Telugu News

వయనాడ్ విషాదం..మానవ తప్పిదమా..?

అందాల టీ తోటలకు, పచ్చని ప్రకృతికి పేరున్న వయనాడ్.. ఇప్పుడు వరదలధాటికి భయానకంగా మారింది. ముఖ్యంగా వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండచరియలు వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. మృతుల సంఖ్య నాలుగు రోజులుగా పెరుగుతూనే వస్తోంది. దీనికి తోడు భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో స్థానిక నదులు ఉప్పొంగుతున్నాయి. నీటిలో ఛిద్రమైన మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ విపత్కర పరిస్థితి ఎదురవ్వడం కేరళకు కొత్తేం కాదు.

వర్షాకాలం ఆరంభం.. జులై, ఆగస్టు వస్తే చాలు.. కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతాయి. కొండచరియలు విరిగిపడటం కొన్నేళ్లుగా సర్వసాధారణం అయ్యింది. భౌగోళికంగా కేరళకు పశ్చిమాన విస్తారమైన సముద్రతీరం ఉంటే… తూర్పున పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రతి జులై నెలాఖరు, ఆగస్టు నెలల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయి. ఫలితంగా కొండల్లో ఉన్న సెలయేళ్లు, నదులు ఉద్ధృతంగా 

ప్రవహిస్తూ కొన్నిసార్లు ఈ అనుకోని ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

గతంలో 2018లో వచ్చిన వరదలు కేరళలో విధ్వంసం సృష్టించాయి. సుమారు 600 మంది ప్రాణాలు కోల్పోగా ఏకంగా 31 వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తు 2015-19 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన అత్యంత ఘోర విపత్తుల్లో ఒకటిగా నిలిచింది.

2019లోనూ సంభవించిన వరదల కారణంగా 121 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 2 లక్షల మంది బాధితులుగా మిగిలారు. అలాగే అదే ఏడాది కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 వేల మంది నిరాశ్రయులయ్యారు.

2020 ఆగస్టులో ఇడుక్కి, వయనాడ్, మలప్పురం, కొట్టాయం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, విరిగిపడ్డ కొండచరియల కారణంగా 66మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో 42 మంది, 2022లో 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా వయనాడ్ జిల్లాలో జరిగిన ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 296కు చేరింది. చలియార్‌ నదిలోనే ఇప్పటివరకు 144 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటికీ 240 మంది ఆచూకీ కనిపించడం లేదు. 200 మంది గాయపడి వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. వెయ్యిమందిని సురక్షితంగా కాపాడినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం 82 సహాయక శిబిరాలను ఏర్పాటు చేయగా 8,204 మంది ఇప్పటివరకు ఆశ్రయం పొందుతున్నారు.

ఇటువంటి ప్రకృతి విపత్తులకు యావత్ ప్రపంచం అల్లాడిపోతోంది. కొన్నాళ్ల క్రితం ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 260 మంది ప్రాణాలు కోల్పోగా.. వారి సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉందని యునైటెడ్ నేషన్స్ హ్యూమానిటేరియన్ ఏజెన్సీ వెల్లడించింది.  2024 మే నెలలో పాపువా న్యూగినియాలో కొండ చరియలు విరిగిపడ్డ ప్రమాదంలో ఏకంగా 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అంటున్నారు.

కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి..?!

నిటారుగా ఉండే కొండలు, లోయల దిగువ భాగాలు, కార్చిచ్చులో కాలిపోయిన భూభాగాలు, అడవుల్ని విపరీతంగా కొట్టేసిన భూభాగాలు, అలాగే నీటిలో ఎక్కువకాలం నానిన ప్రాంతాలు, వాగులు, నదుల ప్రవాహ మార్గాల్లో ఉండే భూభాగాల్లో ల్యాండ్ స్లైడ్స్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కేరళలో అంతా కొండ ప్రాంతం కావడం, వందల ఏళ్లుగా ఆ పోడు వ్యవసాయం జరగడం వల్ల భూస్వరూపం మారిపోయింది. అలాగే విపరీతమైన వర్షాల కారణంగా నీటిలో ఎక్కువకాలం నాని ఉండటం వల్ల తరచూ కొండచరియలు విరిగి పడుతున్నాయన్నమాట.

ఉష్ణోగ్రతల్లో విపరీత మార్పులు, వాతావరణంలో జరుగుతున్న పరిణామాలు కొండ చరియలు విరిగిపడటాన్ని మరింత పెంచుతాయి. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు అధిక వర్షాలకు దారి తీస్తుండగా.. ఆ వర్షాల వల్ల పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.

  • సహజమైన కారణాలకంటే మానవ చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కొండ ప్రాంతాల్లో నిర్మాణాల సమయంలో ఏటవాలు(స్లోప్) సరిగా ప్లాన్ చేయకపోవటం, వృక్షసంపదను భారీగా తొలగించటం, కొండపై పడి కిందకు జాలువారే నీరు వెళ్లే వ్యవస్థలో ఆటంకాలు.. ఇతర కారణాల వల్ల కొండచరియలు విరిగిపడుతుంటాయి.
  • సహజంగా కొండల మీద వాన పడినప్పుడు.. ఆ నీరు పల్లానికి వెళ్తుంది. అందుకోసం సహజంగా మార్గాలు ఏర్పడతాయి. అయితే ఆ వ్యవస్థల దిశను మార్చడం,అందులో ఏమైనా మార్పులు చేయడంతో ఆ నీరు కిందకు వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా.. ఆ వాననీరుతో మట్టి, రాళ్లు బలహీనపడి కొండచరియలు హఠాత్తుగా విరిగిపడతాయి.

నివారించలేమా..?!

కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు సంభవించే ముందుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతటవే బిగుసుకుపోవడం, నేల, గోడల్లో పగుళ్లు రావడం. స్తంభాలు, వృక్షాలు పక్కకు వంగిపోవటం, కొండల నుంచి మట్టి రాలటం వంటివి చోటుచేసుకుంటాయి.

పర్వత ప్రాంతాల్లో, నదీ పరీవాహక ప్రాంతాల్లో నేల క్షయం చెందకుండా చూసుకోవాలి. అలాగే పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉన్న చోట్ల రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేయడం, ఆ నేల అడుగు భాగాన్ని మరింత ధృడంగా తయారయ్యేలా నిర్మాణాలు చేపట్టడం, అలాగే కొండపై నుంచి జారే పడే రాళ్లకు ఆయా చోట్ల ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చెయ్యడం ద్వారా కొంత మేర ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు.

  • ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండే కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. 
  • కొండల నుంచి మట్టి, రాళ్లు రోడ్లమీద పడకుండా గోడలు నిర్మించాలి. ఫెన్సింగ్ ద్వారా రక్షణ కల్పించాలి.
  •  పగుళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలకు సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. 
  • కొండఏటవాలు ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలి.

Show More
Back to top button