పారిస్ వేదికగా గత 19 రోజులుగా జరిగిన ఒలింపిక్స్ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఫ్రెంచ్ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా ఈ ముగింపు వేడుకలను నిర్వాహకులు జరిపారు. ఈ వేడుకల్లో భారత్ తరపున షూటర్ మను భాకర్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్ పతకధారులుగా వ్యవహరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రేక్షకులకు అభివాదం తెలుపుతూ క్రీడాకారులు వీడ్కోలు పలికారు.
ఇక ఈ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 329 స్వర్ణ పతకాలకు 206 దేశాలకు చెందిన 10,714 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా 40 స్వర్ణాలతో టాప్‌లో నిలిచింది. చివరి రోజు చైనాను వెనక్కి నెట్టిన యూఎస్.. పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇందులో 40 స్వర్ణ పతకాలు సహా మొత్తంగా 126 పతకాలను యూఎస్ సాధించింది.
ఇక చైనా 40 స్వర్ణాలు పాటు మొత్తం 91 పతకాలను తన ఖాతాలో వేసుకొని పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగా, గత టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి 71వ స్థానంకు పడిపోయింది. మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనగా.. ఆరు పతకాలు వచ్చాయి. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.