CINEMATelugu Cinema

తెలుగు వెండితెరపై తొలి మహిళా సినీ నిర్మాత.. దాసరి కోటిరత్నం.

రంగస్థలం వేదిక మీద ఉన్నప్పుడు గానీ, వెండితెర మీద ఉన్నప్పుడు గానీ చాలా మంది తారల జీవితాలు మహా అద్భుతంగా సాగుతాయి. అదే వైభవం చిట్టచివర వరకు కూడా సాగించడం కొంతమందికి మాత్రమే సాధ్యపడుతుందేమో. అలాంటి కోవలోకి చెందిన తార “దాసరి కోటిరత్నం”. ఆంధ్ర నాటక రంగంలో నాలుగు దశాబ్దాల పాటు స్త్రీ, పురుష పాత్రలను సమానంగా పోషించారు. రంగస్థలంపై మహిళల పాత్రలను మగవారే పోషించే రోజులవి. అటువంటి పరిస్థితుల్లో నాటకాలలోకి అడుగుపెట్టి ఆమె తన ప్రతిభ చాటుకున్నారు. ఎంత చక్కని అభినయమో, అంత చక్కని గాత్రము ఆమెది. సినిమాలలో గొప్పగా రాణించినా, రాణించలేకపోయినా ఆమె గానానికి చివరి వరకు మన్నన ఉండేది. సినిమా నటిగా, నిర్మాతగా, రంగస్థలం నటిగా, సమాజ నిర్వాహకురాలిగా దాసరి కోటిరత్నం ఒక చరిత్ర సృష్టించారనడంలో అతిశక్తి లేదు.

తెలుగు సినీ రంగంలో మహిళా నిర్మాతలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటి వారందరికీ ఆదర్శవంతురాలు దాసరి కోటిరత్నం. తెలుగు సినిమా రంగంలో తొలి నిర్మాతగా ఆమె ఖ్యాతి గడించారు. నిర్మాతగా ఆమె నిర్మించిన “సతీ అనసూయ” 1935 వ సంవత్సరంలో విడుదలైంది. దాసరి కోటిరత్నం “అటు నాటక రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ సమాన ప్రతిభను ప్రదర్శించి ఆంధ్ర ప్రజల ఆదరాభిమానాలను ఆమె పొందగలిగారు. రంగస్థలం మీద నటించిన రోజులలో గ్రామ్ ఫోన్ గాయనిగా రికార్డులు ఇచ్చి సంచలనాలను సృష్టించి అటు ప్రేక్షకులతోను, ఇటు శ్రోతలతోనూ శభాష్ అనిపించుకున్న తొలి తెలుగు మహిళా సినీ నిర్మాత దాసరి కోటి రత్నం. చివరి రోజులలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక, అనారోగ్యంతో ఆవిడ ఈ లోకం నుండి నిష్క్రమించారు.

గాయనిగా, రంగస్థలం నటిగా, సినిమా నటిగా, సినీ నిర్మాతగా సుమారు నలభై ఐదు సంవత్సరాలు సినీ, నాటకరంగానికి సేవలు చేసిన ఆమె చివరి రోజులలో అంటే సుమారు ఆమె వయస్సు అరవై సంవత్సరాలు వచ్చేసరికి దృష్టి మాంద్యంతో బాధపడుతూ ఉండేవారు. దాదాపు 45 సంవత్సరాలు సినీ నాటక రంగాలకు అపురూపమైన సేవ చేసి, ఎంతోమంది అనాధలకు దానధర్మాలు చేశారు, వృద్ధ కళాకారులకు సహాయం చేస్తూ వచ్చారు. జీవన మలిసంధ్యలో ఆమె నిస్సహాయంతో కృంగిపోతూ, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితులలో ఉన్న ఆమెకు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు వృద్ధులకు ఇచ్చే ఉపకార వేతనాలు ఆమెకు చివరి రోజులలో దిక్కయ్యి,  జీవించారు. పేదరికం కాటు వేసినాకూడా మహోజ్వల కళాకారిణిగా వెలుగొందారు దాసరి కోటిరత్నం.

నేపథ్యం…

దాసరి కోటిరత్నం 1890 లో గుంటూరు జిల్లా నరసరావుపేట పత్తిపాడులో జన్మించారు. ఆమె తండ్రి రంగస్థల నటులు. ఆయన రంగస్థలంపై నాటకాలు వేస్తూ ఉండేవారు. అందువలన కోటిరత్నం చిన్నగా ఉన్నప్పటి నుండే ఆమెకు వాళ్ళ నాన్న నాటకాలలో శిక్షణ ఇప్పిస్తుండేవారు. ఆడపిల్ల అయినా కుడా చిన్నపిల్ల అవ్వడంతో ఆమె రంగస్థలం రకరకాల పాత్రలు ధరిస్తూ ఉండేవారు. “హరిశ్చంద్ర” నాటకంలో లోహితాసుడు, “బొబ్బిలియుద్ధం” లో చిన రంగారావు, “లవకుశ” లో లవుడు,  కుశుడు, “భక్త ప్రహ్లాద” లో ప్రహ్లాదుడు ఇలా వివిధ పాత్రలు పోషించేవారు. చిన్నపిల్లగా ఉన్న దాసరి కోటిరత్నం బాల “మగ” పాత్రలు ధరిస్తూ వచ్చారు. మాములుగానే ఆడపిల్లలు చిన్నప్పుడు మగపాత్రలు ధరించినప్పటికీ, దాసరి కోటిరత్నం మాత్రం పెద్దయ్యాక కుడా నాటకాలలో మగపాత్రలు ధరించడం, సినిమాలలో కథానాయిక పాత్రలు ధరించడం పరిపాటిగా జరుగుతుండేవి. చిన్నతనంలో ఒకవైపు నటిస్తూనే, మరోవైపు రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి వద్ద సంగీత శిక్షణ పొందారు. ఆమెకు పది సంవత్సరాల వయస్సుండగా వాళ్ళ అమ్మ చనిపోయారు. దాంతో వాళ్ళ నాన్న దాసరి కోటిరత్నాన్ని తీసుకొని తన అత్తగారి ఊరు (దాసరి కోటిరత్నం అమ్మమ్మగారి ఊరు) నక్కబొక్కలపాడు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత చిన్న వయస్సు నుండి యుక్త వయస్సు వచ్చేవరకు కూడా ఆమె నాటకాలు వేస్తూనే ఉన్నారు.

నాటక సమాజం స్థాపించి…

మహిళలు నాటకాలలో నటించడానికి వ్యతిరేకత వ్యక్తం చేసే ఆ రోజులలో దాసరి కోటిరత్నం సొంతంగా ఓ నాటక సమాజాన్ని నెలకొల్పి, ఊరూరా ప్రదర్శనలు ఇచ్చే సాహసం చేశారు. అంత చిన్న ఊరిలో నాటక సంస్థను స్థాపించి దానిని నిర్వహించి పేరు తెచ్చుకోవడం అనేది ఆ రోజుల్లోనే ఆమె సాధించిన ఘనతకు నిదర్శనం. నక్కబొక్కలపాడు పక్కా పల్లెటూరు అయినప్పటికీ దాసరి కోటిరత్నం నెలకొల్పిన నాటక సమాజానికి అతి తక్కువ కాలంలోనే పేరుప్రఖ్యాతులు రావడానికి కారణం ఆమె ఎన్నుకున్న నాటకాలు, ఆమె ప్రదర్శించిన నాటకాలే. “ఉషాపరిణయం”, “శశిరేఖ పరిణయం”, “కనకధార”, “కృష్ణలీల”, “రామదాసు”, “సావిత్రి” మొదలగు నాటకాలను కోటిరత్నం స్థాపించిన నాటక సమాజం ప్రదర్శించేది. అదేవిధంగా తెనాలి వాస్తవ్యులు తోట రాఘవయ్య, మల్లాది గోవింద శాస్త్రి, పారుపల్లి సుబ్బారావు, పారుపల్లి సత్యనారాయణ వంటి ఉద్ధండులైన నటులు ఆ నాటకాలలో నటించడంతో ఆయా నాటకాలకు మంచి పేరు వచ్చేది. ఐదేళ్లపాటు తాతగారి ఊరులోనే ఉండి నాటకాలను ప్రదర్శించిన కోటిరత్నం ఆ తరువాత తాను గుంటూరుకు మకాం మార్చి అక్కడ నాటక సమాజాన్ని కొనసాగించారు.

నవల నాటక సమాజంలో చేరి…

నిజానికి పురుషులు నాటక సంస్థలను స్థాపించి స్త్రీలను నాటకాలలోకి తీసుకుంటూ ఉంటారు. కానీ దాసరి కోటిరత్నం మాత్రం తాను నాటక సంస్థను స్థాపించి ప్రఖ్యాత పురుష నటులను తన నాటక సంస్థల్లోకి ఆహ్వానించి పాత్రలను పోషింపజేస్తూ ఉండేవారు. కోటిరత్నం పురుష పాత్రలు ధరిస్తూ ఉంటే, పారుపల్లి సుబ్బారావు ఆ నాటకాలలో స్త్రీ పాత్రలు ధరిస్తూ వచ్చారు. అలా కొంత కాలం కొనసాగిన తరువాత దంటు వెంకట కృష్ణయ్య గుంటూరులో స్థాపించిన నవల నాటక దాసరి కోటి రత్నాన్ని తీసుకొనదలచి ఆమెను తన నాటక సమాజంలో చేరడానికి గుంటూరుకు రావలసిందిగా కోరారు. నవల నాటక సమాజంలో ఇరవై అయిదు మంది మహిళా నటీమణులు ఉండేవారు. అందులో పురుష పాత్రలు కూడా ఉండేవి. 

అందువలన దంటు వెంకట కృష్ణయ్య  ఆ నవల నాటక సమాజంలో ఆ రోజుల్లో దాసరి రామతిలకం, శ్రీహరి, అంజనీ బాయి, సరస్వతమ్మ లాంటి ప్రసిద్ధ నటులతో బాటు దాసరి కోటి రత్నం కూడా చేరి వారు నటించే నాటకాలలో పురుష పాత్రలు ధరిస్తూండేవారు. అలాంటి నాటకాలలో దాసరి కోటిరత్నంకు బాగా పేరు తెచ్చిన నాటకం “సతీ అనసూయ”. అందులో ఆమె కొన్నిసార్లు “అనసూయ” గా పాత్ర పోషించేవారు. అలాగే మరికొన్నిసార్లు ఆ నాటకంలో అత్రి మహామునిగా, నారదుడిగా, పాత్రలు వేసి మెప్పిస్తూ ఉండేవారు. ఆ రోజులలోనే ఆమె సతీ అనసూయ అనే నాటకాన్ని సుమారు 200 సార్లు ప్రదర్శించారు. అలా ప్రదర్శిస్తున్న క్రమంలో ఆమెకు వందకు పైగా వెండి, బంగారు పతకాలు బహుమతిగా వచ్చాయి. నాటకంలో దాసరి కోటిరత్నం ఉందని తెలిస్తే ప్రేక్షకులు అధిక సంఖ్యలో వచ్చేవారు. ఆ నాటకానికి వారం రోజులు ముందే టికెట్లు అయిపోయేవి.

రెండోసారి నాటక సమాజం స్థాపించి…

దాసరి కోటిరత్నం కొంతకాలం నవలా నాటక సమాజంలో నాటకాలు వేశారు. ఆ తరువాత అందులో ఉన్న రామతిలకం, అంజనీబాయి మొదలగు వారి ప్రోద్భలంతో దాసరి కోటిరత్నం రెండవసారి నాటక సమాజాన్ని స్థాపించి “సావిత్రి” అనే నాటకాన్ని అనేకమార్లు ప్రదర్శించారు. ఆ నాటకంలో కోటిరత్నం సత్యవంతుడి పాత్రలో నటించగా, ఆ నాటకానికి కొప్పవరపు సుబ్బారావు దర్శకత్వం వహించారు. అప్పట్లో కొప్పవరపు సుబ్బారావు నాటకాలకు అత్యధిక ప్రజాదరణ ఉండేది. అలాంటి ప్రఖ్యాత దర్శకుడిని తన నాటక సమాజంలోకి తీసుకుని ఆయన దర్శకత్వంలో నాటకాలను ప్రదర్శించిన ఖ్యాతి దాసరి కోటిరత్నంకే దక్కింది. ఒకసారి “సావిత్రి” నాటకాన్ని మద్రాసులోని రాయల్ టాకీస్ లో  ప్రదర్శించినప్పుడు ఆ ప్రదర్శనకు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కూడా హాజరయ్యారు. ఆ నాటకాన్ని తిలకించిన ఆయన దాసరి కోటిరత్నం యొక్క నటనను అభినందించడమే కాకుండా, ఆమెకు ఒక బంగారు కంకణాన్ని కూడా బహుకరించారు.

అదే “సావిత్రి” నాటకాన్ని నైజాం సంస్థానంలో ప్రదర్శించినప్పుడు ఆ నాటకం తిలకించిన దివాను రాధాకృష్ణ ప్రసాద్ వెండి గొడ్డలి, వెండి తాడును ఆమెకు బహూకరించారు. రెండోసారి ఆమె స్థాపించిన నాటక సమాజం ద్వారా ప్రదర్శించిన “సావిత్రి” నాటకానికి ప్రశంసలు మాత్రమే కాకుండా బహుమానాలు కూడా వస్తుండేవి. ఆ నాటక సమాజం తరుపున “శ్రీకృష్ణతులాభారం” అనే నాటకాన్ని తయారుచేసి అందులో దాసరి కోటిరత్నం కృష్ణుడిగా, నారదుడిగా నటిస్తుండేవారు. నిరంతరం పౌరాణిక నాటకాలు వేస్తున్న కోటిరత్నం ఈసారి సాంఘిక నాటకం వేయాలనుకున్నారు. దాంతో దొమ్మేటి సూర్యనారాయణ, దొమ్మేటి సత్యనారాయణ లాంటి ప్రసిద్ధ రంగస్థల నటులని తన నాటక సంస్థలోకి ఆహ్వానించి వాళ్లతో కలిసి “రంగూన్ రౌడీ” అనే నాటకాన్ని సుమారు నాలుగు సంవత్సరాలు ప్రదర్శించారు. ఇలా ఊహ తెలిసి తన ఏడవ యేటన రంగస్థలం ఎక్కి, అప్పటి నుండి తాను రెండుసార్లు సొంతంగా నాటక సంస్థను స్థాపించి, మరొకసారి వేరొక నాటక సంస్థలో చేరి ఈ విధంగా దాదాపు రెండు దశాబ్దాల పాటుగా అద్భుతమైన నాటకాలలో ముఖ్యంగా పురుష పాత్రలను ధరించి, ప్రేక్షకుల  ప్రశంసలు పొందుతూ, అలా కొనసాగుతూ వస్తున్నారు.

చిత్రరంగ ప్రవేశం…

తెలుగు సినిమాకు మాటలు మొదలైన (1932) కొత్తలో సినిమాలకు రంగస్థలం నాటకాలను ప్రాతిపదికగా తీసుకుంటూ ఉండేవారు. అలా రంగస్థలం నాటకాలను సినిమాలుగా తీస్తున్న క్రమంలో 1935లో కొంతమంది కలకత్తాలో “సతీసక్కుబాయి”  సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకు దాసరి కోటిరత్నం నాటక సమాజంలోని సభ్యులను, అందులోని నటీనటులనే తీసుకుని ఆ సినిమా తీశారు. ఆ సినిమాకు చిలకమర్తి లక్ష్మీనరసింహం రచన చేశారు. నిజానికి సినిమాగా తీసిన ఇదే నాటకాన్ని రంగస్థలం మీద ప్రదర్శించినప్పుడు అందులో దాసరి కోటిరత్నం శ్రీకృష్ణునిగా నటిస్తే, తుంగల చలపతిరావు సక్కుబాయిగా నటించారు. ఇక “సతీసక్కుబాయి” సినిమా విషయానికి వస్తే దాసరి కోటిరత్నం సక్కుబాయిగా, తుంగల చలపతిరావు శ్రీకృష్ణుడుగా నటించారు. కుంపట్ల సుబ్బారావు సక్కుబాయి భర్తగా నటించగా, సూరవరపు వెంకటేశ్వర్లు గయ్యాళి అత్త పాత్రను పోషించారు. మాములుగా నాటకాలలో మగవాళ్ళు ఆడవాళ్లుగా పాత్రలు పోషించేవారు. కానీ సినిమాలో మగవాళ్ళు ఆడవాళ్లుగా పాత్రలు పోషించిన ఒకే ఒక్క సినిమా ఈ “సతీసక్కుబాయి”. భరత లక్ష్మీ పిక్చర్స్ పతాకం పై నిర్మించిన ఈ సినిమా 21 మే 1935 నాడు  విడుదలైంది. ఈ సినిమాకు దర్శకుడు “చారు చంద్ర రాయ్” అనే బెంగాలీ. ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు.

తొలి మహిళా నిర్మాతగా “సతీ అనసూయ” (1935)..

“సతీసక్కుబాయి” సినిమా నిర్మాణం జరిగిన నాలుగైదు నెలలు దాసరి కోటిరత్నం కలకత్తాలోనే ఉన్నారు. అక్కడ సినిమాలు తీస్తూ కలకత్తా వారు లాభం గడించే విధానం చూసి మనం ఎందుకు సినిమాలు తీయకూడదు అని ఆమె అనుకున్నారు. “సతీసక్కుబాయి” సినిమాలో నటించిన నటీనటులతో కలిసి ఒక సినిమాను నిర్మించాలని అనుకున్నారు. దాంతో ఆమె అరోరా ఫిలిం కార్పొరేషన్ వారితో మాట్లాడి వారి ఉమ్మడి భాగస్వామ్యంతో “సతీ అనసూయ” (1935) అనే సినిమాను మే నెలలో ప్రారంభించి, నాలుగు నెలలలో పూర్తి చేసి 04 అక్టోబరు 1935 లో విడుదల చేశారు. ఈ సినిమాకు అహిన్ చౌదరి దర్శకులు. ఈయన కూడా బెంగాలీనే. ఇందులో దాసరి కోటిరత్నం అనసూయ పాత్రను ధరించారు.

ఈ సినిమాలో దాసరి కోటిరత్నం, తుంగల చలపతిరావు, డి. లీలాకుమారి, డి.వెంకుబాయి, రంగపుష్ప చిత్ర మొదలగు వారు నటించారు. తెలుగు చిత్రసీమలో తొలి మహిళా నిర్మాతగా తొలిచిత్ర నిర్మాణం ప్రారంభమై, విడుదలై విజయవంతంగా ముగిసింది. ఆ తరువాత కూడా దాసరి కోటిరత్నం కొన్ని రోజులు పాటు కలకత్తాలోనే ఉన్నారు. అక్కడే నిర్మాణం జరుపుకున్న “లంకా దహనం”, “మోహినీ భస్మాసుర”, “వరవిక్రయం”, “పాండురంగ విఠల” లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించారు. మాములుగానే ఆమె అద్భుతమైన గాయని. అందువలన ఆమెకు అవకాశాలు కూడా చాలా తొందరగానే వచ్చాయి. ఇలా 1939 వరకు కలకత్తాలోనే ఉన్న ఆమె చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చారు.

కౌసల్య పాత్ర ఇచ్చిన “కన్నాంబ”… 

1939 వరకు కలకత్తా, కొల్హాపూర్ మొదలగు ప్రాంతాలకే పరిమితమైన సినిమా నిర్మాణం ఆ తరువాత మద్రాసుకు రావడం, కొత్త కొత్త నటీమణులు సినిమారంగంలోకి ప్రవేశించడంతో దాసరి కోటిరత్నంకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమెకు ఉన్న నాటక అనుభవంతో తనతో పాటు నాటకాలు వేసిన తుంగల చలపతిరావు, సూరిబాబు, సూరవరపు వెంకటేశ్వర్లు మొదలగు వారితో కలిసి మళ్ళీ సక్కుబాయి నాటకాన్ని వేదిక మీదికి తీసుకెళ్లారు. ఏ నాటకాన్ని సినిమాగా తీశారో, అదే సినిమాను మళ్ళీ నాటకంగా వేశారు. దాసరి కోటిరత్నం పాటలను వినడానికి ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చేవారు. 1943 – 44 ప్రాంతాలలో దాసరి కోటిరత్నం తిరిగి రంగస్థలం నుండి సినిమా రంగానికి వచ్చారు. రెండవసారి నాటకాలు వేసినప్పుడు కన్నాంబతో ఏర్పడిన పరిచయం మూలంగా, కన్నాంబ దాసరి కోటిరత్నాన్ని మద్రాసుకు పిలిపించి ఆమె నిర్మిస్తున్న “పాదుకా పట్టాభిషేకం” (1945) లో కౌసల్య పాత్రను ఇచ్చారు. 1945లో పాదుక పట్టాభిషేకం సినిమా కోసం ఆమె పాటలు ఆమెనే పాడుకున్నారు. ఆ తరువాత సుమారు పదిహేను సంవత్సరాలు మద్రాసులోనే ఉండి చిన్నచిన్న వేషాలు వేశారు. 

మరణం…

ఆమె గాత్ర మాధుర్యం వలన ఆమెకు అవకాశాలు వస్తూనే ఉండేవి. కానీ ఆమెకు నిర్మాతలు చిన్న చిన్న పాత్రలు ఇస్తూ వచ్చారు. ఎస్వీ రంగారావు మొదటిసారిగా నటించిన “వరూధిని” సినిమాలో కూడా ఒక చిన్నపాత్రలో నటించారు. ఆ తరువాత “గొల్లభామ”, “చంద్రవంక”, “అగ్నిపరీక్ష”, “బంగారుభూమి” ఇలా సినిమాలలో నటించారు. సినిమాలలో నటిస్తున్నంతవరకు ఆమెకు ఏ ఇబ్బంది లేకుండా పోయింది. 1958వ సంవత్సరం నాటికి ఆమె కొంచెం లావు అవ్వడం, గొంతు మారిపోవడం, దృష్టి మందగించడం ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చిపడ్డాయి. సినిమాలో నటించినన్ని రోజులు ఆమె సంపాదించిందంతా వృద్ధ కళాకారులకు, పేదలకు దానం చేస్తూ వచ్చారు.

అందువలన కాబోలు చిట్టచివరిలో ఆమెకు అవకాశాలు తగ్గినాక ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొక తప్పలేదు. 1960 సంవత్సరం వచ్చేసరికి తన సొంత ఊరు నక్కబొక్కలపాడుకు ఆమె వెళ్లిపోయారు. అక్కడే ఉండి జీవించడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో 1960లో ఆంధ్ర నాటక కళాపరిషత్తు వారు తణుకులో ఆమెకు సన్మానం చేసి కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు. ఆమె గురించి, ఆమె ఆర్థిక స్థితిగతుల గురించి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పత్రికలకు వ్రాసిన ఒక వ్యాసం చదివిన ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు ఆమెకు నెలసరి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతూ చివరి రోజులలో అనారోగ్యంతో పోరాడుతూ డిసెంబరు 1972 లో చిలకలూరిపేటలో మరణించారు. దాసరి కోటిరత్నం నిజంగానే ఒక చరిత్ర సృష్టించారు. కానీ ముగింపు విషాదం కావడమే ఈమె లాంటి కొంతమంది కళాకారులకు శాపమేమో అనిపిస్తుంది.

Show More
Back to top button