మద్రాసు నుండి  బొంబాయి వచ్చి ఒక మంచి ఛాయాగ్రాహకుడి కోసం వెతకసాగారు. వారికి రవికాంత్ గురించి తెలిసింది. దాంతో నందమూరి సోదరులు రవికాంత్ నగాయిచ్ ను తమ వెంట 1960 వ సంవత్సరంలో మద్రాసుకు తీసుకువచ్చారు.

అవకాశం ఇచ్చిన నందమూరి సోదరులు..

రవికాంత్ నగాయిచ్ కు తెలుగు సినిమారంగంలో తొలి చిత్రం “సీతారామ కళ్యాణం” (1961) అని చెప్పవచ్చు. ఆ చిత్రంలో కైలాసంకు సంబంధించిన సన్నివేశం ఛాయాగ్రహకుడిగా ఆయనకు ఎనలేని పేరు తెచ్చింది. ముక్కు మొహం తెలియని మహానగరం ఐన బొంబాయిలో పని కుదిరినా కూడా చుక్కాని లేని నావ లాగా సతమతమవుతున్న రవికాంత్ ను ఎన్టీఆర్ ఆదుకొని దారి చూపించారు. “నా ప్రగతికి కారకులైన దేవుళ్ళు నందమూరి సోదరులు, నా ఎదుగుదలకు కారకులు నందమూరి తారక రామారావు” అని పలు సందర్భాల్లో రవికాంత్ చెప్పారు. “సీతారామ కళ్యాణం” చిత్రం తరువాత ఆయన ప్రతిభకు గుర్తింపుగా అనేక సినిమాలు రావడం మొదలయ్యాయి.

నందమూరి తారకరామారావు, విఠలాచార్య, ఎం. మల్లికార్జునరావు, కె.ప్రత్యగాత్మ, బాపు మొదలగు దర్శకులకు రవికాంత్ ఛాయాగ్రహకులుగా పనిచేశారు. తెలుగులో ఆయన పనిచేసిన చిత్రాలలో సగానికి పైగా నందమూరి తారకరామారావు, ఆ తరువాత ఎక్కువ సినిమాలు విఠలాచార్యకు పనిచేశారు. ఎందరో నిర్మాతలు రవికాంత్ చేత కెమెరా ట్రిక్కులు చేయించుకున్నారు. కేవలం ఆయన  మాత్రమే చేయించుకున్న   కర్ణ, లవకుశ,  శ్రీకృష్ణార్జునయుద్ధం వంటి సినిమాలకు తాను ఛాయాగ్రహకుడు కాకున్నా కూడా కెమెరా ట్రిక్కులు మాత్రం రవికాంత్ నగాయిచ్ చేసినవే.

డూండీ వద్ద “వీరాభిమన్యు” (1965)…

చిత్రసీమలో అవకాశాలు పెరిగిన తరువాత రవికాంత్ నగాయిచ్ తన మకాం మద్రాసుకు మార్చారు. గులేబకావళి కథ, బందిపోటు (తెలుగు & కన్నడం), నవగ్రహ పూజ మహిమ, గురువును మించిన శిష్యుడు, వీరాభిమన్యు (తెలుగు & తమిళం) వంటి పలు చిత్రాలలో రవికాంత్ చేసిన మాయాజాలం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. గంటల తరబడి పనిచేస్తూ దృశ్యాన్ని అద్భుతంగా పండించేందుకు ఆయన పడే తపన అంతా ఇంతా కాదు. విఠల్ ప్రొడక్షన్స్ నిర్మించిన నవగ్రహ పూజా మహిమ (1964) సినిమాలో ఒక సన్నివేశం చిత్రీకరిస్తుండగా మధ్యలో పులి కెమెరా మీదకి ఒక్కసారిగా దూకింది. రవికాంత్ హడలిపోయారు. చాలా కొద్దిలో ఆయన బయటపడ్డారు. కెమెరాలో అనేక భాగాలు దెబ్బతిన్నాయి. 

నందమూరి తారకరామారావు తరువాత రవికాంత్ ను ఛాయాగ్రహకులుగా ప్రోత్సహించిన వారు డూండీ. ఆయన రాజ్యలక్ష్మి ఫిలిమ్స్ అధినేత. డూండీ నిర్మాణంలో రవికాంత్ ఛాయాగ్రహకుడిగా వచ్చిన చిత్రం “వీరాభిమన్యు” (1965). రవికాంత్ విశ్వరూపానికి నిదర్శనం ఈ సినిమా. కాలంతో నిమిత్తం లేకుండా రవిలోని ప్రతిభకు అర్థం పట్టే చిత్రం వీరాభిమన్యు. ఈ సినిమాలో ఆయన చేసిన ఇంద్రజాలాలు అన్ని ఇన్నీ కాదు. ఆ సినిమాలో ఆయన ఒక కొత్త ఆకృతిలో, వైవిధ్య పద్ధతిలో ట్రిక్కులు చేశారు. రాజ్యలక్ష్మి ఫిలిమ్స్ లో కెమెరాకు సంబంధించినంత వరకు ప్రత్యేకించి ఒక విభాగం ఉండేది. దానికి రవికాంత్ ముఖ్యలుగా ఉండేవారు.

ఎందరో శిష్యగణం…

ప్రముఖ ఛాయాగ్రహకుడిగా పేరుపొందిన రవికాంత్ నగాయిచ్ శిష్యగణం చాలానే ఉన్నారు. తరువాత కాలంలో ఛాయాగ్రహణంలో గొప్పగా పేరు తెచ్చుకున్న ఎస్.వెంకటరత్నం, వి.యస్.ఆర్.స్వామి, వాల్మీకి కృష్ణారావు మొదలగు వారంతా కూడా ఆయనకు శిష్యగణం. ఆ తరువాత కూడా రవికాంత్ మెరికల్లాంటి సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు అందించారు. ఆయన కెమెరా విఠలాచార్య సినిమాలకు  పెద్ద ఆకర్షణ. విఠలాచార్య నిర్మాణ సంస్థ అయిన విఠల్ ప్రొడక్షన్స్ కు కేవలం తాంత్రిక ఛాయాగ్రహణం మీద ఆధారపడి సాగే కథలు కలిగిన “జ్వాలాదీప రహస్యం”, “అగ్గిపిడుగు” సినిమాలకు ఛాయాగ్రహణం అందించారు. అలెగ్జాండర్ డ్యూమస్ వ్రాసిన “ది కోర్సికాన్ బ్రదర్స్” స్వేచ్ఛానువాదం “అగ్గిపిడుగు” సినిమా. “జ్వాలాదీప రహస్యం” సినిమాకు ప్రేరణ “సన్స్ ఆఫ్ థండర్స్”. కెమెరా ట్రిక్స్ మాత్రమే కాకుండా సినిమా యొక్క కథను అనుసరిస్తూ, కథను గొప్పగా చూపుతూ రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణం సాగేది. అందుకు నిదర్శనం నేషనల్ ఆర్ట్ థియేటర్ నిర్మాణంలో తెరకెక్కిన “వరకట్నం” సినిమా. అందులో ఒక్క కెమెరా ట్రిక్కు సన్నివేశం కూడా లేదు.

నియాన్ లైట్లు ఉపయోగించి…

“సీతారామ కళ్యాణం” సినిమాలో రావణుడిని పది తలలుగా చూపించేందుకు రవికాంత్ నగాయిచ్ మస్క్ పద్ధతిని అనుసరించారు. దీనికి అవసరమైన కొలతలు, లెక్కలు  పాత్రధారి సహకారం ఎంతైనా కావాలి. మిగతా భాగవతం మాస్క్ చేసి రావణుడి తలను పది సార్లు విడివిడిగా తీశారు. అంటే ఫిలింను పదిసార్లు ఎక్స్ ఫోజు చేశారు. కానీ ఎక్కడ కూడా ఆ తేడా కనిపించదు. ఈ సన్నివేశ చిత్రీకరణకు సరిగ్గా 56 గంటలు పట్టింది. రామారావు గానీ, రవికాంత్ నగాయిచ్ గానీ క్షణం విశ్రమించకుండా నిరంతరంగా పనిచేశారు. ఆ దృశ్యాన్ని అద్భుతంగా పండించారు. “గులేబకావళి కథ” సినిమాలో నాయకుడు అస్తిపంజరాలతో యుద్ధం చేసే సన్నివేశంలో నియాన్ లైట్లు ఉపయోగించి, ఆస్థిపంజరాలను తయారుచేయించారు (పెద్ద పెద్ద నగరాల్లో అప్పట్లో ప్రచార ప్రకటలనల కోసం హోర్డింగ్ లకు నియాన్ లైట్లను ఉపయోగించేవారు). రవికాంత్ నగాయిచ్ వాటిని బ్యాటరీ సాయంతో నడిపించాడు.

45 సార్లు ఫిలిం ఎక్స్ పోజ్ చేసి…

“స్ప్లిట్ స్క్రీన్” (భాగాలుగా విడగొట్టి, చిత్రీకరించడం) పద్ధతిని ఉపయోగించడంలో రవికాంత్ నగాయిచ్ మాంచి దిట్ట అని చెప్పాలి. వీరాభిమన్యు సినిమాలో ఘటోత్కచుని దహనం సన్నివేశం,  సంపూర్ణ రామాయణం సినిమాలను కుంభకర్ణుని నిద్రలేపే సన్నివేశం ఈ కోవకు చెందినవే కావడం విశేషం. కుంభకర్ణుని, ఘటోత్కచుని  ముందు టెలిఫోటోతో మహా కాయులుగా చూపించి, ఆ తరువాత అదే ఫిలిమ్ మీద విస్తృతమైన వీక్షణ కోణంలో వారి ప్రతిమను చిన్నవాళ్ళను చేసి తీశారు. ఈ రెండు సన్నివేశాలలో కుంభకర్ణుని, ఘటోత్కచుడిని  ఎత్తైన ప్లాట్ఫారం మీద పడుకోబెట్టి వాళ్ళ మహకాయాన్ని ముందుగా తీశారు. ఆ తర్వాత మిగతా వారి చిన్నచిన్న రూపంలో తీసుకెళ్లారు. కుంభకర్ణుడు ఎపిసోడ్ స్టూడియోలో చిత్రీకరించారు. కానీ ఘటోత్కచుని ఎపిసోడ్ మాత్రం అవుట్ డోర్ లో తీశారు.

ఆ రోజుల్లో తమ సినిమాలలో రంగుల సన్నివేశాలు పెట్టడం రాజ్యలక్ష్మి పిక్చర్స్ వారికి సరదా. వీరాభిమాన్యు సినిమాలో చివరన ఐదు నిమిషాలు ఇలాగే వర్ణ దృశ్యాలు వస్తాయి. అభిమన్యుడి చావుకు కృష్ణుడే కారణమని అర్జునుడు నిందిస్తాడు. అప్పుడు కృష్ణుడు అతనికి సృష్టి ధర్మాన్ని బోధిస్తాడు. ఈ విశ్వరూప దర్శన సన్నివేశాలు తెరమీద ఏకకాలంలో విడివిడిగా అనేక సన్నివేశాలు కనిపించేసరికి ఆనాటి ప్రేక్షకులను నోరెళ్లబెట్టారు. రవికాంత్ నగాయిచ్ ఈ సన్నివేశాల చిత్రీకరణకు ఫిలింలో ఏకంగా 45 సార్లు ఎక్స్ ఫోజు చేశారు. నాటికి, నేటికి కూడా ఇది ఆల్ టైం రికార్డు. “శ్రీకృష్ణ పాండవీయం” సినిమాలో విశ్వరూప దర్శనం కూడా ఇదే ఫార్మేట్ లో ఆయన చిత్రీకరించారు.

మినియేచర్ మాట్స్ విధానం…

అగ్గిపిడుగు సినిమాలో రామారావులు ఇద్దరూ పరస్పరం కత్తితో తలపడే సన్నివేశం ఒకటుంది. ఈ సన్నివేశాన్ని రమేష్ “స్ప్లిట్ స్క్రీన్” పద్ధతిలో తీశారు. ఫిలింను కొన్ని ముక్కలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని మాత్రమే ఎక్స్ ఫోజ్ చేస్తూ మిగిలిన దాన్ని మస్క్ చేసేవారు రవికాంత్ నగాయిచ్. ఒక్క నూలు వాసి తేడా వచ్చినా తెరమీద గజం వాసి తేడాగా కనిపిస్తుంది. వీరాభిమాన్యు సినిమాలో రంభ ఊర్వశి తలదన్నే పాటలో ఆయన సూపర్ ఇంపోజ్ పద్ధతిని అనుసరించారు.

అలాగే రవికాంత్ తీసిన కెమెరా ట్రిక్స్ లలో గొప్పది వీరాభిమన్యు సినిమాలో కురుసభలో శ్రీకృష్ణుని విశ్వరూపం సందర్శనం. దూతగా వెళ్లిన శ్రీకృష్ణుడిని మట్టు పెట్టాలని చూస్తారు దుర్యోదనాదులు. కృష్ణుని కందకంలోకి తొక్కేస్తారు. కానీ వాళ్ళందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూ దర్బారు నేలమాళిగను చీల్చుకుంటూ కృష్ణుడు విశ్వరూపం సందర్శనమిస్తాడు. ఈ సన్నివేశాన్ని రవికాంత్ నగాయిచ్ హై స్పీడ్ కెమెరాతో తీశాడు.

మామూలుగా సెకనుకు తిరిగే 24 ఫ్రేముల బదులు, 45 ఫ్రేములు నడిపించారు. తెరమీద మూడు నిమిషాల పాటు కనిపించే ఆ సన్నివేశం అద్భుతం. “నభూతో నభవిష్యత్తు”. దర్బార్ కప్పును తాకుతూ శ్రీకృష్ణుని విశ్వరూప సన్నివేశం మనకు కనిపిస్తుంది. ఇక్కడ రవికాంత్ నగాయిచ్ మినియేచర్ మ్యాట్స్ విధానాలను కూడా తన ట్రిక్ ఫోటోగ్రఫీకి అనువుగా వాడుకున్నారు. తద్వారా ప్రేక్షకుడిని ఒక తన్మయావస్థలోకి తీసుకొని పోయారు.

ఘటోత్కచుని పెద్దగా చూపించి…

మినియేచర్స్ ను ఉపయోగించడంలో ఆరితేరిన రవికాంత్ నగాయిచ్ తాంత్రిక సన్నివేశాలను తెరమీద పండడానికి మినియేచర్స్ ని బాగా ఉపయోగించుకున్నారు. కళాదర్శకుడు పరస్పరం అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడుకుని సన్నివేశం పండించాలి. వీరాభిమన్యు చిత్రంలో ఘటోత్కచుడు విరాట నగరాన్ని ధ్వంసం చేసే సన్నివేశాన్ని ఈ మినియేచర్స్ సహాయంతోనే తీశారు. నగరాన్ని చిన్నదిగా చేసి చూపించి, ఘటోత్కచుడిని పెద్దదిగా చూపించారు. ఉత్తర స్నాన సన్నివేశం కూడా ఇలా తీసినదే కావడం విశేషం. అందులో కొంత భాగం మామూలు సెట్, మిగతాది మినియేచర్స్. చెప్పుకునేందుకు ఇదంతా చాలా తేలిగ్గా అనిపించినా ఎంతో జాగ్రత్తగా లెక్కలు వేసుకొని, అనేక ఏర్పాట్లు చేసుకుని తీయాలి.

దర్శకుడిగా ప్రస్థానం కొనసాగించి…

ఛాయాగ్రహకుడిగా రవికాంత్ నగాయిచ్ ను తొలినుండి గమనిస్తూ వచ్చిన డూండీ దర్శకుడిగా కూడా ఆయన రాణించగలడు అనే విషయాన్ని ముందే గ్రహించి, తనచేత “మహాబలుడు” సినిమాతో మెగాఫోన్ పట్టించి దర్శకుడి అవతారం ఎత్తించారు. కృష్ణ, వాణిశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన జానపద కథాచిత్రం “మహాబలుడు” (1969) కి ఛాయాగ్రాహక బాధ్యతలతో పాటు, దర్శకత్వ బాధ్యతలు కూడా రవికాంత్ నగాయిచ్ నిర్వహించారు. జానపదంగా తీసిన ఈ చిత్రం బాగానే ఆడింది. ఆ తరువాత “గూడచారి 116” చిత్రాన్ని డూండీ హిందీలో నిర్మిస్తూ ఆ చిత్రం దర్శకత్వ బాధ్యతలు రవికాంత్ నగాయిచ్ కు అప్పగించారు. జితేంద్ర మరియు బబిత జంటగా “ఫర్జ్” (1967) పేరుతో తెరకెక్కించిన ఆ సినిమా భారతదేశమంతటా విజయ విహారం చేసి, వజ్రోత్సవం జరుపుకుంది.

ఇదే వరుసలో గోవుల గోపన్న (1968) చిత్రాన్ని హిందీలో విజయలక్ష్మీ పిక్చర్స్ బేనర్‌పై ప్రముఖ నిర్మాతలు సుందర్‌లాల్ నహతా, డూండీలు “జిగ్రీ దోస్త్” (1969) పేరుతో నిర్మించారు. జితేంద్ర కథానాయకుడిగా నటించిన ఆ సినిమాను రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో తెరకెక్కినదే. అదృష్టవంతులు (1969) తెలుగు చిత్రాన్ని హిందీలో హిమ్మత్ (1970), సర్కార్ ఎక్స్‌ప్రెస్ (1968) సినిమాను ది ట్రైన్ (1970) సినిమాగా రవికాంత్ నగాయిచ్ తన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఛాయాగ్రహకుడిగానే కాదు దర్శకుడిగా ఆయన విజయ పరంపర మొదలైంది. అనువాదాలు కాకుండా నేరుగా చిత్రాలను దర్శకత్వం చేయడం ప్రారంభించారు.

మరణం…

ఛాయాగ్రహకుడిగా రవికాంత్ మద్రాసులో కేవలం కెమెరా ట్రిక్స్ తీయడం కోసం సొంతంగా ఒక ఫ్లోర్  నిర్మించుకున్నారు. వాటికి కావలసిన పరికరాలన్నీ అమర్చుకున్నారు. రవికాంత్ పనితనం అంత కేవలం తన ఇంగితజ్ఞానం మాత్రమే. ఆయన నిరంతరం పరిశోధన చేస్తూ ఉండేవారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పరికరాలు తెప్పించినా కూడా వాటి సహాయంతో తన బుద్ధిబలాన్ని ఉపయోగించేవారు. తెరపై జలపాతం అందంగా కనిపించాలంటే నీళ్ల బదులు రాళ్ళు, ఉప్పు పోసి చిత్రీకరణ జరిపితే అది ప్రేక్షకులకు నీళ్ల కంటే అందంగా కనిపిస్తుందని రవికాంత్ నగాయిచ్ కు బాగా తెలుసు. కొన్నాళ్ళ తరువాత రవికాంత్ నగాయిచ్ సొంతంగా సినిమాలు నిర్మించడం ఆరంభించారు. 

మృగయా (1976) సినిమాతో అవార్డు చిత్రాల నటుడిగా ముద్ర పడిపోయిన మిథున్ చక్రవర్తికి యాక్షన్ హీరోగా ఇమేజ్ తెచ్చింది రవికాంత్ నగాయిచ్ తెరకెక్కించిన సురక్ష (1979). విజయాల పరంపర కొనసాగుతున్న క్రమంలో కాలంతో పాటు వచ్చిన మార్పును రవికాంత్ నగాయిచ్ గమనించలేదు. నమ్ముకున్న తర్కంతోనే ఆయన సినిమా తీశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సినిమాలు విజయవంతం అవ్వలేదు. మెల్లిమెల్లిగా ఎదురు దెబ్బలు తగలడం మొదలయ్యాయి. సినిమాల ఆర్థిక లావాదేవీలు ఆయన ఆరోగ్యం మీద ప్రభావం చూపినారంభించాయి. దాంతో చిన్న వయస్సులోనే 06 జనవరి 1991 నాడు అనారోగ్యంతో కన్నుమూశారు.

Show More
Back to top button