CINEMATelugu CinemaTelugu Special Stories

తన సినిమాలతో అభ్యుదయ భావాలను ఎలుగెత్తి చాటిన దర్శకులు.. టి.కృష్ణ..

చలనచిత్ర పరిశ్రమ లో సినిమా అన్న మూడ‌క్ష‌రాలు, వినోదం అనే మూడ‌క్ష‌రాల‌కే ప‌రిమితం కాకుండా స‌మాజంలోని సాంఘిక‌, ఆర్ధిక‌, రాజ‌కీయ కోణాల‌ను స్పృశిస్తూ వాటిలోని లోటుపాట్ల‌ను, అమాన‌త‌ల‌ను, అనైతిక‌త‌ను ప్ర‌శ్నిస్తూ, ఎన్నో సామాజిక అంశాల‌ను పూస‌గుచ్చిన‌ట్లు చూపించి పాల‌కుల అవినీతి అరాచ‌కాల‌పై తూటాలను ఎక్కుపెట్టేలా చేసే దర్శకులను అభ్యుదయవాద దర్శకులుగా మనం గుర్తిస్తాము. ఆ కోవకు చెందినవారే అభ్యుదయ దర్శకులు టి.కృష్ణ గారు.

వినూత్న భావాల‌కు, విల‌క్ష‌ణ చిత్ర క‌థా క‌థ‌నాల‌కు తెలుగు చిత్ర‌రంగం ప్రేక్ష‌కులు నాటి సంచ‌ల‌న చిత్రం మాల‌పిల్ల‌ నుంచి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, దాంతో సామాజిక ప్రయోజనాల్ని కూడా పొందవచ్చని దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం గారు నిరూపించారు. తాను తీసిన సినిమాలతో సామాజిక పరమార్థం ఏంటో సినీజనాలకు తెలిసేలా చేశారు. “మాలపిల్ల”, “రైతుబిడ్డ” చిత్రాల ద్వారా సినిమాకి సామాజిక పరమార్థమేంటో నేర్పించారు.

న‌డుస్తున్న సమాజంలో మ‌నం నిత్యం ఎన్నో రంగాల‌లో చూస్తున్న అస‌మాన‌త‌లు, అక్ర‌మాలు, అమాయ‌కులు దోపిడీకి గురికావ‌డం, సామాజిక భ‌ద్ర‌త లేక‌పోవ‌డం, ఇలా ఒక‌టేమిటి ఎన్నో స‌మ‌స్య‌ల‌ను స్పృశిస్తున్న క‌థా క‌థ‌నాల‌తో టి కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీకరించిన చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డ‌మే కాదు, ఆలోచింప‌చేశాయి కూడానూ. వామపక్ష విద్యార్థిగా యువజన ఉద్యమాల పట్లకర్షితుడైన టి.కృష్ణ గారు విద్యార్థి సమాఖ్య, యువజన సమైక్యాంధ్రప్రదేశ్ లో ప్రజానాట్యమండలి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. ప్రజానాట్యమండలి క్రింద తాను అనేక నాటకాలలో నటించి దర్శకత్వం వహించారు.

అతి చిన్న వయస్సు లోనే తాను ప్రజల సమస్యలు, సామాజిక సమస్యలను ప్రతిబించే కథలతో అత్యంత సాహసవంతంగా చిత్రాలను నిర్మించి, ఆయా సమస్యల పట్ల ప్రజలలో, సమాజంలో ఆలోచనలు రేకెత్తించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన “నేటి భారతం”, “దేశంలో దొంగలు పడ్డారు”, “రేపటి పౌరులు” లాంటి చిత్రాలను చిత్రీకరించిన కృష్ణ గారు దర్శకత్వం వహించిన “దేవాలయం”, “వందేమాతరం”, “ప్రతిఘటన” (తెలుగు, కన్నడం) చిత్రాలు సినిమా మీడియంలో నూతన ఒరువడిని సృష్టించాయి. ఈ చిత్రాలన్నీ ఎన్నో అవార్డులు పొందాయి.

అతి పిన్న వయస్సులో (36 సంవత్సరాలకే) మరణించిన టి.కృష్ణ గారు కేవలం ఏడు చిత్రాలకే దర్శకత్వం వహించి దర్శకుడిగా విశేష సంచలనం సృష్టించారు. తాను దర్శకత్వం వహించిన ప్రతీ చిత్రం తనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    తొట్టెంపూడి కృష్ణ

ఇతర పేర్లు  :    టి.కృష్ణ 

జననం    :     1 సెప్టెంబర్ 1950  

స్వస్థలం   :    కాకుటూరి వారిపాలెం, ఆంధ్ర ప్రదేశ్ , భారతదేశం

వృత్తి      :    చిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్

తండ్రి    :   వెంకట సుబ్బయ్య

తల్లి     :   రత్తమ్మ

జీవిత భాగస్వామి    :   కోటేశ్వరమ్మ 

పిల్లలు   :      ముగ్గురు, గోపీచంద్ తో సహా 

మరణం    :   21 అక్టోబరు 1987, 

మద్రాసు , తమిళనాడు , భారతదేశం

నేపథ్యం…

తొట్టెంపూడి కృష్ణకుమార్‌ (టి. కృష్ణ) గారు 01 సెప్టెంబరు 1950 నాడు ప్రస్తుత ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా ) టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెం లో రత్తమ్మ మరియు వెంకట సుబ్బయ్య దంపతులకు జన్మించారు. కృష్ణ ఒంగోలులోని సి.ఎస్‌.ఆర్ శర్మ కళాశాలలో బిఎ పూర్తి చేశారు. కళాశాల జీవితం, మిత్రుల సాహచర్యం, “అన్న” నల్లూరు వెంకటేశ్వర్లు పరిచయం టి. కృష్ణ గారిని మేటి కళాకారుడిగా, సంచలన సినీ దర్శకుడిగా తీర్చిదిద్దింది.

చదువు కోసం మొదట టి.కృష్ణ గారు 1965లో ఒంగోలుకు వచ్చారు. తాను ఠాగూరు ట్యుటోరియల్‌ కళాశాలలో మెట్రిక్‌ చదువు కోసం వచ్చి “స్టూడెంట్‌ ఫెడరేషన్‌ మెస్‌” లో చేరారు. ప్రజానాట్య మండలి ఒడిలో, నల్లూరు వెంకటేశ్వర్లు శిక్షణలో పెరిగిన కృష్ణ గారు తెలుగు చలనచిత్ర రంగంలో సంచలనాలు సృష్టించే అభ్యుదయ దర్శక శిఖరంగా ఎదిగారు. సాధారణంగా సైన్స్‌ కోర్సు అయితే ప్రాక్టికల్స్‌ (ప్రయోగాలు) ఉంటాయని, నాటక ప్రదర్శనలకు అవాంతరం కలుగకూడదనే ధ్యేయంతో బీ.ఏ కోర్సు తీసుకుని పూర్తిచేసారు.

టి.కృష్ణ గారికి నాటకరంగం పట్ల విపరీతమైన మక్కువ. దాంతో తాను పలు నాటక పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు సాధించారు. తాను చక్కటి గాయకులు కూడానూ. మాదాల రంగారావు,  ఎం.వీ.ఎస్‌. హరనాథరావు, ఇసుకపల్లి మోహనరావు గార్లు తదితరులు కూడా తనతో కలిసి నాటకాలలో పాల్గొనేవారు. బొల్లిముంత శివరామకృష్ణ గారు రచించిన “సంభవామి యుగేయుగే” నాటిక టి.కృష్ణ గారికి మంచి పేరు తీసుకువచ్చింది. 1974లో ఖమ్మంలో జరిగిన “ప్రజా నాట్య మండలి” శిక్షణ సభల్లో గురజాడ వేషధారణతో టి.కృష్ణ గారు అందరినీ అలరించారు.

సినీ నేపథ్యం..

టి.కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా స‌మాజంలో అణ‌గారిన వ‌ర్గాల‌లోని స్త్రీల బ‌తుకులు, వారి జీవితాల‌ను అధోగ‌తి లోకి నెట్టి వారి జీవ‌న గ‌మ‌నాన్ని అత‌లాకుత‌లం చేసే వారివ‌ల్ల ఆ మ‌హిళ‌ల మ‌నుగ‌డ ఎలా ఊహించ‌ని మార్పుల‌కు బ‌లి అవుతుందో, ర‌సార్ద్రంగా చిత్రీక‌రించ‌డం తన చిత్రాల‌లో ప్ర‌తిఫ‌లిస్తుంది. దర్శకుడు టి.కృష్ణ గారు తొలి నుంచి అభ్యుదయ భావాలతో సాగిన ఘనుడు. చదువుకునే రోజుల్లోనే ఆయన మనసు కళల పట్ల ఆకర్షితమైంది. ఎర్రజెండా నీడన వెలిగిన ఒంగోలు పరిసర ప్రాంతానికి చెందినవాడు కావడం వలన టి.కృష్ణ గారి మదిలోను అభ్యుదయవాదం తాండవించింది. మిత్రులు మాదాల రంగారావు, పోకూరి బాబురావులతో కలిసి ఆరంభంలో చిత్ర నిర్మాణంలో రచనలలోనూ పాల్పంచుకున్న టీ.కృష్ణ గారు తర్వాతి రోజుల్లో మెగా ఫోన్ పట్టి దర్శకత్వం కూడా చేశారు.

టి.కృష్ణ గారు 1969లో గుత్తా రామినీడు వద్ద ఒక సినిమాకు టి. కృష్ణ  సహాయ దర్శకుడిగా పనిచేసారు. తరువాతి కాలంలో అభ్యుదయ చిత్రాలకు చిరునామాగా మారారు. మాదాల రంగారావు తీసిన యువతరం కదిలింది, విప్లవ శంఖం, ఎర్రమల్లెలు చిత్రాలకు ఆయన సహకారం అందించారు. తొలిసారిగా టి.కృష్ణ గారి దర్శకత్వంలో శోభన్ బాబు, మంజుల లు జంటగా నటించిన “మొనగాడు” చిత్రాన్ని టి.త్రివిక్రమరావు గారు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1976 సెప్టెంబర్ 30వ తేదీన విడుదలయ్యింది. మరో మిత్రుడు పోకూరి బాబూరావుతో కలసి ఈ తరం బ్యానర్‌పై “నేటి భారతం” తీసి సంచలనం సృష్టించారు.

ఈతరం పిక్చర్స్..

చదువుకొనే రోజుల్లో మిత్రులతో కలసి సినిమాల గురించి చర్చిస్తూ ఉండేవారు పోకూరి బాబూరావు గారు. ఒంగోలు సి.ఎస్.ఆర్.శర్మ కాలేజ్ లో బి.కామ్. చదివే సమయంలో టి.కృష్ణ గారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి భావాలు కలవడంతో మంచి మిత్రులయ్యారు. కళాశాలలో ప్రత్యేక ఉత్సవాల్లో ఇద్దరూ కలసి పాటలు పాడేవారు. నాటకాలు వేసేవారు. చదువు పూర్తయ్యాక టి.కృష్ణ గారు మద్రాసు చేరి, అక్కడ గుత్తా రామినీడు వద్ద అసోసియేట్ గా పనిచేశారు. అయితే సినిమా రంగం నచ్చక తిరిగి వచ్చేశారు. బాబూరావు ఎమ్.కామ్ పూర్తి చేసి, ఆంధ్రా బ్యాంక్ లో ఉద్యోగంలో చేరారు.

మిత్రులిద్దరూ తరచూ కలుసుకొనేవారు. బాబూరావు, టి.కృష్ణ ఇద్దరూ “ప్రజానాట్యమండలి” వైపు ఆకర్షితులయ్యారు. అక్కడే మాదాల రంగారావు గారితో పరిచయం ఏర్పడింది. మాదాల గారి “యువతరం కదిలింది” చిత్రాన్ని నిర్మించే సమయంలో బాబూరావు, టి.కృష్ణ గార్లు ఆ సినిమాకు పనిచేశారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. మాదాల గారితో కలసి “విప్లవశంఖం”, “ఎర్రమల్లెలు” చిత్రాలకు కూడా బాబూరావు, కృష్ణ గార్లు పనిచేశారు.

ఆ తరువాత మిత్రులిద్దరూ కలసి “ఈ తరం పిక్చర్స్” పతాకంపై తొలి ప్రయత్నంగా “నేటి భారతం” నిర్మించారు. టి.కృష్ణ గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ సినిమాకు బాబూరావు గారి సోదరుడు వెంకటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించేవారు. టి.కృష్ణ దర్శకత్వంలోనే “దేశంలో దొంగలు పడ్డారు”, “రేపటి పౌరులు” చిత్రాలు నిర్మించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. దాంతో సినిమా రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించి, బాబురావు గారు బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు.

నేటి భారతం…

టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన “నేటి భారతం” సినిమా అప్పట్లో ఓ సంచలనం.

సుమన్ హీరోగా , విజయశాంతి హీరోయిన్ గా చేసిన ఈ సినిమా లోని పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. “మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం” గీతం ఇప్పటికీ అజరామరం.

నేటి భారతం కథ తయారుచేసి, ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ ను స్థాపించారు. అప్పటికే 4, 5 సినిమాలు చేసిన సుమన్ గారిని కలిసి డేట్స్ తీసుకున్నారు.

మాదాల రంగారావు గారి “నవోదయం” చిత్రీకరణ జరుగుతుంటే టి.కృష్ణ గారు అక్కడికి వెళ్లారు.

ముచ్చర్ల అరుణ, కవిత తో పాటు మరో అమ్మాయిపై షాట్స్ తీస్తున్నారు. ఆ అమ్మాయి భారతి పాత్రకు సరిపోతుందని కృష్ణ గారు నిర్ణయించుకున్నారు.

1983 జూన్ 15న చిత్రీకరణ, మద్రాసులోనే మొత్తం షూటింగ్ 50 రోజుల లోపే తీసేసారు.

సమయానికి ఎవరూ దొరక్క వేరు శెనక్కాయలు అమ్మకునే వేజెళ్ళ రాజేశ్వరికి ప్రేమికుడిగా, భర్తగా టి.కృష్ణ గారు నటించారు. “భారత మాతను నేను బందీనై పడివున్నాను” అంటూ శ్రీ శ్రీ గారు మంచం మీద ఉండి వ్రాసిన ఈ పాట హైలెట్.  “మానవత్వం పరిమిళించే” పాటను సితార విద్వాంసులు “రవిశంకర్ ప్రసాద్” బిట్ ఆధారంగా చక్రవర్తి స్వరపరిచారు.

వేశ్య గృహం నడిపే పాత్రను ఎస్.వరలక్ష్మి చేత అతికష్టం మీద టి.కృష్ణ గారు ఒప్పించి చేయించారు.

విజయశాంతికి ఇది 11వ సినిమా. పోకూరి బాబురావు గారు లక్ష రూపాయలతో సినిమా మొదలుపెట్టి, తరచూ ఒంగోలు వచ్చి ఫ్రెండ్స్ దగ్గర అప్పుచేసి పట్టుకెళ్ళేవారు. విషయం తండ్రి గ్రహించి , ధైర్యం ఇచ్చారు.

బ్యాంకు లో పనిచేయడం వలన తన పేరు కాకుండా తన తమ్ముడు వెంకటేశ్వరరావు పేరు వేశారు. 14 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఒంగోలులో జరిగిన 100 రోజుల వేడుకకు ఎం.ఎస్.రెడ్డి, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటివారు హాజరయ్యారు.

చక్రవర్తి అందుకున్న తొలి నంది అవార్డు ఈ సినిమాకే కావడం విశేషం.

బెస్ట్ డైరెక్టర్ గా టి.కృష్ణ, బెస్ట్ యాక్టర్ గా పి.ఎల్.నారాయణ అవార్డులు అందుకున్నారు.

ప్రతిఘటన…

అన్ని కులాలు, మ‌తాల‌తో పాటు ఆర్ధికంగా, సామాజికంగా కూడా విభిన్న త‌ర‌గ‌తుల స‌మాజం లో ఉంటారు.

ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబ మ‌హిళ త‌న క‌ళ్ళ ముందు ఒక రాజ‌కీయ గూండా చేస్తున్న దుర్మార్గాన్ని, అకృత్యాల‌ని ఎలా ఎదుర్కొంది? అందుకు ఆమెను ప్రేరేపించిన సంఘ‌ట‌న‌లు, సంద‌ర్భం ఏమిటి అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో ప్ర‌తిఘ‌ట‌న‌ చిత్రంలో క‌థానాయ‌కి పాత్ర‌ను సృష్టించ‌డం జ‌రిగింది.

“ప్రతి భారతి సతిమానం చంద్రమతీ మాంగల్యం, మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం..

శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే మానవరూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే..

కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో..

నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుందీ సభ్యసమాజం ఏమైపోతుందీ మానవధర్మం..

ఏమైపోతుందీ ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం.. 1985లో విడుదలైన ప్రతిఘటన చిత్రంలోని పాట ఇది.

ఇందులో కథానాయిక విజయశాంతి కళాశాల అధ్యాపకురాలు. కొందరు విద్యార్థులు తరగతి గదిలో బ్లాక్ బోర్డుపై స్త్రీ బొమ్మల్ని నగ్నంగా చిత్రిస్తారు.

క్లాసులోకి వచ్చిన విజయశాంతి ఆ బొమ్మలు చూసి కోపంతో స్త్రీ ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించే సందర్భంలో వేటూరి గారు వ్రాసిన పాట.

ఆ పాత్ర నేటి యువ‌త‌కు అత్యంత ఆద‌ర్శ‌ప్రాయ‌మైన‌ది. మ‌న చుట్టుప‌క్క‌ల ఏం జ‌రిగినా మ‌న‌కెందుకులే అని ప‌ట్టించుకోకుండా పోయే వారి క‌ళ్ళు తెరిపించి, వారిలో సామాజిక చైత‌న్యం క‌లిగించిన పాత్ర అది. ఇటువంటి స‌మాజ స‌మ‌స్య‌ల‌కు, ఇలా ముగింపు చెప్పినా త‌ప్పులేదు అని నిర్భ‌యంగా ప్ర‌వ‌ర్తించిన ఆ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టి విజ‌య‌శాంతి గారి న‌ట‌న కూడా ఆ పాత్ర‌కు జీవం పోసింది. ఆ నటనే చిత్ర ఘనవిజ‌యానికీ కార‌ణ‌మైంది.

ఇదే చిత్రాన్ని ద‌ర్శ‌కులు టి. కృష్ణ గారు హిందీలో “ప్ర‌తిఘాత్‌“ పేరుతో రూపొందించారు. దాంతో అక్క‌డ కూడా ఆ సినిమా విజ‌యం సాధించింది.

అన్యాయాలు, అక్రమాలు తన సినిమా కథా వస్తువులు..

టి.కృష్ణ గారికి సినిమా అనేది వినోదం కాదు, సందేశం పంచే మాధ్యమం. తనకు సినిమా వ్యాపారం కాదు, వ్యవహారం.

తాను అనుకున్నది చెప్పగలిగే ధైర్యం. తాను నమ్మినది చూపించగలిగే తెగువ.

ఇత్యాది విషయాలతోనే సినిమాకి విలువ పెంచాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతిలే కృష్ణ గారికి కధా వస్తువులు.

వాటిని ఎదిరిస్తూ చేసే పోరాటాలే సినిమాలలో తాను చూపే పరిష్కారాలు. నేటిభారతం, ప్రతిఘటన, రేపటిపౌరులు, దేవాలయం, దేశంలో దొంగలు పడ్డారు, వందేమాతరం లాంటి సినిమాలతో ఒక సిద్ధాంతానికి, అందులోనూ స‌మాజ శ్రేయ‌స్సు కోసం నిల‌బ‌డి, త‌న‌లోని అభ్యుద‌య భావాల‌ను అంద‌రికీ తెలియ‌చెప్పాల‌ని, అందుకే క‌ట్టుబ‌డి ఆ ధోర‌ణిలోనే, చిత్ర క‌థా క‌థ‌నాల‌తో రూపొందించిన చిత్రాలు, ద‌ర్శ‌కుడు టి. కృష్ణ‌ గారిలోని వృత్తి ప‌ట్ల నిజాయితీని తెలియ‌చేస్తాయి.

ఇలాంటి సామాజిక స్పృహ‌తోనే ద‌ర్శ‌కుడు టి. కృష్ణ గారి సార‌థ్యంలో దేశంలో దొంగ‌లు ప‌డ్డారు, వందేమాత‌రం మొద‌లైన చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి.

రేపటి పౌరులు (1986) టి. కృష్ణ గారు దర్శకత్వం వహించిన అఖరు తెలుగు చిత్రం.

రాజశేఖర్, విజయశాంతి, పి.ఎల్.నారాయణ, అనురాధ నటించిన ఈ చిత్రం ఉత్తమ చలన చిత్రంగా నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.

ఈ చిత్రం కృష్ణ గారి మరణానంతరం విడుదలయ్యింది. తన వృత్తిగ‌త‌మైన ప్ర‌యాణం అలుపు ఎరుగ‌ని గ‌మ‌నం. తన ప‌థం, దృక్ప‌థం విభిన్నం, విల‌క్ష‌ణం.

చిత్ర మాధ్య‌మం ద్వారా స‌మాజంలోని చీక‌టి కోణాల‌ను వెలికితీస్తూ, స‌మాజానికి వెలుగు చూపుతూ, సినిమా అన్న‌ది కేవ‌లం వినోదం కోసం కాదు మ‌న‌లో సామాజిక స్పృహ క‌లిగించే గొప్ప వివేక మాధ్య‌మం అని గాఢంగా న‌మ్మిన ప్ర‌యోజ‌నాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు టి. కృష్ణ‌ గారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు, ప్రేక్ష‌కుల‌కు మ‌రికొన్ని ఉత్త‌మ చిత్రాల‌ను అందించ‌వ‌ల‌సిన ద‌ర్శ‌కులు టి. కృష్ణ గారు చాలా చిన్న వ‌య‌సులో మ‌ర‌ణించ‌డం అత్యంత విచార‌క‌రం. అయితే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రాలు ఆయ‌న‌ను నిత్యం స్మ‌రించుకునే విధంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

వ్యక్తిగత జీవితం…

టి.కృష్ణ గారు కోటేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె జన్మించారు. తమ కుమారులలో ఒకరైన ప్రేమ్‌చంద్ ఔత్సాహిక దర్శకులు.

అయితే 1995 వ సంవత్సరంలో తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా కారు ప్రమాదంలో మరణించారు.

టి.కృష్ణ గారి రెండవ కుమారులు గోపీచంద్ గారు కూడా ప్రముఖ తెలుగు సినిమా నటులు.

గోపీచంద్ గారు కథనాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంంభించి, ఆ తరువాత ప్రతినాయకుడి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి, మళ్ళీ హీరో గా తన ప్రతిభతో దూసుకుపోతున్నారు. టి.కృష్ణ గారి కూతురు డెంటిస్ట్.

మాములుగానే టి.కృష్ణ గారికి పుస్తకాలు, రచయితలు అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఏకంగా తన పిల్లలకు కూడా వారి పేర్లనే పెట్టుకునేటంత ఇష్టం. “కర్మభూమి”, “రంగ్ భూమి” వంటి ఎంతో గొప్ప రచనలను చేసిన ప్రముఖ బెంగాలీ రచయిత అయిన ప్రేమ్ చంద్ గారి పేరునే తన పెద్ద కుమారుడి పేరుగా ప్రేమ్ చంద్ అని పెట్టుకున్నారు.

ఇక చిన్న కుమారుడు మన అందరికి తెలిసిన హీరో గోపి చంద్ గారు. ఇక “అసమర్ధుని జీవిన యాత్ర” అనే రచనను అందించిన రచయిత గోపి చంద్ పేరు అది.

చిన్న కొడుకుక్కి గోపీచంద్ అనే పేరు పెట్టుకున్నారు. ఈ విధంగా అద్భుతమైన రచయితలపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

అస్తమించిన అభ్యుదయం…

అనతి కాలంలోనే సంచన దర్శకులుగా అవార్డు, రివార్డులు అందుకుని ప్రజా దర్శకుడుగా, అభ్యుదయవాద దార్శనికుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన టి.కృష్ణ గారు 21 అక్టోబరు 1986 నాటి తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు మద్రాసు లోని అపోలో ఆసుపత్రిలో మరణించారు.

దర్శకత్వం చేసిన చిత్రాల సంఖ్య త‌క్కువే అయినా అవి అద్భుతమైన సంచ‌నాలకు తెరలేపాయి.

ఎన్నో సామాజిక అంశాల‌ను పూస‌గుచ్చిన‌ట్లు చూపించి పాల‌కుల అవినీతి అరాచ‌కాల‌పై తూటాలను ఎక్కుపెట్టేలా చేసిన టి.కృష్ణ గారిపై మృత్యువు క‌న్నేయడం అభిమానులను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేసిందనే చెప్పాలి. 

సమాజాన్ని సంస్కరించాలన్నా, సమాజాన్ని చెడగొట్టాలన్నా సినిమా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

సమాజంలోని అనేక దారిద్రాలనని ఎత్తిచూపి, వాటి వెనుక ఉన్న హస్తాన్ని బహిర్గతం చేయడం అన్నది రెండున్నర గంటల సినిమాలో చేసే ప్రయత్నం.

ఇది చాలా కష్టమైన పని. రాజకీయ పోకడల మీద, సాంఘిక దురాచారాల మీద వ్యంగ్యధోరణిలో చిత్రించిన సన్నివేశాలు మనసుకి హత్తుకుపోయే విధంగా తన చిత్రాలలో చూపించిన అభ్యుదయవాది టి.కృష్ణ గారు అస్తమించే నాటికి తన వయస్సు 36 సంవత్సరాలు.

అంతకుముందే కృష్ణ గారు కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్నారు.

అమెరికాలో రెండు నెలల పాటు క్యాన్సర్ వ్యాధికి వైద్య చికిత్స పొంది సెప్టెంబరు నెల 29వ తేదీన మద్రాసు కు తిరిగి వచ్చారు.

అక్టోబర్ 01 నాడు అపోలో ఆసుపత్రిలో చేరినారు.

ఆరోగ్యం కుదుటపడింది అని అనుకున్న దశలో టి.కృష్ణ గారు ఆకస్మాతుగా ఆకాశంలో చుక్కలైపోయారు.

Show More
Back to top button