జంతువులలో ఎక్కువగా పిల్లిని ఆపశకుణంగా భావిస్తారు. ఆశుభాలను కలుగజేసే జంతువుగా పరిగణిస్తారు. ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళుతుంటే పిల్లి ఎదురొస్తే చాలు అబ్బా.. ఇక ఆ పని జరగదు శుభం ఎదురైంది అని పెద్దలు అంటూ ఉంటారు. పిల్లిని అశుభంగా భావిస్తారు కానీ పిల్లిని కూడా ఓ దేవతగా కొలుస్తారు. అంతేకాదండోయ్ పిల్లికి ఏకంగా గుడి కూడా కట్టేశారు. ప్రతిరోజు పూజలు కూడా చేస్తారు. పిల్లికి పూజలు చేయడం ఏంటి? ఏమిటా కథ అనుకుంటున్నారా దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో గల బెక్కలేలే అనే గ్రామంలో పిల్లిని దైవంగా కొలుస్తారు. అక్కడ పిల్లి కోసం ఏకంగా ఆలయాన్ని నిర్మించి ప్రతిరోజు పూజలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి జాతరను కూడా నిర్వహిస్తారు. అశుభంగా భావించే పిల్లికి పూజలు చేయడమేంటి అని విచిత్రంగా అనిపిస్తుంది కదూ.. కానీ ఇది నిజం. ఈ ఆచారం వెయ్యేళ్ళ నుంచి కొనసాగిస్తున్నారట ఆ గ్రామస్తులు. అయితే దుష్టశక్తుల నుంచి తమ గ్రామాన్ని కాపాడేందుకు మంగమ్మ తల్లి అనే దేవత పిల్లి రూపంలో ప్రవేశించిందని అక్కడి గ్రామస్తులు నమ్ముతారు.
అయితే హిందూ ఆచారాల ప్రకారం.. పిల్లులు అశుభశకునంగా భావిస్తారు. వీటిలో ముఖ్యంగా నల్ల పిల్లి కనిపిస్తే వామ్మో అంటూ వణికిపోతుంటారు. ఏదో కీడు జరగబోతుందని శంకిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి సాంప్రదాయాలు వివిధ కట్టుబాట్లు ఉంటాయి. అయితే కొన్ని చోట్ల జంతువులను దేవుళ్ళుగా పూజిస్తే మరికొన్ని చోట్ల వాటిని భక్షిస్తారు. అదేవిధంగా అన్ని ప్రాంతాలను బట్టి కట్టుబాట్లు ఉంటాయి. ముఖ్యంగా పిల్లులు అంటే ఎంతోమంది చీదరించుకుంటారు. భయపడుతుంటారు. ఎక్కువగా వాటిని ఇష్టపడరు. కానీ కర్ణాటకలో ఈ విధమైన ఆచారం కొనసాగుతుంది అంటే చాలామందికి ఇది ఒక విచిత్రమైన ఘటనగా భావిస్తున్నారు.
అక్కడ పిల్లిని పూజించడమే కాకుండా ప్రతి ఇంటి పైన పిల్లి బొమ్మలను పెట్టుకొని ఇల్లులు కూడా నిర్మిస్తుంటారు. పిల్లలకు పవిత్రంగా పూజ చేస్తారు. తమ ఇంటి ఆవరణలో పిల్లి వచ్చిందంటే సాక్షాత్తు మంగమ్మ తల్లి తమ ఇంటిలోకి ప్రవేశించింది అని భావించి, ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పిల్లికి పాలు, పెరుగు నైవేద్యంగా సమర్పిస్తారు. తమ ఇంట్లోకి వచ్చిన పిల్లిని కొట్టకుండా తిట్టకుండా వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తారు. మంగమ్మ తల్లి అదృష్టాన్ని తీసుకువచ్చిందంటూ.. ఆ గ్రామస్తులు పిల్లిని కొలుస్తారు. ప్రతి ఇంటి ముందు పాలు, పెరుగు, వెన్న గిన్నెలను పెట్టి పిల్లులను తమ ఇంటికి రావాలని ఆహ్వానిస్తారు.
వాటి ఆకలిని తీరుస్తుంటారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది అనంటే అక్కడ వారు చెప్పే మాట ఒక్కటే.. మంగమ్మ తల్లి అనే దేవత సాక్షాత్తు పిల్లి రూపంలో ఇలా తిరుగుతూ ఉంటుందని, అందుకే తాము పిల్లిని దేవతగా కొలుస్తామని అంటున్నారు. పిల్లలను పూజించే ఆచారం తమ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుందని గ్రామస్తుల మాట. అంతే కాకుండా తమ గ్రామంలో గ్రామ దేవతగా పూజిస్తామని వెల్లడించారు. పిల్లిని బాధ పెడితే తమ గ్రామ దేవతను ఇబ్బంది పెట్టినట్లే అని, అందువల్ల పిల్లిని దేవతగా కొలుస్తూ అది ఇంటికి వచ్చిన ఆహారాన్ని అందిస్తామని అక్కడి గ్రామస్తులు చెబుతున్న మాట.
మన తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగను ఎలా అయితే నిర్వహిస్తామో అక్కడ వారికి పిల్లి కోసం జరిపే జాతర అంత పవిత్రమైన పండుగ. వారు నమ్మినటువంటి మంగమ్మ తల్లి పిల్లి రూపంలో ఉండి అక్కడ కొరివి దెయ్యాల నుండి తమను కాపాడుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం. అక్కడ ఎవరైనా పిల్లిని గద్దించినా, కొట్టినా వారిని కఠినంగా శిక్షిస్తారు. పిల్లి చనిపోయినట్లయితే దహన సంస్కారాలను సైతం ఘనంగా నిర్వహిస్తారు. పిల్లి చావును కూడా గౌరవంగా గుర్తించి అంత్యక్రియలను నిర్వహిస్తారు.
తెలంగాణలోనూ పిల్లికి ఓ గుడి
అవును తెలంగాణలో కూడా పిల్లికి ఓ గుడి ఉంది. ఇక్కడ పిల్లి దేవత.. వాహనం కూడా పిల్లినే. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని బెక్కం అనే గ్రామంలో పిల్లిని దేవతగా కొలుస్తారు. ఈ గ్రామం శ్రీశైలం ముంపు గ్రామంగా చెప్తారు. నేల బిల్కు, పెద్ద బిల్కులనే రెండు చిన్న గ్రామాలు కలిపి బెక్కంగా ఏర్పడిందట. అయితే ఈ గ్రామంలో ఉండే శివాలయంలోని శివుడు బెక్కేశ్వరుడు గా కొలువుదీరాడు. ఈ ఆలయ ప్రహరీ వద్ద ఉన్నటువంటి ఓ గూటిలో ఓ పెద్ద శిల్పం దర్శనమిస్తుంది. కుడి చేతిలో తామర పుష్పం, ఉత్కుటాసన భంగిమలో అమ్మవారి రూపం దర్శనమిస్తుంది. ఆమెను పార్వతీదేవిగా కొలుస్తారు. అయితే ఆ శిల్పం దిగువన పిల్లి ముఖం మానవ శరీరాకృతితో పిల్లి వాహన దారియై అర్ధ పద్మాసనంలో ఉన్న మరో అమ్మవారి రూపం కనిపిస్తుంది. పిల్లి వాహనంతో ఉండడం పెళ్లి ముఖం కలిగి దేవత రూపం ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే పిల్లి దేవతకు మార్జాలమే వాహనంగా మారిందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.
స్థల పురాణం..
పూర్వం బెక్కం అనే గ్రామంలోని ఓ పుట్ట మీద ఆవు పాలు కురిపిస్తూ ఉండేదట. అయితే.. ఆ సమయంలో ఓ పిల్లి పాలను తాగుతూ ఉండేదని, అది గుర్తించిన స్థానికులు ఆ పుట్టను తవ్వగా అందులో ఓ శివలింగం బయటపడిందని చెబుతారు. అయితే కన్నడలో పిల్లిని బెక్కగా పిలుస్తారట. ఆ పిల్లి పేరు మీదగస్ శివుడికి ‘బెక్కేశ్వరుడు’ అని ఆ గ్రామానికి బెక్కం అనే పేరు పెట్టారన్నది ఆ గ్రామస్తులు చెబుతున్నారు. కేతరస, రాజరసలానే వారు ఈ
తైలోక్యమల్ల ఒకటవ సోమేశ్వరుడి పాలన కాలంలో అంటే.. 1065 సంవత్సరంలో ఆలయానికి భూమి దానంగా చేశారట. ఆ శాసనం కూడా బయటపడినట్టు తెలుస్తోంది. ఈ ఆలయం రాష్ట్రకూట శైలిలో నిర్మించబడి త్రికూటాలయంలో లలాట భింబంగా గజలక్ష్మి ఉంటుంది. గర్భాలయంలో చత్రాపరితల సమలింగం, నంది శిల్పాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ బెక్కేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఆ స్వామి వారితో పాటు పిల్లి రూపంలో ఉన్నటువంటి దేవతను సైతం గ్రామస్తులు కొలుస్తున్నారు. ఏదేమైనాప్పటికీ పిల్లిని అపశకునంగా భావించే వారికి పిల్లి కూడా దేవతా అన్న విషయం ఈ ఆలయాల ద్వారా తెలిసింది. కర్ణాటకలో ఏకంగా పిల్లి కోసం జాతరనే నిర్వహిస్తుండడం విచిత్రమైన విషయమైతే.. తెలంగాణలో సైతం మార్జాలమే దేవతగా ఉండి ఆ దేవతకు మార్జాలమే వాహనం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.