Telugu Special Stories

పన్నెండేళ్లకోసారి వచ్చే పుణ్య కుంభమేళా..!

నదీ స్నానం వల్ల మానవులకు పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే, అతి పవిత్రమైన పన్నెండు పుణ్య నదులు.. ప్రతి పన్నెండేళ్లకోసారి పుష్కరాలు, మహా కుంభమేళాను నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దక్షిణాదివాసులు పుష్కరాల వైభవానికి అధిక ప్రాధాన్యతనిస్తే, ఉత్తరాదివాసులు కుంభమేళాకు అగ్రస్థానం ఇస్తున్నారు. అయితే, పుష్కరాల్లో, కుంభమేళాల్లో యావత్ భారతదేశంలోని భక్తులంతా పాల్గొని, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ఈసారి వచ్చిన మహా కుంభమేళాకు గల ప్రత్యేకత, విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మకర సంక్రమణ పర్వదినాల్లో తొలి పండుగైన భోగి రోజున ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ప్రారంభమైంది. 45 రోజులపాటు దాదాపు 40 కోట్ల మంది భక్తులు ఈ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలుస్తోంది. హైందవ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు విశేష ప్రాధాన్యం ఉంది. కుంభమేళా నిర్వహణకు కొన్ని పద్దతులు ఉంటాయి. ప్రతి నాలుగేళ్లకోసారి కుంభమేళా కార్యక్రమాలు నిర్వహించగా, అర్థ కుంభమేళాను ప్రతి ఆరేళ్లకోసారి హరిద్వార్ లేదా ప్రయాగ్ రాజ్ లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా ప్రతి పన్నెండు ఏళ్లకోసారి ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్ లో నిర్వహిస్తారు. 2013లో ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా నిర్వహించగా, తిరిగి ఇప్పుడు ఈ 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా పుణ్యనదీ స్నాన వేడుకను నిర్వహించనున్నారు.

సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభ సమయంలో, మకర సంక్రాంతి రోజు నుంచి మహాకుంభం అనేది మొదలవుతుంది. అప్పటినుంచే కుంభస్నానాలు మొదలవుతాయి. సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కుంభమేళా స్నానాన్ని శంకరభగవత్పాదులు ప్రారంభించినట్లు మనకు పురాణ చరిత్ర చెబుతోంది. ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యగణాలు, సాధుపుంగవుల పుణ్య స్నానాల కోసం తొలుత సంఘం ఒడ్డున ప్రత్యేక ఘాట్ లు ఏర్పాటయ్యాయి. రానురాను లక్షల సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర స్నానాలకు తరలివచ్చే క్రతువు మొదలైంది. మోక్ష సిద్ధికి ఈ పుణ్యనదీ స్నానం ఎంతో దోహదపడుతుంది. మహా పుణ్యస్నానం, రాజస్నానంగా మహాకుంభ స్నానాన్ని పెద్దలు పరిగణిస్తారు. ఈ సమయంలో నదినీరు అమృతతుల్యం అవుతుందని విశ్వసిస్తారు. చాలామంది భక్తులు ఇతర నదుల్లోనూ స్నానాలు చేసి దేవతారాధనలు చేస్తారు. 

*మరో కథనం ప్రకారం అమృతాన్ని స్వర్గానికి తీసుకెళ్లే సమయంలో మహావిష్ణువు భూమిపై నాలుగు పుణ్యతీర్ధాల్లో ఒక్కో చుక్క అమృతాన్ని విడిచాడని, ఆ నాలుగు తీర్ధాల్లో ప్రతీ 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతూ వస్తుంది. 

*గంగా, యమున, అంతర్వాహిని, సరస్వతీ నదుల సంగమ ప్రదేశంగా, త్రివేణీ సంగమం పేరొందింది. ఈ త్రివేణి సంగమం ప్రయాగలో ఉంది. హరిద్వార్, నాసిక్, ఉజ్జయినీల్లో ప్రతి పన్నెండేళ్లకోసారి కుంభమేళా వస్తుంది. అయితే, ఈ నాలుగు తీర్థాల్లోని కుంభమేళా వేర్వేరు సంవత్సరాల్లో జరుగుతుంది. పన్నెండేళ్లకోసారి నిర్వహించే నదీమ తల్లి వేడుక కుంభమేళా కాగా 144 ఏళ్లకోసారి నిర్వహించే వేడుక మహా కుంభమేళాగా భావిస్తారు. ఇక ప్రతి ఆరేళ్లకోసారి నిర్వహించే ఈ స్నానపు పండుగను అర్థ కుంభమేళగా పిలుస్తారు. 

*కుంభ అంటే కుండ, మేళా అంటే జన సమూహం అని అర్థం. అమృతభాండ వేడుకకు అసంఖ్యాక జనాల రాకనే కుంభమేళాగా పెద్దలు అభివర్ణిస్తారు.

*వేద, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఏడాదిపాటు నివాసం ఉంటాడు. పన్నెండు రాశులపై ప్రయాణించేందుకు పన్నెండేళ్ల సమయం పడుతుంది. ఈ కారణంగానే పన్నెండు సంవత్సరాలకోసారి పవిత్ర పుణ్యనదీ ప్రాంతాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. మూడేళ్లకోసారి వివిధ ప్రదేశాల్లో ఈ వేడుకలు జరుగుతాయి. 

*కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభమేళా జరుగుతుంది. దేవతలకు ఒకరోజంటే మానవులకు ఏడాది కాలం. దేవతల పగటి కాలం ఉత్తరాయణం, దేవతల రాత్రికాలం దక్షిణాయనం. పురాణాల ప్రకారం దేవ, దానవుల మధ్య సమరం పన్నెండేళ్లపాటు జరిగిందని అందుకు పన్నెండేళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారని పెద్దలు చెబుతారు. దేవతలకు పన్నెండేళ్లు అయితే మానవులకు 144 ఏళ్లు. అందుకే ఈ సమయంలో భువిలో మహాకుంభమేళా కార్యక్రమాన్ని ఘనంగా చేస్తారు.

*ఉత్తరాది కుంభమేళా అయినా, దక్షిణాది పుష్కరాలైన.. ఏవైనా నదీ పండుగలే. పన్నెండేళ్ల కాలాన్ని ప్రామాణికంగా చేసుకునేవి నదీమతల్లి పండుగలే. దేశంలోని పన్నెండు పుణ్య నదులను పుష్కర యోగ్య నదులుగా గుర్తించారు. ప్రతీ ఏడాది ఒక్కో నది చొప్పున మొత్తం 12 నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. పుష్కరాలు జరిగిన నదికి తిరిగి పుష్కరం రావడానికి పన్నెండేళ్లు సమయం పడుతుంది. 

*అయితే, నదులకు ఉపనదులుగా ఉండి.. పుష్కరాల్లో స్థానం సంపాదించినవి కొన్ని ఉన్నాయి. గంగ, గోదావరి, నర్మద, సరస్వతి, యమున, కృష్ణ, కావేరీ సింధు నదులు ప్రధాన నదులుగా పుష్కర వేడుకలకు అర్హమైనవి. ఇక ఉపనదులుగా ఉన్న తుంగభద్ర, ప్రాణహిత, భీమా, తపతి నదులు పుష్కర నదులుగా పిలుస్తారు.

*ఈ మహా కుంభమేళాకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పెద్దఎత్తున కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తోంది. 

*ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరిగే ప్రదేశాన్ని అంతా కలుపుతూ యూపీ ప్రభుత్వం ఓ జిల్లాను ఏర్పాటు చేసింది. ఆ జిల్లాకు ‘మహా కుంభమేళా’ అని అధికారికంగా పేరును ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 76కి చేరింది. 

Show More
Back to top button