
తొలి స్వాంతంత్ర సంగ్రామంలో మంగళ్ పాండే కీలకపాత్ర పోషించిన యోధుడు. గొప్ప ఉద్యమకారుడు. అప్పటివరకూ బ్రిటిషర్ల అరాచకాలను మౌనంగానే భరిస్తున్న భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను సాధించేలా ఉత్తేజపరిచిన భారతీయ పౌరుడు.. ఉరికొయ్యలను ముద్దాడి భారతమాత ఒడిలో వీరమరణం పొందిన వీరుడతడు.. ఆయనే మంగల్ పాండే.. ఈ నెల 19న అయన జయంతి. ఈ సందర్భంగా అయన గురుంచిన విశేషాలను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
నేపథ్యం…1827 జులై 19న ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన నగ్వా గ్రామం, అవధ్ ప్రాంతంలో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మంగళ్ పాండే. జమీందారీ వ్యవస్థ నడుస్తున్న రోజులవి. వ్యవసాయ పనులు తప్ప మరో వృత్తిని చేపట్టేవారు కాదు అప్పటి ప్రజలు. ఎంత శ్రమకోర్చినా తగిన ఫలితం దక్కేది కాదు. పేదరికంలోనే అక్కడి చుట్టుపక్కల గ్రామాలు మగ్గుతుండేవి. అప్పట్లో భారతీయులు సైనికులుగా చేరారు. తనకు తెలిసిన స్నేహితుడొకడు బ్రిటీష్ సైనిక దళంలో సిపాయిగా చేరాడని తెలిసింది. అతని ద్వారా తాను కూడా సిపాయిగా చేరాలనుకున్నారు పాండే. అప్పుడతని వయసు 22. కొన్నాళ్ళు శిక్షణ సైతం పొందారు. బయటి ప్రపంచంతో సంబంధం లేని చోటు అది. అనుకున్నట్లుగానే 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరారు. 34వ బెంగాల్ స్థానిక పదాతిదళానికి చెందిన 6వ కంపెనీలో సిపాయిగా పని చేశారు. ఈ కంపెనీలో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులే ఉన్నారు. తన వృత్తిని సిపాయిగా కొనసాగిస్తూ వచ్చారు. సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు.. బ్రిటీష్ వారి దాష్టీకం, భారత్ లో చెలరేగుతున్న అసమ్మతి గురించిన వార్తలు తెలుస్తుండేవి వీరికి.
తిరుగుబాటుకు దారి తీసిందిలా…
1850లో బరాక్‌పూర్‌లోని దండు వద్ద పోస్టింగ్ వేసినప్పుడు, ఒక కొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్‌ను భారతదేశంలోకి ప్రవేశపెట్టారు. అయితే ఈ ఆయుధాన్ని లోడ్ చేయడానికి సైనికుడు గ్రీజు గుళికల చివరలను నోటితో కొరకాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆవు లేదా పందికొవ్వు పూసి ఉంటారనే ఒక వదంతి పుట్టింది. ఈ విషయం పాండే కు తెలిసి ఎంతో రగిలిపోయాడు. తమ మత విశ్వాసాలను దెబ్బతీసే ఈ పనికి మూల కారణమైన బ్రిటీషర్ల మీద విపరీతమైన ఆక్రోశం పెంచుకున్నారు ఆయన. తోటి సిపాయిలను బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడమని ఉత్తేజపరిచారు. బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు.
కానీ అది కొవ్వు పదార్థమే అని పాండేకు, ఇతర సైనికుల్లో సందేహం కాస్త మరింత బలపడింది. చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు దారితీశాయి.
పాండే తన తోటి సిపాయిలను బ్రిటీష్ సామ్రాజ్య పాలనలో జరిగే దురాగతాలపై కదం తొక్కాలని పిలుపునిచ్చారు.
బ్రిటీషర్ ల అరాచకాలను మౌనంగా భరించిన భారతీయుల్లో మంగళ్ పాండే తిరుగుబాటుతో ఒక్కసారిగా భారీ మార్పు వచ్చింది.
తెల్లవారి చేతుల్లో చావను….
ఇదిలా ఉంటె మరో పక్క, బ్రిటీష్ పాలకులు సైనికుల్లో తిరుగుబాటు లక్షణాలు కనిపిస్తున్నాయని గ్రహించారు. వీరందరికీ నాయకుడిగా మంగళ్ పాండే వ్యవహరిస్తున్నారన్న సందేశం వెళ్ళింది.
తన తుపాకీని సిద్ధం చేసుకొని, కనిపించిన ప్రతి అధికారిని కాల్చి పారేయమని వారందర్నీ ఉత్తేజపరిచారు పాండే. అదే పనిగా కాల్పులు జరగగా, ఎవరూ అతని ధైర్యాన్ని చూసి అరెస్టు చేయలేకపోయారు.
ఆఖరుకు మేజర్ జనరల్ అధికారి వచ్చి, సైనికుల్ని అలర్ట్ చేశారు. సైనికులందర్ని వరుసలో నిలబడమన్నారు. వారి ముందు అటు ఇటు నడవసాగారు.
తిరుగుబాటుకు ముగింపు పలకాల్సివస్తుందని అర్ధమైన పాండే తెల్లవారిచేతికి చిక్కడం ఇష్టంలేక, కాలి బొటన వేలితో ట్రిగ్గర్ ను నొక్కి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు.
కానీ బుల్లెట్ తగిలి గాయపడ్డారే కానీ, చనిపోలేదు. ఆయన్ను దగ్గరికెళ్ళి చూసే సాహసం కూడా చేయలేదు బ్రిటీష్ అధికారులు.
అతన్ని ప్రాణాలతో ఉంచాలనే ఉద్దేశంతో ఆసుపత్రికి తరలించారు.
వారం గడించింది. కాస్త కోలుకున్నాక, ఆయన మీద రాజద్రోహం, సైనిక తిరుగుబాటు నేరాలను మోపింది బ్రిటిష్ ప్రభుత్వం. విచారణ ముగిసింది.
తీర్పు వెలువడింది. ఉరిశిక్ష విధించింది. 1857 మార్చి 29న తిరుగుబాటు చేస్తే, ఏప్రిల్ 18న ఉరి తీయాలని ఉత్తర్వులు అందాయి.
ఈ వార్త అంతటా వ్యాపించడంతో, స్థానిక రాజసంస్థానాలు సైతం తిరుగుబాటుకు సిద్దమయ్యాయి.
మంగళ్ పాండే ను ఉరి తీస్తే సైనిక దళాల మీద ప్రభావం ఎలా ఉంటుందో అని భయపడి, ఉరిశిక్షను ఏప్రిల్ 8న, అంటే పదిరోజుల ముందే అమలు చేశారు.
ఆయన మరణించిన ప్రభావంతో మరి కొంతమంది పాండేలు పుట్టుకొస్తారని భావించిన బ్రిటిషర్లు, భారతీయులు పని చేసే కంపెనీని పూర్తిగా రద్దు చేసింది.
మంగళ్ పాండే ప్రారంభించిన తిరుగుబాటును 1857 సిపాయిల తిరుగుబాటు అని, మొదటి స్వాతంత్య్ర యుద్ధం అని కూడా పిలుస్తారు.
మంగళ్ పాండే మరణించినా ఆయన రగిలించిన తిరుగుబాటు వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్వాతంత్రోద్యమం ప్రజ్వరిల్లింది.
1857 లో జరిగిన ఈ పోరాటం కారణంగా 300 పట్టణాలకు భారతీయులు స్వాతంత్రం సాధించగలిగారు.
ఆయన బ్రిటీష్ వారి గుండెల్లో తూటాలు దింపి.. స్వాతంత్య్రం సాధించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ధీరుడుగా చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు.