అందాల పాపను చూసి “అముల్ బేబీ” అని ముద్దుగా పిలవడం మనకు అలవాటు. అముల్ బ్రాండ్ అంటే తెలియని భారతీయులు ఉండరు. అంతటి మహత్తర అముల్ సృష్టికర్త వర్గీస్ కురియన్‌ను గుర్తు చేసుకోవడం మన కనీస కర్తవ్యం. భారత శ్వేత విప్లవ పితామహుడు (ఫాదర్ ఆఫ్ వైట్ రెవొల్యూషన్) డా: వర్గీస్ కురియన్ జన్మదినం 26 నవంబర్ రోజున ప్రతి ఏట దేశవ్యాప్తంగా “జాతీయ క్షీర దినోత్సవం లేదా నేషనల్ మిల్క్ డే” పాటించుట ఆనవాయితీగా మారింది. పాలు, పాల ఉత్వత్తుల్లో పోషక విలువలు, నిత్యం పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పాల ఉత్పత్తులను పెంచే మార్గాలు, పాడి పరిశ్రమల లాభసాటి నిర్వహణ, పాల ఉత్పత్తిదారులను కొనియాడడం, పాడి పరిశ్రమను వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా రైతులకు పరిచయం చేయడం లాంటి ప్రధాన అంశాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా జాతీయ క్షీర దినం వేదికలను వినియోగిస్తారు.
‘అముల్ డైరీ’ సృష్టికర్త డా: వర్గీస్ కురియన్:
భారత్‌లో శ్వేత విప్లవానికి నాంది పలికిన డా: వర్గీస్ కురియన్ కృషితో నేడు పాల ఉత్పత్తుల్లో మన దేశాన్ని అగ్ర స్థానంలో నిలిచింది. కోట్ల పేద రైతుల కుటుంబాల దృష్టిని పాడి పరిశ్రమ వైపుకు మరల్చి, వారి కుటుంబాల్లో/జీవితాల్లో వెలుగులు నింపి, పాల ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసి, భారతీయుల ఆరోగ్యాలను కాపాడిన మహోన్నతుడిగా కురియన్ సేవలను కొనియాడాల్సిందే. కురియన్ దూరదృష్టి, దార్శనికత ఫలితంగా “నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు” ఏర్పడడం, దాని వ్యవస్థాపక చైర్మన్‌గానే కాకుండా గుజరాత్‌లో “కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్(అముల్ డైరీ)” స్థాపన, “ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్” స్థాపన, “అల్లహాబాదు సెంట్రల్ యూనివర్సిటీ” విసీగా పని చేయడం లాంటి అమూల్య సేవలతో తన జీవితాన్ని ఆసాంతం దేశాభివృద్ధికి అంకితం చేశారు. తను చూపిన సహకార పాల ఉత్పత్తుల ఉద్యమం ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అల్పాదాయ దేశాలకు కూడా దారి దీపంగా మారడం హర్షదాయకం.
కోజికోడ్ నుంచి అముల్ దాకా ప్రస్థానం:
దార్శనికుడు, విలక్షణ ఆలోచనాపరుడు, సామాజిక ఔత్సాహికవేత్త, పేదల పక్షపాతి, నిరంతర శ్రామికుడు, మేధావి అయిన వర్గీస్ కురియన్ 26 నవంబర్ 1921న కోజికోడ్, కేరళలో జన్మించారు. అకుంఠిత దీక్షతో సహకార పాల ఉత్పత్తి సంఘాన్ని ఏర్పాటు చేసి, 1946లో అముల్ డైరీ రూపంలో ప్రపంచంలోనే అతి పెద్ద పాల సహకార సంఘాన్ని స్థాపించిన మహానుభావుడు కురియన్.
ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన కురియన్ కృషితో పాల ఉత్పత్తిదారులు ఊపిరి పీల్చుకోవడం, పాల ఉత్పత్తులతో తమ జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవడం, పాడి పరిశ్రమను లాభాల బాటన నడిపించడం, మధ్యవర్తుల ఆగడాలను అరికట్టడం, మార్కెటింగ్ సౌకర్యాలు పెంచడం, పాడి రైతులకు దిశ నిర్దేశనం చేయడం లాంటి సత్కార్యాలను సుసాధ్యం చేసిన కురియన్ సేవలు మరువలేనివి. కురియన్ కృషితో ప్రపంచంలోనే అతి పెద్ద “ఆపరేషన్ ఫ్లడ్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
కురియన్ చొరవతో దాదాపు 30 సంస్థలు ఏర్పడడం, వాటిని రైతులు/శ్రామిక వర్గాలు నడపడం జరుగుతోంది. అముల్ బ్రాండ్ విజయవంతం కావడంలో వర్గీస్ సేవలే ప్రధానం. కురియన్ కృషిని గుర్తించిన పౌర సమాజం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషన్, పద్మ విభూషన్, రామన్‌మెగసెసె, కృషి రత్న, వరల్డ్ ఉుడ్ ప్రైజ్ లాంటి పురస్కారాలను అందజేశాయి.
జాతీయ క్షీర దినోత్సవ వేడుకలు:
జాతీయ క్షీర దినోత్సవం వేదికగా కురియన్ అమూల్య సేవలను గుర్తు చేసుకుంటూ వారు చూపిన బాటలో నడిచే ప్రయాత్నాలను చేయడం, సదస్సుల నిర్వహణ, పాడి రైతులకు శిక్షణలు, పాలలో ఉన్న పోషక విలువలను ఏకరువు పెట్టడం, పౌర సమాజ ఆరోగ్య పరిరక్షణలో పాడి రైతుల పాత్రను శ్లాఘించడం, పాల సరఫరా శృంఖలాలను పటిష్ట పరచడం, డైరీ పరిశ్రమలను నెలకొల్పడం, విద్యాలయాల్లో యువత/పిల్లలకు పోటీలను నిర్వహించడం, పాల ఉత్పత్తిలో ప్రగతి సాధించిన రైతులను ప్రస్తుతించడం లాంటి పలు అంశాలను చర్చించడం జరుగుతుంది.
తల్లి ముర్రు పాలే ఏకైక అమృతాహారంగా మన జీవితాలు ప్రారంభమై, తొలి ఒకటి లేదా రెండేళ్లు రొమ్ము పాలును ప్రధాన పోషకాహారంగా తీసుకొని ఎదిగిన మనిషికి పాల ప్రాధాన్యాన్ని విడమర్చి చెప్పాల్సిన పని లేదు. పాల ఉత్పత్తిదారుల ఆరాధ్య దైవంగా నిలిచిన వర్గీస్ కురియన్ చూపిన దారిలో నడుస్తూ, కుటుంబాల ఆదాయాలను/ఆరోగ్యాలను/సుఖసంతోషాలను పెంచుకుంటూ పాడి పరిశ్రమను అనుబంధ ఆదాయ వనరుగా మార్చుకుంటూ దేశ పౌరుల ముంగిట పాలు, పాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచుదాం, మానవాళి ఆయురారోగ్య శ్రేయస్సుకు క్షీరాన్ని పునాదిగా మార్చుదాం.