Telugu News

ఆపరేషన్‌ ట్రిడెంట్ దెబ్బకు తోక ముడిచిన పాక్‌ !

 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధంలో భారత త్రివిధ దళాలు గెలుపొందిన శుభ దినంగా 16 డిసెంబర్‌ రోజున దేశవ్యాప్తంగా “విజయ్ దివస్‌” వేడుకలను సగర్వంగా, ఘనంగా నిర్వహించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. బంగ్లాదేశ్‌ లేదా ఈస్ట్‌ పాకిస్థాన్ విముక్తి పోరాటంగా 03 డిసెంబర్‌ 1971న ప్రారంభమైన ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం13 రోజుల పాటు కొనసాగిన పిదప 16 డిసెంబర్‌ 1971 రోజున పాకిస్థాన్ ఓటమిని అంగీకరించడంతో బంగ్లాదేశ్‌ ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడం, ఇండియా త్రివిధ దళాల దెబ్బకు పాకిస్థాన్‌ లొంగి పోవడం, భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లో విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది. నాటి నుండి ప్రతి ఏట మన త్రివిధ దళాల పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ నాటి యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించడం, గాయపడిన సైనికులకు కృతజ్ఞతలు తెలియజేయడా సాంప్రదాయంగా వస్తున్నది. 

ఈస్ట్‌ పాకిస్థాన్‌, వెస్ట్‌ పాకిస్థాన్‌లో మధ్య తారస్థాయికి చేరిన విభేదాలు:

 1947లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత జరిగిన తీవ్ర పరిణామాల్లో దేశం భారత్‌, పాకిస్థాన్‌ అనబడే రెండు ముక్కలుగా విభజించబడడం, విభజన తీవ్ర రక్తపు మరకలతో జరగడం చూసాం. విభజన తర్వాత నూతనంగా ఏర్పడిన పాకిస్థాన్‌లో ఈస్ట్‌ పాకిస్థాన్‌ (నేటి బంగ్లాదేశ్‌‌), వెస్ట్‌ పాకిస్థాన్‌ (నేటి పాకిస్థాన్‌) అన రెండు ప్రాంతాలు చేరడం జరిగింది. వెస్ట్‌ పాకిస్థాన్ అణచివేత‌ చర్యలతో ఈస్ట్‌ పాకిస్థాన్‌ లేదా బంగ్లాదేశ్‌ నలిగి పోవడం, రెండు ప్రాంతాల ప్రజల మధ్య తీవ్రమైన విభేదాలు పొడచూపడంతో రెండు ప్రాంతాల మధ్య తీవ్ర ఘర్షణలు కొనసాగడం జరిగింది. నాటి పాకిస్థానీ జనరల్‌ యేహ్య ఖాన్‌ దుందుడుకు చర్యలు, బంగ్లాదేశీయులను అణిచివేత, మహిళల మానభంగాలు, అమానవీయ మారణహోమంతో రెండు పాకిస్థానీ ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం పొడచూపడంతో బంగ్లాదేశ్‌ స్వతంత్రం కోసం యుద్ధం అనివార్యం అయ్యింది. ఈ పోరాటంలో బంగ్లాదేశ్ “ముక్తి బహిణి” దళాల భాగస్వామ్యం కూడా ప్రధానమైనదిగా పేర్కొనబడింది. 

“ఆపరేషన్‌ ట్రిడెంట్”‌ దెబ్బకు తోక ముడిచిన పాకిస్థాన్‌:

 బంగ్లాదేశ్‌ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా వెస్ట్‌ పాకిస్థాన్‌ ప్రభుత్వం పని చేయడంతో “బంగ్లాదేశ్‌ లేదా ఈస్ట్‌ పాకిస్థాన్‌”లో తమ స్వతంత్రం కోసం “బంగ్లా విముక్తి” పోరాటాలు ఎగిసిపడడం, దానికి నాటి ఇందిరాగాంధీ నేతృత్వపు భారత ప్రభుత్వం కూడా సహకరించడం గమనించాం. 03 డిసెంబర్‌ 1971 రోజున భారత్‌పై పాకిస్థానీ ఏయిర్‌ ఫోర్స్‌ దాడులు జరపడంతో ఇండియా, పాకిస్థాన్‌లో మధ్య యుద్ధం ప్రారంభం అయ్యింది. దీనికి బదులుగా భారత త్రివిధ దళాలు, ముఖ్యంగా భారత నావికా దళం 04 డిసెంబర్‌ 1971న నిర్వహించిన “ఆపరేషన్‌ ట్రిడెంట్‌” జవాబుతో కరాచీ పోర్ట్‌ నామరూపాలు లేకుండా పోవడంతో పాకిస్థాన్‌ బిత్తరపోవడం, భారత్‌ తన ప్రతాపాన్ని పాక్‌కు రుచి చూపడం గత ఘన చరిత్రగా నిలిచిపోయింది.

14 డిసెంబర్‌ 1971 రోజున ఈస్ట్‌ పాకిస్థాన్‌ గవర్నర్‌ ఇంటిపై భారత ఏయిర్‌ ఫోర్స్‌ దాడులు చేయడంతో ఖంగుతిన్న పాకిస్థాన్‌ ఓటమిని అంగీకరించి బంగ్లాదేశ్‌ ఏర్పడడానికి అంగీకరించడం, 16 డిసెంబర్‌న పాకిస్థానీ జనరల్‌ ఏ ఏ కె నాజియా నేతృత్వంలో 93,000 పాకిస్థానీ సైన్యం లొంగి పోవడంతో, పాకిస్థానీ కంబందహస్తాల నుంచి బంగ్లాదేశ్‌ లేదా ఈస్ట్‌ పాకిస్థాన్‌ స్వేచ్ఛను పొందిన ఫలితంగా‌ మరో కొత్త దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించడం జరిగిపోయింది. 

ఇండో-పాక్‌ యుద్ధంలో ప్రాణ నష్టం:

భారత జనరల్‌ సామ్‌ మనేక్‌షా నేతృత్వంలో సాధించిన విజయంలో పాటు 3,000 మంది వరకు భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం, 9,851 మంది వరకు గాయపడడం విచారకరం. పాకిస్థాన్ సైన్యంలో 8,000లకు పైగా మరణాలు, 25,000ల వరకు సైనికులు గాయపడడం జరిగింది. తొమ్మిది నెలలుగా జరిగిన ఈస్ట్‌, వెస్ట్‌ పాకిస్థాన్‌ పోరాటంలో పాకిస్థానీ అనుకూల, వ్యతిరేక దళాల మధ్య జరిగిన పోరులో 3 లక్షల నుంచి 3 మిలియన్ల వరకు సాధారణ ప్రజలు/సైనికులు మరణించడం, అనేక మంది మహిళలు మానభంగం చేయబడడం లాంటి అమానవీయ ఘటనలు చోటు చేసుకోవడం వెస్ట్‌ పాకిస్థానీ ప్రభుత్వ పెద్దల ఫలితమే అని అర్థం చేసుకోవాలి. 

భారత త్రివిధ దళాలు అర్జించి పెట్టిన ఈ ఘన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏట 16 డిసెంబర్‌ రోజున “విజయ్‌ దివస్‌” నిర్వహించుకోవడం, ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పించడం, గాయపడిన సైనికులకు చేయూతను అందించడం జరుగుతున్నది. 

Show More
Back to top button