
సంక్రాంతి అంటే జూదం, కోడి పందాలు అని చాలామంది అనుకుంటారు. కానీ, సంక్రాంతి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక విశిష్టమైన పండుగ. దీన్నే మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఎందుకంటే, ఈరోజు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రాంతిని పలు రాష్ట్రాల్లో నూతన సంవత్సరం ప్రారంభంగా కూడా భావిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి, కల్లాపి చల్లి, రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
హరిదాసు పాటలకు, బసవన్న ఆటలకు, పిండి వంటలకు, పతంగులు ఎగరేయ్యటకు ప్రసిద్ధి గల పండుగ కూడా సంక్రాంతే. అంతేకాదు, ఈ పండుగను పంటల పండుగ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజునే రైతులు పంట చేతికి వస్తుంది. ఆరు నెలలు కష్టపడ్డ పంట చేతికి వచ్చిన సంతోషంలో రైతులు ఈరోజును పెద్ద పండుగల జరుపుకుంటారు. కొత్త బియ్యంతో బెల్లాన్ని కలిపి పరమణాన్నీ వండుకుని తింటారు. అంతేకాదు సంక్రాంతి రోజన పితృదేవతలకు తర్పణాలను ఇస్తుంటారు. కొన్ని చోట్ల ఆడవాళ్లు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటుంటారు.
కోడి పందాలు.. అసలు రహస్యం ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంక్రాతి రోజును జరిగే కోడి పందాలకు ఓ ప్రత్యేక చరిత్ర ఉందని మీకు తెలుసా?.. అది ఏంటంటే.. ప్రాచీన కాలంలో యుద్ధాలు తప్పవనుకున్నప్పుడు లక్షల మంది చనిపోతారని, పౌరుషాలకు పోవద్దని పెద్దలు చెప్పేవారు. ఈ క్రమంలో పెద్దలు ఓ నిర్ణయన్ని తీసుకోవడం జరిగింది. అదేమిటంటే.. ‘తులారణం’ ప్రకారం ఇరుపక్షాల నుంచి ఒక్కో కోడిని ఎంపిక చేసి పందెం పెట్టేవారు. ఏదైతే చనిపోతుందో వారు ఓడిపోయినట్లుగా వారు నిర్ణయించుకున్నారు. దీంతో అశేష జన నష్టం తప్పి శాంతి ఏర్పడుతుందని ఆనాడు కోడి పందేలను ప్రోత్సహించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కోడి పందాలు నిర్వహిస్తునే ఉన్నారు. కానీ కాల క్రమంలో కోడి పందాలు పౌరుషానికి ప్రతీకగా మారాయి.
అంతేకాదు 11వ శతాబ్దం నాటి పల్నాటి రాజుల కాలంలో కోడి పందేలు వినోదానికి మాత్రమే కాకుండా పౌరుషానికి ప్రతీకగా ఉన్నట్లు సమాచారం. బాల నాగమ్మతో పందెంలో ఓడిపోయిన పల్నాటి బ్రహ్మనాయుడు అడవులకు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. ఇక బొబ్బిలి, విజయనగర రాజుల మధ్య కూడా కోడి పందేలు పరువు-ప్రతిష్టల సమస్యగా ఉండేదంట. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలకు విశేష ఆదరణ ఉంది. అయితే, ఇలాంటి కోడి పందాలు నేడు కొన్ని ప్రదేశాల్లో సంప్రదాయంగా సాగవలిసినవి ఓ జాదంలా మారి కొన్ని కుటుంబాల జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి.
భోగి వైభోగం
సంక్రాంతి సంబరాలు భోగి పండుగతో మొదలవుతాయి. ఈరోజు తెల్లవారుజామునే భోగిమంటలు వేసి.. ఆ మంటల్లో పాత వస్తువులను వేస్తుంటాం. ఇలా చేయడం వల్ల ఉన్న చెడు అంతా తొలగిపోయి మంచి రోజులు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఆడవారు సాయంత్రం బొమ్మలపేరంటాలను ఏర్పాటు చేస్తుంటారు. ముత్తైదువులను పిలిచి పేరంటం చేసి, పండు తాంబూలం ఇస్తారు. చిన్న పిల్లల తలపై భోగి పండ్లను ( రేగు పండ్లు, పూల రేకులు, చిల్లర నాణేలు, చెరుకు ముక్కలు కలిపి) పోస్తారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని.. దాని మీదుగా పండ్లను పోస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని, పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని కొందరి నమ్మకం.
కన్నుల విందుగా కనుమ
సంక్రాంతి తర్వాత రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగను పశువుల కోసం జరుపుకునే పండుగగా భావిస్తుంటారు. పంట పడడంలో పశు పక్ష్యాదుల పాత్ర కూడా పెద్దదని రైతులు నమ్ముతుంటారు. దీంతో ఈరోజు గోవులకు, ఎద్దులకు పసుపు, కుంకుమలు పెట్టి పూజిస్తారు. మరోవైపు పశువులనీ, వాటి ఉంటే కొట్టాలనీ శుభ్రపరుస్తారు. కొట్టాలను గోమయంతోనూ, పూలదండలతోనూ అలంకరిస్తారు. దీంతోపాటు వారికిష్టమైన ఆహారాన్ని పెట్టి.. పూజిస్తారు. అంతేకాకుండా కొంతమంది కనుమ రోజు వారి పితృదేవతలనీ స్మరించుకుంటారు.
ముక్కల కనుమ
కొన్ని చోట్ల భోగి,సంక్రాంతి, కనుమ(Kanuma)గా మరికొన్ని చోట్ల ముక్కనుమ అని నాలుగో రోజు పండుగను చేసుకుంటారు. ఈరోజున గ్రామదేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి గ్రామాన్ని , తమని రక్షించమని వేడుకుని బలిస్తారు. ఇష్టమైన మాంసాహార వంటకాలను వండుకుని కుటుంబంతో కలిసి తింటారు. నాలుగో రోజున అందుకే ఈ రోజున ముక్కల కనుమ అంటారు.. అదేనండీ ముక్కనుమ. ముక్కనమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును కరినాళ్ అని పిలుస్తారు. ఈ రోజు బంధువులను కలిస్తే మంచిదని చెబుతారు. కొత్త సంబంధాలు కలుపుకునేందుకు, మంచి చెడులకు సంబంధించి బంధువులను పరామర్శించేందుకు ఈ రోజు మంచిరోజుగా భావిస్తారు. అందుకే సుకుటుంబ,సపరివార సమేతంగా వనభోజనాలు కూడా చేస్తారట.