Telugu Special Stories

చార్లెస్‌ డార్విన్‌ – జీవ పరిణామ పితామహుడు 

ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన అతి కొద్ది మంది శాస్త్రవేత్తల్లో చార్లెస్ రాబర్ట్‌‌ డార్విన్‌ ప్రముఖుడిగా గుర్తింపబడుతున్నాడు. ఇంగ్లాండ్‌లో 12 ఫిబ్రవరి 1809న ఒక సంపన్న కుటుంబంలో జన్మించి చార్లెస్‌ డార్విన్‌ అత్యంత ప్రధానమైన సహజ ప్రాణి ప్రపంచానికి చెందిన “జీవ పరిణామ సిద్ధాంతాన్ని (థియరీ ఆఫ్‌ ఎవోల్యూషన్‌)” ప్రతిపాదించి జీవ శాస్త్రవేత్తగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

వైద్యుడైన తండ్రి చార్లెస్‌ డార్విన్‌ను ఎడిన్బర్గ్‌ యూనివర్శిటీలో చేర్పించి వైద్య శాస్త్రంలో ప్రవేశించాలని ఆశించినప్పటికీ ప్రకృతి ఒడిలో ఉన్న వైవిధ్యభరిత జీవకోటి మనుగడకు సంబంధించిన అంశాల పట్ల ఆకర్షితుడై మెడిసిన్‌ కోర్సును వదిలి జీవుల సహజ జీవ పరిణామం పట్ల జీవశాస్త్ర అధ్యయనం ప్రారంభించారు. 1831లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా పొందిన చార్లెస్‌ డార్విన్ఐదేళ్ల పాటు భౌగోళిక నౌకాయాన బృందంలో నాచురలిస్ట్‌గా పాల్గొనడంతో జీవ వైవిధ్య సౌందర్యాలను ప్రత్యక్షంగా చూడడంలో తన జీవ పరిణామ శాస్త్ర  అధ్యయనాలు, ప్రతిపాదనలకు మూలస్తంభాలుగా నిలిచాయి. 

చార్లెస్‌ డార్విన్ ప్రధాన శాస్త్ర‌ ప్రతిపాదనలు:

జీవ పరిణామ సిద్ధాంతానికి సంబంధించిన నేచురల్‌ సెలక్షన్‌ ఆధారంగా “ఆన్‌ దిఓరిజిన్‌ ఆఫ్‌ స్పీసీస్‌” అనే పరిశోధన పుస్తకాన్ని 1859లో ముద్రించి నాటి జీవశాస్త్ర సాంప్రదాయ ఆలోచనలకు విరుద్ధంగా తన అధ్యయనాల ఫలితాలను బయటి ప్రపంచానికి వివరించి విశ్వ శాస్త్ర వేత్తల దృష్టిని ఆకర్షించగలిగారు. 1871లో లింగ ఎంపిక సిద్ధాంతం (సెక్సువల్ సెలక్షన్‌ థియరీ)తో మానవ పరిణామానికి సంబంధించిన “ది డిసెంట్‌ ఆఫ్‌ మ్యాన్(మానవ సంతతి)‌” పుస్తకం ముద్రించారు. వీటికి తోడుగా వానపాముల “ఎర్త్‌ వర్మ్ స్టోన్‌” అనే పరిశోధనలు, ఫోటోట్రోపిజమ్‌ పరికరం, పీజియన్‌ ఫెన్సింగ్‌, బొటానికల్ పరిశోధనలు, కోరల్‌ రీఫ్‌ ఏర్పాటు, కంపారిటివ్‌ అనాటమీ (తులనాత్మక శరీర నిర్మాణ శాస్త్రం)‌ లాంటి పలు అతి ముఖ్యమైన అంశాల ప్రతిపాదనలు చేశారు. 

జీవశాస్త్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిన చార్లెస్‌ డార్విన్‌ తన 73వ ఏట 19 ఏప్రిల్‌ 1882న తుది శ్వాస విడిచారు. సహజ శాస్త్రం ఆధారంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన “ఆన్‌ ది ఓరిజిన్‌ ఆఫ్‌ స్పీసీస్” పరిశోధన పుస్తకంతో ప్రపంచ ప్రశంసలు పొంది “జీవ పరిణామ పితామహుడు” అనే బిరుదును పొందారు. వినయం, ఓపెన్‌ మైండెడ్‌, ఇంట్రెవర్టెడ్‌, దయాగుణాల మేలుకలయిక అయిన చార్లెస్‌ డార్విన్‌ జీవితం నేటి పరిశోధకులకు, యువతకు దారి దీపం కావాలని కోరుకుందాం, మనం కూడా పరిణామం చెంది అద్భుత పరిశోధనలకు ఆజ్యం పోద్దాం.

Show More
Back to top button