నేటి నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. భారతదేశం వ్యాప్తంగా హిందువులు వినాయక చవితి పండుగను వైభవంగా జరుపుకుంటారు. హిందూ పండుగలలో అత్యంత ప్రాముఖ్యమైనది వినాయక చవితి పండుగ. ఈ పండుగ మొదలైందంటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహం వెళ్లివిరుస్తోంది. చిన్నారులైతే గణేష్ నవరాత్రులలో ఎంతో ఉత్సాహంగా గడుపుతారు ఆటపాటలతో అంతా ఒకచోట చేరి కేరింతలు కొడతారు. నవరాత్రులు ముగిశాక నిమజ్జనం రోజు ఉత్సాహంగా గడిపే ఆ చిన్నారులు వినాయకుడికి బై బై చెబుతూ.. కన్నీరు కూడా కారుస్తారు.
అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది వినాయక చవితి పండుగ. అయితే వినాయక చవితి పండుగను అన్ని చోట్ల ఒకేలా కాకుండా వారి వారి ప్రాంతాలకు తగ్గట్టుగా నిర్వహిస్తారు. మహారాష్ట్ర రాష్ట్రంలో వినాయక చవితి ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. వినాయక చవితి సందర్భంగా మనం ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదే వెయ్యేళ్ళ కాలం నాటి భారీ గణనాథుడు. ఆకాశవీధిలో దర్శనమిచ్చేలా కొలువుదీరి ఉన్నాడు. ఆ గణనాథుని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం ఛత్తీస్గడ్ రాష్ట్రం. చతిస్గడ్ రాష్ట్రంలోని భారీ గణనాథుడు కొలువుదీరి ఉన్నాడు. ఆయనను దర్శించుకోవడం అంత సులభమైన పనేం కాదు. ఓ పర్వత శిఖరం పై కొలువుదీరి ఉన్న ఆ గణేశుని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. చతిస్గడ్ రాష్ట్రంలోని బస్తర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి దంతేవాడ జిల్లాలోని ఫరస్ పాల్ గ్రామం..
బైలాడిలా కొండపై వెలిశాడు ఈ భారీ గణనాథుడు. కొండ అంటే మామూలుగా ఉన్నటువంటి శిఖరం అయితే కాదు అది. సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. దట్టమైన కీకారణ్యం లాంటి అడివిలో భారీ ఎత్తులో ఉన్నటువంటి కొండ శిఖరాగ్రాన ఈ గణపయ్య విగ్రహం స్థాపించబడింది. ఈ గణనాథుడిని “దోల్కల్ గణేష్” అని పిలుస్తారు. కొండ శిఖరాగ్రాన స్థాపించబడినటువంటి ఈ విగ్రహం కథ నేటికీ రహస్యంగానే ఉంది.
స్థానికుల కథనం…
డోల్ ఆకారంలో ఉన్న పర్వత శిఖరం పై ఈ విగ్రహం ఉండడం వల్ల దీనికి దూల్కల్ గణేష్ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విగ్రహం పదవ శతాబ్దంలో నాగవంశీయుల కాలంలో రూపొందించబడిందని వారి నమ్మకం ఆ కాలంలో నాగవంశీయులు మాత్రమే ఉండేవారని ఆ కాలం నాటితే ఈ విగ్రహం అని అక్కడి ప్రజలు చెబుతారు. వెయ్యిళ్ల కాలం నాటి అమూల్యమైన కళాఖండం అది. 500 కిలోల కంటే ఎక్కువ బరువుతో ఉన్న ఈ గణనాథుడి పొడవు ఆరు అడుగులు. ఏకశిలాగా కనిపిస్తోంది.
పురాణ గాధ…
ఈ ప్రదేశంలో గణేశుడు, పరశురాముడు యుద్ధం చేశారు. అందువల్ల అక్కడ గణేశుడు దంతం విరిగిపడింది. పరశురాముడు శివుడిని కలవాలని అనుకున్నాడు. అప్పటివరకు శివుడికి కాపలాగా ఉన్న గణేశుడు పరశురాముడిని లోపలికి అనుమతించలేదు. బలవంతంగా లోపలికి ప్రవేశించడానికి పరశురాముడు ప్రయత్నించినప్పుడు గణేషుడు అతనితో గొడవపడి ఆయనను భూమి పై ఉన్న బైలాదిలా పర్వత శ్రేణి పైకి విసిరేశాడు. అనంతరం వారిద్దరి మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. యుద్ధం సమయంలో పరుశురాముడు తన ఆవిధమైన తన ఆయుధంతో గణేశుని మీదికి విసిరారు. అది కాస్త గణేష్ ని దంతానికి తగ్గడంతో అక్కడ విరిగిపడింది. అందుకే ఇక్కడ గణేశుడిని ఏకదంతా అని కూడా పిలుస్తారు.
ఈ కొండకు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నో రాతి ఆయుధాలు దొరికాయి. అక్కడ ఆదిమానవులు సైతం నివసించిన దాఖలాలు ఉన్నట్లు పురావస్తు శాఖ వెల్లడించింది. ఈ గణపతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుతారని స్థానికులు చెబుతున్నారు. గణేశుడు విరిగిన దంతంతో ఇక్కడ దర్శనం ఇస్తాడు. పూలమాలలు, మోదకాలతో కనిపిస్తాడు. ఈ విగ్రహం 2012 నుండి ప్రాచూర్యంలోకి వచ్చింది. దట్టమైన కీకారణ్యంలో ఉన్నటువంటి ఈ విగ్రహం గురించి 2012 సంవత్సరం ముందు వరకు ఎవరికీ తెలియలేదు.
అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల ద్వారా ఈ విషయం మీడియాకు తెలియడంతో అప్పటినుండి.. ఈ గణనాథుడు తెగ వైరల్ అయిపోయాడు. దటమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గణనాథుడి ని దర్శించుకోవడం కోసం ప్రజలు రిస్క్ చేసి మరీ ఇక్కడికి చేరుకుంటారు. పూర్తి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోపక్క పోలీసులు, అధికార యంత్రాంగం పర్యాటకులకు సూచనలు చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ.. రిస్క్ చేసి పర్యాటకులు గణనాథుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు.
సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతం శిఖరంపై నుండి చూస్తే ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. కొండ చుట్టూ.. అద్భుతమైన ప్రకృతి రమణీయత కనువిందు కలిగిస్తుంది. ఆ పర్వతశ్రేణిపై వినాయకుడిని నిత్యం ఓ పూజారి భక్తితో పూజిస్తున్నాడు. ధూప దీప నైవేద్యాలు సైతం సమర్పించి భూమి, ఆకాశాలకు నివేదిస్తున్నాడు. బండరాళ్లపై ఉన్న ప్రజలు భయపడుతూనే ఆ గణనాథుని చూస్తారు. అక్కడ ఏ మాత్రం తడబడిన కాలు కిందకి జారి పడిపోవడం ఖాయం. అయినప్పటికీ ఎటువంటి బెరకు లేకుండా.. ఆ పూజారి భక్తి భావంతో, ఆధ్యాత్మికతతో ఆ గణనాథుడికి నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు.
ఆలయం చేరుకోవడానికి మార్గం..
ధోల్కల్ గణేష్ ని దర్శించుకోవడం అంటే సాధ్యమైన పని కాదు. ఎంతో రిస్క్ చేస్తేనే.. ఆయన దర్శనం కలుగుతుంది. అయినప్పటికీ పర్యాటకులు రిస్క్ చేసి మరి దర్శించుకుంటున్నారు.
ధోల్కల్ దగ్గరగా ఉన్న ఫరస్ పాల్ గ్రామం దంతవాడ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గణనాధుని దర్శించుకోవాలంటే అక్కడ రిజిస్టర్ గైడ్ సహకారం తీసుకోవాలి. దట్టమైన అడవి వల్ల ఒంటరిగా ప్రయాణం చేయరాదు. ఈ అడవి చాలా ప్రమాదకరమైంది. అక్కడ ఒకసారి దారి తప్పితే ఎటువైపు వెళతామో కూడా తెలియదు. అందువల్ల గైడ్ సహకారంతో మాత్రమే ఈ ఆలయానికి చేరుకోవాలి. అటువైపు ఎటువంటి రోడ్డు మార్గము లేదు. ప్రయాణ సౌకర్యం లేదు. కేవలం అడవి మార్గం గుండా దాదాపు 40 నిమిషాల వరకు కాలినడకనే ప్రయాణించాల్సి ఉంటుంది. వాహనాలు కొంత దూరం వరకు వెళ్తాయి. అనంతరం 40 నిమిషాల వరకు దట్టమైన కీకారణ్యంలో కాలిబాటనే ఆశ్రయిస్తూ ఆ పర్యాటకులు నడిచి వెళతారు.
ప్రయాణ సమయంలో అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉండవు. మంచినీరు కూడా దొరకదు. అందువల్ల అక్కడకు వెళ్లే పర్యటకులు కచ్చితంగా తమ వెంట ఆహారాన్ని, మంచినీటిని తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సిందే. సేద తీరేందుకు కూడా అక్కడ సౌకర్యాలు ఉండవు. ఎందుకంటే అది దట్టమైన అటవీ ప్రాంతం. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం మంచుకొస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఒకపక్క కీకారణ్యం.. మరో పక్క మావోయిస్టుల అలజడి. అందువల్ల పర్యాటకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పర్యాటకుల మాటల్లో…
తెలంగాణ, చతిస్గడ్ రాష్ట్రాలకు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం రెండు రాష్ట్రాలు పూనుకుంటే అభివృద్ధి జరుగుతుందని, పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని భక్తులు కోరుకుంటున్నారు. పర్యాటకశాఖ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే వెయ్యేళ్ళనాటి ఈ అరుదైన గణనాథుడు ప్రపంచ గుర్తింపు పొందుతాడని అంటున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇంకేంటి మీకు కూడా ఈ గణనాథుడిని చూడాలి అనిపిస్తుందా.. అయితే మరెందుకు ఆలస్యం రిస్క్ చేసైనా సరే.. ఆ గణేశుడిని దర్శించుకోండి.