Telugu Special Stories

ఇలలో స్వర్గం ఇరకం.. పులికాట్ సరస్సు మధ్యలో ఈ దీవి గురించి మీకు తెలుసా?

కనుచూపుమేరా నీరు..

కాలుష్యం గురించి ఆందోళన లేని ప్రశాంత వాతావరణం..

వాహన రణగొణ ధ్వనులు వినిపించని సుందర ప్రదేశం..

ఈ అద్భుత వాతావరణం చూస్తే కాలానికి కూడా సేద తీరాలి అనిపిస్తుంది ఏమో.

అంత అందమైన ప్రదేశం పులికాట్ సరస్సు మధ్యలో గల ‘ఇరకం’ దీవి. ఈ అద్భుత ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం.

ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు నెల్లూరు జిల్లా తడ మండలంలో ఉన్న దీవి ‘ఇరకం’. దేశంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ మధ్యలో ఉంటుందీ దీవి. ఇక్కడకు పడవలో మాత్రమే చేరుకో గలం! మండలంలోని తీరప్రాంతమైన భీముల వారిపాలెం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవిని నిశ్చల పులికాట్లో తేలికపాటి అలలపైన పడవలో కూర్చొని అటూ ఇటూ ఊగుతూ చేరుకో వచ్చు. తెరచాప పడవల హొయలు, వల లను విసిరే జాలరులూ, వారికి దొరకకుండా ఎగిరిపడే చేప పిల్లలూ, వాటిని వేటాడేందుకు పోటీపడే వలస పక్షులూ, ఆహారం కోసం జపం చేసే స్వాతి కొంగలూ, ఇంకా పీకల్లోతు నీళ్లలో దిగి ఆల్చిప్పలను సేకరించే మత్స్యకా రుల్ని ఇరకం వెళ్లే దారిలో చూడొచ్చు. పడవ దిగగానే రా రమ్మని పిలిచే బిళ్లగన్నేరు పూలు, మొగలిపూల సువాసనలూ, నీటికోసం వందల ఏళ్ల కిందట తవ్వుకున్న నీటి దొరువులూ(చిన్న చెరువులు), వాటిచుట్టూ కంచెలా పచ్చని ప్రేము చెట్లూ… అడుగడుగునా ఆకట్టుకునే దృశ్యాలెన్నో సందర్శకుల్ని అలరిస్తాయి.

పులికాట్ సరస్సు మధ్యలో ప్రకృతి అందాలతో  ప్రశాంతంగా ఉండే దీవి  ఇరకం. ఇక్కడ కాలుష్య కోరలు కానరావు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే పడవ ప్రయాణం తప్ప మరో అవకాశం లేదు. గ్రామం చుట్టూ ఉప్పునీరు ఉన్నప్పటికీ గ్రామంలో మాత్రం తియ్యటి మంచినీళ్లు లభిస్తాయి.  గ్రామం నిండా మంచి నీటికోసం తవ్విన దొరువులు కనిపిస్తాయి. మొగలి పొదలు పుష్పాలతో మత్తెక్కించే వాసనతో ఆహ్వానిస్తాయి. వరి ప్రధాన పంట కాగా ఇక్కడ మొగలి పొదలు, వెదురు, పేము, కొన్ని రకాల మూలికా వేర్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పంటలను వ్యాపారాత్మకంగా పెంచేలా ప్రభుత్వం అవగాహన కల్పించి సహకరిస్తే ఎంతో మందికి ఇదొక జీవనోపాధిగా మారొచ్చు.

శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం సమీపంలో ఉన్న ఈ గ్రామం కూడా పులికాట్ సరస్సు మధ్యలో ఉంటూ గతంలో దీవిగా ఉండేది. కానీ షార్ రోడ్డు నుంచి వేనాడు వరకు పసల పెంచలయ్య మంత్రిగా పనిచేసిన కాలంలో ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్డు ఒక్కటే మార్గం. ప్రస్తుతం అది కూడా గతుకులమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక్కడ షేక్ షావలి అల్లా దర్గా, శ్రీశృంగేశ్వర శ్రీరంగ పెరుమాళ్ ఆలయం వంటి ఆధ్యాత్మిక విశేషాలు  ఉన్నాయి. వరి ప్రధాన పంట ఇక్కడ. కానీ ఈ గ్రామం నుంచి గ్రామస్తులు పనులపై మండల కేంద్రం తడకు రావాలంటే దాదాపు 33 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

ఈ దీవి ప్రజలు సీగిరేణి ఆకుతోనే తల స్నానాలు చేస్తారు. దీని వల్ల చుండ్రు, జుట్టు రాలే సమస్యలు ఉండవు. ఇక్కడ లభించే ఉత్పత్తులను వాణిజ్యపరంగా సాగు చేసేలా ఇక్కడి గిరిజనులు, ఇతరులను ప్రోత్సహించడం ద్వారా పలువురికి ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతుంది. వేనాడు, ఇరకం దీవులకు  మరికొద్ది దూరంలోనే శ్రీసిటీ, మాంబట్టు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఈ గ్రామాల్లోని యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయి గ్రామాలకే పరిమితమవుతున్నారు.

వ్యవసాయ భూమి పరిమితంగా ఉండి కూలీలు ఎక్కువగా ఉండడంతో వీరికి సరైన ఉపాధి లభించడం లేదు. ఇరకం, వేనాడు దీవుల్లో ప్రశాంతమైన వాతావరణంతోపాటు ప్రతి చెట్టూ, వేరూ, ఆకూ, పువ్వూ, కాయ, పండూ అన్నీ ఏదో ఒక అద్భుతమైన ఔషధగుణంగా ఉపయోగపడతాయి.

వేనాడులో ఎక్కువ శాతం చెట్లు క్లోనింగ్ మొక్కల తరహాలో ఓ మోస్తరు ఎత్తు మాత్రమే పెరుగుతాయి. భారీ వృక్షాలు ఇక్కడ కనిపించకపోవడం విశేషం. బయటి ప్రాంతాల్లో రావి, వేపచెట్ల తరహాలో ఈ గ్రామంలో వేపచెట్లు ఆరిపాకు చెట్లతో పెనవేసుకుని కనిపిస్తాయి. ఈ గ్రామాలకు వెళ్లే మార్గంలో పులికాట్ సరస్సులో నీళ్లు ఉన్న సమయంలో దేశ, విదేశీ విహంగాలు చేసే విన్యాసాలు కనువిందు చేస్తాయి

బోటు ప్రయాణం…

సుమారు 47 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఇరకంలో 630 కుటుంబాలున్నాయి. జనాభా మూడు వేలు. వీరి మాతృభాష తమిళం. 90 శాతం తమిళం మాత్రమే మాట్లాడగలరు. పది శాతానికి రెండు భాషలూ వచ్చు. ఈ దీవిలో ఇరకం, మత్స్యకారుల గ్రామం తిరువెంకటానగర్ కుప్పం ఉన్నాయి. ఇక్కడ ఉండేవారి ప్రధాన వృత్తి చేపలు పట్టడమైనా వ్యవసాయ, వ్యవసాయ కూలీల కుటుంబాలూ ఉన్నాయి. చుట్టూ ఉప్పు నీరున్నా దీవిలో మంచినీటికి ఇబ్బందిలేదు. చేపలూ వ్యవ సాయ ఉత్పత్తులూ అమ్మాలన్నా, నిత్యావస రాలు కొనాలన్నా గ్రామం నుంచి బయటకు  వెళ్లాల్సిందే. ప్రజల అవసరాలకు రోజూ రెండుసార్లు మాత్రమే ప్యాసింజరు బోటు అందుబాటులో ఉంటుంది. ఇది గ్రామ ప్రజలు తమకు తాముగా చేసుకున్న నిర్ణయం. ప్రభుత్వం అందించిన ఈ బోటు నిర్వహణను గ్రామస్థులే చూసుకుంటారు. అట్నుంచి దీవికి రావడానికి ఉదయం, సాయంత్రం వేళల్లో బోట్లు ఉంటాయి. ఒకవైపు ప్రయాణానికి రూ.10 చెల్లించాలి.

ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఇరకం, తిరువెంకటానగర్ కుప్పంల నుంచి రెండు పడవలు భీములవారిపాలెం రేవుకు వెళ్తాయి.

అత్యవసరమై దీవి నుంచి బయటకు వెళ్లాలంటే రూ.500 చెల్లించి ప్రత్యేక పడవ ఏర్పాటుచేసుకోవాల్సిందే! సరుకు రవాణాకూ ప్రయివేటు బోట్లు ఉంటాయి.

పక్క రాష్ట్రంలో చదువు…

ఇరకం, తిరువెంకటానగర్లలో ప్రభుత్వం రెండు పాఠశాలలు ఏర్పాటుచేసినా అక్కడ తెలుగులో బోధన ఉండటంతో ఎవరూ వెళ్లడంలేదు. రవాణా పరంగా ఉన్న ఇబ్బందులవల్ల ఇక్కడికి రావడానికి ఉపాధ్యాయులూ ఆసక్తి చూపడంలేదు. దాంతో పాఠశాలలు దాదాపు మూతపడ్డాయనే చెప్పాలి. ఇరకంలో మాత్రం ఒక విద్యావలంటీరు పాఠాలు చెబుతుంటారు. మాతృభాషపైన ఉన్న మమ కారంతో స్థానికులు తమ పిల్లల్ని అతి కష్టం మీద ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళనాడు పరిధిలోని సున్నాంబుగోళం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. రోజూ ఇరకం నుంచి దాదాపు 100 మంది విద్యా ర్థులు చదువుకోవడానికి పడవల్లో వెళ్తారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో చిన్న పిల్ల లను సైతం పడవలో పంపి వాళ్లు తిరిగొచ్చే దాకా బిక్కుబిక్కుమంటూ తల్లిదండ్రులు ఇళ్ల వద్ద గడుపుతుంటారు. ఎండైనా, వానైనా ఆ పడవలోనే పాఠశాలకు వెళ్లిరావాలి.

పట్టించుకోని ప్రభుత్వాలు…

రాష్ట్ర ప్రభుత్వం పులికాట్ సరస్సుతోపాటు ఇరకం దీవినీ పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయి.  గతంలో స్వదేశీ దర్శన్ పథకంలో  దీవిలోని ఎనిమిదెకరాల ప్రభుత్వ భూమిని పర్యాటకశాఖ స్వాధీనం చేసుకుంది. దీవి చుట్టూ సరస్సు లోతు అయిదారు అడుగులకు మించదు. అందుకే ఇది బోటు షికారుకు ఎంతో అనుకూల ప్రాంతం. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా స్పీడు బోటు వస్తే భీములవారిపాలెం రేవుని కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చని గ్రామస్థులు ఆశిస్తున్నారు. సమీపంలోని వేనాడును కలుపుతూ 1.2కి.మీ పొడవైన వంతెన నిర్మాణానికీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆ దార్లో రహదారి మార్గాన్ని సులభంగా చేరొచ్చు కూడా.

పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఇరకంలో చదువుకున్న యువతకూ స్థానికంగా ఉపాధి లభిస్తుందని గ్రామస్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు! గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా ఈ దీవిని పట్టించుకోకపోవడం బాధాకరం. గత ప్రభుత్వ పర్యటక శాఖామంత్రి రోజా ఇరకం దీవిని అద్భుతంగా మారుస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు అయినప్పటికీ అభివృద్ధి శూన్యం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమైన ఈ చిన్న దీవిని పట్టించుకుని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని ఇరకం దీవి ప్రజలు కోరుతున్నారు.

Show More
Back to top button