Telugu News

దీదీ హయాంలో దీనస్థితికి పశ్చిమ బెంగాల్

ఒకప్పుడు వ్యవసాయ వస్తువులు మరియు వస్త్రాల ప్రధాన ఉత్పత్తిదారుగా భాసిల్లిన పశ్చిమ బెంగాల్ భారత ఉపఖండంలోనే సుసంపన్నమైన ప్రాంతం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రాంతంలోని సుసంపన్నమైన సంపద మరియు వాణిజ్యావకాశాల కారణంగా మొఘల్ చక్రవర్తులు దీనిని “ప్యారడైజ్ ఆఫ్ నేషన్స్” (దేశాల స్వర్గం) అని అభివర్ణించారు. 17వ మరియు 18వ శతాబ్దాలలో అతిపెద్ద ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థగా కొనసాగిన బెంగాల్ సుబా ధాన్యాలు, పట్టు, పత్తి, ఉప్పు, పండ్లు, లోహాలు సహా ఎన్నో వస్తువులను ఎగుమతి చేసింది. బ్రిటిష్ వలసవాద కాలంలో బెంగాల్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఉపఖండంలోని ఇతర ప్రాంతాలతో ఆర్థికంగా ధీటుగా పోటీపడింది.

స్వాతంత్ర్యానంతరం, 1950ల ప్రారంభం వరకు కూడా దేశ పారిశ్రామికీకరణలో పశ్చిమ బెంగాల్ సహకారం ఇతోధికంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఆ తరువాత మారిన ఆర్ధిక ముఖచిత్రం నేపథ్యంలో దేశంలోని ఇతర నగరాల్లో కొత్త ఆర్థిక కేంద్రాలు ఆవిర్భవించాయి. 1960లలో జాతీయ సగటులో 127.5 శాతం ఉన్న పశ్చిమ బెంగాల్ తలసరి ఆదాయం 2024లో 83.7 శాతానికి క్షీణించింది. 1947లో పారిశ్రామిక ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ వాటా 24 శాతం కాగా అది 2021 నాటికి 3.5 శాతానికి క్షీణించింది. ఈ క్షీణతకు విధానపరమైన స్తబ్దత, క్షీణించిన పారిశ్రామికీకరణ, రాజకీయ అస్థిరత మరియు నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల వలసలు కారణమని చెప్పవచ్చు.  

*పశ్చిమ బెంగాల్ ఆర్థిక మందగమనం:* 

20వ శతాబ్దపు మధ్యకాలంలో, పశ్చిమ బెంగాల్ భారతదేశ ఆర్థిక రంగానికి ఎంతో గర్వకారణంగా ఉండేది. ఒకప్పుడు దేశంలోని నాలుగు మెట్రో నగరాలలో ఒకటిగానే కాక భారతదేశ పారిశ్రామిక శక్తికి గుండెకాయగా పరిగణించబడిన కోల్‌కతా నేడు రాష్ట్రం గణనీయమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. 1960-61లో 10.5 శాతం స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వాటాతో ఆర్థికంగా అగ్రగామిగా ఉన్న ఈ రాష్ట్రం యొక్క జిడిపి 2023-24లో 5.6 శాతానికి దిగజారింది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మందగమనానికి అనేక కారణాలు ఉన్నాయి. అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్ధిక పరిస్థితిని గట్టెక్కించడానికి 1991లో నాటి పి వి నరసింహా రావు ప్రభుత్వం నూతన ఆర్ధిక విధానం 1991 (న్యూ ఎకనామిక్ పాలసీ) పేరిట పలు ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆర్థిక సరళీకరణకు అనుగుణంగా పోరాడినప్పటికీ వాటి ఫలాలను సొమ్ము చేసుకోవడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైంది.

అదే సమయంలో కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు ఆర్థిక శక్తి కేంద్రాలుగా మారాయి. భారతదేశ విభజన పశ్చిమ బెంగాల్‌లోని జనపనార పరిశ్రమకు తీవ్ర విఘాతం కలిగించింది. పేలవమైన మౌలిక సదుపాయాలు, ఉత్పాదకతలో క్షీణత, మితిమీరిన కార్మిక సంఘాల జోక్యం, కార్మిక అశాంతి, సమ్మెలు, అధిక వడ్డీ రేట్లు, ప్రభుత్వ ప్రతికూల పారిశ్రామిక విధానాలు తదితర కారణాలు స్వదేశీ మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో పశ్చిమ బెంగాల్ బాగా వెనకబడింది. 1977 నుండి 2011 వరకు 34 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న సిపిఐ(ఎం) కానీ ఆ తరువాత వరుసగా అధికారం చేజిక్కించుకుని నేటికీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మమతా బెనర్జీ కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిన పెట్టడంలో మాత్రం విజయం సాధించలేకపోయారు.  

*పశ్చిమ బెంగాల్ లోని పరిశ్రమలు:* 

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పరిశ్రమలలో జనపనార, తేయాకు, లెదర్ ప్రాసెసింగ్, ఉక్కు, అల్లాయ్ స్టీల్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, రత్నాలు మరియు నగల కర్మాగారాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ వాతావరణం జనపనార మరియు తేయాకు సాగుకు అత్యంత అనువైనది, ఈ ఉత్పత్తులు మరియు సంబంధిత పరిశ్రమలకు ఇది ప్రధాన కేంద్రం. దాదాపు 666 లెదర్ మరియు లెదర్ సంబంధిత వస్తువులను ఉత్పత్తి చేసే యూనిట్లతో లెదర్ ప్రాసెసింగ్ మరియు తయారీలో పశ్చిమ బెంగాల్ అగ్రగామిగా ఉంది, దుర్గాపూర్‌ లోని అల్లాయ్ స్టీల్ ప్లాంట్‌తో సహా అనేక స్టీల్ ప్లాంట్‌లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ లోని గ్రామీణ ప్రాంతం ప్రసిద్ధ క్రీమ్ అయిన బోరోలిన్‌ను ఉత్పత్తి చేసే అనేక ఔషధ కంపెనీలకు నిలయం. పశ్చిమ బెంగాల్ సెక్టార్-Vలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌ ఉంది. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, రత్నాలు మరియు నగల పరిశ్రమలు కూడా ఆ రాష్ట్ర ఆర్ధిక పరిపుష్టికి దోహదమవుతున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమలు ప్రధానంగా కోల్‌కతా నగర పరిసరాలు, ఖనిజాలు అధికంగా ఉండే పశ్చిమ పర్వత ప్రాంతాలు మరియు హల్దియా ఓడరేవు ప్రాంతంలో ఉన్నాయి. అయినప్పటికీ భూవినియోగం మరియు ఆర్థిక వ్యవస్థ రెండింటిలోనూ వ్యవసాయం ఆధిపత్యం చెలాయిస్తుంది.

*పారిశ్రామిక విధాన వైఫల్యం:*

పశ్చిమ బెంగాల్‌లో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆ రాష్ట్ర పారిశ్రామిక విధానం వైఫల్యం కూడా ఆ రాష్ట్ర పారిశ్రామిక క్షీణతకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. లఘు మరియు కుటీర పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వ 1978 నాటి పారిశ్రామిక విధానం రాష్ట్ర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో విజయవంతం కాలేదు. ఈ విధానాన్ని అమలు చేయవలసిన అధికారుల పేలవమైన పని తీరు, బాధ్యతారాహిత్యం, కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధానం ఇతర ప్రాంతాలకు అనుకూలంగా ఉండడం వల్ల అనేక మంది పారిశ్రామికవేత్తలు పశ్చిమ బెంగాల్ వెలుపల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఇందుకు ఉదాహరణగా 3 అక్టోబర్ 2008న, అప్పటి ముఖ్యమంత్రితో క్లుప్త సమావేశం తర్వాత, దివంగత రతన్ టాటా పశ్చిమ బెంగాల్ నుండి నానో ప్రాజెక్ట్‌ను తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని పేర్కొనవచ్చు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి మమతా బెనర్జీ నేతృత్వంలోని సింగూర్ ప్రాజెక్ట్ వద్ద ప్రతిపక్షాల ఉద్యమం పట్ల తన నిరాశను ప్రస్తావించడం అందరికీ తెలుసు. 

*ఫలించని విదేశీ పర్యటన:*

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2023 నవంబర్ 21 మరియు 22వ తేదీల్లో కోల్‌కతాలో జరగిన 7వ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (బిజిబిఎస్)కి ముందు సెప్టెంబర్ 11, 2023న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లలో 12 రోజుల సుదీర్ఘ పర్యటనకు ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ముఖ్య ప్రభుత్వ అధికారులతో కలిసి వెళ్లారు. అక్కడ ఆమె వరుస వ్యాపార సమావేశాలను నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మాడ్రిడ్ మరియు బార్సిలోనాలను సందర్శించారు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరిగిన చివరి వ్యాపార శిఖరాగ్ర సమావేశం కావడం విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం పశ్చిమ దేశాలు తమ రాష్ట్రాన్ని గమ్యస్థానంగా చేసుకునేలా ప్రోత్సహించడానికి ఎంతో ఆసక్తి చూపినప్పటికీ ఆ ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో మాత్రం ఫలించలేదు. అంతే కాదు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆమె గతంలో చేపట్టిన సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌ పర్యటనలు కూడా నిష్ప్రయోజనమయ్యాయి. 

తరలివెళ్ళిన రెండు వేలకు పైగా కంపెనీలు:

నవంబర్ 25 నుండి డిసెంబర్ 20 వరకు జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సమిక్ భట్టాచార్య అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, 2019 నుండి 2024 మధ్య కాలంలో 39 లిస్టెడ్ కంపెనీలతో సహా 2,277 వ్యాపారాలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాలను పశ్చిమ బెంగాల్ నుండి ఇతర రాష్ట్రాలకు తరలించాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 3న రాజ్యసభలో అధికారికంగా తెలియచేసింది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కంపెనీల పునరావాసానికి గల కారణాలను గుర్తించడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు నిలుపుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేపడుతున్నదా అని కూడా భట్టాచార్య ఆరా తీశారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందచేసిన సమాచారం ఆ రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక ప్రతికూల వాతావరణాన్ని ప్రస్ఫుటంగా తెలియచేస్తుంది. 

*పునర్వైభవం సాధిస్తుందా?*

ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని విస్మరించి ఓటు బ్యాంకు రాజకీయాలతో కేవలం అధికారంలో కొనసాగడమే ఏకైక లక్ష్యంగా కొనసాగినంత కాలం. పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక కేంద్రంగా దాని పునర్వైభావాన్ని సాధించడం అసాధ్యమనే చెప్పవచ్చు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో అయినా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణతో ‘దీదీ’గా పిలువబడే మమతా బెనర్జీ తుచ్ఛ రాజకీయ ప్రయోజనాలను పక్కన బెట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ ప్రగతి నిరోధకులుగా మారిన మతోన్మాద, సంఘవ్యతిరేక శక్తులను ఉక్కుపాదంతో అణచివేయడంతో పాటు బంగ్లాదేశ్ నుండి యధేచ్ఛగా వలస వస్తున్న అక్రమ చొరబాటుదార్లకు అడ్డుకట్టవేసి రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తే ఎంతో కొంత ఫలితం తప్పకుండా ఉంటుంది. 

Show More

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి, ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ, హైదరాబాద్
Back to top button