CINEMATelugu CinemaTelugu Special Stories

తెలుగు చిత్ర సీమలో తొలి తరం హాస్య నటి.. నటి గిరిజ..

నటి గిరిజ సీతాకోకచిలుక కు కొన్ని పరిణామ దశలు ఉంటాయి. గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత రూపవిక్రియ చెంది వెలువడే రంగు రంగుల రెక్కల “సీతాకొక చిలుక” దశ. “సీతాకొక చిలుక” గా మారగానే స్వతంత్రంగా ఎగిరిపోతాయి. అలాగే సినిమా తారలకు కొన్ని పరిణామ దశలు ఉంటాయి. సాధారణంగా తారలు కొంతకాలం పాటు మంచి నిర్మాతలు, దర్శకులు చాటున ఉండి వాళ్ళు ఇచ్చిన మంచి పాత్రలలో చక్కని నటన నేర్చుకుని వాటి సాయంతో రెక్కలకు బలం చేకూర్చుకొని ఉన్నట్టుండి ఓ శుభ ముహూర్తాన తమకు తాము ఎగరడం నేర్చుకుంటారు.

ఆ సమయంలో నిర్మాతలు, దర్శకులు ఆ తారలలోని నటనను వినియోగించుకోవడం తప్ప కొత్తగా వారిలో ప్రజ్ఞా పాటవాలను వెలికి తీయడం అంటూ పెద్దగా ఏమీ ఉండదు. అందుకు నటి గిరిజ గారు ఉదాహరణ. తొలి రోజుల్లో నటి గిరిజ గారు ఈ పరిణామ దశలన్నీ చాలా సహనంగా వినమ్రంగా దాటుకుంటూ వచ్చారు. గిరిజ గారు తన పదిహేనేళ్ల వయస్సు లోనే తన తల్లిని పోగొట్టుకున్నారు. గిరిజ గారు అంటే ఆ రోజుల్లో చాలామందికి అభిమానం ఉండేది. ముఖ్యంగా సినిమా అగ్ర తారలు, పెద్దవాళ్లంతా గిరిజ గారిని తమ ఇంటి పిల్లగా చూసుకునేవారు. చిన్నవాళ్లు తనను చెల్లెలుగా ఆదరించేవారు. అందరితోనూ కలివిడిగా ఉండే గిరిజ గారిని కన్నాంబ గారు ప్రాణంగా చూసుకునేవారు.

గిరిజ గారు కడారు నాగభూషణం గారిని తండ్రి కంటే ఎక్కువగా గౌరవించేవారు. గిరిజ గారి కుటుంబంలో వారంతా మొదటి నుంచి కనకదుర్గ అమ్మవారి భక్తులు. అమ్మవారి పూజ పట్ల విపరీతమైన భక్తి శ్రద్దలతో ఉండేవారు. ఆ భక్తితోనే గిరిజ గారి తల్లి నటి రామతిలకం గారు తన కూతురుకు గిరిజ అని పేరు పెట్టుకుంది. గిరిజ గారు శరత్ చంద్ర గారి సాహిత్యాన్ని బాగా ఇష్టపడేవారు. నిజానికి గిరిజ గారు సున్నిత మనస్తత్వం గలవారు. ఆ మనస్తత్వమే చివరి రోజులలో ఆమెకు శాపం అయ్యింది. ఎవరికి ఏమి కాకుండా ఏకాకిగానే వెళ్ళిపోయింది. సినీ వినీలాకాశంలో తారగా మిగిలిపోయింది.

గిరిజ గారు రోజుల్లో కథానాయిక, దరిమిలా హాస్య గీతిక, ఆపైన కరుడుగట్టిన విష పుత్రిక. తాను నటించేది ఏ పాత్రయినా చిత్తశుద్ధితో, భక్తిశ్రద్ధలతో చేసేది. అందుకే ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో అప్పుడప్పుడు మెదిలాడుతూనే ఉంది. నేడు హాస్యం అతిహాస్యం, అపహాస్యం అవుతున్నా కూడా అలనాటి అజరామర చిత్రాలలో కల్తీ చేయకుండా తన పాత్రను తాను నిలబెట్టుకున్న కళాకారిణి దాసరి గిరిజ గారు.

తెలుగుతనాన్ని, సంప్రదాయాన్ని, తోబుట్టువులుగా చేసుకుని ఎదిగినా కూడా తమిళులు కూడా తనను సమాదరించారు. తన చక్కటి చిత్రాలని ప్రోత్సహించారు. ఇన్ని వెలుగులు వెలిగిన తన చివరి రోజులు అమావాస్య చీకట్లే అయ్యాయి. తారల జీవితాల్లో సుఖాన్ని వెతకడం చాలా కష్టం. దుఃఖాన్ని గుర్తించడం ఎంతో తేలిక. తెరమీద ఇంతగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే హాస్య తారలలో చాలామంది జీవితం చివరి రోజుల్లో అంతా దుఃఖభరితం ఎందుకు చేశాడో కనిపించని ఆ పైవాడికే తెలియాలి.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    దాసరి గిరిజ

ఇతర పేర్లు  :    గిరిజ 

జననం    :     3 మార్చి 1936  

స్వస్థలం   :     కంకిపాడు , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా

వృత్తి      :    నటి, హాస్యనటి మరియు చిత్ర నిర్మాత

తండ్రి    :   పద్మరాజు

తల్లి     :   దాసరి రామతిలకం.

జీవిత భాగస్వామి    : సి.సన్యాసిరాజు 

పిల్లలు   :      సలీమా

మతం   :     హిందూ

మరణం    :     5 సెప్టెంబర్ 1995 మద్రాసు , తమిళనాడు , భారతదేశం

నేపథ్యం…

దాసరి గిరిజ గారు 3 మార్చి 1938  నాడు ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. తన తల్లి కూడా రంగస్థలం మరియు సినీ నటి దాసరి రామతిలకం. నవ్వడం, నవ్వించడం లాంటివి చిన్నప్పుడు గిరిజ గారికి తెలియదు. బాల్యంలో తనకు చదివే సర్వస్వం. బాగా చదువుకోవాలి అందరి చేత శెభాస్ అనిపించుకోవాలి. ఈ రెండే లక్ష్యాలు. తన తల్లి రామతిలకం గారి సినిమా ప్రభావం గిరిజ మీద ఉండేది కాదు. రామ తిలకం మద్రాసులో ఉంటే గిరిజ గారు మాత్రం తన పెద్దమ్మ దగ్గరే గుడివాడలో ఉండేవారు. తన తల్లి రామతిలకం వేసిన చింతామణి నాటకానికి ప్రేక్షకులు ఆ రోజుల్లోనే బ్రహ్మరథం పట్టారు.

తల్లి నటి రామతిలకం… 

రామతిలకం గారు బెజవాడలో జన్మించారు. రామతిలకం గారు ఆనాటి రంగస్థలం దిగ్గజాలు కపిలవాయి రామనాథ శాస్త్రి, ఈలపాటి రఘురామయ్య, సిఎస్సార్ ఆంజనేయులు, బందా కనకలింగేశ్వర రావు గార్లతో కలసి ఎన్నో నాటకాలలో నటించారు. నాటకాల లో శ్రీకృష్ణతులాభారం లో సత్యభామ, శ్రీకృష్ణ లీలలు లో యశోద, సతీసక్కుబాయి లో సక్కుబాయి పాత్రల ద్వారా ఆమె ఆంధ్రదేశంలో ఇంటింటికి పరిచయం అయిపోయింది. అప్పట్లో సినిమాలకు వేరే నటులు అంటూ ఉండేవారు కాదు. రంగస్థలం నటులే సినిమాలలో తారలుగా చెలామణి అయ్యేవారు. అలా రామతిలకం గారు కూడా సినిమా తార అయిపోయింది.

ఏ చింతామణి వేషంతో తాను తెలుగునాట తాను ప్రసిద్ధి చెందిందో, అదే చింతామణి వేషంతో తాను తొలి చిత్రంలో నటించారు. కాళ్లకూరు సదాశివరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చింతామణి (1933) చిత్రాన్ని కలకత్తాకు చెందిన మదన్ థియేటర్ సంస్థ నిర్మించింది. అలా మొదలైన ప్రస్థానం అదే సావిత్రి, శ్రీకృష్ణ లీలలు, ద్రౌపతి వస్త్రాపహరణం లాంటి చిత్రాల్లో నటించారు. శ్రీకృష్ణ లీలలు చిత్రంలో రామతిలకం గారు రంగస్థలం మీద తాను వేసిన యశోద వేషాన్ని వేశారు. అందులో తాను పాడిన “కలయో వైష్ణవ మాయో” అన్న పద్యం వినడానికి ప్రేక్షకులు పదేపదే ఆ సినిమాకు వచ్చేవారు. 1938 మార్చి నెలలో తనకు ఆడపిల్ల జన్మించింది. తనకు గిరిజ అని పేరు పెట్టుకున్నారు.

తెలుగు సినిమాలు మద్రాసులో తీయడం మొదలయ్యాక అక్కడ తీసిన చండిక, జీవనజ్యోతి, విశ్వమోహిని, సత్యమేవ జయం, తెనాలి రామకృష్ణ చిత్రాల్లో నటించారు. ఇంతలో యుద్ధం వచ్చింది. మద్రాసు వాసులకు ప్రాణభయం అధికం అయ్యింది. ఎవరికి వారు ముటా ముల్లె సర్దుకుని తోచిన దిక్కుకు వెళ్లిపోయారు. రామతిలకం గారు కూడా గుడివాడ వచ్చేశారు. అక్కడ సొంతంగా ఒక నాటక సమాజం ఏర్పాటు చేసుకొని మళ్లీ ముమ్మరంగా నాటకాలు వేయడం ఆరంభించారు. యుద్ధం ముగిసిపోయాక మద్రాసులో మళ్లీ సినిమా వాతావరణం మొదలైంది. రామతిలకం గారు తిరిగి మద్రాసుకు చేరుకున్నారు. వరూధిని సినిమాలో తను నాయిక గా నటించారు. ఆ సినిమా పరాజయం పాలైంది. తిలకం సినిమా జీవితము కొడిగట్టడం ఆరంభించింది.

గిరిజ గారి సినీ నేపథ్యం…

వరూధినీ సినిమా పరాజయంతో రామతిలకం గారు మళ్ళీ గుడివాడ వెళ్ళిపోయారు. 1948లో సి.పుల్లయ్య గారి పిలుపు మేరకు రామతిలకం గారు జెమినీ వారి చిత్రం కోసం మద్రాసు వచ్చారు. కానీ ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. అప్పుడే స్కూల్ ఫైనల్ లో ఉత్తీర్ణులైన గిరిజ గారు కూడా తల్లి రామతిలకం వెంట మద్రాసుకు వచ్చారు. అక్కడ గిరిజ గారు సినిమా పెద్దలు ఎల్.వి.ప్రసాద్ ల్, సౌందర రాజన్, కె.యస్.రామచంద్ర రావు గార్ల దృష్టిని ఆకర్షించింది. కె.యస్.రామచంద్ర రావు గారిది కూడా గుడివాడ నే. రామతిలకంకు రంగస్థలం సహచరుడు. గిరిజ గురించి తానే కస్తూరి శివరావు గారికి చెప్పారు.

తొలి చిత్రం పరమానందయ్య శిష్యులు...

శివ రావు గారు అప్పట్లో కథానాయకులతో సమానంగా గ్లామర్ ఉన్న హాస్యనటులు. వారు చిత్రీకరించిన పరమానందయ్య శిష్యులు కథలో  గిరిజ గారిని హేమ అనే పాత్రకు ఎంపిక అయ్యింది. తన తొలి నాయకుడు మరెవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు గారు. చదువుకునే రోజుల్లో తాను తెలుగు తల్లి నాటకంలో వేసిన లక్ష్మీ పాత్ర తప్ప గిరిజ గారికి నాటక అనుభవం పెద్దగా లేదు. సంగీతం నేర్చుకుంది, హార్మోనియం వాయిస్తూ వర్ణాలు, కృతులు పాడేవారు. పరమానందయ్య శిష్యులు అంతగా ఆడలేదు. అప్పటికే గిరిజ గారికి సినిమా వాసన బాగా వంట పట్టేసింది. తర్వాత సౌందర్ రాజన్ గారు తీసిన అదృష్టదీపుడు (1950) లో గిరిజ గారికి చిన్న వేషం ఇచ్చారు. రెండో సినిమాలోని ఇలా చిన్న వేషం వేయవలసి వచ్చిందని గిరిజ గారు బాధపడలేదు. చిన్నగా ఎదగడం మంచిది అనుకుంది.

పరమానందయ్య శిష్యుల కథ సినిమా నిర్మాణంలో ఉండగానే గిరిజ గారు రేలంగి గారి దృష్టిలో పడ్డారు. రేలంగి గారి సిఫారసుతోనే విజయ వారి “పాతాళ భైరవి” లో దేవత వేషం సంపాదించుకున్నారు గిరిజ గారు. “పాతాళ భైరవి” గిరిజను యావదాంధ్ర దేశానికి సన్నిహితం చేసింది.

ఆ సినిమాలో గిరిజ గారి “పలికే నరుడా ఏమి నీ కోరిక” అన్న సంభాషణ వాడవాడలా మారుమ్రోగిపోయింది. దేవదాసు నిర్మాత డి.ఎల్.నారాయణ గారు తన “స్త్రీ సాహసం” లో కోమలి పాత్ర ఇచ్చారు.

అదృష్టదీపుడు సినిమాలో గిరిజ గారిది చిన్న వేషం అయినా అది పుల్లయ్య గారిని ఆకట్టుకుంది.

ఆయన తాను తీసిన “ధర్మదేవత” లో గిరిజ గారికి ప్రాముఖ్యమున్న వేషం ఇచ్చారు.

అందులో గిరిజ గారు పోషించిన వాసంతి వేషం తనకు మంచి పేరు సంపాదించి పెట్టింది.

తల్లి రామతిలకం మరణం…

ఆడజన్మ సినిమా కూడా గిరిజ గారికి బాగా పేరు తెచ్చి పెట్టింది. గిరిజ గారు సినిమాల్లో నిలదొక్కుకుంటున్న సమయంలో విధి గిరిజ గారిని చిన్న చూపు చూసింది. చిన్నప్పటి నుండి తనను ప్రాణపదంగా చూసుకుంటూ వచ్చిన తన తల్లి రామతిలకం గారు కన్ను మూశారు. 47 ఏళ్లకే కనిపించని లోకాలకు వెళ్ళిపోయింది. చెన్నపట్నంలో గిరిజ గారు ఒంటరి అయ్యారు. తల్లి వినియోగబాధను మర్చిపోవడానికి పనిలో మరింత మమేకమైనారు గిరిజ గారు. అప్పటికే తాను మద్రాసు చేరి మూడేళ్లు అయ్యింది. తమిళం బాగా నేర్చుకున్నారు. తనకు తెలుగుతో బాటు తమిళంలో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

గిరిజ గారు కోడరికం (తమిళంలో మామియార్), ప్రతిజ్ఞ (తమిళంలో పంజం), మా ఇల్లు (తమిళంలో ఎన్ వీడు) ఇలా రెండు భాషల చిత్రాల్లో నటించారు. మరోవైపు తెలుగు లో ప్రజాసేవ, లక్ష్మి చిత్రాల్లో నటించారు. గిరిజ గారు “మనోహర” అనే చిత్రంతో ఉభయ భాషల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ సినిమా హిందీలో కూడా విడుదలైంది. అలా తాను ఉత్తరాది వారికి కూడా పరిచయం అయ్యారు. తమిళంలో తిరుంబిపార్ (1953), అసైమగన్ (1953) వంటి చిత్రాల్లో నటించారు. తన తొలి చిత్రం పరాజయం పాలవ్వడంతో గిరిజ గారు తర్వాత చిత్రాలన్నిటిలో కూడా ఉప నాయికతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అంజలీదేవి, సావిత్రి, జమున, కృష్ణకుమారి గార్లతో పోలిస్తే గిరిజ గారికి అంత అందచందాలు లేకపోయాయి.

హాస్య పాత్రల వైపు..

అభినయ సామర్థం ఒక్కటే తారను నిలబెట్టలేని పరిస్థితి ఆ నాటికి వచ్చేసింది. దాంతో గిరిజ గారు మెల్లిగా హాస్య పాత్రల వైపు ముగ్గు చూపడం ప్రారంభించారు. రేలంగితో జత కట్టారు. ఒకవైపు ఇతర పాత్రలు చేస్తూ హాస్య పాత్రలో నటించడం ప్రారంభించారు. ఈ మార్పును క్రమేపి అమలుపరుస్తూ వచ్చింది. అప్పుచేసి పప్పుకూడు, నమ్మినబంటు, అన్నపూర్ణ వీళ్ళ జంటను బాక్సాఫీసు విజయ సూత్రంగా నిర్ధారించాయి. తర్వాత కాలంలో తన కుల గోత్రాలు వంటి సినిమాల్లో పద్మనాభం గారితో, ప్రేమించి చూడు వంటి సినిమాల్లో చలం గారితో కూడా జతకట్టారు. 

సమాజం (1960) సినిమాలో గిరిజ గారు వేసిన సాత్విక వేషం అద్భుతంగా ఉండి ప్రేక్షకుల మెప్పు పొందింది. అలాగే భార్యాభర్తలు (1961) లో వేశ్య పాత్ర కూడా బావుంది. భలే రాముడు, భలే అమ్మాయిలు, ఎమ్మెల్యే, నమ్మినబంటు, మంచి మనసుకు మంచి రోజులు, అత్తా ఒకింటి కోడలే, మా ఇంటి మహాలక్ష్మి, అన్నపూర్ణ, కులదైవం, ఋణానుబంధం, వెలుగునీడలు, జగదేకవీరుని కథ, టాక్సీ రాముడు, శభాష్ రాజా, టైగర్ రాముడు, ఆత్మబంధువు, ఆరాధన, లవకుశ, అనురాగం, లక్షాధికారి, మైరావణ, వారసత్వం, అమరశిల్పి జక్కన్న ఇవన్నీ గిరిజ గారి చలనచిత్ర యాత్రలో కొన్ని మజిలీలు. గిరిజ గారు 100కు పైగా సినిమాల్లో నటించారు.

రేలం “గి” రిజల జంట...

1950 – 60ల పథమార్థం లోనూ రేలంగి, గిరిజ గార్ల జంట తెలుగు చిత్రసీమకు కాసుల పంట.

వీరిరువురు విజయవంతమైన ఎన్నో సినిమాకు ఆనాడు ఆలంబన అయ్యారనేది అక్షర సత్యం. “అప్పుచేసి పప్పుకూడు”, “ఆరాధన”, “రాముడు భీముడు” వంటి చాలా చిత్రాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.

“ఆరాధన” సినిమాలో వీళ్ళిద్దరి మీద తీసిన “ఓహోహో మావయ్య ఇదేమయ్య బలెబలే బాగు ఉందయ్యా” పాట ఆరోజుల్లో ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో కథానాయకుడిది ఏకపక్ష ప్రేమ.

కథానాయిక తనను చీదరించుకుంటూ ఉంటుంది. చిట్టచివరిలో గాని అతను ఎంత గొప్ప ప్రేమికుడో కథానాయికకు అర్థం కాదు.

అందువలన వాళ్ళిద్దరికీ యుగళగీతాలు ఉండవు. మరి సినిమా నీరసం కాకూడదనే ఉద్ధేశ్యంతో రేలంగిరిజ హాస్య జంటల మీద రెండు యుగళగీతాలు పెట్టారు.

అందులో ఒక పాట వాళ్ళ విహారయాత్ర సందర్భంగా వచ్చేది.

తెరమీద పాట ప్రత్యక్షంగా కాగానే థియేటర్లలో ప్రేక్షకులు ఆనందం అంతా ఇంతా కాదు.

అప్పుచేసి పప్పుకూడు లో “కాశీకి పోయాను రామాహరి” పాట, రాముడు భీముడు లో “సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు తాగు బలే సిగరెట్టు” పాట ఆనాడు సగటు సినిమా ప్రేక్షకుని ఎంతగా గిలిగింతలు పెట్టాయో ఆ తరం ప్రేక్షకులందరికీ తెలుసు.

ఆరాధన సినిమాలో రేలంగి, గిరిజలకు రెండు యుగళగీతాలు ఉన్నాయంటే వాళ్ళ జంటకు ఆ రోజులలో ఎంతటి ప్రేక్షకాధరణ ఉందో ఊహించుకోవచ్చు. రేలంగిరిజ ల బాక్సాఫీస్ మహిమ అది.

తగ్గిన తన ప్రాభవం…

60వ దశకం వచ్చేసరికి గీతాంజలి, మీనా కుమారి వంటి కొత్త తారలు వచ్చేసారు. గిరిజ గారికి పోటీ పెరిగింది. కుర్ర తారగా తను వేసిన చివరి హాస్యవేశం  ప్రేమించి చూడు చిత్రం కావచ్చు. అప్పటికే తనలో ఆ మునుపటి చమక్కు తగ్గిపోయింది. తాను జంటగా నటించిన చలం ప్రక్కనే పెద్దగా కనిపించింది. అదే ఏడాది వచ్చిన సుమంగళి లో పద్మనాభం పిన్నిగా తల్లిపాత్రలకు మారిపోయింది. సినిమా జీవితంలో వచ్చిన ఈ స్తబ్ధతను తాను కూడా గుర్తించింది. రేలంగి, గిరిజల స్థానంలో పద్మనాభం, గీతాంజలి జంట ముందుకు వచ్చింది. 1970 లకు వచ్చేసరికి రాజబాబు, రమాప్రభ లు పాపులర్ అయ్యారు. అప్పటికి రేలంగిని, గిరిజలను ప్రేక్షకులు మర్చిపోయారు.

రేలంగి గారు కన్నుమూశారు. గిరిజ గారిని తలుచుకునే వారే కరవయ్యారు. రామతిలకం గారికి గిరిజ ఏకైక సంతానం. గిరిజ గారికి కూడా ఒక్కతే కూతురు. పేరు శ్రీ గంగ. కుటుంబంలో మూడోతరం తారగా శ్రీ గంగ ను సినిమాలకు తీసుకురావాలని దాసరి నారాయణరావు గారు తీసిన మేఘసందేశం లో అక్కినేని కుమార్తెగా నటింపజేశారు. కానీ ఆ తరువాత ఆ అమ్మాయి ఎందుకనో సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు గిరిజ గారిని అతలాకుతలం చేశాయి.

వ్యక్తిగత జీవితము..

గిరిజ గారికి 17 యేళ్ళ వయస్సులోనే తన తల్లి గారు మరణించారు. దాంతో తనకు అండగా ఎవ్వరూ లేకపోవడంతో నిర్మాత, దర్శకుడు సి.సన్యాసిరాజు గారిని వివాహమాడింది.

గిరిజ గారి భర్త సన్యాసిరాజు, తన భార్య పేరుతో విజయ గిరి ధ్వజా ప్రొడక్షన్స్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలి గార్లతో భలే మాస్టారు సినిమా తీశారు.

ఆ సినిమా పెద్దగా విజయవంతం అవ్వలేదు. 1971లో ఎన్టీఆర్, చంద్రకళ గార్లతో పవిత్ర హృదయాలు తీశారు. ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవటంతో గిరిజ గారు సంపాదించిన ఆస్తంతా కోల్పోయారు.

మద్రాసు లో గల రెండంతస్థుల విశాలమైన భవనం అప్పులతో చేజారిపోయింది.

రేలంగి గారు మరణించిన తరువాత తనకు సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయి.

సొంత ఇల్లు కోల్పోయి చివరకు చిన్న అద్దె గదిలోకి మారే పరిస్థితి ఏర్పడింది. పూట గడవని స్థితికి వచ్చింది.

రాజశ్రీ, “భీష్మ” సుజాత వంటి సహ నటీమణుల ఆదరణతో ఎలాగో కొంతకాలం తన బ్రతుకు బండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది.

ఈమె కూతురు శ్రీరంగ, దాసరి నారాయణరావు గారు నిర్మించిన మేఘసందేశంలో అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించింది.

ఆ తరువాత సలీమాగా అనేక మలయాళం సినిమాలలో నటించి మంచినటిగా పేరు తెచ్చుకున్నారు.

చిత్ర సమాహారం…

నవ్వితే నవరత్నాలు (1951) , పాతాళభైరవి (1951) , ధర్మదేవత (1952) , భలేరాముడు (1956)

భలే అమ్మాయిలు (1957) , దొంగల్లో దొర (1957) , ముందడుగు (1958) , రాజనందిని (1958)

అప్పుచేసి పప్పుకూడు (1959) , మనోరమ (1959) ,రాజా మలయసింహ (1959) , రేచుక్క పగటిచుక్క (1959)

ఇల్లరికం (1959) , దైవబలం (1959) , పెళ్ళికానుక (1960) , భట్టి విక్రమార్క (1960)

సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960) , బాగ్దాద్ గజదొంగ (1960) , ఋణానుబంధం (1960)

కులదైవం (1960) , ఇంటికి దీపం ఇల్లాలే (1961) , జగదేకవీరుని కథ (1961), భార్యాభర్తలు (1961)

వెలుగునీడలు (1961) , సిరిసంపదలు (1962) , ఆరాధన (1962), పరువు ప్రతిష్ఠ (1963) , బందిపోటు (1963)

ఈడు జోడు (1963) , రాముడు-భీముడు (1964), కలవారి కోడలు (1964) , ప్రేమించి చూడు (1965)

మంగమ్మ శపథం (1965) ,నవరాత్రి (1966) , ఆస్తిపరులు (1966) ,రహస్యం (1967) ,ఆడదాని అదృష్టం (1974)…

శివైక్యం…

అద్భుతమైన నటీనటులతో తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని చవిచూసిన అదృష్టవంతులలో గిరిజ గారు కూడా ఉన్నారు.

అనుబంధాలు, ఆప్యాయతలకు అలవాలమైన కాలమది. నటీమణులకు కూడా మంచి సంప్రదాయాలు, అలవాట్లు ఉండేవి.

పండుగ వచ్చిందంటే ఇంటి నుంచి గారెలు, బూరెలు తెచ్చి చిన్నా, పెద్దా అందరికీ ఇచ్చేవారు.

ఇత్యాది విషయాలలో సూర్యకాంతం గారిది అగ్రతాంబూలం. తరువాత వరుసలో గిరిజ, షావుకారు జానకి, కృష్ణకుమారి గార్లు ఉండేవారు.

వారు చిత్రీకరణ కు వస్తున్నారంటే వారు ఏదో ఒకటి తినుబంఢారాలు వస్తాయన్న నమ్మకం కార్మికులలో ఉండేది. వాటికోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు.

తేనాంపేటలో నటి గిరిజ గారికి లంకంత ఇల్లు ఉండేది.

అగ్ర కథానాయికలకు ధీటుగా మేడ మీద ఎయిర్ కండీషన్ గదులు కూడా ఉండేది. గిరిజ గారు ఎంతో దర్జాగా బ్రతికారు.

తనకు సినిమాలు తగ్గేసరికి ఆ ప్రాభవం కూడా మెల్లమెల్లగా తరిగిపోవడం ఆరంభించింది.

మేడలు, కార్లు అన్నీ కూడా సినిమాల్లో మాదిరిగా అంతర్థానమయ్యాయి. తాను ఒక మనిషిగా బాగా దిగులు పడిపోయింది, చిక్కిపోయింది.

చివరికి కనీస అవసరాలకు కూడా తడుముకునే పరిస్థితి వచ్చింది. హాస్య నటుల్లో చాలామందికి ఈ పరిస్థితి ఎందుకు దాపురించేదో ఇప్పటికీ అర్థం కాదు.

నటి గిరిజ గారు దీనస్థితిలో ఉన్నప్పుడు ఒక సినిమాలో పేదరాలి పాత్ర వేషం వచ్చింది.  తనున్న పరిస్థితికి ఆహార్యం విషయంలో సరిగ్గా సరిపోయింది.

కానీ రెండు రోజులు చిత్రీకరణ జరిగాక తనను ఆ చిత్రం నుండి తప్పించారు. అందులో పేదరాలి వేషమే.

కానీ ఈ పేదరాలు మొదట్లో బాగా డబ్బున్న మనిషిగా ఉండాలి. ఫ్లాష్ బ్యాక్ లో ఆ సన్నివేశాలు వస్తాయి. ఆ సన్నివేశంలో రాజసం ఉట్టిపడ్డట్టు కనిపించాలి.

తన స్వరూపం అందుకు తగ్గట్టు లేదు. తనకు కొంత పారితోషికం ఇచ్చి ఆ సినిమా నుండి తప్పించేశారు.

ఏ తారకు ఇది తట్టుకోలేని కష్టం. అయినా నటి గిరిజ గారు ఏనాడు తన పేదరికాన్ని కనబడనిచ్చేది కాదు.

చివరికి ఆజ్ఞాతంలోనే, అంధకారంలోనే 05 సెప్టెంబరు 1995 లో కన్ను మూసింది.  నవ్వులన్నీ మనకు పంచి, కన్నీళ్లు కష్టాలను తనతో పట్టుకుపోయింది.

Show More
Back to top button