ప్రస్తుతం చూసుకుంటే.. ఏ ఆహారం తినాలన్న ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. ఇలా ఫుడ్ డెలివరీకి డిమాండ్ బాగా పెరిగింది. ఇందులో ప్రస్తుతం స్విగ్గీ అగ్రస్థానంలో ఉంది. మార్కెట్ పోటీని తట్టుకుని ఇన్ని సంవత్సరాలు నిలబడిన సంస్థ స్విగ్గీ విజయ గాథ మీ కోసం..
స్విగ్గీ వ్యవస్థాపకుడైన శ్రీహర్షకి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి తను BITS పిలానీలో చదువుకునే సమయానికి వెళ్లాలి. అప్పుడు ఫొటోగ్రఫీ క్లబ్లో చేరాడు. దీంతో వివిధ ప్రదేశాలను పర్యటిస్తూ ఉండేవాడట. ఇలా ప్రయాణం తన జీవితంలో ఒక భాగంగా మారింది. అయితే, పొర్చుగల్ నుంచి టర్కీ వెళ్లిన టూర్ తన జీవితాన్నే మార్చేసింది. ఈ టూర్‌ని తను ఒక సైకిల్ మీద చేశాడు. దీనిని పూర్తి చేయడానికి తనకు దాదాపు 6 నెలల సమయం పట్టింది. ఈ ప్రయాణం వల్ల ఓపికగా ఉండడం, ఒక సన్యాసి జీవితం జీవించడం నేర్చుకున్నాడు. దీనివల్ల తన ఆలోచనా విధానం మారిపోయిందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
హర్ష చదువు పూర్తి చేసుకున్న తర్వాత.. ఏ జాబులో చేరాలనే ఆలోచన లేకపోవడంతో క్యాంపస్ ఇంటర్వ్యూకి కూడా వెళ్లలేదు. తర్వాత IIM కోల్‌కత్తాలో MBAలో చేరాడు. ఈ సమయంలో ప్లేస్మెంట్ కమిటీలో సభ్యుడిగా పనిచేసి.. ఎందరో విద్యార్థులకు ఉద్యోగం వచ్చేలా చేశాడు. మరోవైపు లండన్‌లో ఫినాన్స్కి సంబంధించిన ఉద్యోగంలో చేరాడు. ముందునుంచే సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న హర్ష కొన్నాళ్లు లండన్‌లో ఉద్యోగం చేసిన తర్వాత తిరిగి భారత్‌కు వచ్చాడు. ప్రముఖ సంస్థ రెడ్‌బస్ స్థాపకుడైన ఫణీంద్ర శర్మను స్ఫూర్తిగా తీసుకుని ఏదైన ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. దీంతో తన జూనియర్ నందన్‌తో కలిసి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా BUNDLE అనే ఒక లాజిస్టిక్స్ వ్యాపారం 2013లో ప్రారంభించాడు. ఇది అంతలా కలిసి రాలేదు. దీంతో ఈ వ్యాపారం ఆపేశాడు.
BUNDLE వ్యాపారం విఫలం అవ్వడంతో.. ఫుడ్ రంగంలో అడుగు పెట్టాలనుకున్నాడు. దీంతో తన స్నేహితులైన నందన్, రాహుల్‌లతో కలిసి స్విగ్గీ ప్రారంభించాడు. ఐటీ, కోడింగ్‌కి సంబంధించిన పనులన్నీ రాహుల్ చూసుకునే వాడు. ముందుగా ఐదుగురు డెలివరీ పార్టనర్స్, 10 రెస్టారెంట్స్‌తో బెంగళూరులో వ్యాపారం ప్రారంభించారు. అవసరం అయితే, వీళ్లు కూడా ఫుడ్ డెలివరీ చేసేవారు. ఇలా మెల్లమెల్లగా రెస్టారెంట్లు రిజిస్ట్రేషన్స్ పెరిగాయి.. కస్టమర్లు పెరిగారు. 2015లో వ్యాపారం విస్తరించడానికి ఫండ్ కోసం ప్రయత్నించారు. తొలి మీటింగ్‌లోనే ఇన్వెస్టర్ల నుంచి రూ.1000 కోట్ల ఫండ్ సంపాదించారు.
ఇక వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2017లో క్లౌడ్ కిచెన్‌తో కూడా స్విగ్గీలో రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు చేశారు. 2018లో 1.3 బిలియన్ డాలర్ బిజినెస్‌గా స్విగ్గీ నిలిచింది. 2020లో కరోనా సమయంలో రోజూ దాదాపు 15 లక్షల ఫుడ్ ఆర్డర్స్ వచ్చేవట. ప్రస్తుతం స్విగ్గీలో లక్షకు పైగా రెస్టారెంట్స్ రిజిస్టర్ అయ్యాయి. 500కు పైగా సిటీలలో సేవలందిస్తుంది. తర్వాత రాహుల్ తన షేర్ తీసుకుని వ్యాపారం నుంచి తొలగిపోయాడు. ఇదండీ స్విగ్గీ సక్సెస్ స్టోరీ.. స్విగ్గీ విజయంతో తెలుగు కుర్రాడైన శ్రీహర్ష ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తి గా నిలిచాడు.