గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ (Global Burden of Diseases – GBD) అధ్యయనం ప్రకారం భారతదేశంలో అత్యధిక మరణాలకు రెండవ సాధారణ కారణం స్ట్రోక్. స్ట్రోక్ అనేది రక్తం గడ్డకట్టడం (క్లాట్) లేదా దెబ్బతిన్న రక్తనాళం కారణంగా మెదడుకు రక్త ప్రసరణలో అంతరాయం కలిగినప్పుడు సంభవించే వైద్య అత్యవసర పరిస్థితి. ఆక్సిజన్ మరియు పోషకాలను స్వీకరించడానికి మెదడుకు స్థిరమైన రక్త ప్రవాహం అవసరం. కాగా స్ట్రోక్ (కొన్నిసార్లు “మెదడు దాడి” అని కూడా అంటారు) కేవలం కొన్ని నిమిషాల్లోనే తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ప్రతి 40 సెకన్లకు ఒక స్ట్రోక్ మరియు ప్రతి 4 నిమిషాలకు ఒక మరణంతో భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1,85,000 మంది స్ట్రోక్‌లకు గురవుతున్నారు.
ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్లో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా ఎం వి పద్మ శ్రీవాస్తవ మాట్లాడుతూ, భారతదేశంలో స్ట్రోక్ రెండవ సాధారణ అత్యధిక మరణాలకు కారణమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే బ్రెయిన్ స్ట్రోక్ సంఘటనలలో 68.6 శాతం మన దేశంలోనే సంభవిస్తున్నాయి. స్ట్రోక్‌కు గురైన వారిలో దాదాపు 70.9 శాతం మృత్యువాత పడుతుండగా, 77.7 శాతం వైకల్యం సర్దుబాటు చేయబడిన జీవిత సంవత్సరాలు (Disability Adjusted Life Years – DALY) గడపాల్సివస్తుందని డా శ్రీవాస్తవ ఒక కార్యక్రమంలో తెలిపారు.
GBD 2010 స్ట్రోక్ ప్రాజెక్ట్ యొక్క మరొక ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే దాదాపు 52 లక్షలు లేదా 31 శాతం స్ట్రోక్‌లు 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సంభవిస్తున్నాయి. స్ట్రోక్ భారం భారతదేశంలో ఎక్కువగా ప్రత్యేకించి యువకులు మరియు మధ్య వయస్కులలో ఉంటున్నదని డా శ్రీవాస్తవ చెప్పారు. ఈ గణాంకాలు భారత్ లో పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతున్నప్పటికీ, స్ట్రోక్ రోగులకు త్వరితగతిన సమర్ధవంతమైన చికిత్స అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు సంస్థాగత సంసిద్ధత భారతీయ ఆసుపత్రులలో లేవని ఆమె వాపోయారు.
ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు అరవై ఐదు లక్షల మంది స్ట్రోక్ కారణంగా మరణిస్తారు. అందుచేత ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలకు ఇది మూడవ ఆరోగ్య సమస్యగా పరిగణించబడుతోంది. దాదాపు ఒక కోటి యాభై లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్ కు గురవుతుండగా అందులో దాదాపు యాభై లక్షల మందికి శాశ్వతంగా వైకల్యం ఏర్పడుతోంది. 25 సంవత్సరాలు దాటిన ప్రతి నలుగురిలో ఒక వ్యక్తికి జీవితకాలంలో ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా సంభవించే 51 శాతం మరణాలలో 6 శాతం 15 నుండి 49 సంవత్సరాలు మరియు 34 శాతం 70 సంవత్సరాలు లోపు పురుషులు ఉండడం గమనార్హం.
గుండెపోటు మరియు స్ట్రోక్ మధ్య వ్యత్యాసం:
గుండెపోటు (హార్ట్ అటాక్) మరియు బ్రెయిన్ స్ట్రోక్ (మెదడుకు యొక్క రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడడం లేదా చిట్లడంతో పాటు ఒక భాగానికి ఆక్సిజన్ చేరకపోవడం వలన ఆ భాగం యొక్క కణ మరణానికి దారి తీయడంతో మెదడులోని ఒకటి లేదా అనేక భాగాలు దెబ్బతినడం) రెండూ కూడా రక్త ప్రసరణలో ఆకస్మిక కోత కారణంగా ఏర్పడే వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు. గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో అకస్మాత్తుగా అవరోధం ఏర్పడడంతో గుండెపోటు సంభవిస్తే మెదడులో రక్త ప్రసరణలో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడడంతో స్ట్రోక్ సంభవిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అలా సంభవించినప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. పూర్తి అంతరాయం ఏర్పడిన కొన్ని నిమిషాల్లో, మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ అధిగమించడం అనేది తక్షణ వైద్య సహాయంపై ఆధారపడి ఉంటుంది. తక్షణ చికిత్సతో 80 శాతం స్ట్రోక్‌లను నివారించవచ్చు. ఈ సంఘటన తరువాత ప్రతి క్షణం కూడా రోగి మనుగడకు అత్యంత అమూల్యమైనది.
పక్షవాతం లేదా పెరాలిసిస్:
మెదడుకు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. ఇది మెదడును దెబ్బతీయడంతో పాటు కండరాలకు సంకేతాలను పంపకుండా నిరోధించవచ్చు. దీని పర్యవసానంగా పక్షవాతం రావడమే కాక ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కండరాలలో కదలికను కోల్పోయే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ కొన్నిసార్లు తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యాలకు కూడా కారణమవుతుంది. మెదడులో రక్త ప్రవాహం నిలిచిపోయిన వ్యవధి మరియు దాని కారణంగా ప్రభావితమైన శరీర భాగాన్ని బట్టి సంక్లిష్టతలు ఆధారపడి ఉంటాయి. కండరాల కదలిక కోల్పోవడాన్ని ‘పక్షవాతం’ అంటారు.
శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించడంతో పాటు మెదడు నుండి సంకేతాలను చేరవేసే సమాచార వ్యవస్థగా పనిచేసే నాడీ మండలంలో సమస్య ఏర్పడినప్పుడు అది పక్షవాతానికి కారణమవుతుంది. ఇలాంటి సందర్భాలలో తక్షణ వైద్య చికిత్సతో 80 శాతం స్ట్రోక్‌లను నివారించవచ్చు. స్ట్రోక్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలను త్వరగా గుర్తించడం మరియు ప్రాథమిక లక్షణాలు కనిపించిన 3 గంటలలోపు అత్యవసర చికిత్స అందించడం చాలా ముఖ్యం. పక్షవాతం అనేది స్ట్రోక్ యొక్క అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి, ఇది 90 శాతం మంది స్ట్రోక్ రోగులను ప్రభావితం చేస్తుంది. ఇది సాధారణంగా దెబ్బతిన్న మెదడు యొక్క అవతల వైపు శరీర భాగాన్ని ప్రభావితం చేస్తుంది.
సాధారణంగా పక్షవాతం ప్రభావం ముఖం (మూతి ఒక వైపు వంకర పోవడం), చెయ్యి, కాలు మరియు ఒక వైపు మొత్తం శరీర భాగంపై ఉంటుంది. స్ట్రోక్ యొక్క ఇతర లక్షణాలలో రోగి మాట్లాడటం లేదా మింగడంలో సమస్య, సరిగ్గా ఆలోచించలేకపోవడం లేదా తార్కికత్వం లోపించడం, స్పృహ కోల్పోవడం, ద్వంద్వ దృష్టి (ఒకే వస్తువు రెండుగా కనిపించడం) లాంటివి ఎదుర్కొనవచ్చు. అయితే సంఘటన సంభవించిన వెంటనే స్పందించి అత్యవసర చికిత్స అందించడం, వైద్యుని సలహా మేరకు మందులు తీసుకోవడంతో పాటు తగిన వ్యాయామాలు చేయడం ద్వారా శరీరంలో కోల్పోయిన కదలికను తిరిగి పొందడమే కాక స్ట్రోక్-ప్రేరిత పక్షవాతం నుండి కోలుకోవడం సాధ్యమవుతుంది.
పక్షవాతం వచ్చిన వారిలో 10 శాతం మంది రోగులు దాదాపు పూర్తిగా మరియు 25 శాతం మంది రోగులు కేవలం చిన్నపాటి లోపాలతో మాత్రమే కోలుకుంటున్నారు. 40 శాతం మంది రోగులకు సాధారణం నుండి తీవ్రమైన వైకల్యం సంభవించడం కారణంగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవడం మరియు 10 శాతం మంది రోగులకు దీర్ఘకాలిక సంరక్షణ అవసరం ఏర్పడుతుంది.
నరాల సంబంధిత రుగ్మతలతో జాగ్రత్త:
ఇటీవలి కాలంలో, పార్శ్వపు తలనొప్పి (మైగ్రేన్), స్ట్రోక్స్, మూర్ఛలు (సీజర్స్) మరియు వివిధ రకాల మెదడులో కణితులు వంటి నరాల సంబంధిత రుగ్మతలు సర్వసాధారణంగా మారాయి. ఈ రుగ్మతలకు కూడా నిపుణుల సంరక్షణ మరియు ఖచ్చితమైన చికిత్స అవసరం. ఉదాహరణకు, భారతదేశంలో ప్రతి సంవత్సరం 40 నుండి 50 వేల మంది మెదడు కణితులతో బాధపడుతున్నారు. అన్ని కణితులు హానికరమైనవి కానప్పటికీ కొన్ని ప్రమాదకరమైనవి. సాధారణ తలనొప్పులు, అనారోగ్యంగా అనిపించడం, వాంతులు కావడం, స్పష్టంగా కనిపించకపోవడం, కదలలేకపోవడం లేదా మూర్ఛలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే; వెంటనే న్యూరాలజిస్ట్ లేదా న్యూరో సర్జన్‌ని సంప్రదించడం చాలా అవసరం.
వైద్యశాస్త్రం పురోగమిస్తున్న ఈ కాలంలో కూడా మనం నరాల సంబంధిత సమస్యలను తీవ్రంగా పరిగణించకపోవడం వలన చిన్న సమస్యలు కూడా కాలక్రమేణా తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా సమయానుసారం మితంగా పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడి లేకుండా జీవించడం, రక్తపోటు మరియు శరీరంలో చక్కర స్థాయి నియంత్రణలో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వైద్యులను సందర్శిస్తూ అవసరం మేరకు మందులు వాడడం, మెదడు యొక్క రక్త నాళాలను దెబ్బతీసే ధూమపానం, అధిక ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం, సమయానుసారం వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రత్యేకించి మెదడుకు సంబంధించిన కుటుంబ చరిత్ర ఉంటే, తరచుగా వైద్యున్ని సంప్రదించడం వలన సమస్యను ముందుగానే గుర్తించి ఈ వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది.
వీటితో పాటు మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే పజిల్స్ చేయడం, చదవడం మరియు మేధోపరమైన చర్చలలో పాల్గొనడం వంటి క్రమమైన మానసిక వ్యాయామాలు మెదడును పదునుగా ఉంచడంలో సహాయపడతాయి. రోడ్డు ప్రమాదాలలో అత్యధిక మంది యువతీయువకులు ప్రాణాలు కోల్పోతున్నందున, ప్రత్యేకించి 20 నుంచి 40 సంవత్సరాల వయసు వారు సరైన హెల్మెట్‌లు ధరించడం మరియు రహదారి నియమాలను పాటించడం వల్ల తలకు అయ్యే గాయాలను నివారించవచ్చు.
BEFAST మంత్రం:
BE-FAST అనేది స్ట్రోక్ యొక్క హెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో ప్రజలకు సహాయపడటానికి ఉపయోగించే సంక్షిప్త రూపం. బి: బ్యాలన్స్ లేదా సంతులనం: శరీరం యొక్క ఎడమ లేదా కుడి వైపు మైకం కమ్మడం ద్వారా లేదా బలహీనత కారణంగా నడవడానికి ఇబ్బంది పడడం లేదా సంతులనం (బ్యాలన్స్) కోల్పోవడం; ఇ: ఐస్ (కళ్ళు): ఒకటి లేదా రెండు కళ్లలో దృష్టి లోపాలు ఏర్పడడం, ద్వంద్వ దృష్టి (ఒకే వస్తువు రెండుగా కనిపించడం) లేదా కంటి చూపు కోల్పోవడం వంటివి; ఎఫ్: పేస్ (ముఖం): ముఖం ఒకటి లేదా రెండు వైపులా వంకర పోయినట్లు అనిపించడం; ఏ: ఆర్మ్ (చేయి): రెండు చేతులలో బలహీనత; ఎస్: స్పీచ్ (ప్రసంగం): అస్పష్టంగా మాట్లాడడం లేదా అర్థం లేని పదాలు పలకడం మరియు టి: టైం (సమయం): మెదడుకు సంబంధించి అత్యవసర సమయ సంకేతం – ఇది అత్యవసర సహాయం కోసం ఫోన్ చేయాల్సిన సమయం.