Telugu Special Stories

అహల్యకు మనువడు.. అంజనీపుత్రుడు! 

“శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాజనేయం!

ప్రభాదివ్య కాయం, ప్రకీర్తి ప్రదాయం,

భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం,

భజేహం, భజేహం, భజేహం!”

అంటూ భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు.

మహాబ‌లుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, వ్యాకరణకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు, వీరాంజనేయుడు…

ఇలా ఎన్నో విధాలుగా స్తుతింపబడిన హనుమా.. తల్లి అంజనాదేవి కావడంతో, ఆంజనేయుడయ్యాడు. చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చినందున పవనసుతుడయ్యాడు. శోకసంద్రానున్న సీతమ్మను ఓదార్చిన ఆ అంజనీపుత్రుడు.. మహా బలశాలి అయ్యుండీ కూడా రామబంటుగా ఒదిగాడు..

భక్తుల భయాలన్నీ పారదోలి ప్రసన్నాంజనేయుడయ్యాడు.

ఒక్కో మాసంలో ఒక్కో దేవతకు విశిష్టత ఉన్నట్లు, హనుమంతుడికి వైశాఖ మాసం ప్రత్యేకమైంది.

వైశాఖ శుక్ల ఏకాదశి హనుమ తల్లిదండ్రులైన కేసరి అంజనల వివాహం జరిగింది, వైశాఖ కృష్ణదశమి(మే 14న) స్వయంగా హనుమ జన్మించారు. హనుమద్వైభవాన్ని దధిముఖుడు వానరులకు బోధించింది ఈ వైశాఖమాసంలోనే. విశాఖకు సంబంధించింది వైశాఖం. శాఖ అంటే కొమ్మ. కొమ్మలపై విశిష్టంగా సంచరించేది వానరం. ఆ రకంగా వైశాఖ మాసానికీ వానరావతారానికీ సంబంధం ఉన్నట్లు కూడా చెప్పవచ్చు. ఇంతటి ప్రత్యేకతలను కలిగిన మాసం.. ఆ మాసంలో జన్మించిన రోజున ఆ హనుమంతుడి జన్మ వృత్తాంతాన్ని, పరాక్రమాన్ని, శక్తి ప్రయుక్తుల గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

ఆంజనేయుని జన్మ రహస్యం  

పూర్వం గార్దభ నిస్వనుడు అనే రాక్షసుడు.. తపస్సు చేసి, తన మరణరహస్యం తనకూ, పరమేశ్వరుడికీ తప్ప మరెవ్వరికీ తెలియకుండా శివుడి నుంచి ఒక ప్రత్యేక వరాన్ని పొందాడు. కాలక్రమంలో ఆ రాక్షసుడు లోకకంటకుడిగా తయారవ్వడంతో శివుడు విసుగుచెందాడు. కానీ మాటిచ్చిన కారణంగా నారాయణునికి, గార్దభ నిస్వనుడి మరణరహస్యం చెప్పలేదు. ఎలాగోలా రాక్షసుణ్ణి సంహరిస్తే, దాసుడినై సేవించుకుంటానని మాటిచ్చాడు మహాశివుడు. నారాయణుడు మోహినీ అవతారంతో రాక్షసుణ్ణి మోహితుని చేసి వృక నరావతారంతో అంటే, తోడేలు ముఖం మానవ శరీరంతో సంహరించాడు. 

హరుడు.. హరికిచ్చిన మాటను అనుసరించి రామావతారంలో హనుమంతుడిగా జన్మించి, వెన్నంటే ఉండి సేవించుకున్నాడు. ఇదొక వృత్తాంతం. 

*పరాక్రమవంతుడు కేసరి, అందాలరాశి అంజనలకు వాయుదేవుడి అనుగ్రహంతో పరిపూర్ణ రుద్రాంశతో జన్మించినవాడే వీరాంజనేయుడు.

హనుమ తల్లి అంజనాదేవి. అయితే అంజన జన్మతా: అప్సరస అయినప్పటికీ, ఒక మునివర్యుని శాపం వల్ల వానర కాంతగా పెరుగుతుంది. అంజనా బాల్యంలో.. ఒకనాడు కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న వానరాన్నిని చూసి, దానిపైకి పండ్లు విసిరింది. ధ్యానానికి భంగం కలిగిన వానరరూపంలో ఉన్న ముని నిజరూపం ధరించి, కోపంతో అంజనను… “నీవు ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారతావ”ని శపిస్తాడు. తాను చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష కోరుతుంది. ఆ ముని శాంతించి, ‘నీవు, వానర రూపంలో ఉన్నా, ఎవరైతే  నిన్ను ఇష్టపడతారో, శివుని అవతారమైనటువంటి శిశువుకు జన్మనిచ్చినప్పుడు ఆ శాపం నుంచి విడుదలవుతావ’ని వరమిస్తాడు.

అందువల్లే శాపవిమోచనానికి కారణమైన అంజన భూమిపైన జన్మిస్తుంది. అలా అరణ్యంలో నివాసం ఏర్పరచుకున్న అంజనా..

ఒకరోజు పురుషుడిని చూసింది. ప్రేమలో పడింది. ఆ క్షణం నుంచి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. అతను అంజన వద్దకు వచ్చి, తన పేరు ‘కేసరి’ అని, వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానరముఖం కలిగి ఉన్నప్పటికీ, దివ్య తేజస్సుతో ఉండటంతో ఆశ్చర్యపోయింది. అలా వారిద్దరి అభీష్టం మేరకు ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. సంతానం కోసం శివుని గురుంచి తపస్సు చేసింది.

రాక్షస సంహారం కోసం విష్ణుమూర్తి తన తేజస్సును కాంతి రూపంలో బయటకు తీయగానే బ్రహ్మ, అష్టదిక్పాలకులు, సప్తర్షులు, ఇతర దేవతలు కూడా తమ శక్తులను దానికి జోడించి శివుడికి సమర్పించారు. అనంతరకాలంలో మహాశివుడు తనలోని రుద్రాంశను పార్వతీగర్భంలో ప్రవేశపెట్టాడు. కానీ శివశక్తి తాపాన్ని భరించలేని పార్వతిదేవి ఆ తేజస్సును అగ్నికి సమర్పించింది. అగ్ని కూడా భరించలేక వాయువుకు అర్పించాడు. ఆదిశక్తి అనుగ్రహంతో ఆ శక్తిని స్వీకరించిన వాయుదేవుడు… బిడ్డల కోసం తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు.

ఈ విధంగా శివుని అంశతో పుట్టిన ఆ బాలుడు, ఆంజనేయుడని, కేసరినందనుడని, వాయుపుత్ర/ పవనపుత్ర వంటి  పేర్లతో ప్రసిద్ధి చెందాడు.  హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది. ఫలితంగా స్వర్గానికి తిరిగి వెళ్ళింది.

సుందర హనుమా..

రామాయణంలో హనుమ తన గురించి ఎక్కడా చెప్పుకోలేదు. రాముడు విడిచిన బాణాన్ని అంటూ తన ఘనతంతా రాముడికే చెల్లించాడు. అంతటి హృదయాన్ని మించిన సుందర హృదయం మరొకటి లేదు. అందుచేతనే ఈ కాండ సుందరకాండ అయింది.

రాజు పూజలందుకున్న రాముడి బంటుగా హనుమయ్య అందరికీ సుపరిచితమే. శ్రీరాముడే స్వయంగా హనుమంతుడిని పూజించిన వివరణ పరాశర సంహితలో రాసి ఉంది. దీనిప్రకారం చుస్తే, 

పుట్టిన పది రోజుల్లోనే ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండుగా భ్రమించి మింగబోయిన అహల్యా మనవడైన అంజనీసుతుణ్ణి ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమల(దవడల) మీద కొట్టడంతో హనుమ పేరు స్థిరపడింది. వజ్రాయుధం దెబ్బకు సొమ్మసిల్లిన హనుమ పరిస్థితి చూసి కోపగించాడు వాయుదేవుడు. అతణ్ణి ప్రసన్నం చేసుకునే పరంపరలో త్రిమూర్తులతో సహా దేవతలంతా హనుమంతుడికి అనేక వరాలు ప్రసాదించి దీవించారు. అలా సకలదేవతలూ, రుషుల వరప్రభావంతో మరింత శక్తిమంతుడయ్యాడు. 

వీర హనుమా..  

ఆ పేరే కొండంత ధైర్యాన్నిస్తుంది. భయాన్ని పారదోలే శక్తిమంతమైన స్వరూపం ఆయన సొంతం. పైకి ఎంతటి గంభీరమైన తేజస్సుతో కనిపిస్తాడో, అంతేస్థాయిలో మృదుమధురమైన వాక్కు, చిత్త సంస్కారాన్ని కలిగి ఉంటాడు. బుద్ధిబలం కలవాడు. అనేక గుణగణాలను కలిగినవాడు గనుకనే హనుమ రామాయణంలో అనేకచోట్ల మనకు దర్శనమిస్తాడు.

హనుమాన్‌ అంటే ‘జ్ఞానవాన్‌’ అని అర్థం. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అని, ‘హనువు’ అంటే ‘దవడలు’ అని అర్థం.. అయితే, శబ్దార్థపరంగా చూస్తే, ‘హనుమ’ అనే పదంలోని ‘అ, ఉ, మ’ అనే మూడు అచ్చుల శబ్దం..  మనకు నిగూఢంగా ‘ఓం’కారం అనే శబ్దం ధ్వనిస్తుంది. దీని ద్వారా హనుమంతుడు ఓంకార స్వరూపుడనే విషయం అంతారార్థంగా స్పష్టమవుతుంది. అపరిమితమైన భుజశక్తితోపాటు గొప్ప విద్యావేత్త కూడా. నిత్య ప్రకాశవంతుండైన సూర్యభగవానుడి దగ్గర సకల విద్యలూ నేర్చుకున్నాడు. ఒకరోజు హనుమ, సూర్యుడి దగ్గరకు వెళ్లి తనను శిష్యుడిగా స్వీకరించమని అడిగాడట.

స్థిరంగా ఉండలేని నేను నీకెలా విద్య నేర్పగలను’ అన్నాడట సూర్యుడు. అలా అన్న వెంటనే, అమాంతంగా తన శరీరాన్ని పెంచిన హనుమ.. తూర్పు, పశ్చిమ పర్వతాల మీద చెరొక కాలు పెట్టాడట. అనంతరం సూర్య గమనానికి అభిముఖంగా తన ముఖాన్ని తిప్పుతూ సూర్యుడిని విద్య నేర్పించమని కోరాడట. దీంతో హనుమ శక్తిసామర్థ్యాలను మెచ్చి, సూర్యుడు గురువుగా మారాడు. ఆయన దగ్గర వేదాలు, వ్యాకరణం సహా అన్ని శాస్త్రాలు నేర్చి, గొప్ప పండితుడయ్యాడు. అంతటి సకల విద్యలను నేర్చినవాడు కాబట్టే, హనుమ తనకు మంత్రిగా ఉంటే ముల్లోకాల్లోనూ సాధించలేనిది ఏదీ ఉండదంటాడు ఒకానొక సందర్భంలో రాముడు.

*రాముడికి నమ్మినబంటు. అంతే పరాక్రమానికి, విశ్వాసానికి ప్రతీక అయిన హనుమంతుడు.. భక్తుల కొంగుబంగారం కూడా. అందుచేతనే  హనుమాన్ భక్తులు దీక్ష తీసుకుంటారు. దీక్ష విరమించేందుకు చాలామంది మన రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టుకు వెళ్తారు. ఇక్కడికే ఎందుకంటే, ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని చరిత్రకారులు చెబుతారు. కొండగట్టు అనే కొండమీద కొలువైన ఈ ఆంజనేయుడిని ‘కొండగట్టు అంజన్న’గా పిలుస్తారు.

కొండగట్టు స్థలపురాణం

సుమారు 500 ఏళ్ల క్రితం, ముత్యంపేట గ్రామంలో సింగం సంజీవుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. ఒకరోజు అడవిలో  ఆవుల్ని మేపుతుండగా.. ఒక ఆవు మందలోంచి తప్పిపోయిందట. ఆ ఆవును వెతుక్కుంటూ కొండగట్టువరకు వస్తాడు సంజీవుడు. ఎండలో తిరిగి అలిసిన కాపరి ఒక చెట్టు నీడలో నిద్రిస్తాడు. అప్పుడు అతనికి కలలో  ఆంజనేయుడు కనిపించి ‘నేను తంబోర పొదలో ఉన్నాను. నాకు గుడి కట్టించు. తప్పిపోయిన నీ ఆవు ఫలానా చోట ఉంది’ అని హితవు పలికాడట. మెలకువ వచ్చాక చూస్తే, సంజీవుడికి అక్కడి పొదల్లో వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట. దాంతో, అతను కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడట. అలా కట్టించిన ఆలయమే నేడు ఘనంగా పూజలందుకుంటున్న కొండగట్టు సన్నిధి. 

కరీంనగర్‌లోని జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ముత్యంపేట అనే ఊరు.. రాముని బంటుగా, పవనసుతుడిగా, అభయాంజనేయ స్వామిగా పిలువబడుతున్న.. ఆ ఆంజనేయస్వామి.. ఓ రోజున సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తుండగా, అందులో కొంతభాగం కిందకు పడిందట. అలా పడిన చోటే.. కొండగట్టు పర్వతంగా మారింది. అక్కడే స్వామివారు స్వయంభువుగా వెలిశారని ప్రతీతి. అంతేకాక ఇక్కడి స్వామి విగ్రహానికి రెండు ముఖాలుండటం.. విశేషం! అందులో ఒకటి హనుమంతునిది అయితే, మరొకటి నరసింహస్వామిది. అలాగే ఈ స్వామి భుజాల మీద శంఖుచక్రాలు, ఛాతీ మీద

దగ్గర్లోని సీతమ్మ బావిలోని నీళ్లతో స్వామివారికి నిత్యం అభిషేకం చేయడం ఇక్కడి ఆనవాయితీ. గర్భాలయానికి కుడివైపు వెంకటేశ్వర స్వామి, ఆండాల్… ఎడమవైపు  శివపంచాయతన ఆలయం ఉంటాయి. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి  ఏడాదిలో రెండుసార్లు(చైత్ర, వైశాఖ మాసాల్లో) జరపడం విశేషం. ఈ గుడి ప్రధాన గోపురానికి ఇరువైపులా ఏనుగు బొమ్మలు, గోపురం మీద ఆంజనేయుడి విగ్రహాలు చెక్కి ఉంటాయి.  ఆలయ ప్రాంగణంలోని ధర్మగుండంలో మునిగి, తలానీలాలు సమర్పించాక స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడికి దగ్గర్లో ఉన్న బేతాళ స్వామికి  కోళ్లు, మేకలు బలిగా ఇచ్చి, కల్లు సాక పోసి  మొక్కులు చెల్లిస్తారు భక్తులు. అనంతరం పక్కనే ఉన్న గుహలోని శివలింగాన్ని దర్శించుకుని వెళ్తారు.  

ఆలయ ప్రాశస్త్యం

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటే ఎలాంటి అనారోగ్యమైనా సరే దూరమైపోతుందని నమ్మకం. దుష్టశక్తులను సైతం పోగొట్టగల మహిమ ఇక్కడి స్వామికి ఉందని అంటారు. ఇక సంతానంలేనివారు సైతం ఈ స్వామిని 40రోజుల పాటు నిష్ఠగా పూజిస్తే, తప్పక సంతానం కలుగుతుందట. ఇలా ఆచరించే విధానాన్ని ‘కొండగట్టు అంజన్న’ మాలగా భావిస్తారు. హనుమాన్ దీక్ష తీసుకున్నవాళ్లు కొండగట్టులో దీక్ష విరమించి, స్వామిని దర్శించుకుంటారు. స్వామివారి బొట్టుని ప్రసాదంగా భావిస్తారు. ఇక్కడ దాదాపు 45 ధర్మశాలలున్నాయి.  ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్థులు, సంతాన హీనులు అంజన్న సన్నిధిలో 41 రోజులు గడిపితే బాగవుతారని భక్తుల విశ్వాసం.ఇంతటి మహిమలు కలిగినవాడు కావడం వల్లే.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొండగట్టు ఆంజనేయస్వామిని తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు.

టోంకిని శ్రీసిద్ధి హనుమాన్దేవాలయం

నడిచొచ్చే భక్తులకు అభయమిచ్చే అంజన్నతెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ఉండగా, ఆ తర్వాత అంతటి ప్రసిద్ధి గాంచిన ఆలయం… కుమురంభీం జిల్లాలోని టోంకిని శ్రీసిద్ధి హనుమాన్‌ దేవాలయం.

కాలినడకన వచ్చి ముడుపులు కడితే కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పేరుంది ఇక్కడి అంజన్నకి. దీంతో ఏటా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు పాదయాత్రగా బయల్దేరి ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఆలయానికి వందేళ్ల చరిత్ర ఉంది. అందుకు తాలూకూ ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. రావణుడు సీతాదేవిని అపహరించినపుడు హనుమంతుడు సీతాదేవి జాడ కోసం వెతుకుంటూ వెళుతుండగా.. అలసిపోయి పెన్‌గంగ నది ఒడ్డున కాసేపు సేదతీరాడని.. అప్పుడే అటువైపు వచ్చిన ప్రజలు హనుమంతుడికి కొన్ని పండ్లు ఇచ్చారట. కానీ వాటిని తినకుండా సీతమ్మ జాడ తెలిపేవరకు గాలి తప్ప ఇంకేమి తీసుకోనని చెప్పారట. కానీ మీరు నాకోసం ప్రేమతో ఇచ్చిన కారణంగా, కలియుగంలో మీకోసం నేను ఇక్కడ వెలసి మీ కష్టాలు తీరుస్తానని వాళ్లతో చెప్పాడట. ఆ తర్వాత అక్కడే విగ్రహంగా వెలిశాడని ప్రతీతి. కొన్నేళ్ళకు ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది.

ఇతరాంశాలు..

హనుమత్వ్రతం

హనుమంతుడి పేరుతో హనుమత్‌ వ్రతం వ్యాప్తిలోకి వస్తుందని, ఈ వ్రతం చేసిన వారి పనులన్నీ ఆంజనేయుడే చేసిపెడతాడని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. ఈ కథనంతా కూడా రాముడికి హనుమే స్వయంగా వివరించాడట. సీతాన్వేషణలో ఉన్న రాముడు సైతం పంపానది తీరంలో హనుమంతుడిని వేదిక మీద కూర్చోబెట్టి లక్ష్మణుడితో కలిసి ఈ వ్రతం ఆచరించాడట. ఫలితంగా సీతాన్వేషణ మొదలుకుని సీతారామ పట్టాభిషేకం వరకు మొత్తం కార్యాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తాడు హనుమ. ఇదంతా మనకు విదితమే. కానీ, తన యజమాని చేత పూజలందుకున్న ఏకైక బంటుగా ఆ హనుమయ్యకు ఎనలేని కీర్తి లభించింది. ఇంతటి మహిమాన్విత శక్తియుక్తులు కలిగిన స్వామిని మనసారా స్మరిస్తే బుద్ధి, కీర్తి, బలం, నిర్భయత్వం, అనారోగ్యం దూరమవ్వటం, వాక్పటుత్వం మొదలైన లక్షణాలు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.

*హనుమంతుడు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. వీటినే హనుమన్నవావతారాలంటారు. వీటి గురుంచి  పరాశర సంహితలో పరాశర మహర్షి వివరించడం జరిగింది. అవే, ప్రసన్నాంజనేయస్వామి, వీరాంజనేయస్వామి, వింశతిభుజాంజనేయ స్వామి, పంచముఖాంజనేయ స్వామి, అష్టాదశ భుజాంజనేయ స్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజాంజనేయ స్వామి, ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి, వానరాకార ఆంజనేయస్వామి..

*రుద్రస్వరూపుడిగా అవతరించిన హనుమకు పార్వతి తోకరూపంలో తనశక్తిని ప్రసాదించినట్లుగా పురాణ కథనాలున్నాయి. అందువల్లనే హనుమంతుడి వాల(తోక) పూజకెంతో శక్తి ఉందని చెబుతారు.

జై హనుమాన్!!

Show More
Back to top button