భారత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 డిసెంబర్ రోజున “జాతీయ శక్తి పొదుపు దినం (నేషనల్ ఎనర్జీ కన్‌జర్వేషన్ డే)” నిర్వహించుట ఆనవాయితీగా మారింది. దేశాభివృద్ధిలో శక్తి వనరుల పాత్ర అనిర్వచనీయం. దేశ ప్రగతిని కొలిచే ప్రమాణంగా తలసరి శక్తి వినియోగాన్ని తీసుకుంటారు. వివిధ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న శక్తిని ఆదా చేస్తూ, అవసరం మేరకు మాత్రమే విడుదల చేస్తూ, దేశాభివృద్ధికి బాటలు వేయడానికి 2002లో భారత ప్రభుత్వం “బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసియెన్సీ” అనే సంస్థను నెలకొల్పడం జరిగింది. ఉత్పత్తి అవుతున్న శక్తిలో ప్రసార నష్టాలు, పంపిణీ నష్టాలను తగ్గిస్తూ ప్రతి ఒక్కరు బాధ్యతగా శక్తి వినియోగాన్ని విచక్షణతో చేయాల్సిన సమయం ఆసన్నమైనది.
శక్తి వినియోగంలో భారతం:
ప్రపంచ దేశాల్లో చైనా, అమెరికా తర్వాత మూడవ అతి పెద్ద శక్తి వినియోగ దేశంగా భారత్‌కు పేరు ఉంది. 2023-24 వివరాల ప్రకారం భారత్‌లో తలసరి విద్యుత్తు ఉత్పత్తి 1,395 కెడబ్ల్యూహెచ్‌గా నమోదు అయ్యింది. ఇందులో 43 శాతం వరకు హైడ్రో పవర్ ఉత్పత్తి అవుతున్నది. అత్యధిక తలసరి విద్యుత్తు వినియోగ దేశాల జాబితాలో 53,929 కెడబ్ల్యూహెచ్‌తో ఐస్‌ల్యాండ్ ప్రథమ స్థానంలో ఉండగా నార్వే (28,056 కెడబ్ల్యూహెచ్), కువైట్ (21,076 కెడబ్ల్యూహెచ్), ఖతార్ (20,023 కెడబ్ల్యూహెచ్), యూఏఈ (17,342 కెడబ్ల్యూహెచ్) లాంటి దేశాలు జాబితా తొలి స్థానాలను దక్కించుకున్నాయి. 2023 వివరాల ప్రకారం భారత దేశంలో తలసరి ఎనర్జీ వినియోగం 985 కెడబ్ల్యూహెచ్ నమోదైనది. ఒక సాధారణ భారతీయ కుటుంబంలో వినియోగించే విద్యుత్‌లో 30 శాతం వరకు వృధా కావడం సోచనీయమే కాదు ఆక్షేపణీయం కూడా.
సుస్థిర శక్తికి ప్రతి యూనిట్ పొదుపు ముఖ్యమే:
జాతీయ శక్తి పొదుపు దినం-2024 థీమ్‌గా “సుస్థిర శక్తి : ప్రతి వాట్ ముఖ్యమే” అను అంశాన్ని తీసుకున్నారు. వ్యక్తులు, కుటుంబాలు, పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ సంస్థలు లాంటి అన్ని క్షేత్రాల్లో శక్తి పొదుపు విధానాలను పాటిస్తూ, సుస్థిర పొదుపు బాటన నడవాలి, ఉత్పాదకత పెంచాలి. శక్తిని పొదుపు చేయడం అంటే ఉత్పత్తి చేయినట్లే అని ప్రచారం చేయాలి. శక్తి వినియోగం తగ్గితే పర్యావరణ పరిరక్షణకు ఊతం ఇచ్చినట్లే అని నమ్మాలి. రేపటి ప్రకాశవంతమైన సమాజానికి నేటి శక్తి పొదుపు ఆధారం అని తెలపాలి. శక్తి ఉత్పత్తి, వినియోగాలను తగ్గిస్తే భూమండలం నివాసయోగ్యంగా తయారు అవుతుంది.
శక్తి లేనిదే ప్రపంచం అంతా చీకటే. శక్తి లేనిదే ఒక్క క్షణం కూడా గడవదు. మనల్ని నడిపిస్తున్నది శక్తి మాత్రమే. ఉత్పత్తి అవుతున్న శక్తిని సక్రమంగా, సమర్థవంతంగా వాడుకోవడం, అనవసర నష్టాలను అదుపు చేయడం మన కనీస కర్తవ్యం. అనవసర కార్యాలకు శక్తిని వాడుకోవడం, వృధా చేయడం నేర సమానమని గమనిస్తూ ప్రతి యూనిట్ విద్యుత్తును సక్రమంగా వినియోగించుకుంటూ రేపటి ప్రపంచానికి దారి దీపంగా నిలుద్దాం, విద్యుత్ కొరత లేని భారతాన్ని నిర్మిద్దాం.